లేఖనములు
1 నీఫై 22


22వ అధ్యాయము

ఇశ్రాయేలీయులు భూముఖమంతటిపై చెదరగొట్టబడుదురు—అంత్యదినములలో అన్యజనులు ఇశ్రాయేలీయులను సువార్తతో సంరక్షించి, పోషించుదురు—ఇశ్రాయేలీయులు సమకూర్చబడి రక్షింపబడుదురు, దుర్మార్గులు కొయ్యకాలు వలె కాలుదురు—అపవాది రాజ్యము నాశనము చేయబడును, సాతాను బంధించబడును. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 కంచు పలకలపై చెక్కబడియున్న ఈ విషయములను నీఫైయను నేను చదివి వినిపించిన తరువాత, నా సహోదరులు నా యొద్దకు వచ్చి ఇట్లనిరి: నీవు చదివిన ఈ విషయముల అర్థమేమి? శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా జరుగు ఆత్మీయ విషయముల ప్రకారము అవి అర్థము చేసుకొనబడవలెనా?

2 నీఫైయను నేను వారితో ఇట్లంటిని: ఆత్మ యొక్క స్వరము ద్వారా అవి ప్రవక్తకు విశదపరచబడియున్నవి; ఏలయనగా, శరీరానుసారముగా నరుల సంతానముపై వచ్చు సమస్త విషయములు ఆత్మ ద్వారా ప్రవక్తలకు తెలియజేయబడియున్నవి.

3 అందువలన, నేను చదివి వినిపించిన విషయములు ఐహికమైన, ఆత్మ సంబంధమైన రెండింటికి చెందిన విషయములైయున్నవి; ఏలయనగా, త్వరగానైనా లేదా ఆలస్యముగానైనా ఇశ్రాయేలు వంశము భూముఖమంతటిపైన మరియు సమస్త జనముల మధ్య చెదరగొట్టబడునని అగుపడుచున్నది.

4 యెరూషలేములోనున్న వారి చేత మరచిపోబడిన వారు ఇదివరకే అనేకులున్నారు. సమస్త గోత్రములలో అధికభాగము దూరముగా నడిపింపబడియున్నారు; వారు సముద్ర ద్వీపములపై ఇటు అటు చెదిరిపోయియున్నారు; వారెక్కడ ఉన్నారో మనలో ఎవనికినీ తెలియదు, వారు దూరముగా నడిపింపబడియున్నారని మాత్రమే మనమెరుగుదుము.

5 వారు దూరముగా నడిపింపబడినప్పటి నుండి, ఇశ్రాయేలు పరిశుద్ధుని బట్టి ఈ విషయములు వారిని గూర్చి, ఇకపై చెదిరిపోవు మరియు ఉనికిని కోల్పోవు వారందరిని గూర్చి ప్రవచింపబడియున్నవి; ఏలయనగా, ఆయనకు వ్యతిరేకముగా వారు తమ హృదయములను కఠినపరచుకొందురు; అందువలన, వారు సమస్త జనముల మధ్య చెదరగొట్టబడుదురు మరియు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.

6 అయినప్పటికీ వారు అన్యజనుల చేత సంరక్షింపబడి, ప్రభువు అన్యజనులపై తన చేతిని ఎత్తి వారిని ఒక ధ్వజముగా నిలువబెట్టిన తరువాత, ఇశ్రాయేలు సంతానమును వారి రొమ్ముననుంచుకొని వచ్చెదరు, వారి కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. ఇదిగో చెప్పబడియున్న ఈ విషయములు ఐహికమైనవి; ఏలయనగా, మన పితరులతో ప్రభువు యొక్క నిబంధనలు అట్టివి; రాబోవు దినములలో మనకును మరియు ఇశ్రాయేలు వంశస్థులైన మన సహోదరులందరికినీ చెందినవి.

7 ఇశ్రాయేలు వంశమంతయూ చెదిరిపోయి, ఉనికిని కోల్పోయిన తరువాత అన్యజనుల మధ్య, ముఖ్యముగా ఈ భూముఖముపై ప్రభువైన దేవుడు ఒక బలమైన జనమును పుట్టించు సమయము వచ్చునని, వారి ద్వారా మన సంతానము చెదరగొట్టబడునని దీని అర్థము.

8 మన సంతానము చెదిరిపోయిన తరువాత, ప్రభువైన దేవుడు అన్యజనుల మధ్య ఒక అద్భుతకార్యము చేయుటకు కొనసాగును, అది మన సంతానమునకు అత్యంత విలువైనదిగా ఉండును; అందువలన, అది అన్యజనుల చేత వారు పోషింపబడుట మరియు వారి రొమ్ములపైన, వారి భుజముల మీద మోసుకొనిపోబడుటతో పోల్చబడినది.

9 ఆ కార్యము అన్యజనులకు విలువైనదిగా మరియు అన్యజనులకు మాత్రమే కాక ఇశ్రాయేలు వంశమంతటికీ విలువైనదిగా ఉండును. నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడునని చెప్పుచూ అబ్రాహాముతో పరలోక తండ్రి చేసిన నిబంధనలను తెలియజేయును.

10 నా సహోదరులారా, జనముల కన్నుల యెదుట ఆయన తన బాహువును బయలుపరచని యెడల, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడలేవని మీరు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను.

11 అందువలన, తన నిబంధనలను తన సువార్తను ఇశ్రాయేలు వంశస్థులకు తెచ్చుటలో సమస్త జనముల కన్నుల యెదుట ప్రభువైన దేవుడు తన బాహువును బయలుపరచుటకు కొనసాగును.

12 కావున, ఆయన వారిని చెర నుండి తిరిగి బయటకు రప్పించును మరియు వారు తమ స్వాస్థ్యమైన దేశములకు సమకూర్చబడుదురు; వారు అస్పష్టత నుండి, అంధకారము నుండి బయటకు తేబడుదురు; ప్రభువే వారి రక్షకుడని, వారి విమోచకుడని, ఇశ్రాయేలు యొక్క శక్తిమంతుడని వారు తెలుసుకొందురు.

13 మరియు సమస్త భూమి యొక్క వ్యభిచారిణి అయిన ఆ గొప్ప హేయకరమైన సంఘము యొక్క రక్తము వారిపైకి తిరిగివచ్చును; ఏలయనగా, వారు తమలోతాము యుద్ధములు చేయుదురు, వారి స్వంత ఖడ్గము వారిపైనే పడును, వారు తమ స్వంత రక్తముచేత మత్తులైయుందురు.

14 ఓ ఇశ్రాయేలు వంశమా, నీకు వ్యతిరేకముగా యుద్ధముచేయు ప్రతి జనము ఒక దానికి వ్యతిరేకముగా మరొకటి తిరుగుబాటు చేసి, ప్రభువు జనులను చిక్కించుకొనుటకు వారు త్రవ్విన గోతిలో వారే పడుదురు. సీయోనుకు వ్యతిరేకముగా యుద్ధము చేయువారందరు నాశనము చేయబడుదురు. ప్రభువు యొక్క సక్రమ మార్గములను వక్రీకరించు ఆ గొప్ప వ్యభిచారిణి, అనగా ఆ గొప్ప హేయకరమైన సంఘము ధూళిలోనికి దొర్లిపడును మరియు దాని పతనము గొప్పగా ఉండును.

15 ఏలయనగా, నరుల సంతానము యొక్క హృదయములపైన సాతాను ఇక ఎన్నడును అధికారము కలిగియుండని సమయము వేగముగా వచ్చునని ప్రవక్త చెప్పుచున్నాడు; ఏలయనగా, గర్విష్ఠులందరు, దుర్మార్గముగా ప్రవర్తించు వారందరు కొయ్యకాలు వలె అగు దినము త్వరలోనే వచ్చును. వారు కాల్చివేయబడు దినము వచ్చును.

16 మనుష్య సంతానమంతటిపై దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రత క్రుమ్మరించబడు సమయము త్వరలో వచ్చును; దుర్మార్గులు, నీతిమంతులను నాశనము చేయుటను ఆయన సహించడు.

17 అందువలన ఆయన తన శక్తి చేత నీతిమంతులను కాపాడును, ఆయన యొక్క సంపూర్ణ ఉగ్రత రావలసియున్నప్పటికీ నీతిమంతులు కాపాడబడి, వారి శత్రువులు అగ్నిచేత నాశనము చేయబడుదురు. కావున, నీతిమంతులు భయపడనవసరము లేదు; ఏలయనగా, అగ్నిచేతనైనా సరే వారు రక్షింపబడుదురని ప్రవక్త చెప్పుచున్నాడు.

18 నా సహోదరులారా, ఈ కార్యములు త్వరలో జరుగవలెనని నేను మీతో చెప్పుచున్నాను; రక్తము, అగ్ని మరియు ఆవిరివంటి పొగ కూడా రావలెను; అది ఈ భూముఖముపై జరుగవలెను; వారు ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనిన యెడల, శరీరానుసారముగా అది మనుష్యులకు వచ్చును.

19 ఏలయనగా, నీతిమంతులు నశించరు. సీయోనుకు వ్యతిరేకముగా యుద్ధము చేయువారందరు కొట్టివేయబడు సమయము తప్పక రావలెను.

20 మోషే మాటలను నెరవేర్చునట్లు ప్రభువు నిశ్చయముగా తన జనులకొక మార్గమును సిద్ధపరచును, అతడు ఇట్లనుచూ పలికెను: నా వంటి ఒక ప్రవక్తను ప్రభువైన దేవుడు మీ కొరకు పుట్టించును; సమస్త విషయములలో అతడు మీతో చెప్పు ప్రతి దానిని మీరు వినవలెను; ఆ ప్రవక్తను వినని వారందరు జనుల మధ్య నుండి కొట్టివేయబడుదురు.

21 ఇప్పుడు, మోషే చెప్పియున్న ఈ ప్రవక్త ఇశ్రాయేలు పరిశుద్ధుడేనని, అందువలన అతడు నీతియందు తీర్పు తీర్చునని నీఫైయను నేను మీకు ప్రకటించుచున్నాను.

22 నీతిమంతులు భయపడనవసరము లేదు, ఏలయనగా వారు నాశనము చేయబడరు. కానీ, అది నరుల సంతానము మధ్య కట్టబడియున్న అపవాది రాజ్యము, శరీరమందున్న వారి మధ్య స్థాపించబడిన రాజ్యము—

23 లాభము పొందుటకు స్థాపించబడిన సంఘములన్నియు, శరీరులపై అధికారము సంపాదించుటకు నిర్మించబడిన వారందరు, లోకము దృష్టిలో పేరు సంపాదించుటకు నిర్మించబడిన వారు, శరీర దురాశలను, లోక వస్తువులను మరియు సకల విధముల దోషములను చేయుటకు కోరువారు; క్లుప్తముగా అపవాది రాజ్యమునకు చెందిన వారందరు భయపడి, వణికి కంపించవలసిన సమయము వేగముగా వచ్చుచున్నది. వారే ధూళిలోనికి అణచివేయబడవలసిన వారు, వారే కొయ్యకాలు వలె కాల్చబడవలసిన వారు; ఇది ప్రవక్త మాటల ప్రకారమైయున్నది.

24 నీతిమంతులు చావడిలోని దూడలవలే నడిపించబడి, ఇశ్రాయేలు పరిశుద్ధుడు అధికారము, బలము, శక్తి మరియు గొప్ప మహిమలో పరిపాలన చేయవలసిన సమయము త్వరలో వచ్చును.

25 ఆయన తన పిల్లలను భూమి యొక్క నలుమూలల నుండి సమకూర్చును; ఆయన తన గొఱ్ఱెలను లెక్కించియున్నాడు మరియు అవి ఆయననెరుగును; అప్పుడు ఒకే మంద, ఒకే కాపరియుండును; ఆయన తన గొఱ్ఱెలను మేపును మరియు ఆయన యందు అవి తమ పచ్చికను కనుగొనును.

26 ఆయన జనుల నీతిని బట్టి సాతాను శక్తిలేకయుండును; అందువలన, అతడు అనేక సంవత్సరముల పాటు విడిపించబడలేడు; జనుల హృదయములపై అతడెట్టి అధికారమును కలిగియుండడు. ఏలయనగా, వారు నీతియందు నివసించుదురు మరియు ఇశ్రాయేలు పరిశుద్ధుడు పరిపాలించును.

27 ఇప్పుడు, శరీరానుసారముగా ఈ విషయములన్నియు జరుగవలెనని నీఫైయను నేను మీతో చెప్పుచున్నాను.

28 కానీ వారు పశ్చాత్తాపపడిన యెడల, సమస్త జనములు, వంశములు, భాషలు మరియు ప్రజలు ఇశ్రాయేలు పరిశుద్ధుని యందు క్షేమముగా నివసింతురు.

29 ఇప్పుడు, నీఫైయను నేను ముగించుచున్నాను; ఏలయనగా, ఈ విషయములను గూర్చి ఇకపై చెప్పుటకు నేను తెగించను.

30 అందువలన నా సహోదరులారా, కంచు పలకలపై వ్రాయబడియున్న విషయములు సత్యమని మీరెంచవలెనని నేను కోరుచున్నాను; ఒక మనుష్యుడు దేవుని ఆజ్ఞలకు లోబడవలెనని అవి సాక్ష్యమిచ్చుచున్నవి.

31 అందువలన, కేవలము నేను, నా తండ్రి మాత్రమే సాక్ష్యమిచ్చి, వాటిని బోధించితిమని మీరనుకొనవలసిన అవసరము లేదు. కావున, మీరు ఆజ్ఞలకు లోబడి అంతము వరకు సహించిన యెడల, మీరు అంత్యదినమున రక్షింపబడుదురు. అది ఆలాగునైయున్నది. ఆమేన్‌.