లేఖనములు
జేకబ్ 3


3వ అధ్యాయము

హృదయశుద్ధి గలవారు దేవుని యొక్క ప్రీతికరమైన వాక్యమును పొందెదరు—లేమనీయుల నీతి నీఫైయుల నీతిని అధిగమించును—జారత్వము, కామాతురత మరియు ప్రతి పాపమునకు వ్యతిరేకముగా జేకబ్ హెచ్చరించును. సుమారు క్రీ. పూ. 544–421 సం.

1 ఇదిగో, హృదయశుద్ధిగల మీతో జేకబ్ అను నేను మాట్లాడుదును. నిలకడగల మనస్సుతో దేవుని వైపు చూడుడి, అధిక విశ్వాసముతో ఆయనకు ప్రార్థన చేయుడి, మీ శ్రమలలో ఆయన మిమ్ములను ఓదార్చును, మీ హేతువును బట్టి ఆయన వాదించును మరియు మీ నాశనము కోరువారిని శిక్షించును.

2 హృదయశుద్ధిగల మీరందరూ మీ తలలను పైకెత్తుకొని, దేవుని యొక్క ప్రీతికరమైన వాక్యమును స్వీకరించి, ఆయన ప్రేమపై విందారగించుడి; ఏలయనగా మీ మనస్సులు స్థిరముగా నుండిన యెడల శాశ్వతముగా మీరట్లు చేయగలరు.

3 కానీ హృదయశుద్ధి లేనివారికి, ఈ దినమున దేవుని యెదుట మలినముగా ఉన్న వారికి ఆపద, ఆపద; ఏలయనగా మీరు పశ్చాత్తాపపడని యెడల, మీ నిమిత్తము భూమి శపించబడును; మీ వలే మలినముగా లేని లేమనీయులు ఒక బాధాకరమైన శాపముతో శపించబడినప్పటికీ, మీరు నాశనమగునంతగా మిమ్ములను బాధించెదరు.

4 మీరు పశ్చాత్తాపపడని యెడల, మీ స్వాస్థ్యమైన దేశమును వారు స్వాధీనపరచుకొను సమయము వేగముగా వచ్చును, మరియు ప్రభువైన దేవుడు మీ మధ్యనుండి నీతిమంతులను దూరముగా నడిపించివేయును.

5 ఇదిగో, వారి మలినతను బట్టి, వారి చర్మములపై వచ్చియున్న శాపమును బట్టి మీరు ద్వేషించుచున్న మీ సహోదరులైన లేమనీయులు మీ కంటే అధిక నీతిమంతులు; ఏలయనగా వారు ఒక భార్యను మాత్రమే కలిగియుండాలని, ఉపపత్నులెవ్వరిని కలిగియుండరాదని, వారి మధ్య వ్యభిచారములు జరుగకూడదని మన తండ్రికి ఇవ్వబడిన ప్రభువు ఆజ్ఞను వారు మరచిపోలేదు.

6 ఈ ఆజ్ఞను వారు పాటించుచున్నారు; అందువలన, ఈ ఆజ్ఞను పాటించుటలో వారి శ్రద్ధను బట్టి ప్రభువైన దేవుడు వారిని నాశనము చేయకుండా వారిపై కనికరము చూపును; మరియు ఒకనాటికి వారు ఆశీర్వదింపబడిన జనులగుదురు.

7 వారి భర్తలు తమ భార్యలను ప్రేమించుచున్నారు, వారి భార్యలు తమ భర్తలను ప్రేమించుచున్నారు; వారి భర్తలు మరియు వారి భార్యలు వారి పిల్లలను ప్రేమించుచున్నారు; వారి అవిశ్వాసము, మీ యెడల వారి ద్వేషము వారి పితరుల దోషమును బట్టియైయున్నది; కావున మీ గొప్ప సృష్టికర్త దృష్టిలో మీరు వారికన్న ఎంత ఎక్కువ మేలైనవారుగా ఉన్నారు?

8 ఓ నా సహోదరులారా, మీరు మీ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడని యెడల, వారితోపాటు మీరు దేవుని సింహాసనము యెదుటికి తేబడినప్పుడు వారి చర్మములు మీ కంటె తెల్లగా ఉండునేమోనని నేను భయపడుచున్నాను.

9 అందువలన, వారి నల్లని చర్మములను బట్టి మీరికమీదట వారికి వ్యతిరేకముగా దూషించరాదని, వారి మలినతను బట్టి కూడా వారికి వ్యతిరేకముగా మీరు దూషించరాదని నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదియు దేవుని వాక్యమే; కానీ మీరు మీ స్వంత మలినతను జ్ఞాపకము చేసుకొనవలెను మరియు వారి మలినత వారి పితరులను బట్టి వచ్చెనని జ్ఞాపకము చేసుకొనవలెను.

10 కావున, మీ పిల్లల యెదుట ఉంచిన మాదిరిని బట్టి వారి హృదయములను మీరెట్లు నొప్పించితిరో మీరు జ్ఞాపకము చేసుకొనవలెను; మీ మలినతను బట్టి మీ పిల్లలను నాశనమునకు నడిపించెదరని, వారి పాపములు అంత్యదినమున మీ తలలపై క్రుమ్మరించబడునని కూడా జ్ఞాపకము చేసుకొనవలెను.

11 ఓ నా సహోదరులారా, నా మాటలను ఆలకించుడి; మీ మనోశక్తులను ప్రోత్సహించుడి; మరణ నిద్ర నుండి మిమ్ములను మీరు మేల్కొలుపుకొనుడి; రెండవ మరణమైన ఆ అగ్ని గంధకములు గల గుండములోనికి పడవేయబడునట్లు మీరు అపవాదికి దూతలు కాకుండా నరకపు బాధల నుండి మిమ్ములను మీరు విడిపించుకొనుడి.

12 ఇప్పుడు జేకబ్ అను నేను, నీఫై జనులకు అనేక విషయములు చెప్పితిని, భయంకరమైన వాటి పర్యవసానములను గూర్చి వారికి చెప్పుచూ వారిని జారత్వము, కామాతురత మరియు ప్రతి విధమైన పాపమునకు వ్యతిరేకముగా హెచ్చరించితిని.

13 ఇప్పుడు అధిక సంఖ్యాకులగుచున్న ఈ జనుల మధ్య జరిగిన కార్యకలాపముల యొక్క నూరవభాగము కూడా ఈ పలకలపై వ్రాయబడలేదు; కానీ వారి కార్యకలాపములనేకము, వారి యుద్ధములు, వివాదములు, వారి రాజుల యొక్క పరిపాలనలు పెద్ద పలకలపై వ్రాయబడియున్నవి.

14 ఈ పలకలు జేకబ్ పలకలని పిలువబడినవి, అవి నీఫై చేత చేయబడినవి మరియు నేను నా మాటలు ముగించెదను.