లేఖనములు
1 నీఫై 1


నీఫై మొదటి గ్రంథము

అతని పరిపాలన మరియు పరిచర్య

లీహై, అతని భార్య శరయ, అతని నలుగురు కుమారులు (పెద్దవానితో మొదలుకొని) లేమన్‌, లెముయెల్, శామ్ మరియు నీఫై అని పిలువబడిన వారి వృత్తాంతము. ప్రభువు లీహైని యెరూషలేము దేశములో నుండి వెడలిపొమ్మని హెచ్చరించును, ఏలయనగా అతడు జనులకు వారి దోషములను గూర్చి ప్రవచించును, వారు అతని ప్రాణము తీయుటకు ప్రయత్నించుదురు. అతడు అరణ్యములోనికి తన కుటుంబముతో మూడు రోజుల ప్రయాణము చేయును. నీఫై తన సహోదరులను తీసుకొని, యూదుల వృత్తాంతము నిమిత్తము యెరూషలేము దేశమునకు తిరిగి వెళ్ళును. వారి శ్రమల యొక్క వృత్తాంతము ఇవ్వబడెను. వారు ఇష్మాయెల్ కుమార్తెలను భార్యలుగా తీసుకొందురు. వారు తమ కుటుంబములను తీసుకొని అరణ్యములోనికి వెడలిపోవుదురు. అరణ్యములో వారి శ్రమలు, బాధల యొక్క వృత్తాంతము, వారి ప్రయాణ మార్గము ఇవ్వబడెను. వారు విస్తారమైన జలముల యొద్దకు వచ్చెదరు. నీఫై సహోదరులు అతనికి వ్యతిరేకముగా తిరుగబడుదురు. అతడు వారి గర్వమును అణచి, ఒక ఓడను నిర్మించును. వారు ఆ స్థలమును సమృద్ధిస్థలము అని పిలుచుదురు. వారు వాగ్దానదేశములోనికి వెళ్ళుటకు విస్తారమైన జలములను దాటుట మరియు మొదలైనవి వివరించబడినవి. ఇది నీఫై వృత్తాంతము ప్రకారము వ్రాయబడినది; లేదా మరొక మాటలలో, నీఫై అను నేను ఈ వృత్తాంతమును వ్రాసితిని.

1వ అధ్యాయము

నీఫై తన జనుల వృత్తాంతమును ప్రారంభించును—లీహై దర్శనమందు ఒక అగ్ని స్తంభమును చూచును మరియు ఒక ప్రవచన గ్రంథము నుండి చదువును—అతడు దేవుని స్తుతించును, మెస్సీయ రాకడను ముందుగా చెప్పును, యెరూషలేము నాశనమును గూర్చి ప్రవచించును—అతడు యూదులచే హింసించబడును. సుమారు క్రీ. పూ. 600 సం.

1 మంచి తల్లిదండ్రులకు జన్మించిన నీఫై అను నేను, నా తండ్రి జ్ఞానమంతటిలో కొంత వరకు బోధింపబడితిని, నా జీవిత కాలములో అనేక బాధలను చూచినప్పటికీ, నా దినములన్నిటిలో ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడితిని. ముఖ్యముగా దేవుని మంచితనము, మర్మముల యొక్క గొప్ప జ్ఞానమును కలిగియుండినందువలన నేను నా దినములలో నా కార్యముల వృత్తాంతమును వ్రాయుచున్నాను.

2 నేను ఈ వృత్తాంతమును నా తండ్రి భాషలో వ్రాయుచున్నాను. అది యూదుల ప్రావీణ్యముతో కూడిన ఐగుప్తీయుల భాషను కలిగియున్నది.

3 నేను వ్రాయుచున్న వృత్తాంతము నిజమైనదని నేనెరుగుదును; నేను దానిని నా స్వహస్తముతో వ్రాయుచున్నాను; నేను దానిని నా జ్ఞానమును బట్టి వ్రాయుచున్నాను.

4 ఏలయనగా, యూదా రాజైన సిద్కియా పరిపాలన యొక్క మొదటి సంవత్సరపు ఆరంభములో ఇది జరిగెను (నా తండ్రి లీహై తన దినములన్నిటిలో యెరూషలేము నందు నివసించెను); ఆ సంవత్సరములో అనేకమంది ప్రవక్తలు—జనులు తప్పక పశ్చాత్తాపపడవలెనని, లేనియెడల ఆ మహా పట్టణమైన యెరూషలేము నాశనము చేయబడునని ప్రవచించుచూ అక్కడకు వచ్చిరి.

5 అందువలన నా తండ్రి లీహై ముందుకుసాగి ప్రభువును ప్రార్థించెను. అంతేకాకుండా తన జనుల నిమిత్తము తన పూర్ణ హృదయముతో ప్రార్థించెను.

6 అతడు ప్రభువును ప్రార్థించుచుండగా అక్కడకు ఒక అగ్ని స్తంభము వచ్చి, అతని యెదుట ఒక బండపై నిలిచెను; అతడు అనేక విషయములను చూచెను, వినెను; తాను చూచిన, వినిన దర్శనములను బట్టి అతడు అధికముగా కంపించి వణికెను.

7 తరువాత, అతడు యెరూషలేమునందున్న తన స్వగృహమునకు తిరిగి వచ్చి ఆత్మ చేతను, తను చూచిన దర్శనములను బట్టి జయించబడినవాడై తన పడకమీద పడెను.

8 ఆ విధముగా ఆత్మ చేత జయించబడినవాడై, అతడు ఒక దర్శనమునందు కొనిపోబడి పరలోకము తెరువబడియుండుటను కూడా చూచెను, దేవుడు తన సింహాసనముపై కూర్చునియుండగా వారి దేవుడిని కీర్తించి, స్తుతించు ధోరణిలో లెక్కలేనన్ని దేవదూతల సమూహములు ఆయనను చుట్టియుండుటను తాను చూచితినని అతడికి అనిపించెను.

9 తరువాత, పరలోకము మధ్య నుండి ఒక వ్యక్తి దిగుచుండుటను, ఆయన తేజము మధ్యాహ్నకాలపు సూర్యుని కన్నా అధికముగా ఉండుటను అతడు చూచెను.

10 పన్నెండుమంది ఇతరులు ఆయనను వెంబడించుట కూడా అతడు చూచెను. వారి ప్రకాశము ఆకాశవిశాలమందలి నక్షత్రముల ప్రకాశమును అధిగమించెను.

11 వారు క్రిందికి వచ్చి, భూముఖముపై ముందుకు సాగిరి; మొదటి వ్యక్తి వచ్చి నా తండ్రి యెదుట నిలిచి, అతనికి ఒక గ్రంథమునిచ్చి, దానిని అతడు చదువవలెనని ఆజ్ఞాపించెను.

12 అతడు చదువుచుండగా, అతడు ప్రభువు యొక్క ఆత్మతో నింపబడెను.

13 అతడు ఇట్లనుచూ చదివెను: ఆపద, యెరూషలేమునకు ఆపద, ఏలయనగా నేను నీ హేయక్రియలను చూచితిని! అని యెరూషలేమును గూర్చి నా తండ్రి అనేక విషయములను చదివెను—అది, దాని నివాసులు నాశనము చేయబడవలెనని, అనేకులు ఖడ్గము చేత నశించవలెనని, అనేకులు బబులోనుకు చెరగా కొనిపోబడవలెనని చెప్పెను.

14 తరువాత నా తండ్రి చదివి, గొప్పవైన అనేక అద్భుత దృశ్యములను చూచినప్పుడు అతడు ప్రభువుకు అనేక వాక్యములు ఎలుగెత్తి చెప్పెను; అవేవనగా, ఓ ప్రభువా, సర్వశక్తిమంతుడవైన దేవా! నీ క్రియలు గొప్పవి, అద్భుతమైనవి. పరలోకములలో నీ సింహాసనము ఉన్నతమైనది. నీ శక్తి, మంచితనము మరియు కనికరము భూనివాసులందరిపై ఉన్నవి; నీవు కనికరముగల వాడవు గనుక నీ యొద్దకు వచ్చు వారిని నీవు నశింపనీయవు.

15 తన దేవుని స్తుతించుటలో నా తండ్రి యొక్క భాష ఈ విధముగానుండెను. ఏలయనగా అతడు చూచిన దృశ్యములను బట్టి అనగా ప్రభువు అతనికి చూపిన వాటిని బట్టి అతని ఆత్మ ఆనందించెను, అతని హృదయమంతా నింపబడెను.

16 ఇప్పుడు నీఫై అను నేను, నా తండ్రి వ్రాసిన విషయముల యొక్క పూర్తి వృత్తాంతమును వ్రాయుట లేదు. ఏలయనగా దర్శనములందు, స్వప్నములందు తాను చూచిన అనేక విషయములను అతడు వ్రాసియుండెను; తన సంతానమునకు ప్రవచించిన మరియు పలికిన అనేక విషయములను కూడా అతడు వ్రాసియుండెను. వాటిని గూర్చిన పూర్తి వృత్తాంతమును నేను వ్రాయుటలేదు.

17 కానీ నా దినములలో నా కార్యముల వృత్తాంతమును నేను వ్రాసెదను, ఇదిగో నేను నా తండ్రి వృత్తాంతము యొక్క సంక్షేపమును నా స్వహస్తములతో చేసిన పలకలపైన వ్రాయుదును; కాబట్టి, నేను నా తండ్రి వృత్తాంతమును సంక్షేపము చేసిన తరువాత, నా స్వంత జీవిత వృత్తాంతమును నేను వ్రాయుదును.

18 అందువలన, ప్రభువు నా తండ్రి లీహైకి యెరూషలేము యొక్క నాశనమును గూర్చి అనేక ఆశ్చర్యకరమైన దృశ్యములను చూపిన తరువాత, అతడు జనుల మధ్య ముందుకు వెళ్ళుచూ తాను చూచిన, వినిన దర్శనములను గూర్చి వారికి ప్రవచించుట, ప్రకటించుట మొదలు పెట్టెనని మీరు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను.

19 అతడు వారిని గూర్చి సాక్ష్యమిచ్చిన విషయములను బట్టి యూదులు అతడిని ఎగతాళి చేసిరి. ఏలయనగా అతడు వారి దుర్మార్గమును గూర్చి, వారి హేయక్రియలను గూర్చి నిజముగా సాక్ష్యమిచ్చెను. తాను చూచిన, వినిన దర్శనములు మరియు తాను గ్రంథములో చదివిన వాక్యములు మెస్సీయ రాకడను, లోక విమోచనను స్పష్టముగా విశదపరచెనని కూడా అతడు సాక్ష్యమిచ్చెను.

20 యూదులు ఈ వాక్యములను వినినప్పుడు, వారు ప్రాచీన ప్రవక్తలపై కోపముగానుండి వారిని బయటకు గెంటి వేసి, రాళ్ళతో కొట్టి హతమార్చిన విధముగానే అతనిపై కోపముతో అతని ప్రాణమును కూడా తీయుటకు ప్రయత్నించిరి. కానీ వారి విశ్వాసమును బట్టి విడుదల యొక్క శక్తిని పొందునట్లు, వారిని బలపరచుటకు ప్రభువు యొక్క మృదు కనికరములు ఆయన ఏర్పరచుకొనిన వారందరి మీద ఉండునని నీఫై అను నేను మీకు చూపెదను.