లేఖనములు
జేకబ్ 7


7వ అధ్యాయము

షెరేమ్ క్రీస్తును తిరస్కరించి, జేకబ్‌తో వాదించి, ఒక సూచనను కోరును మరియు దేవునిచేత మొత్తబడును—ప్రవక్తలందరు క్రీస్తును గూర్చి, ఆయన ప్రాయశ్చిత్తమును గూర్చి చెప్పియున్నారు—నీఫైయులు శ్రమయందు జన్మించి, లేమనీయులచే ద్వేషింపబడి, దేశదిమ్మరులుగా తమ జీవితాలను జీవించియున్నారు. సుమారు క్రీ. పూ. 544–421 సం.

1 కొన్ని సంవత్సరములు గడిచిపోయిన తరువాత, నీఫై జనుల మధ్య షెరేమ్ అను పేరుగల ఒక మనుష్యుడు వచ్చెను.

2 అతడు జనుల మధ్య బోధించుచు, క్రీస్తు రాడని వారికి ప్రకటించుట మొదలుపెట్టెను. జనులకు అనుకూలమైన అనేక వాక్యములను అతడు బోధించెను; క్రీస్తు యొక్క సిద్ధాంతమును పడద్రోయవలెనని అతడు ఇదంతయు చేసెను.

3 జనుల హృదయములు త్రోవతప్పునట్లు చేయుటకు అతడు శ్రద్ధగా పనిచేసి, నిజముగా అనేకుల హృదయాలను నడిపించివేసెను; రాబోవు క్రీస్తునందు జేకబ్ అను నేను విశ్వాసము కలిగియున్నానని ఎరిగినవాడై అతడు నా యొద్దకు వచ్చుటకు అవకాశము కొరకు ఎదురుచూచెను.

4 అతడు ప్రవీణుడైనందున జనుల భాష గురించి పరిపూర్ణ జ్ఞానమును కలిగియుండెను; అందువలన అపవాది యొక్క శక్తిని బట్టి అతడు అధికముగా పొగడ్తను, వాక్‌శక్తిని ఉపయోగించగలిగెను.

5 ఈ సంగతులను గూర్చి నేను అనేక విషయములను, అనేక బయల్పాటులను చూచియున్నప్పటికీ, నన్ను విశ్వాసమునుండి కదిలించి వేయగలనని అతడు ఆశించెను; కానీ, నేను నిజముగా దేవదూతలను చూచియుంటిని మరియు వారు నాకు పరిచర్య చేసిరి. ఎప్పటికప్పుడు ప్రభువు యొక్క స్వరము నిజముగా నాతో మాట్లాడుట కూడా నేను వినియున్నాను; అందువలన నేను కదిలించబడను.

6 అతడు నా యొద్దకు వచ్చి, ఈ విధముగా చెప్పుచూ నాతో మాట్లాడెను: సహోదరుడా జేకబ్, నేను నీతో మాట్లాడు అవకాశము కొరకు చాలా ఎదురు చూచితిని; ఏలయనగా నీవు సువార్త లేదా క్రీస్తు సిద్ధాంతము అని పిలుచుచున్న దానిని బోధించుచూ అధికముగా ప్రయాణించెదవని నేను వినియున్నాను మరియు ఎరుగుదును కూడా.

7 నీవు ఈ జనులలో అనేకులను నడిపించివేసియున్నావు, అందును బట్టి వారు దేవుని యొక్క సరియైన మార్గమును మరచిపోయి, సరియైన మార్గమైన మోషే ధర్మశాస్త్రమును పాటించుట లేదు; మరియు ఇప్పటి నుండి అనేక వందల సంవత్సరములకు వచ్చునని నీవు చెప్పుచున్న ఒక వ్యక్తి యొక్క ఆరాధనలోనికి మోషే ధర్మశాస్త్రమును మార్చుచున్నారు. ఇదిగో ఇది దైవదూషణయై యున్నదని షెరేమ్ అను నేను నీకు ప్రకటించుచున్నాను; ఏలయనగా ఏ మనుష్యుడును అట్టి సంగతులను ఎరుగడు; రాబోవు క్రియలను చెప్పలేడు. ఈ విధముగా షెరేమ్ నాకు వ్యతిరేకముగా వాదించెను.

8 కానీ, నేను అతని మాటలన్నిటియందు అతడిని కలవరపెట్టునంతగా ప్రభువైన దేవుడు నా ఆత్మలోనికి తన ఆత్మను క్రుమ్మరించెను.

9 నేను అతనితో—రాబోవు క్రీస్తును నీవు తిరస్కరించుచున్నావా? అనగా, క్రీస్తు ఉన్నయెడల నేనతనిని తిరస్కరించను. కానీ ఏ క్రీస్తూ లేడని, ఎన్నడూ ఉండియుండలేదని, ఎన్నడూ ఉండబోడని నేనెరుగుదునని అతడు చెప్పెను.

10 నీవు లేఖనములను నమ్ముచున్నావా? అని నేనతనితో అనగా, అతడు అవునని చెప్పెను.

11 అయితే నీవు వాటిని గ్రహించలేదు; ఏలయనగా అవి నిజముగా క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవని నేనతనితో చెప్పితిని. ఇదిగో, ప్రవక్తలలో ఏ ఒక్కరూ క్రీస్తును గూర్చి మాట్లాడకుండా వ్రాయలేదని, ప్రవచించలేదని నేను నీతో చెప్పుచున్నానంటిని.

12 అంతయు ఇదియే కాదు—ఇది నాకు విశదము చేయబడినది, ఏలయనగా నేను విని, చూచియున్నాను; ఇది నాకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కూడా విశదము చేయబడినది, అందువలన ప్రాయశ్చిత్తము చేయబడని యెడల సమస్త మానవజాతి నశించిపోవలసినదని నేనెరుగుదునంటిని.

13 అప్పుడతడు నాతో—నీవు అంత ఎక్కువగా ఎరిగిన ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు ఒక సూచనను చూపుమనెను.

14 నేను అతనితో ఇట్లంటిని: నీవు నిజమని ఎరిగిన విషయములో నీకు ఒక సూచనను చూపమని దేవుడిని శోధించుటకు నేనేపాటివాడను? అయినను నీవు అపవాది సంబంధివి గనుక దానిని తిరస్కరించుదువు. అయినప్పటికీ, నా చిత్తము జరుగదు; కానీ దేవుడు నిన్ను మొత్తిన యెడల, ఆయన భూమ్యాకాశములయందు శక్తి కలిగియున్నాడని, క్రీస్తు వచ్చునని అది నీకు ఒక సూచనగా ఉండనిమ్ము. ఓ ప్రభువా, నీ చిత్తము జరుగునుగాక, నా చిత్తము కాదు.

15 జేకబ్ అను నేను ఈ మాటలను పలికినప్పుడు అతడు భూమిపై పడునంతగా ప్రభువు యొక్క శక్తి అతనిపై వచ్చెను. అతడు అనేక దినముల పాటు పోషింపబడెను.

16 అప్పుడతడు జనులతో ఇట్లు చెప్పెను: రేపు కలసి కూడుకొనుడి, ఏలయనగా నేను చనిపోయెదను; కావున చనిపోవుటకు ముందు నేను జనులతో మాట్లాడగోరుచున్నాను.

17 ఉదయమున సమూహము సమకూడిరి; అతడు వారితో సరళముగా మాట్లాడి, వారికి బోధించియుండిన వాక్యములను తిరస్కరించి, క్రీస్తును, పరిశుద్ధాత్మ శక్తిని, దేవదూతల పరిచర్యను ఒప్పుకొనెను.

18 అతడు అపవాది శక్తిచేత మోసగించబడెనని వారితో సరళముగా చెప్పెను. నరకము, నిత్యత్వము, నిత్య శిక్షను గూ ర్చి మాట్లాడెను.

19 అతడు ఇట్లు చెప్పెను: నేను క్షమించరాని పాపమును చేసియున్నానేమోనని భయపడుచున్నాను, ఏలయనగా నేను దేవునితో అబద్ధమాడియున్నాను; నేను క్రీస్తును తిరస్కరించి, లేఖనములను విశ్వసించుచున్నానని చెప్పితిని; అవి నిజముగా ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నేను ఆ విధముగా దేవునితో అబద్ధమాడి యున్నందున నా స్థితి భయంకరమగునేమోనని అధికముగా భయపడుచున్నాను; కానీ నేను దేవుని యెదుట ఒప్పుకొందును.

20 అతడు ఈ మాటలు చెప్పినప్పుడు, అతడింకేమియు చెప్పలేకయుండి ప్రాణము విడిచెను.

21 అతడు తన ప్రాణము విడుచుటకు సిద్ధముగా ఉండి ఈ వాక్యములను చెప్పుట చూచినప్పుడు సమూహము అధికముగా ఆశ్చర్యపడిరి; వారు జయించబడునంతగా దేవుని శక్తి వారిపై దిగివచ్చెను మరియు వారు నేలపై పడిరి.

22 ఇప్పుడు, ఈ సంగతి జేకబ్ అను నాకు సంతోషకరముగా ఉండెను, ఏలయనగా పరలోకమందున్న నా తండ్రి నుండి దీనిని నేను కోరియున్నాను; ఆయన నా మొర విని, నా ప్రార్థనకు జవాబిచ్చెను.

23 దేవుని సమాధానము, ప్రేమ తిరిగి జనుల మధ్య పునఃస్థాపించబడెను; వారు లేఖనములను వెదకిరి మరియు ఇక ఏ మాత్రము దుర్మార్గుడైన ఈ మనుష్యుని మాటలను వినలేదు.

24 లేమనీయులను సత్యము యొక్క జ్ఞానమునకు పునఃస్థాపించుటకు, సరిదిద్దుటకు అనేక మార్గములు కల్పించబడినవి; కానీ అది అంతయూ వ్యర్థమాయెను, ఏలయనగా వారు యుద్ధములు, రక్తపాతమందు ఆనందించిరి, వారి సహోదరులమైన మాకు వ్యతిరేకముగా నిత్యద్వేషమును కలిగియుండిరి. వారి ఆయుధముల యొక్క శక్తి ద్వారా వారు మమ్ములను నిరంతరము నాశనము చేయుటకు ప్రయత్నించిరి.

25 అందువలన నీఫై జనులు తమ రక్షణ దుర్గమైన దేవునియందు విశ్వసించుచు వారికి వ్యతిరేకముగా తమ ఆయుధములతో, తమ సమస్త బలముతో తమను బలపరచుకొనిరి; కావున వారు ఇంకను తమ శత్రువులపై గెలుపొందిన వారిగా ఉండిరి.

26 జేకబ్ అను నేను ముసలివాడగుచుంటిని; ఈ జనుల వృత్తాంతము నీఫై యొక్క ఇతర పలకలపై వ్రాయబడుచున్నందున, నేను ఎరిగినంత మట్టుకు నేను ఈ వృత్తాంతమును వ్రాసియున్నానని ప్రకటించుచూ, కాలము గడిచిపోయెనని, మా జీవితములు కూడా ఒక స్వప్నమువలే గడిచిపోయెనని, మేము ఒంటరివారమైన, గంభీరమైన జనులమైయుండి యెరూషలేము నుండి బయటకు త్రోసివేయబడి శ్రమలో అరణ్యములో జన్మించి దేశదిమ్మరులమై మా సహోదరులచే ద్వేషించబడితిమని, అది యుద్ధములను వివాదములను కలిగించెనని; అందువలన మేము మా దినములను దుఃఖములో గడిపితిమని చెప్పుచూ ముగించెదను.

27 జేకబ్ అను నేను, త్వరలో చనిపోవుదునని గ్రహించితిని; అందువలన, ఈ పలకలను తీసుకొమ్మని నేను నా కుమారుడైన ఈనస్‌తో చెప్పితిని. నా సహోదరుడైన నీఫై నాకు ఆజ్ఞాపించిన వాక్యములను నేను అతనికి చెప్పితిని మరియు అతడు ఆ ఆజ్ఞలకు విధేయత చూపెదనని వాగ్దానము చేసెను. ఇప్పుడు ఈ పలకలపై క్లుప్తముగానున్న నా వ్రాతను నేను ముగించెదను; నా సహోదరులలో అనేకులు నా మాటలను చదువుదురని ఆశించుచూ చదువువాని నుండి నేను సెలవు తీసుకొనుచున్నాను. సహోదరులారా, సెలవు.