లేఖనములు
1 నీఫై 3


3వ అధ్యాయము

లీహై కుమారులు కంచు పలకలను పొందుటకు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుదురు—పలకలను ఇచ్చుటకు లేబన్‌ తిరస్కరించును—నీఫై తన సహోదరులను ప్రేరేపించి, ప్రోత్సహించును—లేబన్‌ వారి ఆస్తిని దొంగిలించి, వారిని సంహరించుటకు ప్రయత్నించును—లేమన్‌, లెముయెల్‌లు నీఫై, శామ్‌లను కొట్టుదురు మరియు వారు ఒక దేవదూత చేత గద్దింపబడుదురు. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 నీఫై అను నేను ప్రభువుతో మాట్లాడిన తరువాత నా తండ్రి గుడారమునకు తిరిగి వచ్చితిని.

2 అతడు నాతో మాటలాడుచూ ఇట్లనెను: ఇదిగో, నేనొక స్వప్నమును చూచితిని, దానిలో నీవు, నీ సహోదరులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళవలెనని ప్రభువు నన్ను ఆజ్ఞాపించెను.

3 ఏలయనగా లేబన్‌ యూదుల వృత్తాంతమును, నా పితరుల వంశావళిని కలిగియున్నాడు; అవి కంచు పలకలపై చెక్కబడియున్నవి.

4 అందువలన నీవు, నీ సహోదరులు లేబన్‌ ఇంటికి వెళ్ళి ఆ వృతాంతములను కోరవలెనని, వాటిని ఇక్కడకు అరణ్యములోనికి తీసుకొని రావలెనని ప్రభువు నన్ను ఆజ్ఞాపించెను.

5 అయితే నీ సహోదరులు, నేను వారి నుండి కోరినదొక కష్టమైన కార్యమని సణుగుచున్నారు; కానీ దీనిని వారి నుండి నేను కోరుటలేదు, ఇది ప్రభువు యొక్క ఆజ్ఞయైయున్నది.

6 కాబట్టి నా కుమారుడా వెళ్ళుము, నీవు సణగనందున ప్రభువు యొక్క అనుగ్రహము పొందెదవు.

7 అప్పుడు నీఫై అను నేను నా తండ్రితో ఇట్లు చెప్పితిని: నేను వెళ్ళి, ప్రభువు ఆజ్ఞాపించిన కార్యములను చేసేదను, ఏలయనగా నరుల సంతానమునకు ఆజ్ఞాపించిన కార్యమును వారు నెరవేర్చునట్లు వారి కొరకు ఒక మార్గమును సిద్ధపరచకుండా ప్రభువు ఎట్టి ఆజ్ఞలను ఇయ్యడని నేనెరుగుదును.

8 నా తండ్రి ఈ మాటలు వినినప్పుడు మిక్కిలి సంతోషించెను, ఏలయనగా నేను ప్రభువు చేత ఆశీర్వదింపబడియున్నానని అతడు ఎరిగియుండెను.

9 నీఫైయను నేను, నా సహోదరులు యెరూషలేము దేశమునకు వెళ్ళుటకు మా గుడారములతో అరణ్యములో ప్రయాణము చేసితిమి.

10 మేము యెరూషలేము దేశమునకు వెళ్ళినప్పుడు నేను, నా సహోదరులు ఒకరితోనొకరు సంప్రదించుకొంటిమి.

11 మాలో ఎవరు లేబన్‌ ఇంటికి వెళ్ళవలెనని చీట్లు వేయగా, చీటి లేమన్‌ మీదకు వచ్చెను; లేమన్‌, లేబన్‌ ఇంటికి వెళ్ళి అతడు తన ఇంటిలో కూర్చొనియుండగా అతనితో మాట్లాడెను.

12 కంచు పలకలపైన చెక్కబడియున్న నా తండ్రి వంశావళిని కలిగియున్న వృత్తాంతములను లేబన్‌ నుండి కోరెను.

13 అప్పుడు లేబన్‌ కోపముతో అతడిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను; ఆ వృత్తాంతములను లేమన్‌కు ఇచ్చుటకు అతడు ఇష్టపడలేదు. అందువలన, అతడు లేమన్‌తో—నీవు ఒక దొంగవు, నేను నిన్ను సంహరించెదననెను.

14 కానీ లేమన్‌ అతని సమక్షమునుండి పారిపోయి వచ్చి, లేబన్‌ చేసిన కార్యములను మాతో చెప్పగా మేము మిక్కిలిగా విచారించుట మొదలు పెట్టితిమి; నా సహోదరులు అరణ్యములోనున్న నా తండ్రి యొద్దకు తిరిగి పోవుటకు సిద్ధమయ్యిరి.

15 కానీ, నేను వారితో ఇట్లు చెప్పితిని: ప్రభువు జీవముతోడు ప్రభువు మనకు ఆజ్ఞాపించిన కార్యమును సాధించునంత వరకు అరణ్యములోనున్న మన తండ్రి యొద్దకు మనము వెళ్ళము.

16 ప్రభువు ఆజ్ఞలను పాటించుటలో మనము నమ్మకముగా ఉండి, మన తండ్రి స్వాస్థ్యమైన దేశమునకు వెళ్ళుదము; ఏలయనగా అక్కడ అతడు బంగారమును, వెండిని, సమస్త విధములైన సంపదలను వదిలివేసెను. అతడు ఇదంతా ప్రభువు ఆజ్ఞలను బట్టి చేసెను.

17 జనుల దుష్టత్వము వలన యెరూషలేము నాశనము చేయబడునని అతడు యెరిగియుండెను.

18 ఏలయనగా, వారు ప్రవక్తల మాటలను తిరస్కరించిరి. అందువలన, నా తండ్రి ఆ దేశము నుండి బయటకు పారిపోవలెనని ఆజ్ఞాపించబడిన తరువాత కూడా అతడు ఆ దేశములో నివసించియుండిన యెడల, అతడు నశించియుండేవాడు. కావున అతడు ఆ దేశము నుండి బయటకు పారిపోవుట ఆవశ్యకమైయుండెను.

19 మన పితరుల భాషను మన సంతానము కొరకు భద్రపరచునట్లు, మనము ఈ వృత్తాంతములను సంపాదించుట దేవునియందు వివేకమైయున్నది.

20 లోకారంభము నుండి ఇప్పటివరకు దేవుని ఆత్మ మరియు శక్తి ద్వారా పరిశుద్ధ ప్రవక్తలకు ఇవ్వబడి, వారందరి నోటిద్వారా పలుకబడిన మాటలను వారి కొరకు మనము భద్రపరచవలెను.

21 ఈ విధమైన భాషతో నేను, దేవుని ఆజ్ఞలను పాటించుటలో విశ్వాసముగా ఉండునట్లు నా సహోదరులను ఒప్పించితిని.

22 తరువాత, మేము మా స్వాస్థ్యమైన దేశమునకు వెళ్ళి మా బంగారమును, వెండిని, ప్రశస్థ వస్తువులను సమకూర్చితిమి.

23 ఈ వస్తువులను సమకూర్చిన తరువాత, మేము లేబన్‌ ఇంటికి తిరిగి వెళ్ళితిమి.

24 లేబన్‌ దగ్గరికి వెళ్ళి, కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతములను అతడు మాకియ్యవలెనని, వాటికి బదులుగా మేము బంగారమును, వెండిని, మా ప్రశస్థ వస్తువులన్నింటిని అతనికిచ్చెదమని చెప్పితిమి.

25 లేబన్‌ మా ఆస్థిని చూచినప్పుడు, అది మిక్కిలి విస్తారమైయున్నందున దాని యెడల దురాశతో అతడు మా ఆస్థిని పొందునట్లు మమ్ములను బయటకు వెళ్ళగొట్టి, మమ్ములను సంహరించుటకు తన సేవకులను పంపెను.

26 మేము లేబన్‌ సేవకుల యెదుట నుండి పారిపోయినందున మా ఆస్థిని వదిలివేయవలసి వచ్చెను. అది లేబన్‌ చేతికి చిక్కెను.

27 మేము అరణ్యములోనికి పారిపోయి ఒక రాతి గుహలో దాగుకొంటిమి మరియు లేబన్‌ సేవకులు మమ్ములను పట్టుకొనలేకపోయిరి.

28 అప్పుడు లేమన్‌, లేమన్‌ మాటలను ఆలకించినందన లెముయెల్ కూడా నాపై, నా తండ్రిపై కోపముగానుండిరి. అందువలన, లేమన్‌ లెముయెల్‌లు వారి తమ్ములమైన మాతో చాలా కఠినమైన మాటలు మాట్లాడి, ఒక దండముతో మమ్ములను కొట్టిరి.

29 వారు మమ్ములను దండముతో కొట్టుచున్నప్పుడు, ప్రభువు యొక్క దేవదూత వచ్చి వారి ముందర నిలిచి, వారితో మాట్లాడి ఇట్లనెను: మీరు, మీ తమ్ముని దండముతో ఎందుకు కొట్టుచున్నారు? ప్రభువు అతడిని, మీపై ఒక అధిపతిగా ఏర్పాటు చేసెనని, ఇది మీ దుర్నీతుల నిమిత్తమే జరిగెనని మీరెరుగరా? ఇదిగో మీరు తిరిగి యెరూషలేమునకు వెళ్ళవలెను, అప్పుడు ప్రభువు లేబన్‌ను మీ చేతులకు అప్పగించును.

30 మాతో మాట్లాడిన తరువాత దేవదూత వెళ్ళిపోయెను.

31 దేవదూత వెళ్ళిపోయిన తరువాత లేమన్‌, లెముయెల్‌లు తిరిగి సణుగుట ఆరంభించి ఇట్లనిరి: ప్రభువు లేబన్‌ను మన చేతులకప్పగించుట ఎట్లు సాధ్యమగును? అతడొక బలమైన మనుష్యుడు, అతడొక ఏబది మందిని ఆజ్ఞాపించగలడు, అంతేకాక అతడు ఏబదిమందిని సంహరించగల బలమైన మనుష్యుడు కూడా; అప్పుడు మనలను ఎందుకు ఉపేక్షించును?