లేఖనములు
మోర్మన్ వాక్యములు 1


మోర్మన్‌ వాక్యములు

1వ అధ్యాయము

నీఫై యొక్క పెద్ద పలకలను మోర్మన్‌ సంక్షేపము చేయును—చిన్న పలకలను అతడు ఇతర పలకలతో పాటు ఉంచును—రాజైన బెంజమిన్ దేశమందు శాంతిని స్థాపించును. సుమారు క్రీ. శ. 385 సం.

1 ఇప్పుడు మోర్మన్‌ అను నేను, నేను చేయుచున్న వృత్తాంతమును నా కుమారుడైన మొరోనైకు అప్పగించుటకు సిద్ధముగా ఉన్నాను; నా జనులైన నీఫైయుల నాశనమంతటిని దాదాపుగా నేను చూచియున్నాను.

2 క్రీస్తు వచ్చిన అనేక వందల సంవత్సరముల తరువాత నేను ఈ వృత్తాంతములను నా కుమారునికి అప్పగించుచున్నాను; అతడు నా జనుల సంపూర్ణ వినాశనమును చూచునని నేననుకొనుచున్నాను. కానీ, బహుశ ఏదో ఒక దినమున అది వారికి ప్రయోజనకరముగా ఉండునట్లు, అతడు వారిని గూర్చి కొంత మరియు క్రీస్తును గూర్చి కొంత వ్రాయునట్లు, అతడు వారి తరువాత కూడా జీవించునట్లు దేవుడు అనుగ్రహించుగాక.

3 ఇప్పుడు నేను వ్రాసియున్న దానిని గూర్చి నేను కొంత మాట్లాడెదను; ఏలయనగా నేను, అమలేకి చెప్పిన ఆ రాజైన బెంజమిన్ యొక్క పరిపాలన వరకు నీఫై పలకలనుండి ఒక సంక్షేపము చేసిన తరువాత, నాకు అప్పగించబడిన వృత్తాంతములను నేను వెదికినప్పుడు ఈ పలకలను కనుగొంటిని, అవి జేకబ్ నుండి ఈ రాజైన బెంజమిన్ యొక్క పరిపాలన వరకు ప్రవక్తల యొక్క ఒక చిన్న వృత్తాంతమును, నీఫై మాటలలో అనేకమును కలిగియున్నవి.

4 క్రీస్తు యొక్క రాకడను గూర్చిన ప్రవచనములను బట్టి ఈ పలకలపై ఉన్న విషయములు నన్ను సంతోషపరచినవి; వాటిలో అనేకము నెరవేరినవని నా పితరులు ఎరుగుదురు; ఈ దినము వరకు మమ్ములను గూర్చి ప్రవచింపబడిన విషయములన్నియు నెరవేరినవని, ఇకపై జరుగునని చెప్పబడినవి తప్పక నెరవేరవలెనని కూడా నేనెరుగుదును.

5 అందువలన వాటిపై నా వృత్తాంతమును ఈ విషయములతో ముగించుటకు నేను ఎన్నుకొంటిని, నా వృత్తాంతము యొక్క ఈ శేష భాగమును నేను నీఫై పలకల నుండి తీసుకొందును; నా జనులకు సంబంధించిన విషయములలో నూరవ భాగమును కూడా నేను వ్రాయలేను.

6 కానీ నేను, ఈ ప్రవచనములను బయల్పాటులను కలిగియున్న ఈ పలకలను తీసుకొని, వాటిని నా వృత్తాంతము యొక్క శేషభాగముతో ఉంచెదను, ఏలయనగా అవి నాకు ప్రీతికరమైనవి; అవి నా సహోదరులకు కూడా ప్రీతికరమగునని నేనెరుగుదును.

7 దీనిని నేను ఒక తెలివైన ఉద్దేశ్యము నిమిత్తము చేయుచున్నాను; ఏలయనగా నా యందున్న ప్రభువు ఆత్మ యొక్క ప్రభావమును బట్టి నేను ఈ విధముగా ప్రేరేపించబడితిని. ఇప్పుడు నేను అన్ని విషయములను ఎరుగను; కానీ, రాబోవు సంగతులన్నిటినీ ప్రభువు ఎరుగును; అందువలన ఆయన చిత్తమును బట్టి, ఆయన నన్ను ప్రేరేపించును.

8 నా సహోదరులు మరలా ప్రియమైన జనమగునట్లు మరియొకసారి దేవుడు అనగా క్రీస్తు యొక్క విమోచన విషయమై అనుభవ జ్ఞానము గలవారై యుండవలెనని వారిని గూర్చి నేను దేవుడిని ప్రార్థించుచున్నాను.

9 ఇప్పుడు మోర్మన్‌ అను నేను, నీఫై పలకల నుండి తీసుకొన్న నా వృత్తాంతమును ముగించబోవుచున్నాను; దేవుడు నాకిచ్చిన జ్ఞానమును గ్రహింపును బట్టి నేను దానిని చేయుచున్నాను.

10 కావున అమలేకి ఈ పలకలను రాజైన బెంజమిన్‌కు అప్పగించిన తరువాత అతడు వాటిని తీసుకొని, రాజైన బెంజమిన్ యొక్క దినముల వరకు తరతరములకు రాజుల ద్వారా అందజేయబడిన వృత్తాంతములను కలిగియున్న ఇతర పలకలతో ఉంచెను.

11 అవి రాజైన బెంజమిన్ నుండి నా చేతులలో పడువరకు తరతరములకు అందజేయబడెను. ఈ సమయము నుండి అవి భద్రపరచబడవలెనని మోర్మన్‌ అను నేను దేవుడిని ప్రార్థించితిని. మరియు అవి భద్రపరచబడునని నేనెరుగుదును; ఏలయనగా వాటిపై గొప్ప విషయములు వ్రాయబడియున్నవి, వాటిని బట్టి వ్రాయబడియున్న దేవుని వాక్యము ప్రకారము ఆ గొప్ప అంత్యదినమున నా జనులు, వారి సహోదరులు తీర్పు తీర్చబడుదురు.

12 ఇప్పుడు రాజైన బెంజమిన్ గూర్చి—అతడు తన స్వజనుల మధ్య కొన్ని వివాదములు కలిగియుండెను.

13 లేమనీయుల సైన్యములు కూడా అతని జనులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు నీఫై దేశము నుండి బయటకు వచ్చెను. కానీ, రాజైన బెంజమిన్ తన సైన్యములను సమకూర్చుకొని, వారికి ఎదురుగా నిలిచి, తన బాహుబలముతో లేబన్‌ ఖడ్గము చేత పోరాడెను.

14 అనేక వేలమంది లేమనీయులను సంహరించు వరకు ప్రభువునుండి బలము పొంది వారు తమ శత్రువులతో పోరాడిరి. వారి స్వాస్థ్యమైన దేశములన్నిటి నుండి వారిని తరిమి వేయువరకు వారు లేమనీయులకు వ్యతిరేకముగా పోరాడిరి.

15 మరియు అబద్ధ క్రీస్తులు అక్కడకు వచ్చిన తరువాత వారి నోళ్ళు మూయించబడెను, వారి నేరములను బట్టి వారు శిక్షింపబడిరి;

16 అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మరియు ఉపదేశకులు జనుల మధ్య ఉండిన తరువాత, వారందరు తమ నేరములను బట్టి శిక్షింపబడిరి; అనేక వివాదములు కలిగి, లేమనీయులలో చేరుటకు అనేకులు వెళ్ళిపోయిన తరువాత, రాజైన బెంజమిన్ తన జనుల మధ్య ఉన్న పరిశుద్ధ ప్రవక్తల సహాయముతో ఈవిధముగా చేసెను—

17 ఏలయనగా రాజైన బెంజమిన్ పరిశుద్ధుడైయుండి నీతి యందు తన జనులను పరిపాలించెను; దేశమందు అనేకమంది పరిశుద్ధ మనుష్యులుండిరి, వారు దేవుని వాక్యమును శక్తితోను, అధికారముతోను పలికిరి; జనుల యొక్క మెడబిరుసుతనమును బట్టి వారు తీక్షణమైన భాషను ఉపయోగించిరి—

18 అందువలన రాజైన బెంజమిన్ వీరి సహాయముతోను తన శరీరము యొక్క సంపూర్ణ బలముతోను, తన సంపూర్ణ ఆత్మ యొక్క సామర్థ్యముతోను ప్రవక్తలతో కలిసి పని చేయుచు మరియొకసారి దేశమందు శాంతిని స్థాపించెను.