సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ యేసు క్రీస్తు గురించి బోధించండి


“మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ యేసు క్రీస్తు గురించి బోధించండి,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ యేసు క్రీస్తు గురించి బోధించండి,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
ప్రభురాత్రి భోజనము వద్ద యేసు మరియు ఆయన శిష్యులు

శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, వాల్టర్ రానె చేత

మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ యేసు క్రీస్తు గురించి బోధించండి

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో బోధించుటకు చాలా విషయాలు ఉన్నాయి—సూత్రాలు, ఆజ్ఞలు, ప్రవచనాలు మరియు లేఖన కథలు. కానీ ఇవన్నీ ఒకే చెట్టు కొమ్మలు, ఎందుకంటే వీటన్నింటికీ ఒకే ఉద్దేశ్యము కలదు: జనులందరూ క్రీస్తు యొద్దకు వచ్చి, ఆయనలో పరిపూర్ణులగుటకు సహాయము చేయుట (జేరమ్ 1:11; మొరోనై 10:32 చూడండి). కాబట్టి మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ, మీరు నిజంగా యేసు క్రీస్తు గురించి మరియు ఆయన వలె మారడం గురించి బోధిస్తున్నారని గుర్తుంచుకోండి. ప్రతీ సువార్త సూత్రం, ఆజ్ఞ మరియు ప్రవచనాత్మక బోధనలో రక్షకుడు మరియు ఆయన విమోచన శక్తిని గూర్చిన సత్యాలను గుర్తించుటకు పరిశుద్ధాత్మ మీకు సహాయము చేయగలరు (జేకబ్ 7:10–11 చూడండి).

మీరు బలిని గూర్చి బోధిస్తున్నారా? మనం చేసే త్యాగాలు రక్షకుని యొక్క “గొప్పదైన చివరి బలి” (ఆల్మా 34:10) వైపు మన ఆత్మలను ఎలా గురిపెడతాయోనని అభ్యాసకులతో అన్వేషించడాన్ని పరిగణించండి. మీరు ఐకమత్యము గురించి బోధిస్తున్నారా? యేసు క్రీస్తు తన తండ్రితో సాధించిన ఐక్యతను మరియు వారితో మనం ఐక్యమగుటకు ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని చర్చించడాన్ని పరిగణించండి (యోహాను 17 చూడండి). ప్రతీ సువార్త అంశాన్ని యేసు క్రీస్తు గురించి బోధించుటకు మరియు తెలుసుకొనుటకు ఒక అవకాశంగా చూడండి.

ప్రతీ ఆజ్ఞ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. కేవలం సువార్త చట్టాలపై దృష్టి పెట్టవద్దు—శాసనకర్త గురించి కూడా తెలుసుకోండి. మీరు జ్ఞానవాక్యము గూర్చి చర్చించి, ఆరోగ్యకరమైన జీవనంలో చేయవలసినవి మరియు చేయకూడని వాటివద్ద ఆపివేస్తే, ఈ చట్టాన్ని మనకు అందించడానికి యేసు క్రీస్తు మన గురించి—మన ఆత్మీయ మరియు శారీరక శ్రేయస్సు రెండింటిపై—ఎంత లోతుగా శ్రద్ధ వహించియుండవచ్చు అని ఆలోచించే అవకాశాన్ని మీరు కోల్పోతారు. తన చట్టాలను జీవించుటలో మనకు సహాయం చేయడానికి తన శక్తిని మనకు అనుగ్రహించుటకు రక్షకుడు ఎంత సుముఖంగా మరియు ఆత్రుతగా ఉన్నారనే దానిపై దృష్టి పెట్టండి. ఆయన మనకు ఇచ్చే ప్రతీ ఆజ్ఞ ఆయన మనస్సు, సంకల్పము మరియు హృదయమును గూర్చి మనకు కొంత బయల్పరుస్తుంది—కలిసి దీనిని కనుగొనడంలో ఆనందాన్ని పొందండి!

యేసు క్రీస్తు యొక్క మాదిరిని నొక్కి చెప్పండి

యేసు క్రీస్తును అన్ని సువార్త సూత్రాలకు పరిపూర్ణ మాదిరిగా గుర్తించడం మరియు నొక్కి చెప్పడం ద్వారా బోధన మరియు అభ్యాసానికి కేంద్రంగా ఆయనను మనం ఉంచవచ్చు. శిష్యులుగా, మనం కేవలం సూత్రాలను అనుసరించడం లేదు—మనము యేసు క్రీస్తును అనుసరిస్తాము. మనము రక్షకుని యొక్క పరిపూర్ణ మాదిరిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చును మరియు ఆయనను అనుసరించుటకు మనలను ప్రేరేపించును.

అంతము వరకు సహించే సూత్రాన్ని మీరు బోధిస్తున్నారని ఒక్కసారి ఊహించుకోండి. అంతము వరకు సహించుటకు రక్షకుడు ఏవిధంగా మాదిరిగా ఉన్నారనే దాని గురించిన చర్చ ఆయన పట్ల మధురమైన భక్తి భావాలను కలిగించవచ్చు. మీరు బోధించే వారు ఆయన మాదిరి నుండి ఏమి నేర్చుకుంటారు మరియు అనుభూతి చెందుతారు?

చిత్రం
నేలపై పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరుచుచున్న రక్షకుడు

రక్షకుడు మనందరి కొరకు పరిపూర్ణమైన మాదిరిని ఉంచారు. ఆయన వారందరినీ స్వస్థపరచెను, మైఖేల్ మామ్ చేత

యేసు క్రీస్తు యొక్క బిరుదులు, పాత్రలు మరియు లక్షణాల గురించి బోధించండి

లేఖనాలలో యేసు క్రీస్తుకు చాలా బిరుదులు ఉన్నాయి. ప్రతీ ఒక్కటి దేవుని ప్రణాళికలో ఆయన పాత్రలలో ఒకదానిని ప్రతిబింబిస్తుంది మరియు ఆయన దైవిక లక్షణాలను గూర్చి మనకు బోధిస్తుంది. దేవుని గొఱ్ఱెపిల్ల, న్యాయవాది, మన విశ్వాసమునకు ముగింపుకర్త మరియు లోకమునకు వెలుగు వంటి బిరుదులు యేసు క్రీస్తును గూర్చి మనకు ఏమి బోధిస్తాయోనని అభ్యాసకులతో అన్వేషించుటను మీరు పరిగణించవచ్చు. రక్షకుని గురించి మరింత తెలుసుకొనుటకు అభ్యాసకులకు మీరు సహాయం చేస్తున్నప్పుడు, ఆయన చెప్పిన మరియు చేసిన దానికి మించి ఆయన ఎవరో మరియు ఆయన మన జీవితాలలో ఎటువంటి పాత్రను పోషించాలనుకొనుచున్నారో కూడా చెప్పండి. రక్షకుని స్వభావం మరియు లక్షణాలను గూర్చి మీరు కలిసి నేర్చుకొనుచున్నప్పుడు, ఆయన పట్ల మీకున్న అవగాహనను మరియు ప్రేమను పరిశుద్ధాత్మ మరింతగా పెంచుతారు.

యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చే చిహ్నాల కొరకు చూడండి

“సమస్త విషయాలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుటకు సృజించబడి, చేయబడినవి” అని ప్రభువు ప్రకటించారు (మోషే 6:63; 2 నీఫై 11:4 కూడా చూడండి). ఆ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, లేఖనాలలో రక్షకుని గురించి సాక్ష్యమిచ్చే అనేక చిహ్నాలను చూడడాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈ చిహ్నములలో రొట్టె, నీరు మరియు వెలుగు వంటివి ఉన్నాయి. ఈ వస్తువులు రక్షకునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు, అవి ఆయన శక్తి మరియు లక్షణాల గురించి మనకు బోధించగలవు. ప్రవక్తలు మరియు లేఖనాలలో ఉన్న ఇతర నమ్మకమైన స్త్రీ పురుషుల జీవితాలలో రక్షకుని జీవితానికి సమాంతరాలను కూడా మీరు కనుగొనవచ్చు. చిహ్నముల కొరకు వెదకుట మీరు గమనించని ప్రదేశాలలో రక్షకుని గురించిన సత్యాలను బయలుపరుచును.