లేఖనములు
1 నీఫై 15


అధ్యాయము 15

లీహై సంతానము కడవరి దినములలో అన్యజనుల నుండి సువార్తను పొందవలెను—ఇశ్రాయేలు సమకూడిక ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడినది, దాని సహజమైన కొమ్మలు తిరిగి అంటుకట్టబడును—నీఫై జీవవృక్షము యొక్క దర్శనమునకు అర్థము చెప్పును, నీతిమంతుల నుండి దుర్మార్గులను విడదీయుటలో దేవుని న్యాయమును గూర్చి మాట్లాడును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 నీఫైయను నేను ఆత్మ యందు కొనిపోబడి ఈ దృశ్యములన్నియు చూచిన తరువాత, నా తండ్రి యొక్క గుడారమునకు తిరిగి వచ్చితిని.

2 నేను నా సహోదరులను చూచితిని; వారు నా తండ్రి చెప్పిన వాక్యములను గూర్చి ఒకరితోనొకరు వాదించుచుండిరి.

3 ఏలయనగా ఒక నరుడు ప్రభువునొద్ద విచారించితే తప్ప గ్రహించుటకు కష్టమైన అనేక గొప్ప విషయములను యథార్థముగా అతడు వారితో చెప్పెను; వారు తమ హృదయములలో కఠినముగా ఉన్నందున ప్రభువు వైపు చూడవలసినంతగా వారు చూడలేదు.

4 ఇప్పుడు నీఫైయను నేను వారి హృదయ కాఠిన్యమును బట్టి, నేను చూచియుండిన దర్శనములను బట్టి దుఃఖించితిని మరియు నరుల సంతానము యొక్క దుష్టత్వము వలన అవి తప్పనిసరిగా నెరవేరవలెనని ఎరిగియుంటిని.

5 నా బాధల చేత నేను జయించబడితిని, ఏలయనగా నేను నా జనుల పతనమును చూచినందువలన నా జనుల యొక్క నాశనమును బట్టి నా శ్రమలు అందరికంటే ఎక్కువని నేను తలంచితిని.

6 నేను శక్తిని పొందిన తరువాత, వారి వాదనలకు కారణమును వారి నుండి తెలుసుకొనగోరి నా సహోదరులతో మాటలాడితిని.

7 వారు—ఇదిగో, మన తండ్రి ఒలీవ చెట్టు సహజమైన కొమ్మలను గూర్చి, అన్యజనులను గూర్చి చెప్పిన మాటలు మాకు అర్థము కాకున్నవని చెప్పిరి.

8 మీరు ప్రభువునొద్ద విచారించితిరా? అని నేను వారినడిగితిని;

9 వారు నాతో ఇట్లనిరి: మేము విచారించలేదు. ఏలయనగా ప్రభువు అటువంటి ఏ విషయమును మాకు తెలియజేయడు.

10 నేను వారితో ఇట్లంటిని: మీరేల ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించరు? మీ హృదయ కాఠిన్యమును బట్టి మీరెందుకు నశించెదరు?

11 ప్రభువు సెలవిచ్చిన విషయములు మీకు జ్ఞాపకము లేవా?—మీరు మీ హృదయములను కఠినపరచుకొనక నా ఆజ్ఞలను పాటించుటలో శ్రద్ధ వహించి, మీరు పొందుదురని నమ్ముచూ విశ్వాసముతో నన్నడిగిన యెడల, తప్పక ఈ విషయములు మీకు తెలియజేయబడును.

12 ఇదిగో, మన తండ్రి యందున్న ప్రభువు యొక్క ఆత్మ ద్వారా ఇశ్రాయేలు వంశము ఒక ఒలీవ చెట్టుతో పోల్చబడినదని నేను మీకు చెప్పుచున్నాను; మనము ఇశ్రాయేలు వంశము నుండి వేరుచేయబడినవారము కాదా, మనము ఇశ్రాయేలు వంశము యొక్క కొమ్మ కాదా?

13 ఇప్పుడు అన్యజనుల సంపూర్ణత ద్వారా సహజమైన కొమ్మలు అంటుగట్టబడుటను గూర్చి మన తండ్రి యొక్క భావమేమనగా, కడవరి దినములలో మన సంతానము అనేక సంవత్సరముల పాటు విశ్వాసమందు క్షీణించియున్నప్పుడు, అనగా మెస్సీయ శరీరము నందు నరుల సంతానమునకు ప్రత్యక్షపరచబడిన అనేక తరముల తరువాత, మెస్సీయ సువార్త యొక్క సంపూర్ణత అన్యజనులకు మరియు అన్యజనుల నుండి మన సంతానము యొక్క శేషమునకు వచ్చును—

14 ఆ దినమున మన సంతానము యొక్క శేషము తాము ఇశ్రాయేలు వంశస్థులమని, ప్రభువు యొక్క నిబంధన జనులమని తెలుసుకొందురు; అప్పుడు వారు తెలుసుకొని, వారి పూర్వీకుల అనుభవజ్ఞానమును, ఆయన ద్వారా వారి పితరులకు ఇవ్వబడిన వారి విమోచకుని సువార్త యొక్క అనుభవజ్ఞానమును పొందెదరు; అందువలన వారు, వారి విమోచకుని యొక్క, ఆయన సిద్ధాంతము యొక్క నిజమైన అంశములను గూర్చి తెలుసుకొందురు, తద్వారా వారు ఎలా ఆయన యొద్దకు వచ్చి రక్షింపబడవలెనో ఎరిగియుందురు.

15 అప్పుడు, ఆ దినమున వారు ఆనందించి శాశ్వతుడైన వారి దేవునికి, వారి దుర్గము మరియు రక్షకునికి స్తుతి చెల్లించరా? ఆ దినమున వారు నిజమైన ద్రాక్షావల్లి నుండి బలమును పోషణను పొందరా? వారు దేవుని సత్య సముదాయములోనికి రారా?

16 ఇదిగో, నేను మీతో చెప్పుచున్నాను: వారు ఇశ్రాయేలు వంశస్థుల మధ్య తిరిగి జ్ఞాపకము చేసుకొనబడుదురు; వారు ఒలీవ చెట్టు యొక్క సహజమైన కొమ్మ అయ్యుండుటను బట్టి నిజమైన ఒలీవ చెట్టులోనికి అంటుగట్టబడుదురు.

17 మన తండ్రి యొక్క భావమిదే; వారు అన్యజనుల ద్వారా చెదరగొట్టబడిన తరువాత తప్ప, ఇది జరుగదని ఆయన భావము; ఇది అన్యజనుల ద్వారా వచ్చునని మరియు ప్రభువు తన శక్తిని అన్యజనులకు చూపవలసియున్నందున యూదుల చేత లేదా ఇశ్రాయేలు వంశస్థుల చేత ఆయన తిరస్కరింపబడునని ఆయన భావము.

18 అందువలన మన తండ్రి మన సంతానమును గూర్చి మాత్రమేకాక, ఇశ్రాయేలు వంశస్థులందరిని గూర్చి కూడా కడవరి దినములలో నెరవేరవలసియున్న నిబంధనను చూపుచూ చెప్పెను; నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడునని చెప్పుచు మన తండ్రియైన అబ్రాహాముతో ప్రభువు ఆ నిబంధన చేసెను.

19 నీఫైయను నేను ఈ విషయములను గూర్చి వారితో అధికముగా చెప్పితిని; ముఖ్యముగా కడవరి దినములలో యూదుల పునఃస్థాపనను గూర్చి వారితో చెప్పితిని.

20 ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి లేదా యూదుల పునఃస్థాపనను గూర్చి పలికిన యెషయా మాటలను వారితో నేను మరలా చెప్పితిని; వారు పునఃస్థాపించబడిన తరువాత, వారు ఇక ఎన్నడూ తమ ఉనికిని కోల్పోరు, మరెన్నడూ చెదరగొట్టబడరు; మరియు వారు సమాధానపడి, ప్రభువు యెదుట తమనుతాము తగ్గించుకొనునట్లు నేను నా సహోదరులతో అనేక మాటలు చెప్పితిని.

21 మరలా వారు నాతో ఇట్లనిరి: మన తండ్రి స్వప్నమందు చూచిన ఈ విషయము యొక్క భావమేమి? అతడు చూచిన ఆ వృక్షము యొక్క భావమేమి?

22 అది జీవవృక్షము యొక్క సూచనయైయున్నదని నేను వారితో చెప్పితిని.

23 వారు నాతో—మన తండ్రి చూచిన ఆ వృక్షము యొద్దకు నడిపించు ఇనుప దండము యొక్క భావమేమి? అనిరి.

24 అది దేవుని వాక్యమని నేను వారితో చెప్పితిని; దేవుని వాక్యమును ఆలకించి, దానిని గట్టిగా పట్టుకొనియుండు వారెన్నడూ నశించరు; అంతేకాక శోధనలు మరియు నాశనమునకు నడిపించునట్లు అపవాది యొక్క అగ్ని బాణములు వారిని అంధులుగా చేయలేవు.

25 అందువలన నీఫైయను నేను, ప్రభువు వాక్యమును లక్ష్యపెట్టవలెనని వారిని ప్రోత్సహించితిని; అంతేకాక వారు దేవుని వాక్యమును లక్ష్యపెట్టవలెనని, అన్నివిషయములలో ఎల్లప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించుటను జ్ఞాపకముంచుకోవలెనని నా ఆత్మ యొక్క సమస్త సామర్థ్యములతో మరియు నేను కలిగియున్న నా సమస్త నైపుణ్యముతో వారికి ఉద్భోధించితిని.

26 వారు నాతో—మన తండ్రి చూచిన నది యొక్క భావమేమి? అనిరి.

27 నా తండ్రి చూచిన నీరు కల్మషమునకు గుర్తు అని నేను వారితో చెప్పితిని; అతని మనస్సు ఇతర విషయములచే ఎంతగానో హరించబడి యున్నందున, అతడు ఆ నీటి కల్మషమును చూడలేదు.

28 అది దుష్టులను జీవవృక్షము నుండి మరియు దేవుని పరిశుద్ధుల నుండి వేరు చేయు ఒక భయంకరమైన అగాధమని నేను వారితో చెప్పితిని.

29 దుష్టుల కొరకు సిద్ధము చేయబడినదని ఆ దేవదూత నాతో చెప్పిన భయంకరమైన నరకమునకు అది సూచనయని నేను వారితో చెప్పితిని.

30 దేవుని న్యాయము దుర్మార్గులను నీతిమంతుల నుండి విడదీసెనని కూడా మన తండ్రి చూచెనని నేను వారితో చెప్పితిని; ఆ న్యాయపు ప్రకాశము మండుచున్న అగ్ని వంటిది, అది అంతము లేకుండా నిరంతరము దేవుని యొద్దకు ఆరోహణమగును.

31 వారప్పుడు నాతో ఇట్లనిరి; దీని అర్థము పరిశీలనా దినములలో శారీరక బాధయా, లేదా భౌతిక మరణము తరువాత ఆత్మ యొక్క అంతిమ స్థితియా, లేదా అది ఐహిక విషయములను గూర్చి మాట్లాడుచున్నదా?

32 అది ఐహికమైన ఆత్మీయమైన రెండింటి విషయముల యొక్క సూచనయై యున్నదని నేను వారితో చెప్పితిని; ఏలయనగా వారి క్రియలను బట్టి, ముఖ్యముగా పరిశీలనాదినములలో ఐహిక శరీరము ద్వారా జరిగించబడిన క్రియలను బట్టి వారు తీర్పుతీర్చబడు దినము రావలెను.

33 అందువలన, నీతికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయములను బట్టి వారు తమ దుర్మార్గతలో మరణించిన యెడల వారు బయటకు త్రోసివేయబడవలెను; వారి క్రియలను బట్టి వారు తీర్పుతీర్చబడునట్లు దేవుని యెదుట నిలువబడుటకు తీసుకొని రాబడవలెను; వారి క్రియలు మలినమైన యెడల వారు మలినముగా ఉందురు; వారు మలినముగా ఉన్న యెడల, వారు దేవుని రాజ్యములో నివసించలేరు; అట్లయిన దేవుని రాజ్యము కూడా మలినమైయుండవలెను.

34 కానీ దేవుని రాజ్యము మలినమైనది కాదని, దేవుని రాజ్యములో అపవిత్రమైన వస్తువేదియు ఉండజాలదని నేను మీతో చెప్పుచున్నాను; అందువలన మలినమైన దాని కొరకు ఒక మలిన స్థలమును సిద్ధము చేయుట అవసరము.

35 మరియు ఒక స్థలము, నేను చెప్పిన ఆ భయంకరమైన నరకము సిద్ధపరచబడియున్నది; అపవాదియే దానిని సిద్ధపరచువాడు: అందువలన మనుష్యుల ఆత్మల యొక్క అంత్య స్థితి దేవుని రాజ్యములో నివసించుటయో లేదా నేను చెప్పియుండిన ఆ న్యాయమును బట్టి బయటకు త్రోసి వేయబడుటయో అయ్యున్నది.

36 అందువలన, దుర్మార్గులు నీతిమంతుల నుండి మరియు ఆ జీవవృక్షము నుండి కూడా తిరస్కరించబడియున్నారు; ఆ వృక్ష ఫలము మిగతా అన్నిఫలముల కంటే మిక్కిలి కోరదగినది, మిక్కిలి శ్రేష్ఠమైనది; అది దేవుని బహుమానములన్నిటిలోకెల్లా గొప్పదైయున్నది. మరియు ఆ విధముగా నేను నా సహోదరులతో మాట్లాడితిని. ఆమేన్‌.