లేఖనములు
1 నీఫై 17


17వ అధ్యాయము

ఒక ఓడను నిర్మించవలెనని నీఫై ఆజ్ఞాపించబడును—అతని సహోదరులు అతడిని వ్యతిరేకించెదరు—ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారముల చరిత్రను వివరించి అతడు వారికి ఉద్భోధించును—నీఫై దేవుని శక్తితో నింపబడును—వారు ఒక ఎండిన రెల్లువలే వాడిపోకుండా ఉండునట్లు అతని సహోదరులు అతడిని ముట్టకుండా నిషేధింపబడిరి. సుమారు క్రీ. పూ. 592–591 సం.

1 మరలా మేము అరణ్యములో మా ప్రయాణము సాగించితిమి; ఆ సమయము నుండి మేము దాదాపు తూర్పు దిక్కుగా ప్రయాణము చేసితిమి. మేము ప్రయాణము చేయుచూ అరణ్యములో చాలా శ్రమలను ఎదుర్కొంటిమి; మా స్త్రీలు అరణ్యములో పిల్లలను కనిరి.

2 మాపై ప్రభువు యొక్క ఆశీర్వాదములు ఎంత గొప్పగా ఉండెననగా, అరణ్యములో మేము పచ్చి మాంసము తిని జీవించినప్పటికీ, మా స్త్రీలు తమ పిల్లలకు సమృద్ధిగా స్తన్యమిచ్చిరి మరియు పురుషులవలే బలముగానుండిరి; వారు సణగకుండా వారి ప్రయాణ భారమునోర్చుకొనుట మొదలుపెట్టిరి.

3 ఆ విధముగా దేవుని ఆజ్ఞలు నెరవేరబడవలెనని మనము చూచుచున్నాము; నరుల సంతానము దేవుని ఆజ్ఞలను పాటించిన యెడల, ఆయన వారిని పోషించును, వారిని బలపరుచును మరియు ఆయన వారికి ఆజ్ఞాపించిన కార్యమును వారు నెరవేర్చగలుగునట్లు సాధనమును దయచేయును; అందువలన అరణ్యములో మేము ప్రయాణము చేసినప్పుడు, ఆయన మాకు సాధనము దయచేసెను.

4 మేము అనేక సంవత్సరముల పాటు ప్రయాణము చేసితిమి. అవును, ఎనిమిది సంవత్సరములు అరణ్యములో ప్రయాణము చేసితిమి.

5 అధికమైన దాని ఫలము మరియు అడవి తేనెను బట్టి సమృద్ధి అని మేము పిలిచిన దేశమునకు మేము వచ్చితిమి; ఈ వస్తువులన్నియు మేము నశించిపోకుండునట్లు ప్రభువు చేత సిద్ధపరచబడినవి. మేము సముద్రమును చూచి దానిని ఇర్రియాంటమ్ అని పిలిచితిమి, అనగా విస్తార జలములని అర్థము.

6 సముద్రము ఒడ్డున మేము గుడారములను వేసుకొంటిమి. మేము వ్రాయలేనన్ని శ్రమలు, కష్టాలనేకము అనుభవించినప్పటికీ సముద్రము ఒడ్డునకు వచ్చినప్పుడు మేము అత్యధికముగా ఆనందించితిమి. అధికమైన దాని ఫలమును బట్టి ఆ స్థలమును మేము సమృద్ధియని పిలిచితిమి.

7 నీఫైయను నేను అనేక దినముల పాటు సమృద్ధిదేశములో ఉండిన తరువాత, ప్రభువు యొక్క స్వరము నాతో—లెమ్ము, నీవు పర్వతముపైకి వెళ్ళుమనెను. నేను లేచి, పర్వతముపైకి వెళ్ళి ప్రభువుకు మొరపెట్టితిని.

8 ప్రభువు నాతో మాట్లాడి ఇట్లనెను: నీ జనులను ఈ జలముల మీదుగా నేను తీసుకొనిపోవునట్లు, నేను నీకు చూపబోవు విధముగా నీవు ఒక ఓడను నిర్మించవలెను.

9 మరియు నేను చెప్పితిని: ప్రభువా, నీవు నాకు చూపిన విధముగా నేను ఓడను నిర్మించుటకు పనిముట్లను చేయునట్లు కరిగించుటకు ముడి లోహమును కనుగొనుటకు నేను ఎక్కడికి వెళ్ళవలెను?

10 నేను పనిముట్లు చేయునట్లు ముడి లోహమును కనుగొనుటకు నేనెక్కడికి వెళ్ళవలెనో ప్రభువు నాతో చెప్పెను.

11 నీఫైయను నేను నిప్పును ఊదుటకు మృగముల చర్మములతో కొలిమి తిత్తులను తయారు చేసితిని, నిప్పును ఊదుటకు సాధనము కలిగియుండునట్లు నేను ఒక కొలిమి తిత్తిని చేసిన తరువాత నిప్పును చేయునట్లు నేను రెండు రాళ్ళను కలిపి కొట్టితిని.

12 మేము అరణ్యములో ప్రయాణము చేయుచుండగా, ప్రభువు మమ్ములను ఇప్పటి వరకు ఎక్కువగా నిప్పును చేయనివ్వలేదు; ఏలయనగా, మీరు దానిని వండకుండునట్లు నేను మీ ఆహారమును మధురముగా చేసెదనని ఆయన చెప్పెను;

13 అరణ్యములో నేను మీకు వెలుగుగా కూడా ఉందును; మీరు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము నేను మీ యెదుట మార్గమును సిద్ధపరిచెదను; అందువలన, మీరు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు వాగ్దానదేశమునకు నడిపింపబడుదురు; మరియు మీరు నడిపింపబడినది నా చేతనేయని మీరు తెలుసుకొందురనెను.

14 ప్రభువు ఇంకను ఇట్లు చెప్పెను: మీరు వాగ్దానదేశములోనికి ప్రవేశించిన తరువాత, ప్రభువునైన నేను దేవుడననియు; ప్రభువునైన నేను మిమ్ములను నాశనము నుండి రక్షించితిననియు; యెరూషలేము దేశము నుండి నేను మిమ్ములను తీసుకొని వచ్చితిననియు మీరు తెలుసుకొందురు.

15 అందువలన నీఫైయను నేను, ప్రభువు ఆజ్ఞలను పాటించుటకు ప్రయాసపడితిని మరియు విశ్వాస్యతను, శ్రద్ధను కలిగియుండునట్లు నా సహోదరులకు ఉద్భోధించితిని.

16 ఒక బండ నుండి కరిగించిన ముడి లోహముతో నేను పనిముట్లను చేసితిని.

17 నేనొక ఓడను నిర్మించబోవుచున్నానని నా సహోదరులు చూచినప్పుడు, వారు ఇట్లనుచూ నాకు వ్యతిరేకముగా సణుగుట మొదలుపెట్టిరి: మా సహోదరుడు ఒక అవివేకి. ఏలయనగా, తాను ఒక ఓడను నిర్మించగలడని, ఈ గొప్ప జలములను దాటగలడని కూడా అతడు తలంచుచున్నాడు;

18 ఆ విధముగా నా సహోదరులు నాకు వ్యతిరేకముగా ఫిర్యాదు చేసిరి, వారు శ్రమించరాదను కోరికగల వారైయుండిరి. ఏలయనగా, నేను ఒక ఓడను నిర్మించగలనని వారు విశ్వసించలేదు. నేను ప్రభువు చేత ఆజ్ఞాపించబడితినని వారు నమ్మలేదు.

19 ఇప్పుడు నీఫైయను నేను వారి హృదయ కాఠిన్యమును బట్టి అత్యధికముగా దుఃఖపడితిని; నేను దుఃఖపడుతున్నానని చూచినప్పుడు, వారు తమ హృదయములందు ఆనందించిరి. ఎంతగాననగా, వారు నాపై ఆనందించుచూ ఇట్లనిరి: నీవు ఆ ఓడను నిర్మించలేవని మేమెరుగుదుము. ఏలయనగా, నీకు వివేచన లేదని మేమెరుగుదుము. అందువలన, నీవు ఇంత గొప్ప పనిని నెరవేర్చలేవు.

20 నీవు, తన హృదయుము యొక్క అవివేకపు ఊహలను బట్టి నడిపింపబడ్డ మన తండ్రి వలే ఉన్నావు. అతడు మనలను యెరూషలేము దేశము నుండి బయటకు నడిపించెను మరియు అనేక సంవత్సరములు అరణ్యములో మనము తిరుగులాడితిమి; మన స్త్రీలు గర్భముతో నుండి శ్రమపడిరి; అరణ్యములో వారు పిల్లలను కనిరి, మరణము తప్ప సకల విధములైన బాధలను అనుభవించిరి; ఈ శ్రమలన్నియు పొందుట కంటే వారు యెరూషలేము నుండి బయటకు రాకమునుపే చనిపోయి ఉండుట మేలైయుండును.

21 ఇన్ని సంవత్సరములు మనము అరణ్యములో బాధపడితిమి. ఇదే సమయములో మన స్వాస్థ్యమైన దేశమును, మన ఆస్థులను మనము అనుభవించి, సంతోషముగా ఉండెడివారము.

22 యెరూషలేము దేశమందున్న జనులు నీతిమంతులని మేమెరుగుదుము. ఏలయనగా, మోషే ధర్మశాస్త్రము ప్రకారము వారు ప్రభువు కట్టడలను, తీర్పులను మరియు ఆయన యొక్క సమస్త ఆజ్ఞలను పాటించిరి. అందువలన, వారు నీతిమంతులని మేమెరుగుదుము. మన తండ్రి వారిని ఖండించెను, అతని మాటలను మనము ఆలకించెదము గనుక మనలను దూరముగా నడిపించి వేసెను. మన సహోదరుడు కూడా అటువంటి వాడే; ఈ విధమైన భాషతో నా సహోదరులు నాకు వ్యతిరేకముగా సణుగుచూ ఫిర్యాదు చేసిరి.

23 నీఫైయను నేను వారితో ఇట్లంటిని: ఇశ్రాయేలు సంతానమైన మన పితరులు ప్రభువు మాటలను ఆలకించని యెడల, ఐగుప్తీయుల చేతులలో నుండి దూరముగా నడిపింపబడియుందురని మీరు నమ్ముచున్నారా?

24 వారిని దాస్యములో నుండి బయటకు నడిపించవలెనని ప్రభువు మోషేను ఆజ్ఞాపించియుండని యెడల, వారు దాస్యము నుండి బయటకు నడిపించబడియుందురని మీరు అనుకొనుచున్నారా?

25 ఇప్పుడు, ఇశ్రాయేలు సంతానము దాస్యములో ఉండెనని మీరెరుగుదురు. భరించుటకు కష్టమైన పనులను వారిపై మోపిరని మీరెరుగుదురు. అందువలన, వారు దాస్యములో నుండి విడిపించబడుట వారి కొరకు ఖచ్చితముగా ఒక మంచి కార్యమైయుండెనని మీరెరుగుదురు.

26 మోషే ఆ గొప్ప పనిని చేయుటకు ప్రభువు ద్వారా ఆజ్ఞాపించబడెనని మీరెరుగుదురు. అతని మాట ద్వారా ఎఱ్ఱసముద్రపు జలములు అటు ఇటు విభజింపబడెనని, వారు ఆరిన నేలపై నడిచిరని మీరెరుగుదురు.

27 కానీ, ఫరో సైన్యములైన ఐగుప్తీయులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరని మీరెరుగుదురు.

28 అరణ్యములో వారు మన్నాతో పోషింపబడిరని కూడా మీరెరుగుదురు.

29 అతనియందున్న దేవుని శక్తిని బట్టి తన మాట చేత మోషే బండను కొట్టగా, ఇశ్రాయేలు సంతానము తమ దప్పికను తీర్చుకొనునట్లు జలము బయటకు వచ్చెనని కూడా మీరెరుగుదురు.

30 ప్రభువైన దేవుడు, వారి విమోచకుడు వారి ముందు వెళ్ళుచూ పగటి యందు వారిని నడిపించుచూ రాత్రియందు వారికి వెలుగునిచ్చుచూ మనుష్యులకు అవసరమైన అన్నికార్యములను వారి కొరకు చేయుచూ వారిని నడిపించినప్పటికీ, వారు తమ హృదయములను కఠినపరచుకొని, తమ మనస్సులను గ్రుడ్డిగా చేసుకొని మోషేకు వ్యతిరేకముగా, నిజమైన మరియు సజీవుడైన దేవునికి వ్యతిరేకముగా దూషించిరి.

31 ఆయన వాక్యము ప్రకారము, ఆయన వారిని నాశనము చేసెను; ఆయన వాక్యము ప్రకారము, ఆయన వారిని నడిపించెను; ఆయన వాక్యము ప్రకారము, ఆయన సమస్త కార్యములను వారి కొరకు చేసెను; ఆయన వాక్కు లేకుండా ఏ కార్యము జరుగలేదు.

32 వారు యొర్దాను నదిని దాటిన తరువాత, ఆ దేశ జనులను బయటకు తరిమి వేయునంతగా, వారిని నాశనమునకు చెదరగొట్టునంతగా ఆయన వారిని బలవంతులుగా చేసెను.

33 ఇప్పుడు, ఈ వాగ్దానదేశములో ఉండి మన పితరులచే తరిమివేయబడిన ఈ దేశ జనులు నీతిమంతులని మీరు తలంచుచున్నారా? కాదని నేను మీతో చెప్పుచున్నాను.

34 వారు నీతిమంతులైయుండిన యెడల వారికి బదులు మన పితరులు ఎన్నుకోబడి ఉండేవారని మీరు తలంచుచున్నారా? కాదని నేను మీతో చెప్పుచున్నాను.

35 ప్రభువు సమస్త శరీరులను ఏకరీతిగా భావించును; నీతిమంతుడైన వాడు దేవుని అనుగ్రహము పొందును. కానీ, ఈ జనులు దేవుని వాక్యమును తిరస్కరించి దోషములో పండిపోయియుండిరి; దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రత వారిపై ఉండెను; ప్రభువు ఆ దేశమును వారికి వ్యతిరేకముగా శపించి, మన పితరుల కొరకు దానిని ఆశీర్వదించెను; వారి నాశనము నిమిత్తము వారికి వ్యతిరేకముగా ఆయన దానిని శపించి, దానిపై అధికారము సంపాదించునట్లు మన పితరుల కొరకు ఆయన దానిని ఆశీర్వదించెను.

36 ఇదిగో, మనుష్యులు నివాసముండుటకై ప్రభువు భూమిని మరియు దానిని స్వాధీన పరచుకొనవలెనని ఆయన తన పిల్లలను సృష్టించెను.

37 నీతిగల జనమును ఆయన హెచ్ఛించును, దుష్ట జనములను నాశనము చేయును.

38 నీతిమంతులను శ్రేష్ఠమైన దేశములోనికి నడిపించును, దుష్టులను ఆయన నాశనము చేసి, వారి నిమిత్తము దేశమును శపించును.

39 ఆయన అత్యున్నత పరలోకమందు పరిపాలించును. ఏలయనగా, అది ఆయన సింహాసనము మరియు ఈ భూమి ఆయన పాదపీఠము.

40 ఆయనను తమ దేవునిగా అంగీకరించు వారిని ఆయన ప్రేమించును. ఆయన మన పితరులను ప్రేమించెను. ఆయన వారితో, అనగా అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులతో నిబంధన చేసెను; తాను చేసిన నిబంధనలను ఆయన జ్ఞాపకము చేసుకొనెను; అందువలన, ఆయన వారిని ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొని వచ్చెను.

41 వారిని అరణ్యములో తన దండముతో ఆయన శిక్షించెను; ఏలయనగా, మీరు చేసినట్లే వారు కూడా తమ హృదయములను కఠినపరచుకొనిరి. వారి దుష్టత్వమును బట్టి ఆయన వారిని శిక్షించెను. ఆయన భయంకరమైన ఎగిరే సర్పములను వారి మధ్యకు పంపించెను; వారు కరవబడిన తరువాత, స్వస్థత పొందునట్లు ఆయన ఒక మార్గమును సిద్ధపరిచెను; వారు చేయవలసిన పని చూచుటయే; ఆ మార్గము సరళముగా లేదా సులువుగా ఉండుటను బట్టి అనేకమంది నశించిపోయిరి.

42 ఎప్పటికప్పుడు వారు తమ హృదయములను కఠినపరచుకొని, మోషేకు వ్యతిరేకముగా మరియు దేవునికి వ్యతిరేకముగా దూషించిరి. అయినప్పటికీ, సాటిలేని ఆయన శక్తి ద్వారా వారు వాగ్దానదేశములోనికి నడిపింపబడిరని మీరెరుగుదురు.

43 ఇప్పుడు, ఈ కార్యములన్నిటి తరువాత, వారి దుష్టత్వము పక్వమునకు వచ్చు సమయము ఆసన్నమాయెను; ఈ దినమున వారు నాశనము కాబోవుచున్నారని నేననుకొనుచున్నాను; ఏలయనగా, చెరలోనికి దూరముగా కొనిపోబడు కొద్దిమంది తప్ప వారు నాశనమగు దినము తప్పక రావలెనని నేనెరుగుదును.

44 అందువలన, అరణ్యములోనికి వెళ్ళిపోవలెనని ప్రభువు నా తండ్రిని ఆజ్ఞాపించెను; యూదులు అతని ప్రాణమును తీసివేయుటకు ప్రయత్నించిరి. మీరు కూడా అతని ప్రాణమును తీసివేయుటకు ప్రయత్నించిరి; అందువలన, మీ హృదయములలో మీరు హంతకులు మరియు మీరు వారిలాంటి వారు.

45 మీరు దుష్టత్వము చేయుటకు వేగముగానుండిరి, మీ దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు వెనుకాడిరి. మీరు ఒక దేవదూతను చూచియుంటిరి, అతడు మీతో మాటలాడెను. అంతేకాకుండా, ఎప్పటికప్పుడు మీరు అతని స్వరమును వినియుంటిరి. అతడు, మీతో మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరముతో మాట్లాడియుండెను. కానీ, మీరు ఇంద్రియజ్ఞానమును కోల్పోయియున్నారు, కాబట్టి అతని మాటలను గ్రహించలేకపోతిరి. అందువలన, అతడు ఉరుము వంటి స్వరముతో మీతో మాట్లాడెను, అది భూమి కంపించి ముక్కలుగా విడిపోవునట్లు చేసెను.

46 సర్వశక్తివంతమైన తన వాక్యపు శక్తి ద్వారా ఆయన భూమిని గతించిపోవునట్లు చేయగలడని మీరెరుగుదురు; తన వాక్యము ద్వారా ఆయన గరుకైన స్థలములను నునుపుగాను, నున్ననైన స్థలములను ముక్కలగునట్లు చేయగలడని మీరెరుగుదురు. అయ్యో, అప్పుడు మీరెందుకు మీ హృదయములందు అంత కఠినముగా ఉండగలుగుచున్నారు?

47 మీ మూలముగా నా ఆత్మ వేదనకు లోనగుచున్నది, నా హృదయము బాధపడుచున్నది; మీరు శాశ్వతముగా త్రోసివేయబడుదురేమోనని నేను భయపడుచున్నాను. నా శరీరము శక్తిహీనమగునంతగా నేను దేవుని ఆత్మతో నిండియున్నాను.

48 నేను ఈ మాటలు పలికినప్పుడు, వారు నాపై కోపము తెచ్చుకొని నన్ను సముద్రపు లోతులలోనికి పడవేయవలెనను కోరికతోనుండి, నన్ను పట్టుకొనుటకు ముందుకు వచ్చినప్పుడు నేను వారితో ఇట్లంటిని: నన్ను తాకవద్దని సర్వశక్తిమంతుడైన దేవుని నామమున నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను. ఏలయనగా, నా శరీరమును హరించి వేయునంతగా నేను దేవుని శక్తితో నిండియున్నాను; నన్ను పట్టుకొనువాడు ఎండిన రెల్లువలే వాడిపోవును; దేవుని శక్తి యెదుట అతడు వ్యర్థునిగా ఉండును. ఏలయనగా, దేవుడు అతడిని మొత్తును.

49 వారు తమ తండ్రికి వ్యతిరేకముగా ఇక ఏ మాత్రము సణగరాదని, వారి సహాయమును నా నుండి ఉపసంహరించరాదని నీఫైయను నేను వారితో చెప్పితిని. ఏలయనగా, నేను ఒక ఓడను నిర్మించవలెనని దేవుడు నన్ను ఆజ్ఞాపించెను.

50 నేను వారితో ఇట్లు చెప్పితిని: దేవుడు నన్ను చేయమని ఆజ్ఞాపించిన కార్యములన్నిటిని నేను చేయగలను. ఈ నీటితో నీవు నేల అవ్వమని నేను చెప్పవలెనని ఆయన నన్ను ఆజ్ఞాపించిన యెడల, అది నేల అయిపోవును మరియు నేను అట్లు పలికిన యెడల అది జరుగును.

51 ప్రభువు అట్టి గొప్ప శక్తిని కలిగియున్న యెడల, నరుల సంతానము మధ్య అనేకమైన అద్భుతములు చేసిన యెడల, నేను ఒక ఓడను నిర్మించవలెనని ఆయన నన్ను ఎందుకు ఆదేశించలేడు?

52 వారి గర్వమణచబడి నాకు వ్యతిరేకముగా వాదించలేనంతగా నా సహోదరులతో నీఫైయను నేను అనేక విషయములు చెప్పితిని; అనేక దినములపాటు నన్ను పట్టుకొనుటకు గాని, తమ వ్రేళ్ళతో నన్ను తాకుటకు గాని వారు ధైర్యము చేయలేకయుండిరి. వారు నా యెదుట వాడిపోవుదురని భయపడి అట్లు చేయుటకు ధైర్యము చేయలేదు. దేవుని ఆత్మ అంత బలముగా ఉండెను; ఆ విధముగా అది వారిపై పనిచేసెను.

53 అప్పుడు ప్రభువు నాతో చెప్పెను: నీ చేతిని తిరిగి నీ సహోదరుల వైపు చాపుము, వారు నీ యెదుట వాడిపోకయుందురు. కానీ, వారు అదురునట్లు నేను చేసెదను. నేను వారి దేవుడనైన ప్రభువునని వారు తెలుసుకొనునట్లు నేనిది చేయుదునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

54 నేను నా చేతిని నా సహోదరుల వైపు చాపితిని మరియు వారు నా యెదుట వాడిపోలేదు. కానీ, ఆయన పలికిన మాట ప్రకారము ప్రభువు వారిని వణికించెను.

55 ఇప్పుడు వారు ఇట్లనిరి: ప్రభువు నీతో ఉన్నాడని మేము నిశ్చయముగా ఎరిగియున్నాము, ఏలయనగా మమ్ములను వణికించినది ప్రభువు యొక్క శక్తియని మేమెరుగుదుము. మరియు వారు నా యెదుట సాగిలపడి నన్ను పూజించబోయిరి, కానీ నేను వారిని అట్లు చేయనీయక ఇట్లంటిని: నేను మీ సహోదరుడను, మీ తమ్ముడను; అందువలన, మీ దేవుడైన ప్రభువును పూజించుము; మీ దేవుడైన ప్రభువు మీకిచ్చు దేశములో మీరు ధీర్ఘాయుష్మంతులగునట్లు మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించుము.