లేఖనములు
1 నీఫై 10


అధ్యాయము 10

యూదులు బబులోనీయులచే చెరపట్టబడుదురని లీహై ముందుగా చెప్పును—యూదుల మధ్యకు ఒక మెస్సీయ, ఒక రక్షకుడు, ఒక విమోచకుని రాకను గూర్చి అతడు చెప్పును—దేవుని గొఱ్ఱెపిల్లకు బాప్తిస్మమిచ్చు ఒకని రాకను గూర్చి కూడా లీహై చెప్పును—మెస్సీయ మరణము, పునరుత్థానమును గూర్చి లీహై చెప్పును—ఇశ్రాయేలీయులు చెదరిపోవుట మరియు సమకూర్చబడుటను అతడు ఒక ఒలీవ చెట్టుతో పోల్చును—దేవుని కుమారుని గూర్చి, పరిశుద్ధాత్మ వరమును గూర్చి, నీతి యొక్క ఆవశ్యకతను గూర్చి నీఫై మాట్లాడును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 ఇప్పుడు నీఫైయను నేను, నా కార్యములు, నా పరిపాలన, పరిచర్యను గూర్చిన వృత్తాంతమును ఈ పలకలపై వ్రాయుట కొనసాగించెదను; అయితే, నా వృత్తాంతముతో కొనసాగుటకు, నా తండ్రి, నా సహోదరులను గూర్చి కొన్ని విషయములు నేను చెప్పవలసియున్నది.

2 నా తండ్రి తన స్వప్నమును గూర్చి చెప్పుట ముగించి, సమస్త శ్రద్ధ వహించవలెనని వారికి ఉద్బోధించిన తరువాత అతడు వారితో యూదుల గూర్చి మాట్లాడెను—

3 వారు, ఆ గొప్ప పట్టణమైన యెరూషలేము నాశనము చేయబడి, అనేకులు బబులోనుకు చెరగా కొనిపోబడిన తరువాత, ప్రభువు యొక్క యుక్త కాలమున వారు తిరిగి వచ్చెదరు, అనగా చెర నుండి వెనుకకు రప్పించబడెదరు; వారు చెర నుండి వెనుకకు రప్పించబడిన తరువాత తమ స్వాస్థ్యమైన భూమిని తిరిగి స్వాధీనపరచుకొనెదరు.

4 నా తండ్రి యెరూషలేమును వదిలివెళ్ళిన సమయము నుండి ఆరు వందల సంవత్సరములకు ప్రభువైన దేవుడు ఒక ప్రవక్తను, అనగా ఒక మెస్సీయను లేదా మరొకమాటలో ఒక లోక రక్షకుడిని యూదుల మధ్య పుట్టించును.

5 అతడు చెప్పిన ఈ మెస్సీయ లేదా లోక విమోచకుని కార్యములను గూర్చి సాక్ష్యమిచ్చిన అనేకమంది ప్రవక్తలను గూర్చి కూడా నా తండ్రి మాట్లాడెను.

6 మానవజాతి అంతా తప్పిపోయిన, పతనమైన స్థితిలోనుండిరి, వారు ఈ విమోచకునిపై ఆధారపడితే తప్ప నిరంతరము అలాగే ఉందురు.

7 ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు మెస్సీయ కన్నా ముందుగా రావలసిన ఒక ప్రవక్తను గూర్చి కూడా అతడు చెప్పెను—

8 అతడు వెళ్ళి అరణ్యములో ఇట్లు ప్రకటించవలెను: ప్రభువు మార్గమును మీరు సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరాళము చేయుడి; మీరు ఎరుగని ఒకడు మీ మధ్య నిలిచియున్నాడు; ఆయన నా కంటే శక్తిమంతుడైయున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. మరియు నా తండ్రి ఈ విషయమును గూర్చి అధికముగా మాట్లాడెను.

9 అతడు యొర్దానుకు ఆవల నున్న బెతబారాలో బాప్తిస్మమియ్యవలెనని నా తండ్రి చెప్పెను; అతడు నీటితో బాప్తిస్మమియ్యవలెనని, అతడు మెస్సీయకు కూడా నీటితో బాప్తిస్మమియ్యవలెనని నా తండ్రి చెప్పెను.

10 అతడు మెస్సీయకు నీటితో బాప్తిస్మమిచ్చిన తరువాత, లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లకు తాను బాప్తిస్మమిచ్చియున్నానని చూచి అతడు సాక్ష్యమియ్యవలెను.

11 నా తండ్రి ఈ మాటలను పలికిన తరువాత యూదుల మధ్య బోధింపబడవలసిన సువార్తను గూర్చి, యూదులు అవిశ్వాసములో క్షీణించిపోవుటను గూర్చి నా సహోదరులతో మాట్లాడెను. రాబోవు ఆ మెస్సీయను వారు వధించిన తరువాత మరియు ఆయన వధింపబడిన తరువాత ఆయన మృతులలో నుండి లేచి పరిశుద్ధాత్మ ద్వారా తననుతాను అన్యజనులకు ప్రత్యక్షపరుచుకొనవలెను.

12 నా తండ్రి అన్యజనులను గూర్చి ఎంతగానో మాట్లాడి, ఇశ్రాయేలు వంశస్థులు ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడవలెనని, దాని కొమ్మలు త్రుంచివేయబడి భూముఖమంతటా చెదరగొట్టబడవలెనని చెప్పెను.

13 అందువలన, భూముఖమంతటా మనము చెదిరిపోవలెనన్న ప్రభువు వాక్యము నెరవేరునట్లు, మనము ఏకమనస్సుతో వాగ్దానదేశములోనికి నడిపింపబడుట అవసరమని అతడు చెప్పెను.

14 ఇశ్రాయేలు వంశస్థులు చెదిరిపోయిన తరువాత వారు తిరిగి ఒకటిగా సమకూర్చబడవలెను; లేదా క్లుప్తముగా, అన్యజనులు సంపూర్ణ సువార్తను పొందిన తరువాత, ఇశ్రాయేలు వంశస్థుల శేషములైన ఆ ఒలీవ చెట్టు యొక్క స్వాభావికమైన కొమ్మలు తిరిగి అంటుగట్టబడవలెను లేదా వారి ప్రభువు మరియు విమోచకుడైన నిజమైన మెస్సీయను గూర్చి తెలుసుకొనవలెను.

15 ఈ విధమైన భాషలో నా తండ్రి ప్రవచించి, నా సహోదరులతో మాట్లాడెను; ఇంకా నేను ఈ గ్రంథములో వ్రాయని అనేక విషయములను కూడా చెప్పెను; ఏలయనగా నాకు ఆవశ్యకమైన వాటన్నిటిని నేను, నా ఇతర గ్రంథములో వ్రాసియున్నాను.

16 నేను చెప్పిన ఈ విషయములన్నియు నా తండ్రి లెముయెల్ లోయలోని గుడారములో నివసించియుండగా జరిగెను.

17 నీఫైయను నేను, నా తండ్రి తన దర్శనములో చూచిన దేవుని కుమారుడైన రాబోయే మెస్సీయ యందుగల తన విశ్వాసమును బట్టి అతడు పొందిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అతడు పలికిన మాటలన్నిటిని వినిన వాడనై, దేవుడు పూర్వకాలములో చేసినట్లే తనను తాను మనుష్య సంతానమునకు ప్రత్యక్షపరచుకొనబోవు కాలములో ఆయనను శ్రద్ధగా వెదకు వారందరికి ఆయన బహుమానమైయున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇచ్చు వాటిని నేను కూడా చూచి, విని, తెలుసుకొనవలెనని కోరితిని.

18 ఏలయనగా ఆయన నిన్న, నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు; పశ్చాత్తాపము పొంది ఆయన యొద్దకు వచ్చిన యెడల, లోకము పునాది వేయబడినప్పటి నుండి మనుష్యులందరి కొరకు మార్గము సిద్ధపరచబడియున్నది.

19 శ్రద్ధగా వెదకు వాడు కనుగొనును; అట్టి వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని మర్మములు పూర్వకాలములో జరిగినవి ఈ కాలములో, రాబోయేకాలములో జరుగబోయేవి పూర్వకాలములో విశదపరచబడును; అందువలన, ప్రభువు మార్గము ఒక నిత్య వలయమైయున్నది.

20 కాబట్టి ఓ మానవుడా, నీవు చేసిన క్రియలన్నిటిని బట్టి నీవు తీర్పులోనికి తేబడుదువని జ్ఞాపకముంచుకొనుము.

21 కావున, నీ పరీశీలనా దినములలో నీవు దుర్మార్గము చేయుటకు ప్రయత్నించిన యెడల, దేవుని న్యాయపీఠము యెదుట నీవు అపవిత్రునిగా కనబడుదువు; అపవిత్రమైన వస్తువేదియు దేవునితో నివసింపజాలదు; అందువలన, నీవు శాశ్వతముగా త్రోసివేయబడవలెను.

22 మరియు నేను ఈ విషయములను తిరస్కరించక వాటిని పలుకవలెనని పరిశుద్ధాత్మ అధికారమిచ్చెను.