లేఖనములు
జేకబ్ 5


అధ్యాయము 5

పెంపుడు మరియు అడవి ఒలీవ చెట్ల గురించి జీనస్ చెప్పిన దృష్టాంతమును జేకబ్ ఉదహరించును—అవి ఇశ్రాయేలు మరియు అన్యజనుల పోలికలైయున్నవి—ఇశ్రాయేలు చెదిరిపోవుట మరియు సమకూడుట ముందుగా చిత్రీకరించబడినవి—నీఫైయులు, లేమనీయులు, ఇశ్రాయేలు వంశస్థులందరిని గూర్చి సూచనలు చేయబడినవి—అన్యజనులు ఇశ్రాయేలులోనికి అంటుగట్టబడుదురు—చివరకు ఒలీవతోట దహించివేయబడును. సుమారు క్రీ. పూ. 544–421 సం.

1 ఇదిగో నా సహోదరులారా, ఇశ్రాయేలు వంశస్థులతో జీనస్ ప్రవక్త పలికిన మాటలను చదివియున్నట్లు మీకు జ్ఞాపకము లేదా? అతడు ఇట్లనెను:

2 ఓ ఇశ్రాయేలు వంశస్థులారా ఆలకించుడి, ప్రభువు యొక్క ప్రవక్తనైన నా మాటలను వినుడి.

3 ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఓ ఇశ్రాయేలు వంశమా, నేను నిన్ను ఒక మనుష్యుడు తన ఒలీవతోట యందు పోషించిన పెంపుడు ఒలీవ చెట్టుతో పోల్చుదును; అది పెరిగి, ముసలిదై కృళ్ళుట మొదలుపెట్టెను.

4 ఆ ఒలీవతోట యజమాని వెళ్ళి తన ఒలీవ చెట్టు కృళ్ళుట మొదలుపెట్టెనని చూచెను; అతడు ఇట్లనెను: నేను దానిని శుద్ధిచేసి, దాని చుట్టూ త్రవ్వి దానిని పోషించెదను, బహుశ అది చిన్న చిన్న లేత కొమ్మలను మొలిపించి నశించకయుండునేమో.

5 అప్పుడతడు దానిని శుద్ధిచేసి, దాని చుట్టూ త్రవ్వి తన మాట ప్రకారము దానిని పోషించెను.

6 అనేక దినముల తరువాత అది కొన్ని చిన్న చిన్న లేత కొమ్మలను మొలిపించుట మొదలుపెట్టెను; కానీ ముఖ్యమైన దాని పైభాగము నశించనారంభించెను.

7 ఆ ఒలీవతోట యజమాని దానిని చూచి, తన సేవకునితో ఇట్లు చెప్పెను: ఈ చెట్టును పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నది; కావున వెళ్ళి ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కొమ్మలు త్రెంచి నా దగ్గరకు తెమ్ము; వాడిపోవనారంభించిన ఆ ప్రధానమైన కొమ్మలను మనము త్రెంచి వేసి, అవి కాల్చబడునట్లు వాటిని అగ్నిలో పడవేయుదము.

8 ఆ ఒలీవతోట యజమాని ఇంకను ఇట్లు చెప్పుచున్నాడు, ఇదిగో నేను ఈ చిన్న చిన్న లేత కొమ్మలనేకము తీసుకొని నాకిష్టమైన చోట వాటిని అంటుగట్టెదను; ఆలాగున ఈ చెట్టు యొక్క వేరు నశించిపోయినను నేను దాని ఫలమును నా కొరకు భద్రపరచుకొనవచ్చును; అందువలన నేను ఈ చిన్న చిన్న లేత కొమ్మలను తీసుకొని నాకిష్టమైన చోట వాటిని అంటుగట్టెదను.

9 నీవు అడవి ఒలీవ చెట్టు కొమ్మలను తీసుకొని, వీటి స్థానములో వాటిని అంటుగట్టుము; నా ఒలీవతోట నేలను అవి వ్యర్థము చేయకుండునట్లు నేను త్రెంచి వేసిన వాటిని అగ్నిలో పడవేసి కాల్చివేయుదును.

10 ఆ ఒలీవతోట యజమాని యొక్క సేవకుడు యజమాని మాట ప్రకారము చేసి, అడవి ఒలీవ చెట్టు కొమ్మలను అంటుగట్టెను.

11 ఆ ఒలీవతోట యజమాని దాని చుట్టూ త్రవ్వబడునట్లు, అది శుద్ధిచేయబడునట్లు, పోషించబడునట్లు చేయుచు తన సేవకునితో ఇట్లు చెప్పెను: ఈ చెట్టును పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నది; అందువలన దాని వ్రేళ్ళు నశించకుండా నా కొరకు వాటిని కాపాడగలుగునట్లు నేను ఈ పని చేసియున్నాను.

12 అందువలన నీవు వెళ్ళి, ఆ చెట్టును గమనించుచు నా మాటల ప్రకారము దానిని పోషించుము.

13 వీటిని నా ఒలీవతోట యొక్క మారుమూల ప్రాంతములో నేను కోరుకున్న చోట నాటెదను, అది నీకు తెలియనవసరము లేదు; ఆ చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మలను నా కొరకు భద్రపరచుకొనునట్లు, ఋతువునకు ముందుగా నా కొరకు దాని ఫలమును కూర్చుకొనునట్లు నేను దీనిని చేయుచున్నాను; ఏలయనగా ఈ చెట్టును, దాని ఫలమును పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నది.

14 మరియు ఆ ఒలీవతోట యజమాని తన దారిన వెళ్ళి ఆ పెంపుడు ఒలీవ చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మలను ఆ ఒలీవతోట యొక్క మారుమూల ప్రాంతములలో తన చిత్తము, సంతోషమును బట్టి కొన్నిటిని ఒక చోట మరికొన్నిటిని ఇంకొకచోట నాటెను.

15 దీర్ఘ కాలము గడచిపోయెను మరియు ఆ ఒలీవతోట యజమాని తన సేవకునితో ఇట్లనెను: రమ్ము, ఒలీవతోటలో పని చేయునట్లు మనము అక్కడికి పోవుదము.

16 ఒలీవతోట యజమాని, అతని సేవకుడు ఒలీవ తోటలో పనిచేయుటకు వెళ్ళిరి. అప్పుడు ఆ సేవకుడు తన యజమానితో—ఇదిగో ఇటు చూడుము; ఈ చెట్టును చూడుము అని చెప్పెను.

17 ఆ ఒలీవతోట యజమాని అడవి ఒలీవ కొమ్మలు అంటుగట్టబడిన ఆ చెట్టును చూచెను; అది పెరుగుచు ఫలించుట మొదలుపెట్టెను. అది మంచిదైయుండెననియు దాని ఫలము ప్రకృతి సిద్ధమైన ఫలము వలే ఉండెననియు అతడు చూచెను.

18 అతడు సేవకునితో ఇట్లు చెప్పెను: ఇదిగో అడవిచెట్టు కొమ్మలు దాని వేరు యొక్క తేమను తీసుకొనియున్నవి, అందును బట్టి ఆ వేరు అధిక బలమును పొందియున్నది; దాని వేరు యొక్క అధిక బలమును బట్టి అడవి కొమ్మలు పెంపుడు ఫలమును ఫలించియున్నవి. మనము ఈ కొమ్మలను అంటుగట్టియుండని యెడల ఆ చెట్టు నశించియుండేది. ఇప్పుడు నేను ఆ చెట్టు ఇచ్చిన అధిక ఫలమును కూర్చుకొందును; ఋతువునకు ముందుగా దాని ఫలమును నా కొరకు కూర్చుకొనెదను.

19 మరలా ఆ ఒలీవతోట యజమాని సేవకునితో ఇట్లు చెప్పెను: రమ్ము, మనము ఒలీవతోట యొక్క మారుమూల ప్రాంతమునకు వెళ్ళెదము, ఆ చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మలు కూడా కాలమునకు ముందుగా నేను కూర్చుకొనునట్లు నా కొరకు దాని ఫలమును అధికముగా ఫలించియున్నవేమో చూచెదము.

20 అంతట ఆ చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మలను ఆ యజమాని నాటిన చోటుకు వారు వెళ్ళిరి, అతడు సేవకునితో వీటిని చూడుమని చెప్పగా, మొదటిది అధిక ఫలమును ఫలించియుండెనని, అది మంచిదైయుండెనని అతడు చూచెను. మరలా అతడు సేవకునితో ఇట్లు చెప్పెను: దాని ఫలమును తీసుకొని ఋతువునకు ముందుగా నేను దానిని నా కొరకు భద్రపరచునట్లు దానిని కూర్చుము; ఏలయనగా సుదీర్ఘకాలము నేను దానిని పోషించితిని మరియు అది అధిక ఫలమును ఫలించెను.

21 అప్పుడు ఆ సేవకుడు తన యజమానితో ఇట్లు చెప్పెను: నీవు ఈ చెట్టును లేదా చెట్టు కొమ్మను నాటుటకు ఇక్కడకు ఎట్లు వచ్చితివి? ఏలయనగా ఇది నీ ఒలీవతోట యొక్క భూమియంతటిలో అతి నిస్సారమైన స్థలమైయుండెను.

22 అంతట ఆ ఒలీవతోట యజమాని అతనితో ఇట్లనెను: నాకు సలహా ఇయ్యవద్దు; ఇది ఒక నిస్సారమైన స్థలమని నేనెరుగుదును; అందువలన దానిని సుదీర్ఘకాలము పోషించితినని నేను నీతో చెప్పితిని మరియు అది అధికఫలమును ఫలించియున్నదని నీవు చూచుచున్నావు.

23 ఆ ఒలీవతోట యజమాని తన సేవకునితో మరలా చెప్పెను: ఇటు చూడుము; నేను మరొక చెట్టుకొమ్మను కూడా నాటియున్నాను; ఈ స్థలము మొదటి దాని కంటె ఎక్కువ నిస్సారమైనదని నీవెరుగుదువు. కానీ ఈ చెట్టును చూడుము. నేను సుదీర్ఘకాలము దానిని పోషించితిని మరియు అది అధికఫలమును ఫలించెను; కాబట్టి దానిని పోగుచేసి, ఋతువునకు ముందుగా నేను దానిని నా కొరకు భద్రపరచుకొనునట్లు దానిని కూర్చుము.

24 ఆ ఒలీవతోట యజమాని తిరిగి తన సేవకునితో ఇట్లు చెప్పెను: ఇటు చూడుము, నేను నాటియున్న మరియొక కొమ్మను కూడా చూడుము; నేను దీనిని కూడా పోషించియున్నాను మరియు అది ఫలమును ఫలించియున్నది.

25 మరియు అతడు సేవకునితో ఇట్లు చెప్పెను: ఇటు చూడుము, చివరి దానిని చూడుము. దీనిని నేను సారవంతమైన స్థలమునందు నాటితిని; నేను దీనిని సుదీర్ఘకాలము పోషించినను చెట్టు యొక్క ఒక భాగము మాత్రమే పెంపుడు ఫలమును ఫలించెను, మిగిలిన భాగము అడవి ఫలమును ఫలించెను; నేను ఈ చెట్టును కూడా ఇతర చెట్లవలె పోషించియున్నాను.

26 మంచి ఫలమును ఫలించని కొమ్మలను త్రెంచి వేసి, అగ్నిలో పడవేయుము అని ఆ ఒలీవతోట యజమాని సేవకునితో చెప్పెను.

27 కానీ ఆ సేవకుడు అతనితో ఇట్లు చెప్పెను: దానిని శుద్ధిచేసి, దాని చుట్టూ త్రవ్వి ఇంకొంత కాలము మనము దానిని పోషించెదము, ఋతువునకు ముందుగా నీవు దానిని కూర్చుకొనునట్లు బహుశ అది నీ కొరకు మంచి ఫలమును ఫలించునేమో.

28 ఆ ఒలీవతోట యజమాని మరియు అతని సేవకుడు ఆ ఒలీవతోట యొక్క ఫలమంతటిని పోషించిరి.

29 సుదీర్ఘకాలము గడిచిపోయెను మరియు ఆ ఒలీవతోట యజమాని తన సేవకునితో—రమ్ము, మనము తిరిగి ఒలీవతోటలో పనిచేయుటకు వెళ్ళెదము. ఏలయనగా సమయము దగ్గరపడుచున్నది, అంతము త్వరలో వచ్చుచున్నది; అందువలన ఋతువునకు ముందుగా నేను నా కొరకు ఫలమును కూర్చుకొనవలెను అని చెప్పెను.

30 ఆ ఒలీవతోట యజమాని మరియు సేవకుడు ఒలీవతోట లోనికి వెళ్ళిరి; ప్రకృతి సిద్ధమైన కొమ్మలు విరువబడి అడవి కొమ్మలు అంటుగట్టబడిన ఆ చెట్టు వద్దకు వారు వచ్చిరి; ఆ చెట్టు నిండా అన్నిరకముల ఫలములుండెను.

31 ఆ ఒలీవతోట యజమాని ఫలమును దాని సంఖ్యను బట్టి ప్రతి రకమును రుచి చూచి ఇట్లు చెప్పెను: ఇదిగో, సుదీర్ఘకాలము మనము ఈ చెట్టును పోషించితిమి మరియు ఋతువునకు ముందుగా నేను నా కొరకు అధిక ఫలమును కూర్చుకొనియున్నాను.

32 కానీ ఈసారి ఇది అధిక ఫలమును ఫలించినప్పటికీ అందులో ఏ ఒక్కటీ మంచిది లేదు. ఇక్కడ అన్నిరకములైన చెడుఫలములున్నవి; మనము ఎంతో శ్రమపడినప్పటికి నాకెటువంటి ప్రయోజనము లేదు; ఇప్పుడు ఈ చెట్టును పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నది.

33 ఆ ఒలీవతోట యజమాని సేవకునితో ఇట్లనెను: మరలా దాని మంచి ఫలమును నేను నా కొరకు భద్రపరచుకొనునట్లు ఆ చెట్టుకు మనము ఏమి చేసెదము?

34 అప్పుడు ఆ సేవకుడు తన యజమానితో ఇట్లు చెప్పెను: ఇదిగో నీవు అడవి ఒలీవచెట్టు కొమ్మలను అంటుగట్టినందువలన అవి వ్రేళ్ళను పోషించినవి, అవి నశించక సజీవముగానున్నవి; అందువలన అవి ఇంకను బాగుగానున్నవని నీవు చూచుచున్నావు.

35 అంతట ఆ ఒలీవతోట యజమాని తన సేవకునితో ఇట్లనెను: అవి చెడు ఫలములను ఫలించినంత కాలము ఆ చెట్టు వలన, ఆ వ్రేళ్ళ వలన నాకే ప్రయోజనము లేదు.

36 అయినప్పటికీ వ్రేళ్ళు మంచివని నేనెరుగుదును మరియు నా స్వంత ఉద్దేశ్యము నిమిత్తము నేను వాటిని భద్రపరచితిని; వాటి యొక్క అధిక బలమును బట్టి ఇదివరకు అవి అడవి కొమ్మల నుండి మంచి ఫలములను ఫలించియున్నవి.

37 కానీ అడవి కొమ్మలు పెరిగి, దాని వ్రేళ్ళను అధిగమించినవి; అడవి కొమ్మలు దాని వ్రేళ్ళను అధిగమించిన కారణముగా అది అధికముగా చెడు ఫలములను ఫలించియున్నది; అంత అధికముగా చెడు ఫలములను ఫలించినందువలన అది నశించుట మొదలుపెట్టుచున్నదని నీవు చూచుచున్నావు; దానిని కాపాడుటకు మనము ఏదైనా చేయని యెడల అది అగ్నిలోనికి పడవేయబడునట్లు త్వరలో కృళ్ళిపోవును.

38 ఆ ఒలీవతోట యజమాని మరలా తన సేవకునితో ఇట్లనెను: మనము ఒలీవతోట యొక్క మారుమూల ప్రాంతమునకు వెళ్ళి, ప్రకృతి సిద్ధమైన కొమ్మలు కూడా చెడు ఫలములను ఫలించియున్నవేమో చూచెదము.

39 అప్పుడు వారు ఆ ఒలీవతోట యొక్క మారుమూల ప్రాంతమునకు వెళ్ళి చూడగా, ప్రకృతి సిద్ధమైన కొమ్మల ఫలము కూడా చెడిపోయి ఉండుటను వారు గమనించిరి; మొదటిది, రెండవది మరియు చివరిది అన్నియు చెడిపోయియుండెను.

40 చివరిదాని యొక్క అడవి ఫలము, మంచి ఫలమును ఫలించిన చెట్టు యొక్క భాగమును జయించియుండెను, అందును బట్టి ఆ కొమ్మ వాడిపోయి చనిపోయెను.

41 అప్పుడు ఆ ఒలీవతోట యజమాని రోదిస్తూ సేవకునితో ఇట్లనెను: నా ఒలీవతోట కొరకు ఇంకను ఎక్కువగా నేను ఏమి చేసియుండవలసినది?

42 ఇవి తప్ప ఒలీవతోట యొక్క సమస్త ఫలములు చెడిపోయి ఉన్నవని నేనెరుగుదును. ఒకప్పుడు మంచి ఫలమును ఫలించినవి కూడా ఇప్పుడు చెడుగా మారినవి; ఇప్పుడు నా ఒలీవతోట చెట్లన్నియు నరకబడి అగ్నిలో పడవేయబడుటకు తప్ప దేనికీ పనికిరావు.

43 కొమ్మలు వాడిపోయిన ఈ చివరి దానిని చూడుము, దీనిని నేను సారవంతమైన నేలలో నాటితిని; నా ఒలీవతోట యొక్క అన్ని భాగముల కంటె కూడా నాకిష్టమైన స్థలమిది.

44 నేల యొక్క ఈ భాగమును వ్యర్థము చేయుచున్న దానిని నేను నరికి వేసి, దాని స్థానములో ఈ చెట్టును నాటితినని నీవు చూచితివి.

45 దానిలో ఒక భాగము మంచి ఫలమును మరొక భాగము అడవి ఫలమును ఫలించెనని నీవు చూచితివి; నేను దాని కొమ్మలను త్రుంచివేసి అగ్నిలో పడవేయలేదు, కాబట్టి అవి మంచి కొమ్మను జయించి అది వాడిపోవునట్లు చేసెను.

46 నా ఒలీవతోటను గూర్చి మనము ఎంతో శ్రద్ధ తీసుకొన్నప్పటికి దాని చెట్లు చెడుగా మారినవి, అందువలన అవి మంచి ఫలమును ఫలించవు; ఋతువునకు ముందుగా నా కొరకు దాని ఫలమును కూర్చుకొనుటకు వీటిని భద్రపరచవలెనని నేను ఆశించితిని. కానీ అవి అడవి ఒలీవ చెట్టువలే మారినవి, అవి నరకబడి అగ్నిలో పడవేయబడుటకు తప్ప ఎందుకూ పనికిరావు; వాటిని పోగొట్టుకొనుట నాకు బాధ కలిగించుచున్నది.

47 కానీ నా ఒలీవతోటలో నేను మరిఎక్కువ యేమి చేసియుండగలను? నేను దానిని పోషించకుండా నా చేతిని సడలించితినా? లేదు, నేను దానిని పోషించితిని, దాని చుట్టూ త్రవ్వి, దానిని శుద్ధిచేసి, నేను దానికి ఎరువు వేసితిని; దాదాపు దినమంతయూ నేను దాని కొరకు పనిచేసితిని మరియు అంతము త్వరలో వచ్చుచున్నది. నేను నా ఒలీవతోట చెట్లన్నిటినీ నరికి వేసి, అవి కాల్చివేయబడునట్లు వాటిని అగ్నిలో పడవేయవలసి వచ్చుట నన్ను బాధించుచున్నది. నా ఒలీవతోటను చెడగొట్టిన వాడెవడు?

48 అప్పుడు ఆ సేవకుడు తన యజమానితో ఇట్లనెను: అది నీ ఒలీవతోట యొక్క చెట్ల ఎదుగుదల కాదా—వాటి కొమ్మలు మంచివైన వ్రేళ్ళను జయించలేదా? కొమ్మలు దాని వ్రేళ్ళను జయించియున్న కారణముగా అవి బలమును తమకే తీసుకొనుచూ వ్రేళ్ళ బలము కంటే వేగముగా పెరిగినవి. ఇదిగో నేను చెప్పుచున్నాను, నీ ఒలీవతోట చెట్లు చెడిపోవుటకు కారణమిది కాదా?

49 ఆ ఒలీవతోట యజమాని సేవకునితో ఇట్లనెను: మనము వెళ్ళి ఒలీవతోట చెట్లు నా ఒలీవతోట యొక్క నేలను వ్యర్థము చేయకుండునట్లు వాటిని నరికివేసి అగ్నిలో పడవేయుదము, ఏలయనగా నేను సమస్తము చేసితిని. నేను నా ఒలీవతోట కొరకు మరి ఎక్కువ యేమి చేసియుండవలయును?

50 కానీ ఆ సేవకుడు, ఇంకొంత కాలము దానిని విడిచిపెట్టమని ఆ ఒలీవతోట యజమానితో చెప్పెను.

51 ఆ యజమాని—అవును, ఇంకొంత కాలము నేను దానిని విడిచిపెట్టెదను, ఏలయనగా నా ఒలీవతోట చెట్లను పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నదనెను.

52 అందువలన నా ఒలీవతోట యొక్క మారుమూల ప్రాంతములో నేను నాటియున్న వాటి కొమ్మలను తీసుకొని, వాటిని తెచ్చిన ఆ చెట్టులోనికే మనము తిరిగి అంటుగట్టెదము; అన్నిటికంటే మిక్కిలి చేదు ఫలములున్న కొమ్మలను ఆ చెట్టు నుండి త్రెంచివేసి, వాటి స్థానములో చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మలను మనము అంటుగట్టెదము.

53 ఆ చెట్టు నశించకుండునట్లు మరియు నా స్వంత ఉద్దేశ్యము నిమిత్తము నా కొరకు దాని వ్రేళ్ళను భద్రపరచునట్లు దీనిని నేను చేయుదును.

54 నాకిష్టమైనచోట నేను నాటిన చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మల వ్రేళ్ళు ఇంకనూ సజీవముగానున్నవి; అందువలన వాటిని కూడా నా స్వంత ఉద్దేశ్యము నిమిత్తము భద్రపరచునట్లు నేను ఈ చెట్టు కొమ్మలను తీసుకొని వాటితో అంటుగట్టెదను. ముఖ్యముగా వ్రేళ్ళను నా కొరకు భద్రపరచునట్లు నేను వాటి తల్లి చెట్టు యొక్క కొమ్మలను వాటికి అంటుగట్టెదను, అవి తగినంతగా బలపడినప్పుడు నేనింకను నా ఒలీవతోట యొక్క ఫలము నందు మహిమ పొందగలుగునట్లు బహుశ అవి నా కొరకు మంచి ఫలమును ఫలించునేమో.

55 అప్పుడు వారు అడవి చెట్టుగా మారిన ప్రకృతి సిద్ధమైన చెట్టు నుండి కొమ్మలను తీసుకొని, అవి కూడా అడవి చెట్లుగా మారిన ప్రకృతి సిద్ధమైన చెట్లకు అంటుగట్టిరి.

56 మరియు వారు అడవి చెట్లుగా మారిన ప్రకృతి సిద్ధమైన చెట్ల నుండి కూడా కొమ్మలను తీసుకొని వాటి తల్లి చెట్టుకు అంటుగట్టిరి.

57 ఆ ఒలీవతోట యజమాని సేవకునితో ఇట్లు చెప్పెను: మిక్కిలి చేదుగానున్న వాటిని తప్ప ఇతర అడవి కొమ్మలను చెట్ల నుండి త్రెంచవద్దు; వాటి స్థానములో నేను చెప్పిన దానిని బట్టి నీవు అంటుగట్టవలెను.

58 ఒలీవతోట చెట్లను మనము తిరిగి పోషించెదము, దాని కొమ్మలను మనము క్రమముగా కత్తిరించెదము, నశించవలసిన కృళ్ళిన కొమ్మలను చెట్లనుండి త్రెంచి అగ్నిలో పడవేయుదము.

59 బహుశ వాటి మంచితనమును బట్టి వాటి వ్రేళ్ళు బలము పొందగలుగునట్లు మరియు కొమ్మల యొక్క మార్పును బట్టి మంచిది చెడును అధిగమించగలుగునట్లు నేను దీనిని చేయుదును.

60 నేను ప్రకృతి సిద్ధమైన కొమ్మలను, వాటి వ్రేళ్ళను భద్రపరచియున్నందువలన మరియు ప్రకృతి సిద్ధమైన కొమ్మలను తిరిగి వాటి తల్లి చెట్టునకు అంటుగట్టి, వాటి తల్లి చెట్టు యొక్క వ్రేళ్ళను భద్రపరచినందువలన బహుశ నా ఒలీవతోట చెట్లు తిరిగి మంచి ఫలమును ఫలించునేమో; నా ఒలీవతోట ఫలము నందు నేను తిరిగి సంతోషము కలిగియుందునేమో, బహుశ ప్రథమ ఫలము యొక్క వ్రేళ్ళను, కొమ్మలను భద్రపరచియున్నానని నేను అధికముగా ఆనందించుదునేమో—

61 కావున వెళ్ళుము, మంచిదైన, ఇతర ఫలములన్నిటి కంటే మిక్కిలి శ్రేష్ఠమైన ఆ ప్రకృతి సిద్ధమైన ఫలమును తిరిగి ఫలింపజేయునట్లు, మార్గము సిద్ధపరచునట్లు, మనము ఒలీవతోట యందు మన శక్తితో శ్రద్ధగా పనిచేయునట్లు సేవకులను పిలువుము;

62 మనము వెళ్ళి చివరిసారి మన శక్తితో పని చేసెదము, ఏలయనగా అంతము సమీపించుచున్నది మరియు చివరిసారిగా నేను నా ఒలీవతోటను శుద్ధి చేసెదను.

63 కొమ్మలను అంటుగట్టుడి; చివరివి మొదటివగునట్లు, మొదటివి చివరివగునట్లు చివరి వాటి వద్ద మొదలుపెట్టుడి. పాతవి క్రొత్తవి రెండును, మొదటిది చివరిది మరియు చివరిది మొదటిది, అన్నియు చివరిసారిగా మరొకసారి తిరిగి పోషించబడునట్లు చెట్ల చుట్టూ త్రవ్వుడి.

64 అందువలన వాటి చుట్టూ త్రవ్వి వాటిని శుద్ధి చేసి, చివరిసారిగా మరొకసారి వాటికి ఎరువు వేయుడి, ఏలయనగా అంతము సమీపించుచున్నది. ఒకవేళ ఈ చివరి అంట్లు పెరిగి, ప్రకృతి సిద్ధమైన ఫలమును ఫలించిన యెడల, అప్పుడు అవి పెరుగునట్లు మీరు వాటి కొరకు మార్గము సిద్ధపరచుడి.

65 అవి పెరుగుట ప్రారంభించగానే మంచి వాటి యొక్క బలము, పరిమాణమును బట్టి చేదు ఫలమును ఫలించు కొమ్మలను మీరు తీసివేయుడి; ఒక్కసారిగా వాటిలో చెడ్డవాటినన్నిటినీ మీరు తీసివేయరాదు, అట్లయిన యెడల వాటి వ్రేళ్ళు అంటుకన్నా అధిక బలము కలిగియుండి వాటి అంటు నశించును మరియు నేను నా ఒలీవతోట యొక్క చెట్లను పోగొట్టుకొందును.

66 ఏలయనగా నేను నా ఒలీవతోట యొక్క చెట్లను పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నది; అందువలన మీరు మంచి వాటి పెరుగుదలను బట్టి చెడ్డవాటిని తీసివేయుడి, వేరు మరియు పైభాగము బలమునందు సమానముగా యుండునట్లు చెడ్డవాటిని మంచివి జయించి, చెడ్డవి నరికి వేయబడి అగ్నిలో పడవేయబడు వరకు అవి నా ఒలీవతోట యొక్క నేలను వ్యర్థపరచకుండునట్లు చేయుడి; ఆ విధముగా నేను నా ఒలీవతోట నుండి చెడ్డవాటిని తుడిచివేయుదును.

67 ప్రకృతి సిద్ధమైన చెట్టు యొక్క కొమ్మలను నేను తిరిగి ప్రకృతి సిద్ధమైన చెట్టుకు అంటుగట్టెదను;

68 ప్రకృతి సిద్ధమైన చెట్టు యొక్క కొమ్మలను నేను చెట్టు యొక్క ప్రకృతి సిద్ధమైన కొమ్మలకు అంటుగట్టెదను; అట్లు అవి ప్రకృతి సిద్ధమైన ఫలమును ఫలించునట్లు తిరిగి నేను వాటిని దగ్గరకు తెచ్చెదను మరియు అవి ఏకమగును.

69 చెడ్డవి నా ఒలీవతోట యొక్క భూమియంతటి నుండి బయటకు పడవేయబడును; ఏలయనగా ఈ ఒక్కసారి మాత్రమే నేను నా ఒలీవతోటను శుద్ధి చేసెదను.

70 ఆ ఒలీవతోట యజమాని తన సేవకుని పంపెను; ఆ సేవకుడు వెళ్ళి, యజమాని అతనికి ఆజ్ఞాపించినట్లు చేసి, ఇతర సేవకులను తెచ్చెను; వారు కొద్దిమంది ఉండిరి.

71 ఆ ఒలీవతోట యజమాని వారితో ఇట్లు చెప్పెను: వెళ్ళి మీ శక్తితో ఒలీవతోటలో పని చేయుడి; నేను నా ఒలీవతోటను చివరిసారి పోషించెదను; ఏలయనగా అంతము సమీపించియున్నది మరియు ఋతువు త్వరగా వచ్చుచున్నది; మీ శక్తితో మీరు నాతోపాటు పనిచేసిన యెడల త్వరలో రాబోవు కాలమునకు ముందుగా నా కొరకు నేను కూర్చుకొను ఫలమునందు మీరు సంతోషము కలిగియుందురు.

72 అప్పుడు సేవకులు వెళ్ళి తమ శక్తితో పనిచేసిరి; ఒలీవతోట యజమాని కూడా వారితోపాటు పనిచేసెను; వారు అన్ని విషయములలో ఒలీవతోట యజమాని ఆజ్ఞలను పాటించిరి.

73 ఆ ఒలీవతోట యందు తిరిగి ప్రకృతి సిద్ధమైన ఫలముండుట మొదలాయెను; ప్రకృతి సిద్ధమైన కొమ్మలు అధికముగా ఎదిగి వర్ధిల్లుట మొదలుపెట్టెను; అడవి కొమ్మలు విరిచివేయబడి, పడవేయబడుట మొదలాయెను; వాటి బలమును బట్టి వారు వాటి వేర్లను, పైభాగమును సమానముగా ఉంచిరి.

74 ఆ విధముగా చెడ్డవి ఒలీవతోట నుండి బయటకు పడవేయబడు వరకు ఒలీవతోట యజమాని యొక్క ఆజ్ఞలన్నిటి ప్రకారము వారు సమస్త శ్రద్ధతో పనిచేసిరి; చెట్లు తిరిగి ప్రకృతి సిద్ధమైన ఫలమును ఫలించగా యజమాని తన కొరకు భద్రపరచుకొనెను; అవి ఏకశరీరము వలే ఆయెను మరియు ఫలములు సమానముగానుండెను; ఒలీవతోట యజమాని మొదటి నుండి అతనికి అతి శ్రేష్ఠమైన ఆ ప్రకృతి సిద్ధమైన ఫలమును తన కొరకు భద్రపరచుకొనెను.

75 తన ఫలము మంచిదనియు తన ఒలీవతోట ఇక ఏ మాత్రము చెడుగా లేదనియు ఒలీవతోట యజమాని చూచినప్పుడు, అతడు తన సేవకులను పిలిచి వారితో ఇట్లనెను: ఇదిగో చివరిసారి మనము నా ఒలీవతోటను పోషించితిమి; నేను నా ఇష్టప్రకారము చేసియున్నానని మీరు చూచుచున్నారు; అది మంచిదనియు అది మొదట ఉన్నట్లు కూడా ఉన్నదనియు నేను ప్రకృతి సిద్ధమైన ఫలమును భద్రపరచియున్నాను. మీరు ధన్యులు, ఏలయనగా మీరు నా ఒలీవతోట యందు నాతోపాటు పని చేయుటలో శ్రద్ధ కలిగియున్నారు, నా ఆజ్ఞలను పాటించియున్నారు మరియు నాకు తిరిగి ప్రకృతి సిద్ధమైన ఫలమును తెచ్చియున్నారు, నా ఒలీవతోట ఇక ఏ మాత్రము చెడిపోలేదు మరియు చెడ్డవి పడవేయబడినవి, నా ఒలీవతోట యొక్క ఫలమును బట్టి మీరు నాతోపాటు సంతోషము కలిగియుందురు.

76 ఏలయనగా, త్వరగా వచ్చుచున్న ఋతువునకు ముందుగా సుధీర్ఘ కాలముపాటు నేను నా కొరకు నా ఒలీవతోట యొక్క ఫలమును కూర్చెదను; చివరి సారిగా నేను నా ఒలీవతోటను పోషించి, దానిని శుద్ధిచేసి, దాని చుట్టూ త్రవ్వి, దానికి ఎరువు వేసితిని; అందువలన నేను చెప్పియున్న దానిని బట్టి సుధీర్ఘకాలముపాటు నేను నా కొరకు ఫలమును కూర్చుకొనెదను.

77 తిరిగి నా ఒలీవతోటలోనికి చెడు ఫలము వచ్చు సమయము వచ్చినప్పుడు, నేను మంచివి చెడ్డవి పోగుచేయబడునట్లు చేసెదను; మంచి వాటిని నేను నా కొరకు భద్రపరచెదను మరియు చెడ్డవాటిని వాటి స్వంత స్థలములోనికి పడవేయుదును. అప్పుడు ఋతువును అంతమును వచ్చును; మరియు నా ఒలీవతోట అగ్నితో కాల్చబడునట్లు నేను చేయుదును.