లేఖనములు
జేకబ్ 4


4వ అధ్యాయము

ప్రవక్తలందరు తండ్రిని క్రీస్తు నామమందు ఆరాధించిరి—అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చుట, దేవుడు మరియు ఆయన అద్వితీయ కుమారునికి ప్రతిరూపముగా ఉండెను—ప్రాయశ్చిత్తము ద్వారా మనుష్యులు తమనుతాము దేవునితో సమాధానపరచుకొనవలెను—యూదులు పునాదిరాయిని తిరస్కరించెదరు. సుమారు క్రీ. పూ. 544–421 సం.

1 ఇప్పుడు జేకబ్ అను నేను, నా జనులకు వాక్యమందు అధికముగా పరిచర్య చేసియుంటిని (మా మాటలను పలకలపై చెక్కుట కఠినమైన కారణముగా నా మాటలలో కొన్నింటిని మాత్రమే నేను వ్రాయగలను) మరియు మేము పలకలపై వ్రాయుచున్న విషయములు నిలిచియుండవలెనని మేమెరుగుదుము.

2 మేము ఏ విషయములనైనా పలకలపై తప్ప మరిదేని మీద వ్రాసిననూ అవి నశించి, అదృశ్యమైపోవును; కానీ మేము కొన్ని మాటలను పలకలపై వ్రాయగలము, అవి మా సంతానమునకు, మా ప్రియమైన సహోదరులకు మా గురించి లేదా వారి పితరులను గురించి కొంతవరకు జ్ఞానమునిచ్చును—

3 ఇప్పుడు ఈ విషయమందు మేము ఆనందించుచున్నాము; మా ప్రియమైన సహోదరులు మరియు మా సంతానము వాటిని కృతజ్ఞతాభరితమైన హృదయములతో స్వీకరించుదురని, వారి మొదటి తల్లిదండ్రులను గూర్చి దుఃఖముతో లేదా తిరస్కారముతో కాక సంతోషముతో వారు తెలుసుకొనునట్లు వాటిని చూచెదరని ఆశించుచూ ఈ మాటలను పలకలపై చెక్కుటకు మేము శ్రద్ధగా కృషి చేయుచున్నాము.

4 ఏలయనగా, మేము క్రీస్తును గూర్చి ఎరిగియున్నామని, ఆయన రాకడకు అనేక వందల సంవత్సరముల ముందుగానే ఆయన మహిమ యొక్క నిరీక్షణను మేము కలిగియున్నామని; మేము మాత్రమే కాక, మా కంటే ముందు వచ్చిన పరిశుద్ధ ప్రవక్తలందరు కూడా ఆయన మహిమ యొక్క నిరీక్షణను కలిగియున్నారని వారు తెలుసుకొనవలెనన్న ఉద్దేశ్యము నిమిత్తమే మేము ఈ విషయములను వ్రాసియున్నాము.

5 వారు క్రీస్తు నందు విశ్వసించి, తండ్రిని ఆయన నామమందు ఆరాధించిరి మరియు మేము కూడా తండ్రిని ఆయన నామమందు ఆరాధించుచున్నాము. ఈ ఉద్దేశ్యము నిమిత్తమే మేము మోషే ధర్మశాస్త్రమును పాటించుచున్నాము, అది మా ఆత్మలను ఆయన వైపు కేంద్రీకరించుచున్నది; దేవుడు మరియు ఆయన అద్వితీయ కుమారుని పోలికలో తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుటలో అరణ్యమందు దేవుని ఆజ్ఞలకు విధేయుడైన అబ్రాహామునకు పరిగణించబడినట్లుగా ఈ కారణము చేతనే నీతి నిమిత్తము అది మా కొరకు పరిశుద్ధపరచబడినది.

6 అందువలన మేము ప్రవక్తల వ్రాతలను పరిశోధించుచున్నాము, మేము అనేక బయల్పాటులను, ప్రవచనాత్మను కలిగియున్నాము; ఈ సాక్ష్యములన్నిటినీ కలిగియుండి మేము ఒక నిరీక్షణను పొందితిమి మరియు మేము నిజముగా యేసు నామమందు ఆజ్ఞాపించగా చెట్లు, పర్వతములు లేదా సముద్రపు అలలు మాకు లోబడునట్లు మా విశ్వాసము నిశ్చలమాయెను.

7 అయినప్పటికీ, ఆయన కృప మరియు నరుల సంతానము పట్ల ఆయన గొప్ప తగ్గింపులను బట్టియే మేము ఈ కార్యములను చేయుటకు శక్తి కలిగియున్నామని మేము తెలుసుకొనునట్లు ప్రభువైన దేవుడు మా బలహీనతలను మాకు చూపును.

8 ప్రభువు యొక్క కార్యములు గొప్పవి మరియు అద్భుతమైనవి; ఆయన మర్మముల యొక్క లోతులు వెదుకజాలనివి; ఆయన మార్గములన్నిటినీ కనుగొనుట మానవునికి అసాధ్యము. అతనికి బయల్పరచబడితే తప్ప ఏ మనుష్యుడును ఆయన మార్గములను ఎరుగడు; కావున సహోదరులారా, దేవుని బయల్పాటులను తృణీకరించకుము.

9 ఏలయనగా ఆయన వాక్యపు శక్తి ద్వారా మనుష్యుడు భూముఖముపై వచ్చెను, ఆ భూమి ఆయన వాక్యపు శక్తి ద్వారా సృష్టించబడెను. కావున దేవుడు మాట్లాడినందువలన లోకము ఉనికి లోనికి వచ్చిన యెడల, మాట్లాడినందువలన మనుష్యుడు సృష్టింపబడిన యెడల, అప్పుడు ఆయన చిత్తము, సంతోషమును బట్టి భూమిని లేదా భూముఖపైనున్న ఆయన హస్తకృత్యములను ఎందుకు ఆజ్ఞాపించలేడు?

10 అందువలన సహోదరులారా ప్రభువుకు సలహా ఇచ్చుటకు ప్రయత్నించవద్దు, కానీ ఆయన నుండి సలహా తీసుకొనుటకు ప్రయత్నించుడి. ఏలయనగా, ఆయన సమస్త సృష్టిపై వివేకమందు, న్యాయమందు, గొప్ప కనికరమందు సలహా ఇచ్చునని మీకై మీరు ఎరుగుదురు.

11 కావున ప్రియమైన సహోదరులారా, ఆయన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ఆయనతో సమాధానపడుడి, క్రీస్తు నందున్న పునరుత్థాన శక్తిని బట్టి మీరు పునరుత్థానమును పొందవచ్చును మరియు శరీరమందు ఆయన తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు ముందే విశ్వాసము కలిగియుండి, ఆయన యందు మహిమ యొక్క ఖచ్చితమైన నిరీక్షణను పొందియుండి మీరు క్రీస్తు యొక్క ప్రథమ ఫలములుగా దేవునికి సమర్పించబడవచ్చును.

12 ప్రియమైనవారలారా, నేను ఈ విషయములను మీతో చెప్పుచున్నానని ఆశ్చర్యపడవద్దు; ఏలయనగా క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మాట్లాడినప్పుడు ఆయన గురించి, అదేవిధముగా పునరుత్థానము మరియు రాబోవు లోకమును గురించి పరిపూర్ణ జ్ఞానమును ఎందుకు పొందరాదు?

13 నా సహోదరులారా, ప్రవచించు వానిని మనుష్యుల యొక్క గ్రహింపునకు ప్రవచించనియ్యుడి. ఏలయనగా ఆత్మ సత్యమును పలుకును మరియు అబద్ధమాడదు. అందువలన అది విషయములను గూర్చి అవి వాస్తవముగా ఉన్నట్లు, వాస్తవముగా ఉండబోవునట్లు పలుకును; కావున మన ఆత్మల యొక్క రక్షణ నిమిత్తము ఈ సంగతులు మాకు సరళముగా విశదపరచబడెను; కానీ, ఈ విషయములకు మేము మాత్రమే సాక్షులము కాము; ఏలయనగా దేవుడు వాటిని ప్రాచీన కాలపు ప్రవక్తలకు కూడా చెప్పెను.

14 కానీ యూదులు మెడబిరుసు జనులు; వారు సరళమైన మాటలను తృణీకరించి, ప్రవక్తలను హతమార్చి, వారు గ్రహించలేని సంగతుల కొరకు వెదికిరి. కావున, గురిని దాటి చూచుట వలన వచ్చిన వారి గ్రుడ్డితనమును బట్టి వారు తప్పక పతనము కావలెను; ఏలయనగా దేవుడు వారి నుండి తన సరళత్వమును తీసివేసెను మరియు వారు కోరినందువలన వారు గ్రహించలేని అనేక సంగతులను వారికి దయచేసెను. వారు దానిని కోరిరి, కాబట్టి వారు తొట్రుపడునట్లు దేవుడు దానిని చేసెను.

15 ఇప్పుడు జేకబ్ అను నేను ఆత్మ ద్వారా ప్రవచించుటకు నడిపించబడితిని; ఏలయనగా యూదులు తొట్రపడుట ద్వారా వారు నిర్మించబడి, సురక్షిత పునాదిగా కలిగియుండవలసిన రాయిని తిరస్కరించుదురని నా యందున్న ఆత్మ యొక్క ప్రభావము చేత నేను గ్రహించుచున్నాను.

16 కానీ లేఖనముల ప్రకారము ఈ రాయి గొప్పది, చివరిది మరియు యూదులు నిర్మించబడగల ఏకైక నిశ్చయమైన పునాది అగును.

17 ఇప్పుడు నా ప్రియులారా, వీరు నిశ్చయమైన పునాదిని తిరస్కరించిన తరువాత, అది వారి మూలకు తలరాయి అగునట్లు దాని పైన ఎప్పటికైనా నిర్మించగలుగుట ఎట్లు సాధ్యము?

18 నా ప్రియమైన సహోదరులారా, నేను మీ కొరకు ఈ మర్మమును విప్పిచెప్పెదను. ఏదైనా కారణముచేత చెప్పలేని యెడల, ఆత్మలో నా నిశ్చయము నుండి నేను కదిలింపబడుదును మరియు మీ నిమిత్తము నాకున్న అధిక ఆతృతను బట్టి తడబడుదును.