లేఖనములు
ఓంనై 1


ఓంనై గ్రంథము

1వ అధ్యాయము

ఓంనై, అమరోన్‌, కెమిష్‌, అబినాదోమ్, అమలేకి ప్రతిఒక్కరు తమ వంతుగా గ్రంథములను భద్రపరచుదురు—సిద్కియా దినములలో యెరూషలేము నుండి వచ్చిన జరహేమ్ల జనులను మోషైయ కనుగొనును—మోషైయ వారిపై రాజుగా చేయబడును—జరహేమ్ల వద్దనున్న ములేకీయులు, జెరెడీయులలో చివరివాడైన కోరియాంటమర్‌ను కనుగొనిరి—మోషైయ తరువాత బెంజమిన్‌ రాజగును—మనుష్యులు తమ ఆత్మలను క్రీస్తుకు ఒక అర్పణముగా అర్పించవలెను. సుమారు క్రీ. పూ. 323–130 సం.

1 ఓంనై అను నేను, మా వంశావళిని భద్రపరచుటకు ఈ పలకలపై కొంత వ్రాయవలెనని నా తండ్రి జేరమ్ చేత ఆజ్ఞాపించబడితిని.

2 అందువలన నా దినములలో, నా జనులైన నీఫైయులను వారి శత్రువులైన లేమనీయుల చేతులలో పడకుండా కాపాడుటకు నేను ఖడ్గముతో ఎక్కువగా యుద్ధము చేసితినని మీరు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను. కానీ, నేనొక దుష్టుడనైయున్నాను మరియు నేను చేసియుండవలసినట్లుగా ప్రభువు యొక్క కట్టడలను, ఆజ్ఞలను నేను పాటించలేదు.

3 ఇప్పుడు రెండు వందల డెబ్బది ఆరు సంవత్సరములు గడిచిపోయెను మరియు మేము చాలా కాలముపాటు సమాధానము కలిగియుంటిమి; మేము చాలా కాలముపాటు గంభీరమైన యుద్ధములు, రక్తపాతము కలిగియుంటిమి. వాస్తవానికి రెండు వందల ఎనుబది రెండు సంవత్సరములు గడిచిపోయెను మరియు నేను, నా పితరుల ఆజ్ఞల ప్రకారము ఈ పలకలను భద్రపరచితిని; వాటిని నేను నా కుమారుడైన అమరోన్‌కు అప్పగించితిని. ఇక నేను ముగించెదను.

4 అమరోన్‌ అను నేను వ్రాయుచున్న వాక్యములు కొద్దిగానున్నందున, నా తండ్రి యొక్క గ్రంథమందు వ్రాయుచున్నాను.

5 ఇప్పుడు మూడువందల ఇరువది సంవత్సరములు గడిచిపోయెను మరియు నీఫైయులలో ఎక్కువ దుర్మార్గులైన వారు నశించిపోయిరి.

6 ఏలయనగా ప్రభువు వారిని యెరూషలేము దేశము నుండి బయటకు నడిపించి, వారి శత్రువుల చేతులలో పడకుండా వారిని కాపాడి, భద్రపరచిన తరువాత ఆయన అనుమతించడు, అనగా మీరు నా ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము మీరు దేశమందు వర్థిల్లరు అని చెప్పుచూ ఆయన మన పితరులతో పలికిన మాటలు నిరూపించబడకుండా ఉండుటను ఆయన అనుమతించడు.

7 కావున ప్రభువు వారిని గొప్ప తీర్పునందు దర్శించెను; అయినప్పటికీ నీతిమంతులు నశించరాదని ఆయన వారిని రక్షించి, వారి శత్రువుల చేతులలో నుండి వారిని విడిపించెను.

8 మరియు నేను ఈ పలకలను నా సహోదరుడైన కెమిష్‌కు అప్పగించితిని.

9 ఇప్పుడు కెమిష్‌ అను నేను, నా సహోదరుడు వ్రాసియున్న అదే గ్రంథములో నేను వ్రాయదలచిన కొద్ది వాక్యములను వ్రాయుచున్నాను; ఏలయనగా అతడు చివరిగా వ్రాసిన దానిని అతడు తన స్వహస్తముతో వ్రాసెనని నేను చూచితిని; వాటిని నాకు అప్పగించిన దినమున అతడు దానిని వ్రాసెను. ఈ విధముగా మేము వృత్తాంతములను భద్రపరచితిమి, ఏలయనగా అది మా పితరుల యొక్క ఆజ్ఞలను బట్టియైయున్నది; ఇక నేను ముగించెదను.

10 అబినాదోమ్ అను నేను కెమిష్‌ కుమారుడను. నేను నా జనులైన నీఫైయులు, లేమనీయుల మధ్య అధికమైన యుద్ధములను, వివాదములను చూచితిని; నేను, నా సహోదరులను కాపాడుటకు నా స్వంత ఖడ్గముతో అనేకమంది లేమనీయుల ప్రాణములను తీసియున్నాను.

11 ఈ జనుల యొక్క వృత్తాంతము, తరములను బట్టి రాజుల వద్ద ఉన్న పలకలపై చెక్కబడియున్నది; వ్రాయబడినది తప్ప మరి ఏ బయల్పాటును లేదా ప్రవచనమును నేనెరుగను; అందువలన తగినంతగా వ్రాయబడినది. ఇక నేను ముగించెదను.

12 నేను అబినాదోమ్ కుమారుడైన అమలేకిని. ఇదిగో జరహేమ్ల దేశముపైన రాజుగా చేయబడిన మోషైయను గూర్చి నేను మీతో కొంత మాట్లాడుదును; ఏలయనగా అతడు నీఫై దేశమునుండి బయటకు పారిపోవలెననియు, ప్రభువు యొక్క స్వరమును ఆలకించు వారందరు కూడా అతనితో పాటు దేశము నుండి బయటకు అరణ్యములోనికి వెడలిపోవలెననియు ప్రభువు చేత హెచ్చరించబడెను.

13 ప్రభువు అతడిని ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. ప్రభువు యొక్క స్వరమును ఆలకించువారందరు కూడా దేశము నుండి బయటకు అరణ్యములోనికి వెడలిపోయిరి; వారు అనేక బోధలు మరియు ప్రవచనముల ద్వారా నడిపించబడిరి. వారు దేవుని వాక్యము చేత నిరంతరము ఉపదేశించబడిరి; అరణ్యము గుండా జరహేమ్ల దేశము అని పిలువబడిన దేశములోనికి వచ్చువరకు వారు ఆయన బాహువు యొక్క శక్తిచేత నడిపించబడిరి.

14 వారు జరహేమ్ల యొక్క జనులని పిలువబడిన జనులను కనుగొనిరి. ఇప్పుడు జరహేమ్ల యొక్క జనుల మధ్య గొప్ప ఆనందము కలిగెను; యూదుల వృత్తాంతమును కలిగియున్న కంచు పలకలతోపాటు ప్రభువు మోషైయ యొక్క జనులను పంపించియున్నాడని జరహేమ్ల కూడా అధికముగా ఆనందించెను.

15 యూదా రాజైన సిద్కియా బబులోనులోనికి బందీగా కొనిపోబడిన సమయమున జరహేమ్ల యొక్క జనులు యెరూషలేము నుండి బయటకు వచ్చిరని మోషైయ కనుగొనెను.

16 వారు అరణ్యములో ప్రయాణము చేసి, ప్రభువు యొక్క హస్తము చేత గొప్పజలముల మీదుగా మోషైయ వారిని కనుగొన్న దేశములోనికి తేబడిరి; ఆ సమయము నుండి వారు అక్కడ నివసించిరి.

17 మోషైయ వారిని కనుగొనునాటికి వారు అత్యధిక సంఖ్యాకులయిరి. అయినప్పటికీ వారు అనేక యుద్ధములను, తీవ్రమైన వివాదములను కలిగియుండిరి మరియు ఎప్పటికప్పుడు ఖడ్గము చేత కూలియుండిరి; వారి భాష చెడి పోయియుండెను; వారు ఏ వృత్తాంతములను వారితో తీసుకురాలేదు; వారి సృష్టికర్త యొక్క ఉనికిని వారు తిరస్కరించిరి; మోషైయ లేదా మోషైయ జనులు వారిని అర్థము చేసుకొనలేక పోయిరి.

18 కానీ మోషైయ, అతని భాషలో వారు బోధింపబడునట్లు చేసెను. వారు మోషైయ యొక్క భాషలో బోధింపబడిన తరువాత తన జ్ఞాపకశక్తిని బట్టి జరహేమ్ల తన పితరుల వంశావళిని ఇచ్చెను; అది వ్రాయబడెను, కాని ఈ పలకలపై కాదు.

19 ఇప్పుడు జరహేమ్ల మరియు మోషైయ యొక్క జనులు ఒక్కటిగా కలిసిపోయిరి; మోషైయ వారిపై రాజుగా నియమించబడెను.

20 మోషైయ దినములలో, చెక్కడములతో ఉన్న ఒక పెద్ద రాయి అతని యొద్దకు తేబడెను; అతడు దేవుని యొక్క శక్తి మరియు బహుమానము ద్వారా చెక్కడములకు అర్థము చెప్పెను.

21 అవి కోరియాంటమర్‌ అను ఒకని గురించి మరియు సంహరింపబడిన అతని జనుల గురించి వృత్తాంతమునిచ్చెను. కోరియాంటమర్‌ జరహేమ్ల యొక్క జనుల ద్వారా కనుగొనబడెను; అతడు వారితోపాటు తొమ్మిది చంద్రుల కాలము నివసించెను;

22 అది అతని పితరులను గూర్చి కూడా కొన్నిమాటలు చెప్పెను. అతని మొదటి తల్లిదండ్రులు, ప్రభువు జనుల యొక్క భాషను తారుమారు చేసిన సమయమున గోపురము నుండి బయటకు వచ్చిరి; న్యాయమైన ఆయన తీర్పులను బట్టి, ప్రభువు యొక్క కఠినత వారిపై పడెను; వారి ఎముకలు దేశమునకు ఉత్తరము వైపు చెదిరిపడియుండెను.

23 అమలేకి అను నేను, మోషైయ దినములలో జన్మించితిని; నేను అతని మరణమును చూచుటకు జీవించియుంటిని; మరియు అతని కుమారుడైన బెంజమిన్ అతని స్థానములో పరిపాలించుచుండెను.

24 రాజైన బెంజమిన్‌ యొక్క దినములలో నీఫైయులు, లేమనీయుల మధ్య గొప్ప యుద్ధమును అధిక రక్తపాతమును నేను చూచితిని. కానీ రాజైన బెంజమిన్‌ లేమనీయులను జరహేమ్ల దేశము నుండి బయటకు పారద్రోలునంతగా నీఫైయులు వారిపై గొప్ప ఆధిక్యతను పొందిరి.

25 ఇప్పుడు నేను ముసలివాడగుచుంటిని; సంతానము లేనందువలన, రాజైన బెంజమిన్ ప్రభువు యెదుట న్యాయవంతుడని ఎరిగియున్నందువలన నేను ఈ పలకలను అతనికి అప్పగించుచున్నాను, మరియు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు రమ్మని, ప్రవచనమందు, బయల్పాటులందు, దేవదూతల పరిచర్యయందు, భాషలతో మాట్లాడు బహుమానమందు, భాషలకు అర్థము చెప్పు బహుమానమందు, మంచివైన అన్ని విషయములయందు విశ్వాసముంచవలెనని మనుష్యులందరికి ఉద్భోధించుచున్నాను; ఏలయనగా మంచిదేదైనను ప్రభువు నుండి వచ్చును మరియు చెడ్డది అపవాది నుండి వచ్చును.

26 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మీరు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన క్రీస్తునొద్దకు రావలెనని, ఆయన రక్షణ యందు, ఆయన విమోచన శక్తి యందు పాలుపొందవలెనని నేను కోరుదును. ఆయన యొద్దకు రండి, మీ పూర్ణాత్మలను ఆయనకు ఒక అర్పణముగా అర్పించుడి, ఉపవాసము ప్రార్థనల యందు కొనసాగుడి, అంతము వరకు స్థిరముగానుండుడి; ప్రభువు జీవము తోడు మీరు రక్షింపబడుదరు.

27 ఇప్పుడు నేను, నీఫై దేశమునకు తిరిగి వెళ్ళుటకు అరణ్యములోనికి వెళ్ళిన కొద్దిమందిని గూర్చి కొంత మాట్లాడెదను; ఏలయనగా తమ స్వాస్థ్యమైన దేశమును స్వాధీనపరచుకోవాలనే కోరిక గలిగిన అధికసంఖ్యాకులు అక్కడ ఉండిరి.

28 అందువలన వారు అరణ్యములోనికి వెళ్ళిరి. వారి నాయకుడు ఒక బలమైన, శక్తిగల, మెడబిరుసు జనుడైయుండెను, కావున అతడు వారి మధ్య వివాదము కలుగజేసెను; వారిలో ఏబది మంది తప్ప మిగిలినవారందరూ అరణ్యములో సంహరింపబడిరి మరియు వారు జరహేమ్ల దేశమునకు తిరిగి వచ్చిరి.

29 వారు అధిక సంఖ్యలో ఇతరులను కూడా తీసుకొని తిరిగి అరణ్యములోనికి తమ ప్రయాణము సాగించిరి.

30 అమలేకి అను నేను, ఒక సహోదరుడిని కలిగియుంటిని, అతడు కూడా వారితో వెళ్ళెను; అప్పటి నుండి వారిని గూర్చి నాకు తెలియరాలేదు. ఇప్పుడు నేను మరణించబోవుచున్నాను; మరియు ఈ పలకలు సంపూర్ణమైనవి. ఇక నేను నా మాటలను ముగించెదను.