లేఖనములు
మొరోనై 8


8వ అధ్యాయము

చిన్నపిల్లల బాప్తిస్మము ఒక దుష్ట హేయకార్యమైయున్నది—ప్రాయశ్చిత్తమును బట్టి చిన్న పిల్లలు క్రీస్తులో జీవము కలిగియున్నారు—విశ్వాసము, పశ్చాత్తాపము, సాత్వికము, హృదయము యొక్క దీనత్వము, పరిశుద్ధాత్మను పొందుట మరియు అంతము వరకు స్థిరముగానుండుట రక్షణకు నడిపించును. సుమారు క్రీ. శ. 401–421 సం.

1 మొరోనై అను నాకు, నా తండ్రి మోర్మన్‌ వ్రాసిన ఒక లేఖ; నేను పరిచర్యకు పిలువబడిన వెంటనే అది నాకు వ్రాయబడెను. మరియు ఇట్లు చెప్పుచూ ఆయన నాకు ఈ విధముగా వ్రాసెను:

2 నా ప్రియ కుమారుడవైన మొరోనై, నీ ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను మరచిపోలేదని, ఆయన పరిచర్యకు మరియు ఆయన పరిశుద్ధ కార్యమునకు నిన్ను పిలిచియున్నాడని నేను మిక్కిలి ఆనందించుచున్నాను.

3 అంతము వరకు ఆయన నామమందు విశ్వాసము కలిగియుండుటనుబట్టి తన అపరిమితమైన మంచితనము మరియు కృప ద్వారా ఆయన నిన్ను కాపాడవలెనని, ఆయన పరిశుద్ధ సంతానమైన యేసు నామమందు తండ్రియైన దేవునికి నిరంతరము ప్రార్థన చేయుచూ, నా ప్రార్థనలలో నేను ఎల్లప్పుడు నిన్ను గూర్చి తలంచుచున్నాను.

4 ఇప్పుడు, నా కుమారుడా, నన్ను మిక్కిలిగా బాధపెట్టుచున్న దానిని గూర్చి నేను నీతో మాట్లాడుచున్నాను; ఏలయనగా, మీ మధ్య వివాదములు తలెత్తుట నన్ను బాధపెట్టుచున్నది.

5 నేను ఎరిగినది నిజమైన యెడల, మీ చిన్న పిల్లల బాప్తిస్మమును గూర్చి మీ మధ్య వివాదములున్నవి.

6 నా కుమారుడా, ఈ గొప్ప తప్పిదము మీ మధ్య నుండి తీసివేయబడునట్లు నీవు శ్రద్ధగా పని చేయవలెనని నేను కోరుచున్నాను; ఏలయనగా, ఈ ఉద్దేశ్యము నిమిత్తమే నేను ఈ లేఖను వ్రాయుచున్నాను.

7 నీ నుండి ఈ సంగతులను తెలుసుకొనిన వెంటనే నేను ఈ విషయుమును గూర్చి ప్రభువునొద్ద విచారించితిని. మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇట్లు చెప్పుచూ ప్రభువు వాక్కు నాకు వచ్చెను:

8 నీ విమోచకుడు, నీ ప్రభువు మరియు నీ దేవుడైన క్రీస్తు మాటలకు చెవియొగ్గుము. నేను పాపులనే పశ్చాత్తాపమునకు పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలుచుటకు లోకములోనికి రాలేదు; రోగులకే గాని, ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కర లేదు. చిన్న పిల్లలు స్వచ్ఛమైనవారు, వారు పాపము చేయ సమర్థులు కారు; అందువలన ఆదాము యొక్క శాపము వారి మీద ఎట్టి అధికారము లేకయుండునట్లు, నా మూలముగా అది వారి నుండి తీసివేయబడినది; సున్నతి చట్టము నా మూలముగా కొట్టివేయబడినది.

9 మరియు ఈ విధముగా పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును నాకు తెలియజేసెను; అందువలన నా ప్రియ కుమారుడా, మీరు చిన్నపిల్లలకు బాప్తిస్మమిచ్చుట దేవుని యెదుట గంభీరమైన ధిక్కారమైయున్నదని నేనెరుగుదును.

10 నేను నీతో చెప్పునదేమనగా, మీరు ఈ విషయమును బోధించవలెను—ఉత్తరవాదులైన వారికి, పాపము చేయుటకు సమర్థులైన వారికి పశ్చాత్తాపమును బాప్తిస్మమును బోధించుడి; వారు పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొందవలెనని, వారి చిన్నపిల్లల వలే తమనుతాము తగ్గించుకొనవలెనని తల్లిదండ్రులకు బోధించుడి; అప్పుడు వారందరు, వారి చిన్న పిల్లలతోపాటు రక్షింపబడుదురు.

11 వారి చిన్న పిల్లలకు ఎట్టి పశ్చాత్తాపము లేదా బాప్తిస్మము అవసరము లేదు. బాప్తిస్మము, పాప క్షమాపణ కొరకు ఆజ్ఞల నెరవేర్పునకు పశ్చాత్తాపము కొరకైయున్నది.

12 కానీ, లోకము పునాది వేయబడినప్పటినుండి కూడా చిన్నపిల్లలు క్రీస్తునందు జీవము కలిగియున్నారు; అట్లు కానియెడల, దేవుడు పక్షపాతి, మార్పు చెందు దేవుడు మరియు బేధము చూపు దేవుడు కూడా అయ్యున్నాడు; ఏలయనగా, ఎంతోమంది చిన్నపిల్లలు బాప్తిస్మము లేకుండా మరణించియున్నారు.

13 అందువలన, చిన్నపిల్లలు బాప్తిస్మము లేకుండా రక్షింపబడలేకపోయిన యెడల, వారొక అంతము లేని నరకమునకు వెళ్ళియుండవలెను.

14 నేను నీతో చెప్పునదేమనగా—చిన్నపిల్లలకు బాప్తిస్మము అవసరమని తలంచువాడు ఘోర దుష్టత్వమందు, దుర్నీతి బంధకములందు ఉన్నాడు; ఏలయనగా, అతడు విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వము లేకయున్నాడు; అందువలన ఆ ఆలోచనలో అతడు మరణించవలసియున్న యెడల, అతడు తప్పక నరకమునకు వెళ్ళవలెను.

15 ఏలయనగా, బాప్తిస్మమును బట్టి దేవుడు ఒక బిడ్డను రక్షించునని, మరొకడు బాప్తిస్మము పొందనందు వలన నశించవలెనని తలంచు దుష్టత్వము భయంకరమైనది.

16 ఈ విధముగా ప్రభువు యొక్క మార్గములను చెరుపు వారికి శ్రమ, ఏలయనగా వారు పశ్చాత్తాపపడని యెడల నశించిపోవుదురు. నేను దేవుని నుండి అధికారము కలిగియుండి, ధైర్యముతో మాట్లాడుచున్నాను; మనుష్యుడేమి చేయగలడోయని నేను భయపడను; ఏలయనగా, పరిపూర్ణమైన ప్రేమ సమస్త భయమును పారద్రోలును.

17 నేను దాతృత్వముతో నిండియున్నాను, అది నిత్య ప్రేమయైయున్నది; నా దృష్టిలో పిల్లలందరు సమానులు; అందువలన నేను చిన్నపిల్లలను పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించుచున్నాను; వారందరూ సమానులు మరియు రక్షణ యందు పాలిభాగస్థులై యున్నారు.

18 ఏలయనగా, దేవుడు పక్షపాతి కాడని లేదా మార్పు చెందు దేవుడు కాడని, ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మార్పులేని వాడని నేనెరుగుదును.

19 చిన్నపిల్లలు పశ్చాత్తాపపడలేరు; అందువలన వారి కొరకు దేవుని యొక్క శుద్ధ కనికరములను తిరస్కరించడము అనునది ఘోర దుష్టత్వము, ఏలయనగా వారందరు ఆయన కనికరమును బట్టి ఆయనలో జీవము కలిగియున్నారు.

20 చిన్నపిల్లలకు బాప్తిస్మము అవసరమని చెప్పువాడు, క్రీస్తు యొక్క కనికరములను తిరస్కరించును మరియు ఆయన ప్రాయశ్చిత్తమును, ఆయన విమోచనాశక్తిని వ్యర్థము చేయును.

21 అట్టి వారికి ఆపద, వారు మరణము, నరకము మరియు అంతము లేని వేదన యొక్క అపాయమందున్నారు. నేను దానిని ధైర్యముగా చెప్పుచున్నాను; దేవుడు నన్ను ఆజ్ఞాపించియున్నాడు. వాటిని ఆలకించుడి మరియు లక్ష్యముంచుడి, లేనియెడల క్రీస్తు యొక్క న్యాయపీఠము యొద్ద అవి మీకు వ్యతిరేకముగా నిలుచును.

22 ఇదిగో, చిన్నపిల్లలందరు మరియు చట్టములేకయున్న వారందరు కూడా క్రీస్తు నందు సజీవులైయున్నారు. ఏలయనగా, చట్టము లేని వారందరిపై విమోచనాశక్తి వచ్చును; అందువలన, శిక్ష విధింపబడని వాడు లేదా శిక్షావిధికి లోనుకాని వాడు పశ్చాత్తాపపడలేడు; అట్టి వానికి బాప్తిస్మము ఎట్టి ప్రయోజనము చేకూర్చదు—

23 కానీ, అది దేవుని యెదుట ధిక్కారమైయున్నది, క్రీస్తు యొక్క కనికరములను, పరిశుద్ధాత్మ శక్తిని తిరస్కరించుచూ మృత కార్యములలో నమ్మకముంచుట అయ్యున్నది.

24 నా కుమారుడా, ఈ విధముగా జరుగరాదు; ఏలయనగా, పశ్చాత్తాపము అనునది శిక్షావిధికి లోనైన వారి కొరకు మరియు చట్టమును మీరిన శాపము క్రింద ఉన్న వారి కొరకైయున్నది.

25 పశ్చాత్తాపము యొక్క ప్రథమ ఫలమే బాప్తిస్మము; బాప్తిస్మము, ఆజ్ఞల నెరవేర్పునకై విశ్వాసము ద్వారా వచ్చును; మరియు ఆజ్ఞల నెరవేర్పు పాప క్షమాపణను తెచ్చును;

26 పాప క్షమాపణ, హృదయము యొక్క సాత్వికమును, దీనత్వమును తెచ్చును; హృదయము యొక్క సాత్వికము మరియు దీనత్వమును బట్టి, పరిశుద్ధాత్మ దర్శనము వచ్చును; ఆ ఆదరణకర్త నిరీక్షణతోను, పరిపూర్ణమైన ప్రేమతోను నింపును; ఆ ప్రేమ, పరిశుద్ధులందరు దేవునితో నివసించు అంతము వచ్చువరకు ప్రార్థన పట్ల శ్రద్ధ కలిగియుండుట ద్వారా నిలిచియుండును.

27 నా కుమారుడా, లేమనీయులకు వ్యతిరేకముగా నేను త్వరలో బయటకు వెళ్ళని యెడల, నేను తిరిగి నీకు వ్రాసెదను. ఇదిగో, వారు పశ్చాత్తాపపడని యెడల, వారి నాశనమునకు కారణము ఈ దేశపు గర్వము లేదా నీఫై యొక్క జనులని ఋజువగును.

28 నా కుమారుడా, వారికి పశ్చాత్తాపము రావలెనని వారి కొరకు ప్రార్థించుము. కానీ, ఆత్మ వారితో పోరాడుట మానివేసినదేమోయని నేను భయపడుచున్నాను; దేశము యొక్క ఈ భాగమందు, దేవుని నుండి వచ్చు సమస్త శక్తి మరియు అధికారమును అణచివేయుటకు కూడా వారు చూచుచున్నారు మరియు వారు పరిశుద్ధాత్మను తిరస్కరించుచున్నారు.

29 నా కుమారుడా, అంత గొప్పదైన జ్ఞానమును తిరస్కరించిన తరువాత, ప్రవక్తల ద్వారా పలుకబడిన ప్రవచనములు మరియు మన రక్షకుని మాటలు నెరవేరునట్లు వారు త్వరలో నశించవలెను.

30 నా కుమారుడా, నేను తిరిగి నీకు వ్రాయు వరకు లేదా తిరిగి నిన్ను కలుసుకొను వరకు వీడ్కోలు. ఆమేన్‌.