లేఖనములు
జేరమ్ 1


జేరమ్ గ్రంథము

1వ అధ్యాయము

నీఫైయులు మోషే ధర్మశాస్త్రమును పాటించుచు, క్రీస్తు యొక్క రాక కొరకు ఎదురు చూచుచు దేశమునందు వర్ధిల్లుదురు—జనులను సత్యమార్గములో ఉంచుటకు అనేకమంది ప్రవక్తలు కృషి చేయుదురు. సుమారు క్రీ. పూ. 399–361 సం.

1 మా వంశావళి భద్రపరచబడునట్లు, నా తండ్రి ఈనస్ యొక్క ఆజ్ఞ ప్రకారము జేరమ్ అను నేను కొద్ది మాటలను వ్రాయుచున్నాను.

2 ఈ పలకలు చిన్నవైనందున, ఈ వాక్యములు మా సహోదరులైన లేమనీయుల ప్రయోజనము నిమిత్తము వ్రాయబడినందువలన నేను కొద్దిగా వ్రాయవలెను; కానీ, నేను నా ప్రవచనములు లేదా నా బయల్పాటుల యొక్క విషయములను వ్రాయరాదు. ఏలయనగా నా పితరులు వ్రాసియున్న దానికన్నా అధికముగా నేనేమి వ్రాయగలను? వారు రక్షణ ప్రణాళికను బయలుపరచలేదా? అవును, అని నేను మీతో చెప్పుచున్నాను; మరియు ఇది నాకు చాలును.

3 వారి హృదయ కాఠిన్యము, వారి చెవుల చెవిటితనము, వారి మనస్సుల గ్రుడ్డితనము మరియు వారి మెడల బిరుసుతనమును బట్టి ఈ జనుల మధ్య ఎక్కువ పని చేయబడుట అవసరమైయుండెను; అయినప్పటికీ దేవుడు వారిపట్ల ఎక్కువ కనికరము కలిగియుండి, భూముఖము పైనుండి వారిని ఇంకను నాశనము చేయలేదు.

4 మరియు మా మధ్య అధికముగా బయల్పాటులు పొందినవారు అనేకులున్నారు, ఏలయనగా వారందరు మెడబిరుసు జనులు కారు. మెడబిరుసు జనులు కాకుండా విశ్వాసము కలిగియున్న వారందరు, వారి విశ్వాసమును బట్టి నరుల సంతానమునకు విశదపరచు పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము కలిగియున్నారు.

5 ఇప్పుడు రెండు వందల సంవత్సరములు గడిచిపోయినవి మరియు నీఫై జనులు దేశమందు బలవంతులైరి. వారు మోషే ధర్మశాస్త్రమును పాటించి, ప్రభువుకు పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరించిరి; వారు దేనిని ఉల్లంఘించలేదు లేదా దైవదూషణ చేయలేదు. మరియు దేశ చట్టములు అత్యంత కఠినముగానుండెను.

6 వారు మరియు లేమనీయులు కూడా భూముఖముపై అధికముగా విస్తరించియుండిరి. లేమనీయులు నీఫైయుల కంటె అత్యధిక సంఖ్యలో ఉండిరి; వారు నరహత్యను ప్రేమించిరి, మృగముల రక్తమును త్రాగుచుండిరి.

7 నీఫైయులమైన మాకు వ్యతిరేకముగా వారు అనేక పర్యాయములు యుద్ధమునకు వచ్చిరి. కానీ మా రాజులు, మా నాయకులు ప్రభువు యొక్క విశ్వాసమందు బలముగానుండిరి; వారు జనులకు ప్రభువు యొక్క మార్గములు బోధించిరి; అందువలన మేము లేమనీయులను ఎదుర్కొని, వారిని మా దేశముల నుండి బయటకు తరిమివేసి, మా పట్టణములలో లేదా మా స్వాస్థ్యమైన స్థలములలో ప్రాకారపురములు కట్టుట ప్రారంభించితిమి.

8 మేము అధికముగా విస్తరించి, భూముఖముపై వ్యాపించితిమి మరియు బంగారము, వెండి, వెలగల వస్తువులయందు, చెక్క యొక్క శ్రేష్ఠమైన పనితనమందు, భవనముల యందు, యంత్రముల యందు, ఇనుము, రాగి, కంచు, ఉక్కు మొదలైన వాటియందు అధికముగా ధనవంతులమైతిమి, నేలను దున్నుటకు అవసరమైన అన్నిరకములైన పనిముట్లను, యుద్ధ ఆయుధములను—ముఖ్యముగా పదునైన కొనదేలిన బాణములు, అంబుల పొది, ఈటె, బల్లెములను తయారు చేయుచు, యుద్ధము కొరకు అన్ని ఏర్పాట్లు చేయుచుంటిమి.

9 ఆ విధముగా లేమనీయులను ఎదుర్కొనుటకు సిద్ధపడియుండుట చేత వారు మాకు వ్యతిరేకముగా సఫలము కాలేదు. కానీ, నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు దేశమందు వర్ధిల్లుదురు అని చెప్పుచూ ప్రభువు మన పితరులతో పలికిన వాక్యము నిరూపించబడెను.

10 కానీ వారు ఆజ్ఞలను పాటించకుండా అతిక్రమములో పడిన యెడల భూముఖము పైనుండి వారు నాశనము చేయబడుదురనే దేవుని వాక్యమును బట్టి ప్రభువు యొక్క ప్రవక్తలు నీఫై జనులను ముందుగా హెచ్చరించిరి.

11 అందువలన ప్రవక్తలు, యాజకులు మరియు ఉపదేశకులు సమస్త దీర్ఘశాంతముతో శ్రద్ధ కలిగి యుండవలెనని జనులను హెచ్చరించుచు మోషే ధర్మశాస్త్రమును, అది ఇవ్వబడిన ఉద్దేశ్యమును బోధించుచు, మెస్సీయ కొరకు ఎదురు చూచుటకు, రాబోవు ఆయన వచ్చియున్నట్లుగా విశ్వసించుటకు వారిని ఒప్పించుచు శ్రద్ధగా కృషిచేసిరి. మరియు ఈ విధముగా వారు వారికి బోధించిరి.

12 అట్లు చేయుట ద్వారా వారు భూముఖము పైనుండి నాశనము చేయబడకుండా వారిని కాపాడిరి; నిరంతరము వారిని పశ్చాత్తాపమునకు పురికొల్పుచూ వారు వాక్యముతో వారి హృదయములు నొచ్చుకొనునట్లు చేసిరి.

13 అధిక కాలముపాటు యుద్ధములు, వివాదములు మరియు కలహములలో రెండు వందల ముప్పది ఎనిమిది సంవత్సరములు గడిచిపోయెను.

14 ఈ పలకలు చిన్నవైనందున జేరమ్ అను నేను మరి ఎక్కువ వ్రాయను. కానీ నా సహోదరులారా, మీరు నీఫై యొక్క ఇతర పలకలను పోల్చవచ్చును; ఏలయనగా రాజుల యొక్క వ్రాతలననుసరించి లేదా వారు వ్రాయబడునట్లు చేసిన వాటిని బట్టి మా యుద్ధముల యొక్క వృత్తాంతములు వాటిపై చెక్కబడినవి.

15 నా పితరుల యొక్క ఆజ్ఞల ప్రకారము అవి భద్రపరచబడునట్లు నేను ఈ పలకలను నా కుమారుడైన ఓంనై చేతికి అప్పగించుచున్నాను.