లేఖనములు
1 నీఫై 13


అధ్యాయము 13

నీఫై దర్శనమందు అన్యజనుల మధ్య అపవాది సంఘము స్థాపించబడుట, అమెరికాను కనుగొనుట మరియు వలస ఏర్పరచుకొనుట, బైబిల్ యొక్క అనేక స్పష్టమైన, ప్రశస్థమైన భాగములు కోల్పోబడుట, దాని ఫలితమైన అన్యజనుల విశ్వాస భ్రష్ఠత్వపు స్థితి, సువార్త పునఃస్థాపన, కడవరి దిన లేఖనపు రాక మరియు సీయోను నిర్మాణమును చూచును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 ఆ దేవదూత నాతో—చూడుమనెను. నేను చూచి, అనేక జనములను, రాజ్యములను వీక్షించితిని.

2 ఆ దేవదూత నాతో—నీవు ఏమి చూచుచున్నావనగా, నేను అనేక జనములను, రాజ్యములను చూచుచున్నానంటిని.

3 అతడు నాతో—ఇవి అన్యజనుల జనములు మరియు రాజ్యములని చెప్పెను.

4 అన్యజనుల జనముల మధ్య ఒక గొప్ప సంఘము యొక్క ఏర్పాటును నేను చూచితిని.

5 మరియు ఆ దేవదూత నాతో ఇట్లనెను: ఇతర సంఘములన్నిటి కంటే మిక్కిలి హేయకరమైన సంఘము యొక్క ఏర్పాటును చూడుము, అది దేవుని పరిశుద్ధులను సంహరించును, ముఖ్యముగా వారిని చిత్రహింసలుపెట్టి, కట్టి పడవేయును మరియు ఒక ఇనుప కాడితో వారికి కాడిపెట్టును, వారిని దాస్యములోనికి తెచ్చును.

6 ఈ గొప్ప హేయకరమైన సంఘమును నేను చూచితిని. అపవాది దాని స్థాపకుడని చూచితిని.

7 మరియు బంగారమును, వెండిని, పట్టును, రక్తవర్ణములను, పేనిన సన్ననినారను, అన్నిరకాల విలువైన వస్త్రములను కూడా నేను చూచితిని; అనేక మంది వేశ్యలను చూచితిని.

8 ఆ దేవదూత నాతో ఇట్లనెను: ఇదిగో బంగారము, వెండి, పట్టు, రక్తవర్ణములు, పేనిన సన్ననినార, విలువైన వస్త్రములు మరియు వేశ్యలు ఈ గొప్ప హేయకరమైన సంఘము యొక్క కాంక్షలైయున్నవని చూడుము.

9 ఇంకను లోక ప్రశంసల కొరకు వారు దేవుని పరిశుద్ధులను నాశనము చేయుదురు మరియు వారిని దాస్యములోనికి తెచ్చెదరు.

10 నేను చూచి, అనేక జలములను వీక్షించితిని; అవి నా సహోదరుల సంతానము నుండి అన్యజనులను వేరుపరచెను.

11 మరియు ఆ దేవదూత నాతో—నీ సహోదరుల సంతానము మీద దేవుని ఉగ్రత ఉన్నదని చూడుము అనెను.

12 నేను చూచి, అన్యజనుల మధ్య ఒక మనుష్యుడు నా సహోదరుల సంతానమునుండి ఆ అనేక జలముల ద్వారా వేరు చేయబడుట వీక్షించితిని; మరియు దేవుని ఆత్మను చూచితిని, అది క్రిందికి దిగివచ్చి ఆ మనుష్యునిపై పని చేయగా అతడు ఆ అనేక జలములపై ప్రయాణిస్తూ వాగ్దానదేశములోనున్న నా సహోదరుల సంతానము వద్దకు వెళ్ళెను.

13 దేవుని ఆత్మ ఇతర అన్యజనులపై పనిచేయుట నేను చూచితిని; వారు దాస్యమునుండి బయటకు ఆ అనేక జలములపైన ముందుకు వెళ్ళిరి.

14 వాగ్దానదేశముపైన అన్యజనుల యొక్క అనేక సమూహములను నేను చూచితిని; దేవుని ఉగ్రత నా సహోదరుల సంతానముపై నుండుటను చూచితిని; వారు అన్యజనుల యెదుట చెదరిపోయి సంహరించబడిరి.

15 ప్రభువు యొక్క ఆత్మ అన్యజనులపైన ఉండుటను, వారు వర్థిల్లి భూమిని వారి స్వాస్థ్యమునకు పొందుటను నేను చూచితిని; వారు తెల్లగా నుండి, సంహరింపబడక ముందు నా జనులు ఉన్నట్లే మిక్కిలి చక్కగాను, అందముగాను ఉండుట నేను చూచితిని.

16 దాస్యము నుండి బయటకు వెళ్ళిన అన్యజనులు ప్రభువు యెదుట తమను తాము తగ్గించుకొనుటను మరియు ప్రభువు యొక్క శక్తి వారితో నుండుటను నీఫై అను నేను చూచితిని.

17 వారి మాతృ దేశపు అన్యజనులు జలములపైన భూమిపైన చేరి వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు కూడియుండుట నేను చూచితిని.

18 దేవుని శక్తి వారితోనుండుటను, వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు సమకూడిన వారందరి మీద దేవుని ఉగ్రత ఉండుటను కూడా నేను చూచితిని.

19 దాస్యమునుండి బయటకు వెళ్ళిన అన్యజనులు ఇతర జనములందరి హస్తముల నుండి దేవుని శక్తి ద్వారా విడుదల పొందుటను నీఫై అను నేను చూచితిని.

20 వారు ఆ భూమియందు వర్ధిల్లుట చూచితిని మరియు ఒక గ్రంథము వారి మధ్య తీసుకొనిపోబడుటను నేను చూచితిని.

21 అప్పుడు ఆ దేవదూత నాతో—ఆ గ్రంథము యొక్క అర్థము నీవెరుగుదువా? అనెను.

22 ఎరుగనని నేనతనితో చెప్పితిని.

23 దానికతడు ఇట్లనెను: ఇదిగో అది ఒక యూదుని నోటినుండి వెలువడును. మరియు నీఫైయను నేను దానిని చూచితిని; మరలా అతడు నాతో చెప్పెను: నీవు చూచుచున్న ఆ గ్రంథము యూదుల యొక్క వృత్తాంతము. అది ప్రభువు యొక్క నిబంధనలను కలిగియున్నది, ఇశ్రాయేలు వంశస్థులతో చేసిన ఆయన నిబంధనలను కలిగియున్నది; మరియు అది పరిశుద్ధ ప్రవక్తల యొక్క అనేక ప్రవచనములను కూడా కలిగియున్నది; అది కంచు యొక్క పలకలపై ఉన్న చెక్కడములవంటి ఒక గ్రంథము, కానీ అందులో అంత ఎక్కువ లేవు. అయినప్పటికినీ అవి ప్రభువు ఇశ్రాయేలు వంశస్థులతో చేసిన నిబంధనలను కలిగియున్నవి. అందువలన, అవి అన్యజనులకు మిక్కిలి విలువైనవి.

24 ప్రభువు యొక్క దూత నాతో ఇట్లనెను: ఆ గ్రంథము యూదుని నోటినుండి వెలువడుటను నీవు చూచియున్నావు; అది యూదుని నోటినుండి వెలువడినప్పుడు, అది ప్రభువు సువార్త యొక్క సంపూర్ణతను కలిగియుండెను. ఆయనను గూర్చి పండ్రెండుగురు అపోస్తలులు సాక్ష్యమిచ్చిరి; వారు దేవుని గొఱ్ఱెపిల్ల యందున్న సత్యమును బట్టి సాక్ష్యమిచ్చిరి.

25 అందువలన దేవునియందున్న సత్యమును బట్టి, ఈ వాక్యములు యూదుల నుండి పవిత్రముగా అన్యజనుల యొద్దకు ముందుకు వెళ్ళును.

26 అవి గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపోస్తలుల హస్తము ద్వారా యూదుల నుండి అన్యజనులకు ముందుకు వెళ్ళిన తరువాత, ఆ గొప్ప హేయకరమైన సంఘపు ఏర్పాటును నీవు చూచుచుంటివి. అది ఇతర సంఘములన్నిటి కంటే మిక్కిలి హేయకరమైనది; ఏలయనగా, వారు గొఱ్ఱెపిల్ల సువార్త నుండి స్పష్టమైన అతి ప్రశస్థమైన అనేక భాగములను తీసివేసిరి; మరియు ప్రభువు నిబంధనలనేకము కూడా వారు తీసివేసిరి.

27 ఇదంతయు వారు ప్రభువు యొక్క మంచి మార్గములను తప్పించవలెనని, నరుల సంతానము యొక్క నేత్రములకు అంధత్వమును కలుగజేయవలెనని, వారి హృదయములను కఠిన పరచవలెనని చేసిరి.

28 అందువలన, ఆ గ్రంథము ఆ గొప్ప హేయకరమైన సంఘము యొక్క హస్తముల నుండి ముందుకు వెళ్ళిన తరువాత దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క గ్రంథమైన ఆ గ్రంథము నుండి అనేక స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములు తీసివేయబడినవని నీవు చూచుచుంటివి.

29 ఈ స్పష్టమైన, ప్రశస్థమైన వాక్యములు తీసి వేయబడిన తరువాత, అది అన్యజనుల యొక్క సమస్త జనముల యొద్దకు వెళ్ళును; అది అన్యజనుల యొక్క సమస్త జనముల యొద్దకు, ముఖ్యముగా నీవు చూచినట్లుగా అనేక జలముల మీదుగా దాస్యములో నుండి బయటకు వెళ్ళిన అన్యజనుల యొద్దకు వెళ్ళిన తరువాత—అనేక స్పష్టమైన ప్రశస్థమైన వాక్యములు గ్రంథము నుండి బయటకు తీసివేయబడినవి. దేవుని గొఱ్ఱెపిల్ల యందున్న సరళతను బట్టి అవి మనుష్యసంతానము యొక్క గ్రహింపునకు సరళమైయుండెను—గొఱ్ఱెపిల్ల సువార్త నుండి బయటకు తీసివేయబడిన ఈ వాక్యముల కారణముగా సాతాను వారిపైన గొప్ప శక్తి కలిగియుండునంతగా అనేకులు తొట్రపడుచున్నారు.

30 అయినప్పటికినీ, దాస్యములో నుండి బయటకు వెళ్ళి, దేవుని శక్తి ద్వారా సమస్త జనముల కంటే హెచ్చుగా, సమస్త ఇతర భూముల కంటే కోరదగిన భూముఖముపై ఎత్తబడిన అన్యజనులను నీవు చూచుచున్నావు; ఆ భూమిని అతని సంతానము తమ స్వాస్థ్యమైన భూమిగా కలిగియుండవలెనని నీ తండ్రితో ప్రభువైన దేవుడు నిబంధన చేసియుండెను; అందువలన, అన్యజనులు నీ సహోదరుల మధ్యనున్న నీ సంతానము యొక్క మిశ్రమమును పూర్తిగా నాశనము చేయునట్లు ప్రభువైన దేవుడు జరుగ నీయడు.

31 అంతేకాక, అన్యజనులు నీ సహోదరుల సంతానమును నాశనము చేయుటకు ఆయన అనుమతించడు.

32 అంతేకాక, నీవు చూచిన ఆ హేయమైన సంఘము దాని ఏర్పాటు ద్వారా గొఱ్ఱెపిల్ల సువార్తలోని స్పష్టమైన ప్రశస్థమైన భాగములను మరుగుపరచినందున అన్యజనులు ఇప్పుడున్నట్లుగా శాశ్వతముగా ఆ భయంకరమైన అంధత్వపు స్థితిలో ఉండునట్లు ప్రభువైన దేవుడు అనుమతించడు.

33 అందువలన దేవుని గొఱ్ఱెపిల్ల చెప్పుచున్నాడు: నేను ఇశ్రాయేలు వంశస్థుల శేషమును గొప్ప తీర్పునందు దర్శించునట్లు అన్యజనుల యెడల కనికరముగా ఉందును.

34 మరియు ప్రభువు యొక్క దూత నాతో ఇట్లనెను: ఇదిగో, దేవుని గొఱ్ఱెపిల్ల సెలవిచ్చునదేమనగా, నేను ఇశ్రాయేలు వంశస్థుల శేషమును దర్శించిన తరువాత—నేను చెప్పుచున్న ఈ శేషము నీ తండ్రి యొక్క సంతానము—కావున, నేను వారిని తీర్పునందు దర్శించిన తరువాత, వారిని అన్యజనుల హస్తము చేత మొత్తిన తరువాత, వేశ్యల తల్లియైన ఆ హేయకరమైన సంఘము ద్వారా గొఱ్ఱెపిల్ల సువార్తలోని స్పష్టమైన, ప్రశస్థమైన భాగములు మరుగుపరచబడినందున అన్యజనులు అధికముగా తొట్రపడిన తరువాత—ఆ దినమందు వారికి నా స్వంత శక్తి ద్వారా స్పష్టమైన ప్రశస్థమైన నా సువార్త యొక్క అధిక భాగమును తెచ్చునంతగా నేను అన్యజనుల యెడల కనికరము కలిగియుందునని గొఱ్ఱెపిల్ల సెలవిచ్చుచున్నాడు.

35 ఏలయనగా ఇదిగో, గొఱ్ఱెపిల్ల సెలవిచ్చుచున్నాడు: నేను నీ సంతానమునకు చేయు పరిచర్యను గూర్చిన అనేక వాక్యములను వారు వ్రాయునట్లుగా నన్ను నేను నీ సంతానమునకు విశదపరచుకొనెదను, అవి స్పష్టముగాను ప్రశస్థముగాను ఉండును; నీ సంతానము నాశనము చేయబడి, విశ్వాసమందు క్షీణించిన తరువాత మరియు నీ సహోదరుల సంతానము కూడా క్షీణించిన తరువాత, ఇదిగో ఈ విషయములు గొఱ్ఱెపిల్ల బహుమానము మరియు శక్తి ద్వారా అన్యజనుల ముందుకు వచ్చునట్లు దాయబడును.

36 వీటి యందు నా సువార్త, నా దుర్గము మరియు నా రక్షణ వ్రాయబడునని గొఱ్ఱెపిల్ల సెలవిచ్చుచున్నాడు.

37 ఆ దినమున నా సీయోనును ముందుకు తీసుకొని రావలెనని కోరు వారు ధన్యులు. ఏలయనగా, వారు పరిశుద్ధాత్మ బహుమానము మరియు శక్తిని కలిగియుందురు; వారు అంతము వరకు స్థిరముగానున్న యెడల, అంత్యదినమున లేపబడి గొఱ్ఱెపిల్ల యొక్క శాశ్వత రాజ్యమందు రక్షింపబడుదురు; శాంతిని, అంతేకాకుండా గొప్ప సంతోషవార్తలను ప్రకటించు వారు పర్వతములపైన ఎంతో సుందరముగా ఉందురు.

38 మరియు నా సహోదరుల సంతానము యొక్క శేషమును, యూదుని నోటి నుండి వెలువడిన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క గ్రంథమును నేను చూచితిని, అది అన్యజనుల నుండి నా సహోదరుల సంతానము యొక్క శేషము వద్దకు వచ్చెను.

39 అది వారి యొద్దకు వచ్చిన తరువాత గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపొస్తలులు, ప్రవక్తల యొక్క ఆ గ్రంథములు సత్యమైనవని అన్యజనులను, నా సహోదరుల సంతానము యొక్క శేషమును మరియు భూముఖమంతటిపైన చెదరియున్న యూదులందరినీ నమ్మించుటకు గొఱ్ఱెపిల్ల శక్తి ద్వారా అన్యజనుల నుండి వారికి వచ్చిన ఇతర గ్రంథములను నేను చూచితిని.

40 ఆ దేవదూత నాతో ఇట్లనెను: నీవు అన్యజనుల మధ్య చూచిన ఈ చివరి వృత్తాంతములు గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపొస్తలులవైన మొదటి వాటి యొక్క సత్యమును స్థాపించును; వాటి నుండి తీసివేయబడిన స్పష్టమైన ప్రశస్థమైన వాక్యములను తెలియజేయును; సమస్త వంశములు, భాషలు, జనులకు దేవుని గొఱ్ఱెపిల్ల శాశ్వతుడైన తండ్రి యొక్క కుమారుడని, లోక రక్షకుడని, నరులందరు అతని యొద్దకు రావలెనని, లేని యెడల రక్షణ పొందలేరని తెలియజేయును.

41 గొఱ్ఱెపిల్ల నోటిద్వారా స్థాపించబడు మాటలను బట్టి, వారు రావలెను; గొఱ్ఱెపిల్ల మాటలు నీ సంతానము యొక్క వృత్తాంతములయందు, గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపోస్తలుల వృత్తాంతముల యందు తెలియజేయబడును; అందువలన అవి రెండును ఒక దానియందు స్థాపించబడును. ఏలయనగా, భూమి యంతటి మీద దేవుడొక్కడే, గొఱ్ఱెల కాపరి ఒక్కడే.

42 ఆయన సమస్త జనములకు, యూదులకు అన్యజనులకు కూడా తనను తాను ప్రత్యక్ష పరచుకొను సమయము వచ్చును; మరియు ఆయన తననుతాను యూదులకు అన్యజనులకు ప్రత్యక్షపరచుకొనిన తరువాత, అప్పుడు ఆయన తననుతాను అన్యజనులకు యూదులకు ప్రత్యక్ష పరచుకొనును; కడపటి వారు మొదటి వారగుదురు మరియు మొదటివారు కడపటి వారగుదురు.