లేఖనములు
1 నీఫై 16


16వ అధ్యాయము

దుర్మార్గులు సత్యమును కఠినమైనదిగా భావించెదరు—లీహై కుమారులు ఇష్మాయెల్ కుమార్తెలను వివాహమాడుదురు—అరణ్యములో లియహోనా వారికి మార్గము చూపును—ప్రభువు నుండి ఎప్పటికప్పుడు లియహోనాపై సందేశములు వ్రాయబడును—ఇష్మాయెల్ మరణించును. అతని కుటంబము శ్రమలను బట్టి సణుగును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 నీఫైయను నేను, నా సహోదరులతో మాట్లాడుట ముగించిన తర్వాత వారు నాతో—మేము భరించగలిగిన వాటి కంటే ఎక్కువ కఠినమైన విషయములను నీవు మాకు తెలియజేసియున్నావంటిరి.

2 సత్యమును బట్టి దుర్మార్గులకు వ్యతిరేకముగా కఠినమైన విషయములను నేను మాట్లాడియున్నానని నేనెరుగుదునని వారితో చెప్పితిని; నీతిమంతులను నేను నీతిమంతులుగా తీర్పుతీర్చితిని, వారు అంత్యదినమున లేపబడవలెనని సాక్ష్యమిచ్చితిని; అందువలన, దోషులు సత్యమును కఠినమైనదిగా యెంచుదురు, ఏలయనగా అది వారి హృదయములో బలముగా గ్రుచ్చుకొనును.

3 ఇప్పడు నా సహోదరులారా, దేవుని యెదుట మీరు న్యాయ ప్రవర్తన కలిగి నడుచునట్లు మీరు పరిశుద్ధులైయుండి సత్యమును ఆలకించుటకు ఇష్టపడి దానిని లక్ష్యపెట్టిన యెడల, అప్పుడు మీరు సత్యమును బట్టి సణగరు; నీవు మాకు వ్యతిరేకముగా కఠినమైన విషయములు పలుకుచున్నావని అనరు.

4 నీఫైయను నేను, ప్రభువు ఆజ్ఞలను పాటించవలెనని పూర్తి శ్రద్ధతో నా సహోదరులకు ఉద్భోధించితిని.

5 వారు నీతి మార్గములలో నడుచుకొందురని నేను వారిని గూర్చి ఆనందించి, గొప్ప నమ్మకము కలిగియుండునంతగా వారు ప్రభువు యెదుట తమనుతాము తగ్గించుకొనిరి.

6 ఇప్పుడు ఈ కార్యములన్నియు నా తండ్రి లెముయెల్ అని పిలువబడిన లోయలో ఒక గుడారములో నివసించుచుండగా చెప్పబడెను మరియు చేయబడెను.

7 నీఫైయను నేను ఇష్మాయేలు కుమార్తెలలో ఒకరిని పెండ్లి చేసుకొంటిని; నా సహోదరులు కూడా ఇష్మాయేలు కుమార్తెలను పెండ్లి చేసుకొనిరి; జోరమ్ ఇష్మాయేలు పెద్ద కుమార్తెను పెండ్లి చేసుకొనెను.

8 ఆ విధముగా నా తండ్రి అతనికి ఇవ్వబడిన ప్రభువు ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చెను; మరియు నీఫైయను నేను ప్రభువు చేత అత్యధికముగా ఆశీర్వదింపబడితిని.

9 రాత్రియందు ప్రభువు స్వరము నా తండ్రితో మాట్లాడి, ఉదయమున అతడు అరణ్యములోనికి తన ప్రయాణమును సాగించవలెనని ఆజ్ఞాపించెను.

10 ఉదయమున నా తండ్రి లేచి గుడారపు ద్వారము బయటకు వెళ్ళగా, అతనికి ఆశ్చర్యము కలిగించేలా నేలపైన వింతైన పనితనము కలిగిన ఒక గుండ్రని గోళమును అతడు చూచెను; అది శ్రేష్ఠమైన కంచుతో చేయబడియుండెను మరియు ఆ గోళమందు రెండు సూచికలుండెను; అందులో ఒకటి అరణ్యములోనికి మేమెట్లు వెళ్ళవలెనో సూచించెను.

11 అరణ్యములోనికి మేము తీసుకొని వెళ్ళవలసిన ప్రతి వస్తువును, ప్రభువు మాకు ఇచ్చియుండిన మా సామగ్రిలో మిగిలిన వాటన్నిటినీ మేము ఒకచోట చేర్చితిమి; అరణ్యములోనికి మేము తీసుకొని వెళ్ళునట్లు ప్రతి రకమైన విత్తనమును తీసుకొంటిమి.

12 మా గుడారములను తీసుకొని మేము లేమన్‌ నదిని దాటి అరణ్యములోనికి వెళ్ళిపోతిమి.

13 మేము నాలుగు దినముల పాటు దాదాపు దక్షిణ దిశగా, ఆగ్నేయము వైపు ప్రయాణము చేసి మరలా మా గుడారములను వేసుకొంటిమి; ఆ స్థలమును మేము షాజేర్‌ అని పిలిచితిమి.

14 మేము మా విల్లులు, బాణములు తీసుకొని అరణ్యములో మా కుటుంబముల కొరకు ఆహారమును సంపాదించుటకు వెళ్ళితిమి; మా కుటుంబముల కొరకు ఆహారమును సంపాదించిన తరువాత, మేము అరణ్యములో మా కుటుంబముల యొద్దకు షాజేర్‌ అను స్థలమునకు తిరిగి వచ్చితిమి; మేము తిరిగి అదే మార్గముననుసరించి ఎఱ్ఱసముద్రము దగ్గరనున్న సరిహద్దులలో ఉన్న అరణ్యములోని మిక్కిలి సారవంతమైన ప్రాంతములలో ఉంటూ ముందుకు సాగితిమి.

15 మార్గములో మా విల్లులతో, బాణములతో, రాళ్ళతో మరియు వడిసెలతో ఆహారము కొరకు వేటాడుచూ అనేక దినముల పాటు మేము ప్రయాణము చేసితిమి.

16 అరణ్యములో అత్యంత సారవంతమైన ప్రాంతములలో మమ్ములను నడిపించిన ఆ గోళము యొక్క సూచనలను మేము అనుసరించితిమి.

17 అనేక దినముల పాటు ప్రయాణము చేసిన తరువాత మేము తిరిగి విశ్రమించునట్లు, మా కుటుంబముల కొరకు ఆహారము సంపాదించునట్లు కొంతకాలము పాటు మేము మా గుడారములను వేసుకొంటిమి.

18 నీఫైయను నేను ఆహారము సంపాదించుటకు వెళ్ళినప్పడు శ్రేష్ఠమైన ఉక్కుతో చేయబడిన నా విల్లు విరిగిపోయెను; నా విల్లు విరిగిన తరువాత, దానిని కోల్పోయినందు వలన నా సహోదరులు నాపై కోపముగా నుండిరి, ఏలయనగా మేము ఆహారము సంపాదించలేకపోతిమి.

19 ఆహారము లేకుండా మేము మా కుటుంబముల వద్దకు తిరిగి వచ్చితిమి; వారి ప్రయాణమును బట్టి అధికముగా అలసిపోయిన వారై, ఆహార లేమిని బట్టి వారు చాలా బాధపడిరి.

20 లేమన్‌, లెముయెల్ మరియు ఇష్మాయెల్ కుమారులు అరణ్యములో వారి భాధలు, శ్రమలను బట్టి అత్యధికముగా సణుగుట మొదలుపెట్టిరి; నా తండ్రి కూడా తన దేవుడైన ప్రభువుకు వ్యతిరేకముగా సణగనారంభించెను; ప్రభువుకు వ్యతిరేకముగా సణుగునంత అత్యధికముగా వారందరు దుఃఖపడిరి.

21 ఇప్పుడు నా విల్లు విరిగిపోయినందున, వారి వింటినారలు తెగిపోయినందున నీఫైయను నేను నా సహోదరుల చేత బాధించబడితిని. మరియు మేము ఆహారము సంపాదించుట మిక్కిలి కష్టమవసాగెను.

22 నా సహోదరులు తమ దేవుడైన ప్రభువుకు వ్యతిరేకముగా ఫిర్యాదు చేయునంతగా తమ హృదయములను కఠినపరచుకొనినందువలన, నీఫైయను నేను వారితో అధికముగా మాట్లాడితిని.

23 నీఫైయను నేను కట్టెతో ఒక విల్లును, సన్నని కర్రతో ఒక బాణమును చేసితిని; అందువలన ఒక విల్లు మరియు బాణము, ఒక వడిసె మరియు రాళ్ళతో నన్ను నేను సన్నధుడను చేసుకొని, ఆహారమును సంపాదించుటకు నేనెక్కడికి వెళ్ళవలెను? అని నా తండ్రినడిగితిని.

24 అతడు ప్రభువును విచారించెను, ఏలయనగా నా ఆత్మ యొక్క శక్తితో నేను వారితో అనేక విషయములు చెప్పితిని గనుక నా మాటలను బట్టి వారు తమనుతాము తగ్గించుకొనిరి.

25 మరియు ప్రభువు స్వరము నా తండ్రికి వినబడెను; ప్రభువుకు వ్యతిరేకముగా సణుగుటను బట్టి దుఃఖపు లోతులలోనికి తేబడునంతగా అతడు నిజముగా గద్దింపబడెను.

26 ప్రభువు యొక్క స్వరము అతనితో—ఆ గోళముపై వ్రాయబడిన విషయములను చూడమని చెప్పెను.

27 నా తండ్రి ఆ గోళముపై వ్రాయబడిన విషయములను చూచినప్పుడు, అతడు భయపడి అత్యధికముగా కంపించెను. నా సహోదరులు, ఇష్మాయెల్ కుమారులు మరియు మా భార్యలు కూడా భయపడిరి.

28 ఆ గోళమందున్న సూచికల యెడల మేము చూపిన విశ్వాసము, శ్రద్ధ మరియు లక్ష్యములను బట్టి అవి పని చేసెనని నీఫైయను నేను చూచితిని.

29 వాటిపైన ఒక క్రొత్త వ్రాత కూడా వ్రాయబడియుండెను, అది చదువుటకు సులువుగా ఉండి, ప్రభువు మార్గములను గూర్చి మాకు గ్రహింపునిచ్చెను; మేము దానిపట్ల చూపిన విశ్వాసము, శ్రద్ధను బట్టి అది వ్రాయబడుచూ ఎప్పటికప్పుడు మార్పుచెందెను; ఆ విధముగా ప్రభువు చిన్న చర్య ద్వారా గొప్ప క్రియలను చేయగలడని మేము చూచితిమి.

30 నీఫైయను నేను ఆ గోళముపై ఇవ్వబడిన మార్గమును బట్టి పర్వతము పైకి వెళ్ళితిని.

31 నేను మా కుటుంబముల కొరకు ఆహారము సంపాదించునంతగా, అడవి మృగములను సంహరించితిని.

32 నేను సంహరించిన మృగములను మోసుకొని మా గుడారములకు తిరిగి వచ్చితిని. ఇప్పుడు నేను ఆహారము సంపాదించితినని వారు చూచినప్పుడు, వారు ఎంతో ఆనందించిరి. వారు ప్రభువు యెదుట తమనుతాము తగ్గించుకొని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి.

33 దాదాపుగా మేము మొదట ప్రయాణము చేసిన మార్గములోనే తిరిగి ప్రయాణించితిమి; మేము అనేక దినముల పాటు ప్రయాణము చేసిన తరువాత, కొంతకాలము పాటు మేము నిలిచియుండునట్లు మా గుడారములు తిరిగి వేసుకొంటిమి.

34 ఆ తరువాత ఇష్మాయెల్ మరణించెను, నాహోమ్ అని పిలువబడిన స్థలములో పాతిపెట్టబడెను.

35 ఇష్మాయెల్ కుమార్తెలు తమ తండ్రిని కోల్పోవుటను బట్టి, అరణ్యములో వారి శ్రమలను బట్టి అత్యధికముగా దుఃఖించిరి; నా తండ్రి వారిని యెరూషలేము దేశము నుండి తీసుకొని వచ్చినందున, వారు నా తండ్రికి వ్యతిరేకముగా ఇట్లనుచూ సణిగిరి: మా తండ్రి మరణించెను; మేము అరణ్యములో చాలా తిరుగులాడితిమి, అధిక శ్రమ, ఆకలి, దాహము, అలసటతో బాధపడితిమి; ఈ బాధలన్నిటిని అనుభవించి మేము అరణ్యములో ఆకలితో నశించి పోవలసియున్నది.

36 వారు ఆ విధముగా నాకు, నా తండ్రికి వ్యతిరేకముగా సణిగిరి; వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళవలెనను కోరికతోనుండిరి.

37 అప్పుడు లేమన్‌, లెముయెల్‌తో మరియు ఇష్మాయెల్ కుమారులతో ఇట్లనెను: ఇదిగో మన తండ్రిని మరియు అతని అన్నలమైన మనపై అధికారిగా, ఉపదేశకునిగా ఉండదలచిన మన సహోదరుడైన నీఫైని కూడా మనము సంహరించెదము.

38 ఇప్పుడు ప్రభువు అతనితో మాట్లాడియున్నాడని, దేవదూతలు అతనికి పరిచర్య చేసియున్నారని అతడు చెప్పుచున్నాడు. కానీ, అతడు మనతో అబద్ధమాడుచున్నాడని మనమెరుగుదుము. బహుశా మనలను ఏదో ఒక తెలియని అరణ్యములోనికి నడిపించాలని తలంచుచూ, మన కన్నులను మోసగించాలని అతడు మనతో ఈ మాటలు చెప్పుచూ, యుక్తితో కూడిన విద్యలతో అనేక కార్యములు చేయుచున్నాడు; అతడు మనలను నడిపించిన తరువాత అతని ఇచ్ఛానుసారము మనతో వ్యవహరించునట్లు, మనపై తననుతాను ఒక రాజుగా, అధికారిగా చేసుకొనవలెనని తలంచియున్నాడు. ఈ విధముగా నా సహోదరుడైన లేమన్‌ వారి హృదయములలో కోపము రేపెను.

39 కానీ ప్రభువు మాతోనుండెను, ప్రభువు యొక్క స్వరము వచ్చి వారితో అనేక మాటలు పలికి, వారిని అత్యధికముగా గద్దించెను. వారు ప్రభువు యొక్క స్వరముచేత గద్దించబడిన తరువాత, మేము నశించకుండునట్లు ప్రభువు మమ్ములను తిరిగి ఆహారముతో ఆశీర్వదించునంతగా వారు తమ కోపమును విడిచిపెట్టి, తమ పాపములను బట్టి పశ్చాత్తాపపడిరి.