లేఖనములు
1 నీఫై 7


7వ అధ్యాయము

లీహై కుమారులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, తమ ప్రయాణములో తమతో చేరవలెనని ఇష్మాయేలును, అతని కుటుంబమును ఆహ్వానించెదరు—లేమన్‌ మరియు ఇతరులు తిరగబడుదురు—ప్రభువు నందు విశ్వాసము కలిగియుండమని నీఫై తన సహోదరులకు ఉద్భోధించును—వారు అతడిని త్రాళ్ళతో కట్టివేసి, అతడిని నాశనము చేయుటకు పథకము వేయుదురు—విశ్వాసపు శక్తి చేత అతడు విడిపింపబడును—అతని సహోదరులు క్షమాపణ కోరెదరు—లీహై, అతని సమూహము బలిని, దహనబలులను అర్పించెదరు. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 ఇప్పుడు మీరు ఇది తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను, నా తండ్రి లీహై తన సంతానమును గూర్చి ప్రవచించిన తరువాత, మరలా ప్రభువు అతనితో—లీహై, నీ కుటుంబముతో అరణ్యములోనికి ఒంటరిగా వెళ్ళుట నీకు తగదు; కావున, వాగ్దానదేశములో ప్రభువును సేవించు సంతానమును కనునట్లు నీ కుమారులు వివాహము చేసుకొనవలెనని చెప్పెను.

2 ఇప్పుడు నీఫైయను నేను, నా సహోదరులు యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఇష్మాయేలును, అతని కుటుంబమును అరణ్యములోనికి తీసుకొనిరావలెనని ప్రభువు నా తండ్రిని ఆజ్ఞాపించెను.

3 నీఫైయను నేను, నా సహోదరులతో పాటు మరలా యెరూషలేమునకు వెళ్ళుటకు అరణ్యములో ప్రయాణించితిని.

4 మేము ఇష్మాయేలు ఇంటికి వెళ్ళి ప్రభువు మాటలను అతనితో మనవి చేయగలుగునంతగా అతని అనుగ్రహము పొందితిమి.

5 ప్రభువు ఇష్మాయేలు మరియు అతని కుటుంబీకుల హృదయాలను ఎంత మృదువుగా చేసెననగా, అరణ్యములోనున్న మా తండ్రి గుడారమునకు మాతో పాటు వారు ప్రయాణము సాగించిరి.

6 మేము అరణ్యములో ప్రయాణము చేయుచుండగా లేమన్‌, లెముయెల్, ఇష్మాయేలు కుమార్తెలలో ఇద్దరు, కుమారులలో ఇద్దరు మరియు వారి కుటుంబములు మాకు వ్యతిరేకముగా తిరగబడిరి; ముఖ్యముగా నీఫైయను నాకు, శామ్‌కు, వారి తండ్రి ఇష్మాయేలుకు, అతని భార్య మరియు అతని ముగ్గురు ఇతర కుమార్తెలకు వ్యతిరేకముగా తిరగబడిరి.

7 ఆ తిరుగుబాటులో వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళవలెనని కోరుకొనిరి.

8 ఇప్పుడు నీఫైయను నేను వారి హృదయ కాఠిన్యమును బట్టి నొచ్చుకొనిన వాడనై వారితో ముఖ్యముగా లేమన్‌ లెముయెల్‌లతో ఇట్లు చెప్పితిని: ఇదిగో, మీరు నా అన్నలు. మీరు, మీ హృదయములయందు ఇంత కఠినముగా, మీ మనస్సుల యందు ఇంత గ్రుడ్డిగా, అదియూ మీ తమ్ముడనైన నేను మీతో మాట్లాడి, మీ కొరకు ఒక మాదిరిగా ఉండవలసిన అవసరము వచ్చునంతగా ఎలా ఉన్నారు?

9 మీరు ప్రభువు వాక్యమును ఎందుకు ఆలకించలేదు?

10 ప్రభువు యొక్క దూతను మీరు చూసియున్నారని ఎట్లు మరచితిరి?

11 లేబన్‌ చేతులలోనుండి మనలను విడిపించుటలో, ఆ వృత్తాంతములను పొందునట్లు చేయుటలో ప్రభువు మనకొరకు చేసిన గొప్ప కార్యములను మీరెట్లు మరచితిరి?

12 మనుష్య కుమారులు ప్రభువు నందు విశ్వాసముంచిన యెడల ఆయన తన చిత్త ప్రకారము వారి కొరకు సమస్త కార్యములను చేయగలడని మీరెట్లు మరచితిరి? కాబ్టటి, మనము ఆయన పట్ల నమ్మకముగా ఉండెదము.

13 మనము ఆయన పట్ల నమ్మకముగా ఉన్న యెడల, మనము వాగ్దానదేశమును పొందెదము; మరియు యెరూషలేము నాశనమును గూర్చి ప్రభువు వాక్యము నెరవేరునని భవిష్యత్తులో మీరు తెలుసుకొందురు. ఏలయనగా యెరూషలేము నాశనమును గూర్చి ప్రభువు పలికిన వాక్యములన్నియు తప్పక నెరవేరవలెను.

14 ప్రభువు ఆత్మ త్వరలోనే వారితో పోరాడుట మానివేయును; ఏలయనగా, వారు ప్రవక్తలను తిరస్కరించి, యిర్మియాను చెరలో వేసిరి. దేశమును వదలి పారిపోవునంతగా వారు నా తండ్రి ప్రాణమును తీయుటకు ప్రయత్నించిరి.

15 ఇప్పుడు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిన యెడల, మీరు కూడా వారితో నశించిపోవుదురని నేను మీతో చెప్పుచున్నాను. మీరు కోరిన యెడల ఆ దేశమునకు పోవుడి, మరియు మీరు వెళ్ళిన యెడల మీరు కూడా నశించిపోవుదురని నేను మీతో పలికిన మాటలను జ్ఞాపకముంచుకొనుడి. ఏలయనగా నేనిట్లు పలుకవలెనని ప్రభువు ఆత్మ నన్ను ప్రేరేపించుచున్నది.

16 నీఫైయను నేను నా సహోదరులతో ఈ మాటలు పలికినప్పుడు వారు నాతో కోపముగానుండిరి. వారు మిక్కిలి ఆగ్రహముతో ఉన్నందున నన్ను పట్టుకొని త్రాళ్ళతో కట్టివేసి, కౄరమృగములు తినునట్లు అరణ్యములో నన్ను వదిలివేసి నా ప్రాణము తీయుటకు ప్రయత్నించిరి.

17 కానీ, నేను—ఓ ప్రభువా, నీ యందు నాకున్న విశ్వాసమును బట్టి నా సహోదరుల చేతులలోనుండి నన్ను విడిపించవా; నన్ను కట్టివేసిన ఈ కట్లను త్రెంచి వేయగలుగునట్లు నాకు బలమునియ్యవా అనుచూ ప్రభువుకు ప్రార్థన చేసితిని.

18 నేను ఈ మాటలను పలికిన వెంటనే నా చేతుల నుండి, కాళ్ళ నుండి కట్లు ఊడిపోయినవి. నేను నా సహోదరుల యెదుట నిలబడి మరలా వారితో మాట్లాడితిని.

19 వారు తిరిగి నాపై కోపము తెచ్చుకొని, నన్ను పట్టుకొనుటకు ప్రయత్నించిరి; కానీ, ఇష్మాయేలు కుమార్తెలలో ఒకరు, ఆమె తల్లి మరియు ఇష్మాయేలు కుమారులలో ఒకరు నా సహోదరుల హృదయములు మృదుపరచబడునట్లుగా వారిని బ్రతిమాలిరి; అప్పుడు వారు నా ప్రాణము తీయ్యవలెనని ప్రయత్నించుట మానిరి.

20 వారు తమ దుష్టత్వమును బట్టి దుఃఖపడి, నా యెదుట వంగి నమస్కరించి, నాకు వ్యతిరేకముగా వారు చేసిన దానిని బట్టి నేను వారిని క్షమించవలెనని బ్రతిమాలిరి.

21 వారు చేసిన వాటన్నింటిని యథార్థముగా నేను క్షమించితిని, మరియు వారు క్షమాపణ కొరకు తమ దేవుడైన ప్రభువును ప్రార్థించవలెనని ప్రోత్సహించితిని. వారు ఆ విధముగా చేసిరి. వారు ప్రభువుకు ప్రార్థన చేసిన తరువాత మేము మా తండ్రి గుడారము వద్దకు తిరిగి ప్రయాణించితిమి.

22 మేము మా తండ్రి గుడారము వద్దకు చేరుకొంటిమి. నేను, నా సహోదరులు, ఇష్మాయేలు కుటుంబమంతయు నా తండ్రి గుడారము వద్దకు వచ్చిన తరువాత, వారు తమ దేవుడైన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. వారు ఆయనకు బలిని, దహనబలులను అర్పించిరి.