లేఖనములు
1 నీఫై 11


అధ్యాయము 11

నీఫై ప్రభువు యొక్క ఆత్మను చూచును మరియు దర్శనమందు జీవ వృక్షము అతనికి చూపించబడును—అతడు దేవుని కుమారుని యొక్క తల్లిని చూచును మరియు దేవుని నమ్రతను గూర్చి తెలుసుకొనును—అతడు దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క బాప్తిస్మము, పరిచర్య మరియు సిలువ వేయబడుటను చూచును—అతడు గొఱ్ఱెపిల్ల యొక్క పడ్రెండుగురు అపొస్తలుల పిలుపును, పరిచర్యను చూచును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 నా తండ్రి చూచియుండిన దర్శనములను తెలుసుకొనవలెనని కోరిన తరువాత, వాటిని నాకు తెలియజేయుటకు ప్రభువు సమర్థుడని నమ్ముచూ నా మనస్సులో ధ్యానించుచుండగా, నేను ప్రభువు యొక్క ఆత్మయందు కొనిపోబడితిని. నేను ముందెన్నడు చూడని, ఎన్నడు నా పాదమును మోపియుండని మిక్కిలి ఎత్తైన పర్వతము పైకి కొనిపోబడితిని.

2 అప్పుడు ఆత్మ నాతో—నీవేమి కోరుచున్నావు? అనెను.

3 నేను—నా తండ్రి చూచిన విషయములను చూడవలెనని కోరుచున్నానంటిని.

4 ఆ ఆత్మ నాతో ఇట్లనెను: నీ తండ్రి చెప్పిన ఆ వృక్షమును అతడు చూచెనని నీవు నమ్ముచున్నావా?

5 నా తండ్రి మాటలన్నిటినీ నేను నమ్ముచున్నానని నీవెరుగుదువని నేను చెప్పితిని.

6 నేను ఈ మాటలు పలికినప్పుడు, ఆ ఆత్మ బిగ్గరగా ఇట్లనెను: హోసన్నా ప్రభువుకు, అత్యున్నతుడైన దేవునికి. ఏలయనగా ఆయన భూమియంతటిపై, అందరిపై కూడా దేవుడై యున్నాడు; నీఫై, అత్యున్నతుడైన దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నందున నీవు ధన్యుడవు; అందువలన, నీవు కోరిన వాటిని చూచెదవు.

7 మరియు ఈ కార్యము నీకు ఒక సూచనగా ఇవ్వబడును, నీ తండ్రి రుచి చూచిన ఫలమును కాచిన వృక్షమును నీవు చూచిన తరువాత, పరలోకము నుండి దిగుచున్న ఒక మనుష్యుని కూడా నీవు చూచెదవు; అతడిని నీవు చూచిన తరువాత, అతడు దేవుని కుమారుడేనని నీవు సాక్ష్యమిచ్చెదవు.

8 తరువాత ఆ ఆత్మ నాతో—చూడుము! అని చెప్పెను. నేను చూచి, ఒక వృక్షమును వీక్షించితిని; అది నా తండ్రి చూచిన వృక్షమువలే ఉండెను; దాని సౌందర్యము సమస్త సౌందర్యమును మించియుండెను; మరియు దాని తెల్లదనము పేర్చిన మంచును మించియుండెను.

9 నేను ఆ వృక్షమును చూచిన తరువాత, ఆ ఆత్మతో ఇట్లంటిని: అన్నిటి కంటే ప్రశస్థమైన వృక్షమును నీవు నాకు చూపించితివి.

10 దానికతడు—నీవేమి కోరుచున్నావు? అనెను.

11 నేనతనితో—దాని తాత్పర్యము తెలుసుకొనవలెనని కోరుచున్నానని చెప్పితిని—ఏలయనగా నేనతనితో ఒక మనుష్యుడు మాట్లాడునట్లు మాట్లాడితిని; అతడు ఒక మనుష్యుని రూపములో ఉన్నట్లు నేను చూచితిని; కానీ, అది ప్రభువు ఆత్మ అని నేనెరుగుదును. అతడు నాతో ఒక మనుష్యుడు ఇంకొకనితో మాట్లాడునట్లు మాట్లాడెను.

12 అతడు నాతో—చూడుము! అని చెప్పెను; అతడిని చూడవలెనన్నట్లు చూచితిని, కానీ నేనతనిని చూడలేకపోతిని. ఏలయనగా అతడు నా సమక్షమునుండి వెడలిపోయెను.

13 నేను చూచి, ఆ మహాపట్టణమైన యెరూషలేమును ఇతర పట్టణములను వీక్షించితిని; నేను నజరేతు పట్టణమును, ఆ పట్టణములో ఒక కన్యకను చూచితిని; ఆమె మిక్కిలి అందముగాను, తెల్లగాను ఉండెను.

14 నేను పరలోకములు తెరువబడుటను చూచితిని; ఒక దేవదూత క్రిందికి వచ్చి, నా యెదుట నిలిచి, నాతో—నీఫై నీవేమి చూచుచున్నావు? అని పలికెను.

15 నేనతనితో—కన్యకలందరిని మించి చక్కనైన మిక్కిలి అందమైన ఒక కన్యకనని చెప్పితిని.

16 అతడు నాతో—దేవుని నమ్రతను నీవెరుగుదువా? అనెను.

17 నేనతనితో—ఆయన తన సంతానమును ప్రేమించునని నేనెరుగుదును; అయినప్పటికీ అన్నివిషయముల భావము నేనెరుగనని చెప్పితిని.

18 దానికతడు నాతో—నీవు చూచిన కన్యక దేవుని కుమారుని యొక్క శరీర సంబంధమైన తల్లియై యున్నదనెను.

19 ఆమె ఆత్మయందు కొనిపోబడుట నేను చూచితిని; కొంతకాలము పాటు ఆమె ఆత్మయందు కొనిపోబడిన తరువాత ఆ దేవదూత నాతో ఇట్లనెను: చూడుము!

20 నేను మరలా ఆ కన్యకను, ఆమె చేతులలో ఒక బిడ్డను ఎత్తుకొని యుండుటను చూచితిని.

21 అప్పుడు ఆ దేవదూత నాతో—దేవుని గొఱ్ఱెపిల్లను, నిజముగా నిత్యుడగు తండ్రి యొక్క కుమారుని చూడుము! నీ తండ్రి చూచిన వృక్షము యొక్క అర్థమును నీవెరుగుదువా? అనెను.

22 నేనతనికి ప్రత్యుత్తరమిచ్చి ఇట్లంటిని: ఇది దేవుని ప్రేమయై యున్నది, అది తననుతాను నరుల సంతానము యొక్క హృదయముల యందు చిందించుకొనుచున్నది; అందువలన, అది అన్ని వస్తువులను మించి మిక్కిలి కోరదగినది.

23 అతడు నాతో ఇట్లనెను: అవును, ఆత్మకు మిక్కిలి ఆనందకరమైనది.

24 ఈ మాటలు పలికిన తరువాత, అతడు నాతో—చూడుము! అని చెప్పెను. నేను చూచి, దేవుని కుమారుడు నరుల సంతానము మధ్య ముందుకు వెళ్ళుటను వీక్షించితిని. అనేకులు అతని పాదముల వద్ద పడి ఆరాధించుటను చూచితిని.

25 నా తండ్రి చూచిన ఇనుప దండము దేవుని వాక్యమని, అది జీవజలముల ఊట యొద్దకు లేదా జీవ వృక్షము వద్దకు నడిపించెనని, ఆ జలములు దేవుని ప్రేమకు సూచనగా ఉన్నవని నేను చూచితిని; జీవ వృక్షము దేవుని ప్రేమకు సూచనగా ఉన్నదని నేను గ్రహించితిని.

26 ఆ దేవదూత తిరిగి నాతో చెప్పెను: చూడుము, దేవుని నమ్రతను గమనించుము!

27 నేను చూచి, నా తండ్రి చెప్పిన లోక విమోచకుని వీక్షించితిని; అతని ముందు మార్గమును సిద్ధపరచవలసిన ప్రవక్తను కూడా నేను చూచితిని: దేవుని గొఱ్ఱెపిల్ల ముందుకు వెళ్ళి అతని ద్వారా బాప్తిస్మము పొందెను; ఆయన బాప్తిస్మము పొందిన తరువాత పరలోకములు తెరువబడుటను, పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వచ్చుటను మరియు అతనిపై ఒక పావురము ఆకారములో నిలుచుటను నేను చూచితిని.

28 అతడు జనులకు శక్తి మరియు గొప్ప మహిమలో పరిచర్య చేయుచు ముందుకు వెళ్ళుటను నేను చూచితిని; అతడిని వినుటకు సమూహములు కూడి వచ్చిరి; మరియు వారి మధ్యనుండి వారతనిని బయటకు త్రోసివేయుట నేను చూచితిని.

29 పండ్రెండుగురు ఇతరులు అతడిని వెంబడించుటను నేను చూచితిని. వారు నా యెదుటనుండి ఆత్మ యందు కొనిపోబడిరి మరియు నేను వారిని చూడలేదు.

30 ఆ దేవదూత తిరిగి నాతో—చూడుము! అనెను. నేను చూచి, పరలోకములు మరలా తెరువబడుటను వీక్షించితిని. దేవదూతలు నరుల సంతానముపై దిగివచ్చుటను, వారికి పరిచర్య చేయుటను చూచితిని.

31 అతడు మరలా నాతో—చూడుము! అనెను. నేను చూచి, దేవుని గొఱ్ఱెపిల్ల నరుల సంతానము మధ్య ముందుకు వెళ్ళుటను వీక్షించితిని; రోగులైన జన సమూహములను, అన్ని రకముల వ్యాధులు, దయ్యములు మరియు అపవిత్రాత్మలతో బాధపడుచున్న వారిని నేను చూచితిని; ఆ దేవదూత నాతో మాట్లాడి, ఈ దృశ్యములన్నిటినీ నాకు చూపించెను; వారు దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి ద్వారా స్వస్థపరచబడిరి; దయ్యములు మరియు అపవిత్రాత్మలు బయటకు వెళ్ళగొట్టబడినవి.

32 ఆ దేవదూత తిరిగి నాతో—చూడుము! అనెను. నేను చూచి, దేవుని గొఱ్ఱెపిల్ల జనులచే పట్టబడుటను వీక్షించితిని: అంతేకాకుండా, శాశ్వతుడైన దేవుని కుమారుడు లోకము చేత తృణీకరింపబడుటను నేను చూచి సాక్ష్యమిచ్చుచున్నాను.

33 నీఫైయను నేను, ఆయన సిలువపైన ఎత్తబడి లోకపాపముల నిమిత్తము వధింపబడుటను చూచితిని.

34 అతడు వధింపబడిన తరువాత భూ సమూహములు గొఱ్ఱెపిల్ల యొక్క అపోస్తలులకు వ్యతిరేకముగా పోరాడుటకు సమకూడియుండుట నేను చూచితిని; ఆ పడ్రెండుగురు, ప్రభువు యొక్క దేవదూత ద్వారా ఈ లాగు పిలువబడిరి.

35 భూ సమూహములు కూడియుండి, నా తండ్రి చూచిన భవనము వంటి ఒక పెద్ద విశాల భవనములో ఉండుట నేను చూచితిని. ప్రభువు యొక్క దేవదూత మరలా నాతో—లోకమును, దాని జ్ఞానమును చూడుము. ఇశ్రాయేలు వంశము గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపోస్తలులకు వ్యతిరేకముగా పోరాడుటకు కూడియున్నదనెను.

36 ఆ గొప్ప విశాల భవనము లోకము యొక్క గర్వమైయున్నదనియు, అది పడెననియు, దాని పతనము మిక్కిలి గొప్పదైయుండెననియు నేను చూచి, సాక్ష్యమిచ్చితిని. ఆ దేవదూత మరలా నాతో—గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపొస్తలులకు వ్యతిరేకముగా పోరాడు సమస్త జనముల, జాతుల, భాషల మరియు ప్రజల యొక్క నాశనము అట్లే యుండుననెను.