లేఖనములు
1 నీఫై 8


8వ అధ్యాయము

లీహై జీవవృక్ష దర్శనమును చూచును—అతడు దాని ఫలమును తిని, తన కుటుంబము కూడా ఆ విధముగా చేయవలెనని కోరును—అతడు ఒక ఇనుప దండమును, తిన్నని ఇరుకైన ఒక మార్గమును, మనుష్యులను పూర్తిగా కప్పివేయు అంధకారపు పొగమంచును చూచును—శరయ, నీఫై, శామ్‌లు ఆ ఫలమును తిందురు, కానీ లేమన్‌, లెముయెల్‌లు తిరస్కరించెదరు. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 మేము అన్ని రకముల విత్తనములను, ధాన్యము మరియు ఫల విత్తనములన్నిటిని సేకరించితిమి.

2 నా తండ్రి అరణ్యములోనుండగా మాతో మాట్లాడుచూ ఇట్లనెను: ఇదిగో, నేనొక స్వప్నమును చూచితిని లేదా మరొకమాటలో నేనొక దర్శనమును చూచితిని.

3 నేను చూచిన దాని ప్రకారము, నీఫై, శామ్‌లను బట్టి కూడా ప్రభువునందు ఆనందించుటకు నాకు కారణము కలదు; ఏలయనగా వారు, వారి సంతానములో అనేకులు కూడా రక్షింపబడుదురని నేను భావించుటకు కారణము కలదు.

4 కానీ లేమన్‌, లెముయెల్ మిమ్ములను బట్టి నేను మిక్కిలి భయపడుచున్నాను. ఏలయనగా నా స్వప్నములో నేనొక అంధకారమైన నిర్జీవారణ్యమును చూచితినని నాకనిపించెను.

5 నేనొక మనుష్యుని చూచితిని. అతడు తెల్లని నిలువుటంగీని ధరించియుండి, వచ్చి నా యెదుట నిలిచెను.

6 అతడు నాతో మాట్లాడి, తనను వెంబడించమని నన్ను ఆదేశించెను.

7 నేనతనిని వెంబడించుచుండగా, అంధకారమైన నిర్జీవ ప్రదేశమందు నేను ఉన్నట్లుగా కనుగొంటిని.

8 నేను అంధకారములో అనేక గంటలు ప్రయాణము చేసిన తరువాత, ఆయన మృదు కనికరములనేకమును బట్టి నాపై కనికరము చూపవలెనని నేను ప్రభువును ప్రార్థించుట మొదలుపెట్టితిని.

9 నేను ప్రభువును ప్రార్థించిన తరువాత, విశాలమైన ఒక పెద్ద మైదానమును చూచితిని.

10 మరియు నేనొక వృక్షమును చూచితిని, దాని ఫలము ఒకరిని సంతోషపరచుటకు కోరదగినదైయుండెను.

11 నేను ముందుకు వెళ్ళి, ఆ ఫలమును తింటిని; అది నేను ఇంతకుముందు రుచి చూచిన వాటన్నిటి కంటే అది అత్యంత మధురముగా ఉన్నట్లు గ్రహించితిని. అంతేకాక, ఆ ఫలము తెల్లగా ఉండి, నేను ఇప్పటి వరకు చూచియున్న సమస్త తెల్లదనమును మించియుండుట చూచితిని.

12 ఆ ఫలమును నేను తినినప్పడు అది నా ఆత్మను అత్యంత ఆనందముతో నింపెను; కావున, నా కుటుంబము కూడా దానిని తినవలెనని నేను కోరితిని; ఏలయనగా అది ఇతర ఫలములన్నిటి కంటే కోరదగినదని నేను ఎరిగియుంటిని.

13 బహుశా నా కుటుంబమును కూడా కనుగొందునేమోనని నా చుట్టూ చూడగా నేనొక నదిని చూచితిని. అది నేను తినుచున్న ఫల వృక్షమునకు సమీపముగా దాని ప్రక్కనుండి ప్రవహించుచుండెను.

14 అది ఎక్కడ నుండి వచ్చుచున్నదో కనుగొనుటకు నేను చూడగా, దాని మూలము దూరములో ఉండెను; అక్కడ మీ తల్లి శరయ, శామ్, నీఫై ఉండుట నేను చూచితిని; వారు ఎటు పోవలెనో తెలియనట్లు నిలబడిరి.

15 నేను వారికి సైగ చేసి, వారు నా యొద్దకు రావలెనని, సమస్త ఫలముల కంటే కోరదగిన ఆ ఫలమును తినవలెనని బిగ్గరగా వారితో చెప్పితిని.

16 వారు నా యొద్దకు వచ్చి, ఆ ఫలమును తినిరి.

17 లేమన్‌, లెముయెల్‌లు కూడా వచ్చి ఆ ఫలమును తినవలెనని నేను కోరితిని; అందువలన, బహుశా నేను వారిని చూడగలనేమోనని ఆ నది మూలము వైపు చూచితిని.

18 నేను వారిని చూచితిని, కానీ వారు నా యొద్దకు రాక ఆ ఫలమును తినకయుండిరి.

19 నేనొక ఇనుప దండమును చూచితిని. అది నది ఒడ్డు నుండి నేను నిలబడియున్న వృక్షము వరకు వ్యాపించియుండెను.

20 ఆ ఇనుప దండము ప్రక్కగా, నేను నిలిచియున్న వృక్షము వరకు గల ఒక తిన్నని ఇరుకైన మార్గమును కూడా చూచితిని; అది ఆ ఊట యొక్క మూలము ప్రక్కగా, అదొక లోకమనిపించే విశాలమైన ఒక పెద్ద మైదానమునకు నడిపించెను.

21 మరియు నేను లెక్కలేనన్ని జన సమూహములను చూచితిని. వారిలో అనేకులు నేను నిలిచియున్న వృక్షము యొద్దకు నడిపించుచున్న బాటను చేరుటకు ముందుకు సాగుచుండిరి.

22 వారు ముందుకు వచ్చి ఆ వృక్షము యొద్దకు నడిపించు బాటలో నడుచుట ఆరంభించిరి.

23 అప్పుడక్కడ ఒక అంధకారపు పొగమంచు లేచెను; అది అత్యంత గొప్పదైన అంధకారపు పొగమంచుయైనందున, ఆ దారిలో నడుచుచున్న వారు తమ మార్గమునుండి తప్పిపోయి అటు ఇటు తిరుగులాడి నశించిపోయిరి.

24 ఇతరులు ముందుకుసాగి వచ్చుట నేను చూచితిని. వారు ముందుకు వచ్చి ఆ ఇనుప దండము చివరను పట్టుకొనిరి; వారు సాగి వచ్చి ఆ వృక్ష ఫలమును తినువరకు ఇనుప దండమును వదలక ఆ అంధకారపు పొగమంచు గుండా ముందుకు వచ్చిరి.

25 ఆ వృక్ష ఫలమును తినిన తరువాత వారు సిగ్గుపడినట్లుగా చుట్టూ చూచిరి.

26 నేను కూడా నా చుట్టూ చూచినప్పుడు, ఆ నది అవతలి ఒడ్డున ఒక గొప్ప విశాలమైన భవనమును చూచితిని; అది గాలియందు ఉన్నట్లు భూమి కంటే ఎత్తులో నిలిచియుండెను.

27 అది వృద్ధులు, యౌవనులు, పురుషులు మరియు స్త్రీలతో నిండియుండెను; వారి వస్త్రధారణ తీరు మిక్కిలి శ్రేష్ఠమైనదైయుండెను; వారు వృక్షము యొద్దకు వచ్చి, దాని ఫలమును తినుచున్న వారి వైపు తమ వ్రేళ్ళను చూపుచూ ఎగతాళి చేయు ధోరణిలో ఉండిరి.

28 ఆ ఫలమును రుచి చూచిన తరువాత, వారిని ఎగతాళి చేయుచున్న వారి వలన వారు సిగ్గుపడి, నిషేధింపబడిన దారులలో పడి నశించిపోయిరి.

29 ఇప్పుడు నీఫైయను నేను, నా తండ్రి మాటలన్నింటిని చెప్పుట లేదు.

30 కానీ క్లుప్తముగా వ్రాయుచున్నాను; ఇదిగో, అతడు ఇతర సమూహములు ముందుకు సాగి వచ్చుటను చూచెను. వారు వచ్చి, ఇనుప దండము చివరను పట్టుకొని, ముందుకు వచ్చి మోకరించి, ఆ వృక్ష ఫలమును తినువరకు కూడా నిరంతరము ఇనుప దండమును గట్టిగా పట్టుకొని తమ దారిలో ముందుకు సాగిపోవుచుండిరి.

31 ఇతర సమూహములు ఆ గొప్ప విశాల భవనము వైపునకు తమ మార్గమును తడుముకొనుటను కూడా అతడు చూచెను.

32 అనేకులు ఆ ఊట లోతులలో మునిగిపోయిరి; అనేకులు అన్యదారులలో తిరుగులాడుచు అతని దృష్ఠి నుండి తప్పిపోయిరి.

33 ఆ వింత భవనములో ప్రవేశించిన సమూహము గొప్పదైయుండెను. వారు ఆ భవనములో ప్రవేశించిన తరువాత నా వైపు, ఆ ఫలమును తినుచున్న వారి వైపు ఎగతాళిగా వేలును చూపించిరి; కానీ మేము వారిని లక్ష్యపెట్టలేదు.

34 ఇవి నా తండ్రి యొక్క మాటలు: ఏలయనగా ఎంతమందైతే వారిని లక్ష్యపెట్టితిరో వారందరు తప్పిపోయిరి.

35 లేమన్‌, లెముయెల్‌లు ఆ ఫలమును తినలేదని నా తండ్రి చెప్పెను.

36 నా తండ్రి తన స్వప్నము లేదా దర్శనమును గూర్చి అనేక మాటలు పలికిన తరువాత అతడు మాతో ఇట్లనెను: నేను దర్శనములో చూచిన ఈ దృశ్యములను బట్టి, లేమన్‌ లెముయెల్‌ల గురించి మిక్కిలి భయపడుచున్నాను; ముఖ్యముగా వారు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడుదురేమోనని భయపడుచున్నాను.

37 తరువాత వారు తన మాటలను ఆలకించవలెనని, అట్లయిన ప్రభువు వారికి కనికరముగా నుండునేమోనని చింత గల తండ్రిగా అతడు పూర్ణమనస్సుతో వారికి ఉద్భోధించెను; ఆ విధముగా నా తండ్రి వారికి బోధించెను.

38 వారికి బోధించి, అనేక విషయములను గూర్చి ప్రవచించిన తరువాత ప్రభువు ఆజ్ఞలను పాటించవలెనని అతడు వారిని ఆజ్ఞాపించెను; అతడు వారితో మాట్లాడుట ఇక చాలించెను.