లేఖనములు
జేకబ్ 2


2వ అధ్యాయము

ధనము, గర్వము, అపవిత్రతలపై ప్రేమను జేకబ్ బహిరంగముగా ఖండించును—మనుష్యులు తమ తోటివారికి సహాయము చేయుటకు ఐశ్వర్యమును కోరవచ్చును—నీఫైయులలో ఎవరును ఒకరికంటే ఎక్కువమంది భార్యలను కలిగియుండరాదని ప్రభువు ఆజ్ఞాపించును—ప్రభువు స్త్రీల యొక్క పవిత్రత యందు ఆనందించును. సుమారు క్రీ. పూ. 544–421 సం.

1 నీఫై మరణించిన తరువాత, నీఫై సహోదరుడైన జేకబ్, నీఫై జనులతో పలికిన మాటలు:

2 నా ప్రియమైన సహోదరులారా, జేకబ్ అను నేను దేవుని పట్ల నా బాధ్యతను బట్టి నిగ్రహముతో నా స్థానమును ఘనపరచుటకు, మీ పాపముల నుండి నా వస్త్రములను శుద్ధిచేసుకొనుటకు దేవుని వాక్యమును మీకు ప్రకటించగలుగునట్లు ఈ దినమున దేవాలయములోనికి వచ్చితిని.

3 పిలువబడిన నా స్థానమునందు నేను ఇప్పటి వరకు శ్రద్ధగా ఉంటినని మీరెరుగుదురు; కానీ ఇంతవరకు ఉన్న దాని కంటే ఎక్కువగా నేడు మీ ఆత్మల శ్రేయస్సు కొరకు నేను అధికమైన కోరికను, ఆతురతను కలిగియున్నాను.

4 ఏలయనగా, నేను ఇప్పటి వరకు మీకు ఇచ్చియున్న ప్రభువు వాక్యమునకు మీరు విధేయులై యున్నారు.

5 కానీ ఇదిగో మీరు నన్ను ఆలకించుడి, భూమ్యాకాశముల యొక్క సర్వశక్తిమంతుడైన సృష్టికర్త సహాయము ద్వారా నేను మీ తలంపులను గూర్చి, మీరు పాపము నందు శ్రమించుటను గూర్చి మీతో చెప్పగలనని తెలుసుకొనుడి, ఆ పాపము నాకును దేవునికిని మిక్కిలి హేయకరముగా కనబడుచున్నది.

6 మీ హృదయముల దుష్టత్వమును గూర్చి నేను మీకు సాక్ష్యమియ్యవలసి వచ్చుట నా ఆత్మను దుఃఖపెట్టుచున్నది, నా సృష్టికర్త సన్నిధిలో సిగ్గుతో నన్ను కృంగజేయుచున్నది.

7 మీ భార్యలు, మీ పిల్లల యెదుట నేను మిమ్ములను నేను ఇంతగా గద్దించవలసి వచ్చుట కూడా నన్ను దుఃఖపెట్టుచున్నది, వారిలో అనేకులు దేవుని యెదుట మిక్కిలి సున్నితమైన, పవిత్రమైన, కోమలమైన భావాలు కలిగియున్నారు, ఈ భావన దేవునికి ప్రీతికరముగానున్నది;

8 వారు దేవుని యొక్క ప్రీతికరమైన వాక్యమును, గాయపడిన మనసును స్వస్థపరచు వాక్యమును వినుటకు ఇక్కడకి వచ్చియున్నారని నాకు అనిపించుచున్నది.

9 అందువలన దేవుని నుండి నేను పొందియున్న ఖండితమైన ఆజ్ఞను బట్టి మీ నేరముల విషయమై మిమ్ములను మందలించుటకు, ఇప్పటికే గాయపడియున్న వారిని ఆదరించి వారి గాయములను స్వస్థపరచుటకు బదులుగా వారి గాయములను విస్తరింపజేయుటకు, గాయపరచబడని వారికి దేవుని యొక్క ప్రీతికరమైన వాక్యముతో విందు చేయుటకు బదులుగా మొలకత్తులతో వారి ఆత్మలను పొడిచి, వారి కోమలమైన మనస్సులను గాయపరచుటకు నేను బలవంతము చేయబడుటను బట్టి నా ఆత్మ భారముగా ఉన్నది.

10 కానీ ఈ పని కఠినమైనప్పటికీ నేను దేవుని యొక్క ఖండితమైన ఆజ్ఞల ప్రకారము చేయవలెను మరియు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క వాడిగల కంటి చూపు పర్యవేక్షణలో, హృదయశుద్ధి కలిగి విరిగిన హృదయము గల వారి సమక్షములో మీ దుష్టత్వము, హేయక్రియలను గూర్చి మీకు చెప్పవలెను.

11 అందువలన దేవుని వాక్యము యొక్క సరళత్వమును బట్టి నేను మీకు సత్యము చెప్పవలెను. ఏలయనగా నేను ప్రభువు యొద్ద విచారణ చేయుచుండగా, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: జేకబ్, రేపు ఉదయమున నీవు దేవాలయములోనికి వెళ్ళి నేను నీకిచ్చు వాక్యమును ఈ జనులకు ప్రకటించుము.

12 ఇదిగో నా సహోదరులారా, నేను మీకు ప్రకటించు వాక్యమిదే, మీలో అనేకులు వెండి బంగారములు, అన్ని రకముల విలువైన ముడి లోహాముల కొరకు వెదకనారంభించిరి, అవి మీకు, మీ సంతానమునకు వాగ్దానదేశమైన ఈ దేశమందు మిక్కిలి సమృద్ధిగానున్నవి.

13 దైవానుగ్రహము మీపై మిక్కిలిగా ఉన్నందువలన మీరు అధిక సంపదను పొందియున్నారు; మీలో కొంతమంది మీ సహోదరుల కంటే అధికముగా కలిగియున్న కారణముగా మీరు మీ హృదయములలో గర్వించుచున్నారు, విలువైన మీ వస్త్రములను బట్టి మెడబిరుసు గల పొగరుబోతులైయున్నారు, వారికంటే మీరు గొప్పవారనుకొని మీ సహోదరులను హింసించుచున్నారు.

14 నా సహోదరులారా, ఈ విషయములో దేవుడు మిమ్ములను నిర్దోషులుగా యెంచునని మీరనుకొనుచున్నారా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను. కానీ ఆయన మిమ్ములను ఖండించును మరియు ఈ క్రియలలో మీరు కొనసాగిన యెడల ఆయన తీర్పులు మీపై వేగముగా వచ్చును.

15 మిమ్ములను ఆయన పొడవగలడని, క్షణకాలపు చూపుతో ధూళిగా మార్చగలడని ఆయన మీకు చూపును గాక!

16 ఈ దోషము, హేయక్రియల నుండి ఆయన మిమ్ములను శుద్ధిచేయును గాక! మీరు ఆయన ఆజ్ఞలను ఆలకించి, మీ హృదయ గర్వము మీ ఆత్మలను నాశనము చేయకుండా చూచుకొందురు గాక!

17 మీ వలె మీ సహోదరులను గూర్చి ఆలోచించుడి, అందరితో స్నేహముగానుండుడి, వారు మీవలే ఐశ్వర్యవంతులగునట్లు మీ సంపద విషయములో ఉదారముగా ఉండుడి.

18 కానీ ఐశ్వర్యము కంటే ముందుగా మీరు దేవుని రాజ్యమును వెదకుడి.

19 క్రీస్తు నందు నిరీక్షణ పొందిన తరువాత మీరు వెదకిన యెడల మీరు ఐశ్వర్యము పొందుదురు; మేలు చేయు ఉద్దేశ్యముతో అనగా దిగంబరులకు బట్టలిచ్చుటకు, ఆకలిగొన్నవారికి ఆహారమిచ్చుటకు, చెరపట్టబడిన వారిని విడిపించుటకు, రోగులకును బాధించబడినవారికిని సహాయము చేయుటకు మీరు వాటిని వెదకుదురు.

20 ఇప్పుడు నా సహోదరులారా, నేను మీతో గర్వమును గూర్చి మాట్లాడియున్నాను; మీ హృదయముల యందు గర్విష్ఠులైన కారణముగా దేవుడు మీకు ఇచ్చిన వాటిని బట్టి మీరు మీ పొరుగువానిని బాధించి, హింసించితిరి గదా, దానిని గూర్చి మీరేమందురు?

21 సమస్త శరీరులను సృష్టించిన ఆయనకు అట్టి క్రియలు హేయకరమైనవని మీరు భావించుట లేదా? ఆయన దృష్టిలో ప్రతీ జీవి విలువైనది. సమస్త శరీరులు ధూళియైయుండి, ఆయన ఆజ్ఞలను గైకొని, శాశ్వతముగా ఆయనను మహిమపరచవలెనన్న ఏకైక ఉద్దేశ్యముచేత ఆయన వారిని సృష్టించెను.

22 ఇప్పుడు గర్వమును గూర్చి మీతో మాట్లాడుట నేను ముగించెదను. నేను మీతో మరింత తీవ్రమైన నేరమును గూర్చి మాట్లాడవలసి రానియెడల, మిమ్ములను గూర్చి నా హృదయము అధికముగా ఆనందించియుండును.

23 కానీ మీ తీవ్రమైన నేరములను బట్టి దేవుని వాక్యము నన్ను క్రుంగజేయుచున్నది. ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ఈ జనులు దోషమందు వృద్ధి చెందుట మొదలుపెట్టుచున్నారు; వారు లేఖనములను గ్రహించలేకయున్నారు, ఏలయనగా వారు దావీదు మరియు అతని కుమారుడు సొలోమోనును గూర్చి వ్రాయబడిన వాక్యములను బట్టి వ్యభిచారములు చేయుట యందు తమను సమర్థించుకొనుటకు ప్రయత్నించుచున్నారు.

24 దావీదు మరియు సొలొమోను నిజముగా అనేకమంది భార్యలను, ఉపపత్నులను కలిగియుండిరి, ఆ విషయము నా యెదుట హేయకరమైనదిగా యుండెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

25 అందువలన, యోసేపు గర్భఫలము నుండి ఒక నీతిగల కొమ్మను నా కొరకు స్థాపించునట్లు నేను ఈ జనులను యెరూషలేము దేశము నుండి బయటకు నా బాహుబలము చేత నడిపించియున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

26 కావున, ఈ జనులు ప్రాచీన కాలపు వారి వలే చేయుటను ప్రభువైన దేవుడనగు నేను అనుమతించను.

27 కావున నా సహోదరులారా నా మాట వినుడి, ప్రభువు వాక్యమును ఆలకించుడి: ఏలయనగా మీలో ఏ మనుష్యుడూ ఒకరి కంటే ఎక్కువమంది భార్యలను కలిగియుండరాదు; ఉపపత్నులు ఎవ్వరిని అతడు కలిగియుండరాదు.

28 ఏలయనగా ప్రభువైన దేవుడనగు నేను, స్త్రీల యొక్క పవిత్రత యందు ఆనందించుదును. వ్యభిచారములు నా యెదుట హేయకరమైయున్నవని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

29 కావున ఈ జనులు నా ఆజ్ఞలను గైకొనవలెనని, లేని యెడల వారి నిమిత్తము భూమి శపించబడునని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

30 ఏలయనగా నా కొరకు నేను సంతానమును వృద్ధి చేయదలచిన యెడల, నేను నా జనులను ఆజ్ఞాపించెదనని, లేని యెడల వారు ఈ వాక్యములను ఆలకించెదరని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

31 ఏలయనగా ప్రభువునైన నేను, యెరూషలేము దేశములోను నా జనుల దేశములన్నిటిలోను వారి భర్తల దుష్టత్వము, హేయక్రియలను బట్టి నా జనుల కుమార్తెలు దుఃఖించుటను చూచి, వారి రోదనను వినియున్నాను.

32 యెరూషలేము దేశము నుండి నేను బయటకు నడిపించియున్న ఈ జనుల యొక్క సుందరమైన కుమార్తెల రోదనలు నా జనులలోని పురుషులకు వ్యతిరేకముగా నా యొద్దకు వచ్చుటను నేను సహించనని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

33 ఏలయనగా వారి కోమలత్వమును బట్టి వారు నా జనుల కుమార్తెలను బందీలుగా కొనిపోరాదు, అట్లయిన యెడల నేను వారిని ఒక బాధాకరమైన శాపముతో నాశనము చేయుదును; వారు ప్రాచీన కాలపు వారివలే వ్యభిచారములు చేయరాదని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

34 ఇప్పుడు నా సహోదరులారా, ఈ ఆజ్ఞలు మన తండ్రియైన లీహైకి ఇయ్యబడినవని మీరెరుగుదురు. అందువలన వాటిని మీరు ముందే ఎరిగియున్నారు; మీరు గొప్ప నిందకు గురైయున్నారు; ఏలయనగా మీరు చేసియుండకూడని ఈ క్రియలను మీరు చేసియున్నారు.

35 మీరు మన సహోదరులైన లేమనీయుల కంటే తీవ్రమైన దోషములు చేసియున్నారు. వారి ఎదుట మీ చెడ్డ మాదిరులను బట్టి మీరు కోమలమైన మీ భార్యల హృదయములను విరిచియున్నారు, మీ పిల్లల నమ్మకమును పోగొట్టుకొనియున్నారు; వారి హృదయ రోదనలు మీకు వ్యతిరేకముగా దేవునికి ఆరోహణమగుచున్నవి. మీకు వ్యతిరేకముగా మీపై వచ్చుచున్న దేవుని వాక్యము యొక్క కఠినత్వమును బట్టి అనేక హృదయములు లోతైన గాయములతో పొడవబడి, మరణించినవి.