లేఖనములు
మోర్మన్ 7


7వ అధ్యాయము

క్రీస్తు నందు విశ్వాసముంచి, ఆయన సువార్తను అంగీకరించి, రక్షణ పొందమని కడవరి దినములలోని లేమనీయులను మోర్మన్‌ ఆహ్వానించును—బైబిలును విశ్వసించు వారందరు మోర్మన్‌ గ్రంథమును కూడా విశ్వసించెదరు. సుమారు క్రీ. శ. 385 సం.

1 ఇప్పుడు వారి పితరుల యొక్క క్రియల గురించి వారు తెలుసుకొనునట్లు, దేవుడు నా మాటలను వారికి ఇచ్చునేమోనను ఉద్దేశ్యముతో, కాపాడబడిన ఈ జనుల యొక్క శేషమునకు నేను కొంత చెప్పెదను; అనగా, ఇశ్రాయేలు వంశము యొక్క శేషమైన మీతో నేను చెప్పుచున్నాను మరియు నేను చెప్పుచున్న మాటలివే:

2 మీరు ఇశ్రాయేలు వంశస్థులని తెలుసుకొనవలెను.

3 మీరు పశ్చాత్తాపపడవలెనని, లేని యెడల మీరు రక్షింపబడలేరని మీరు తెలుసుకొనవలెను.

4 మీరు మీ యుద్ధ ఆయుధములను క్రింద పడవేయవలెనని, ఇకమీదట రక్తము చిందించుటలో ఆనందించరాదని మరియు దేవుడు మీకు ఆజ్ఞాపించితే తప్ప, వాటిని తిరిగి తీసుకొనరాదని మీరు తెలుసుకొనవలెను.

5 మీరు మీ పూర్వీకులు పొందిన జ్ఞానమును పొందవలెనని, మీ పాపములు మరియు దుర్ణీతులన్నిటి విషయమై పశ్చాత్తాపపడవలెనని, యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడని, ఆయన యూదుల చేత సంహరింపబడెనని, తండ్రి యొక్క శక్తి ద్వారా ఆయన తిరిగి లేచియున్నాడని, దాని ద్వారా ఆయన సమాధిపై విజయము పొందియున్నాడని, ఆయనయందు మరణపు ముల్లు మ్రింగి వేయబడినదని విశ్వసించవలెనని మీరు తెలుసుకొనవలెను.

6 ఆయన మృతుల యొక్క పునరుత్థానమును తెచ్చును, దాని ద్వారా ఆయన న్యాయపీఠము యెదుట నిలబడుటకు మనుష్యుడు లేపబడవలెను.

7 మరియు ఆయన లోకము యొక్క విమోచనను తెచ్చెను, దానిని బట్టి తీర్పు దినమున ఆయన యెదుట నిర్దోషిగా కనుగొనబడిన వాడు, ఆయన రాజ్యమందు దేవుని సన్నిధిలో నివసించుటకు, అంతములేని సంతోషము యొక్క స్థితిలో పైనున్న గాయకులతో కలిసి ఏక దేవుడైన తండ్రికి, కుమారునికి మరియు పరిశుద్ధాత్మకు నిరంతరము స్తుతులు పాడుటకు అనుమతించబడును.

8 కావున పశ్చాత్తాపపడి, యేసు నామమందు బాప్తిస్మమునొందుడి మరియు ఈ గ్రంథమందే కాక యూదుల నుండి అన్యజనులకు వచ్చు గ్రంథమందు, అన్యజనుల నుండి మీకు వచ్చు గ్రంథమందు కూడా మీ ముందు ఉంచబడిన క్రీస్తు యొక్క సువార్తను హత్తుకొనుడి.

9 ఏలయనగా, మీరు దానిని విశ్వసించు ఉద్దేశ్యమునకై ఇది వ్రాయబడినది మరియు మీరు దానిని విశ్వసించిన యెడల, దీనిని కూడా విశ్వసించెదరు; మీరు దీనిని విశ్వసించిన యెడల, మీ పితరులు మరియు వారి మధ్య దేవుని శక్తి ద్వారా చేయబడిన అద్భుతకార్యములను గూర్చి మీరు తెలుసుకొందురు.

10 మీరు యాకోబు సంతానము యొక్క శేషమని కూడా మీరు తెలుసుకొందురు; కావున, మీరు మొదటి నిబంధన యొక్క జనుల మధ్య లెక్కింపబడియున్నారు; మరియు మీరు క్రీస్తు నందు విశ్వసించి, ఆయన మనకు ఆజ్ఞాపించిన దాని ప్రకారము మన రక్షకుని మాదిరిని అనుసరించుచూ, మొదట నీటితోను తరువాత అగ్నితోను, పరిశుద్ధాత్మతోను బాప్తిస్మము పొందిన యెడల, తీర్పు దినమున మీకు మేలు కలుగును. ఆమేన్‌.