లేఖనములు
1 నీఫై 4


4వ అధ్యాయము

నీఫై ప్రభువు ఆజ్ఞననుసరించి లేబన్‌ను సంహరించును, తరువాత ఉపాయము చేత కంచు పలకలను సంపాదించును—జోరమ్ అరణ్యములోనున్న లీహై కుటుంబముతో చేరుటకు ఎన్నుకొనును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 నేను నా సహోదరులతో ఇట్లనుచూ మాట్లాడితిని: మనము యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ప్రభువు ఆజ్ఞలను పాటించుటలో నమ్మకముగా ఉండెదము; ఏలయనగా, భూనివాసులందరికన్నను బలవంతుడైన ఆయన లేబన్‌ కంటె, అతని ఏబదిమంది కంటె లేదా అతని పది వేలమంది కంటే కూడా అధిక బలవంతుడు ఎందుకు కాలేడు?

2 కావున మనము వెళ్ళి మోషే వలే బలముగా నుండెదము; అతడు ఎఱ్ఱసముద్రపు నీళ్ళతో మాట్లాడగా అవి ఇటు అటు విడిపోయి, మన పితరులు దాని గుండా చెర నుండి బయటకు ఆరిన నేలమీద రాగా, ఫరో సైన్యములు వారిని అనుసరించి ఎఱ్ఱసముద్రపు నీళ్ళలో మునిగిపోయెను.

3 ఇప్పుడు ఇది సత్యమని ఒక దేవదూత మీతో మాట్లాడెనని కూడా మీరెరుగుదురు; కాబట్టి మీరు సందేహపడనేల? రండి, మనము వెళ్ళెదము; మన పితరుల వలే మనలను విడిపించుటకు, ఐగుప్తీయుల వలే లేబన్‌ను నాశనము చేయుటకు ప్రభువు సమర్థుడైయున్నాడు.

4 నేను ఈ మాటలను పలికినప్పుడు వారు ఇంకను కోపముగా నుండి సణుగుట కొనసాగించిరి; అయినను యెరూషలేము ప్రాకారము వెలుపలకు వచ్చువరకు వారు నన్ను అనుసరించిరి.

5 అది రాత్రి అయినందున వారు ప్రాకారము వెలుపల దాగుకొనునట్లు నేను చేసితిని. వారు దాగుకొనిన తరువాత, నీఫై అను నేను పట్టణములోనికి రహస్యముగా ప్రవేశించి, లేబన్‌ ఇంటి వైపు వెళ్ళితిని.

6 నేను చేయవలసిన కార్యములను ముందుగా ఎరుగనివాడనై ఆత్మ చేత నడిపించబడితిని.

7 నేను ముందుకు సాగి, లేబన్‌ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నేనొక మనుష్యుని చూచితిని, అతడు మద్యము మత్తులో ఉండి నా యెదుట నేల మీద పడియుండెను.

8 నేనతనిని సమీపించినప్పుడు, అతడు లేబన్‌ అని నేను కనుగొంటిని.

9 నేనతని ఖడ్గమును చూచి దానిని ఒరనుండి బయటకు తీయగా, దాని పిడి మేలిమి బంగారపుదై, దాని పనితనము అతి శ్రేష్ఠముగాయుండి, దాని అలుగు అత్యంత అమూల్యమైన ఉక్కుతో చేయబడినదైయుండుట చూచితిని.

10 తరువాత లేబన్‌ను చంపవలెనని ఆత్మ ద్వారా నేను ప్రేరేపింపబడగా, నేనెన్నడు మనుష్యుని రక్తము చిందించలేదే అని నా హృదయములో అనుకొంటిని. నేను అయిష్టముగానుండి, అతడిని చంపరాదని కోరుకొంటిని.

11 అప్పుడు ఆత్మ తిరిగి నాతో—ఇదిగో, ప్రభువు అతడిని నీ చేతులకు అప్పగించియున్నాడని చెప్పెను. అతడు నా ప్రాణమును తీయుటకు ప్రయత్నించెనని, ప్రభువు ఆజ్ఞలను గైకొనడని, మా ఆస్థిని కూడా తీసుకొనెనని నేనెరుగుదును.

12 ఆత్మ మరలా నాతో—అతడిని సంహరించుము; ఏలయనగా, ప్రభువు అతడిని నీ చేతులకు అప్పగించియున్నాడు;

13 ప్రభువు తన నీతి ఉద్దేశ్యములను నెరవేర్చుటకు దుష్టులను సంహరించును; ఒక జనాంగము అవిశ్వాసములో క్షీణించి, నశించుట కంటే ఒక మనుష్యుడు నశించుట మేలు అని చెప్పెను.

14 నీఫై అను నేను ఈ మాటలు వినినప్పుడు, నీ సంతానము నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము వాగ్దానదేశములో వర్ధిల్లుదురని అరణ్యములో ప్రభువు నాతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొంటిని.

15 నా సంతానము ధర్మశాస్త్రమును కలిగియుంటే తప్ప, మోషే ధర్మశాస్త్రము ప్రకారము ప్రభువు ఆజ్ఞలను పాటించలేరని నేను తలంచితిని.

16 ధర్మశాస్త్రము కంచు పలకలపైన చెక్కబడియున్నదని;

17 మరలా ఆయన ఆజ్ఞల ప్రకారము ఆ వృత్తాంతములను పొందవలెనని—ఈ కారణము చేతనే ప్రభువు లేబన్‌ను నా చేతులకప్పగించెనని నేనెరుగుదును.

18 కావున నేను ఆత్మ యొక్క స్వరమునకు లోబడి, లేబన్‌ కేశములు పట్టుకొని, అతని ఖడ్గముతో అతని శిరస్సును ఖండించితిని.

19 నేనతని శిరస్సును ఖండించిన తరువాత, లేబన్‌ వస్త్రములలో ప్రతి ఒక్కటి తీసుకొని, నా శరీరముపై ధరించితిని; నేను అతని కవచమును నా నడుము చుట్టూ కట్టుకొంటిని.

20 ఈలాగున చేసిన తరువాత, నేను లేబన్‌ ధనాగారము వైపు వెళ్ళితిని. అటు వెళ్ళుచుండగా, ధనాగారపు తాళపుచెవులను కలిగియున్న లేబన్‌ సేవకుని చూచితిని. అతడు నాతోపాటు ధనాగారములోనికి రావలెనని లేబన్‌ స్వరములో ఆజ్ఞాపించితిని.

21 అతడు ఆ వస్త్రములను, నా నడుముకున్న ఖడ్గమును చూచి, నన్ను తన యజమానియైన లేబన్‌ అనుకొనెను.

22 అతడు నాతో యూదుల పెద్దలను గూర్చి మాట్లాడెను. తన యజమాని లేబన్‌ రాత్రివేళ వారిమధ్యనుండుటకు వెళ్ళెనని అతడు ఎరిగియుండెను.

23 నేను అతనితో లేబన్‌ వలె మాట్లాడితిని.

24 కంచు పలకలపైనున్న చెక్కడములను ప్రాకారముల వెలుపలనున్న నా జ్యేష్ఠ సహోదరుల యొద్దకు కొనిపోవలెనని నేను అతనితో చెప్పితిని.

25 నన్ను అనుసరించవలెనని కూడా ఆజ్ఞాపించితిని.

26 నేను సంఘ సహోదరులను గూర్చి మాట్లాడితినని, నేను సంహరించిన ఆ లేబన్‌ నేనే అనుకొని అతడు నన్ను అనుసరించెను.

27 ప్రాకారము వెలుపలనున్న నా సహోదరుల యొద్దకు వెళ్ళుచుండగా, అతడు నాతో యూదుల పెద్దలను గూర్చి అనేక పర్యాయములు మాట్లాడెను.

28 లేమన్‌, లెముయెల్, శామ్‌లు నన్ను చూచి మిక్కిలి భయపడిరి. వారు నా సమక్షము నుండి పారిపోయిరి; ఏలయనగా వచ్చినది లేబన్‌ అని, అతడు నన్ను సంహరించియుండి, వారి ప్రాణములు కూడా తీయుటకు వచ్చెనని వారు అనుకొనిరి.

29 నేను వారిని పిలువగా వారు నన్ను విని, నా సమక్షము నుండి పారిపోవుట మానిరి.

30 లేబన్‌ సేవకుడు నా సహోదరులను చూచినప్పుడు కంపించుట మొదలుపెట్టి, నా యెదుట నుండి పారిపోయి యెరూషలేము పట్టణమునకు తిరిగిపోవుటకు సిద్ధముగానుండెను.

31 ఇప్పుడు నీఫై అను నేను భారీకాయుడనైయుండి, ప్రభువు నుండి అధికముగా బలమును పొందుట వలన నేను లేబన్‌ సేవకుడిని పట్టుకొని, అతడు పారిపోకుండా నిరోధించితిని.

32 అతడు నా మాటలను ఆలకించిన యెడల ప్రభువు జీవముతోడు, నా జీవముతోడు అతడు మా మాటలను ఆలకించిన యెడల మేము అతని ప్రాణమును విడిచిపెట్టెదమని నేనతనితో చెప్పితిని.

33 అతడు భయపడవలసిన అవసరము లేదని, మాతో అరణ్యములోనికి వచ్చిన యెడల, మా వలే ఒక స్వతంత్ర మనుష్యునిగా ఉండవచ్చని నేనతనితో ప్రమాణపూర్వకముగా చెప్పితిని.

34 నేను ఇంకా అతనితో—నిశ్చయముగా ఈ కార్యమును చేయమని ప్రభువు మమ్ములను ఆజ్ఞాపించెను; మేము ప్రభువు ఆజ్ఞలను పాటించుటలో శ్రద్ధగా యుండవలదా? కావున, నీవు అరణ్యములోనికి నా తండ్రి యొద్దకు వచ్చిన యెడల, నీవు మాతోపాటు స్థానము కలిగియుండెదవు అని చెప్పితిని.

35 నేను చెప్పిన మాటలను బట్టి జోరమ్ ధైర్యము తెచ్చుకొనెను. ఆ సేవకుని పేరు జోరమ్; అతడు అరణ్యములోనికి మా తండ్రి వద్దకు వచ్చెదనని వాగ్దానము చేసెను. ఆ సమయము నుండి మాతో ఉండెదనని అతడు మాకొక ప్రమాణము చేసెను.

36 ఇప్పుడు అరణ్యములోనికి మా ప్రయాణమును గూర్చి యూదులు తెలుసుకొనరాదని, అట్లయిన వారు మమ్ములను వెంబడించి, నాశనము చేయుదురనే కారణము చేత అతడు మాతో ఉండిపోవలెనని మేము కోరితిమి.

37 జోరమ్ మాతో ప్రమాణము చేసినప్పుడు, అతడిని గూర్చి మా భయములు తొలగిపోయెను.

38 తరువాత, మేము ఆ కంచు పలకలను, లేబన్‌ సేవకుని తీసుకొని అరణ్యములో మా తండ్రి గుడారము నొద్దకు ప్రయాణము చేసితిమి.