లేఖనములు
3 నీఫై 1


మూడవ నీఫై

నీఫై గ్రంథము
హీలమన్‌ కుమారుడైన నీఫై యొక్క కుమారుడు

హీలమన్‌, యూదా రాజైన సిద్కియా పరిపాలన యొక్క మొదటి సంవత్సరమందు యెరూషలేము నుండి బయటకు వచ్చిన లీహై కుమారుడైన నీఫై యొక్క వంశస్థుడైన ఆ ఆల్మా కుమారుడైన ఆల్మా యొక్క కుమారుడైన హీలమన్‌ యొక్క కుమారుడు.

1వ అధ్యాయము

హీలమన్‌ కుమారుడైన నీఫై దేశము నుండి బయటకు వెడలిపోవును మరియు అతని కుమారుడు నీఫై గ్రంథములను భద్రపరచును—సూచకక్రియలు మరియు ఆశ్చర్యకార్యములు విస్తరించినప్పటికీ, నీతిమంతులను సంహరించుటకు దుర్మార్గులు ప్రణాళిక వేయుదురు—క్రీస్తు జననము యొక్క రాత్రి వచ్చును—సూచకక్రియ ఇవ్వబడును మరియు ఒక క్రొత్త నక్షత్రము ఉదయించును—అబద్ధములు, మోసములు అధికమగును మరియు గాడియాంటన్‌ దొంగలు అనేకులను సంహరించెదరు. సుమారు క్రీ. శ. 1–4 సం.

1 ఇప్పుడు తొంబది ఒకటవ సంవత్సరము గడిచిపోయెను మరియు లీహై యెరూషలేమును విడిచి వచ్చిన సమయమునుండి ఆరు వందల సంవత్సరములు గడిచిపోయెను; అది, లకోనియస్ ప్రధాన న్యాయాధిపతి మరియు దేశముపై పరిపాలకుడైన సంవత్సరమందైయుండెను.

2 హీలమన్‌ కుమారుడైన నీఫై, తన పెద్ద కుమారుడైన నీఫైకి కంచు పలకలను, భద్రపరచబడిన గ్రంథములన్నిటిని మరియు లీహై యెరూషలేము నుండి బయటకు వెడలిపోయినప్పటి నుండి పవిత్రముగా ఉంచబడిన సమస్త వస్తువులను గూర్చిన బాధ్యతనిచ్చి, జరహేమ్ల దేశమునుండి బయటకు వెడలిపోయెను.

3 అప్పుడతడు దేశము నుండి బయటకు వెడలిపోయెను మరియు అతడు ఎక్కడకు వెళ్ళెనో ఏ మనుష్యుడు ఎరుగడు; అతని స్థానములో అతని కుమారుడు నీఫై వృత్తాంతములను, అనగా ఈ జనుల గ్రంథములను భద్రపరిచెను.

4 తొంబది రెండవ సంవత్సరము యొక్క ప్రారంభమందు, ప్రవక్తల యొక్క ప్రవచనములు మరింత సంపూర్ణముగా నెరవేరుట మొదలాయెను; ఏలయనగా జనుల మధ్య అతిగొప్ప సూచకక్రియలు మరియు అద్భుతకార్యములుండుట మొదలాయెను.

5 కానీ, లేమనీయుడైన సమూయేలు ద్వారా పలుకబడిన మాటలు నెరవేరుటకు సమయము గతించిపోయెనని చెప్పనారంభించిన వారు కొందరు అక్కడుండిరి.

6 వారు తమ సహోదరులను చూచి ఆనందించుట మొదలుపెట్టి, ఇట్లు చెప్పిరి: ఇదిగో సమయము గతించిపోయెను మరియు సమూయేలు మాటలు నెరవేరలేదు; కావున ఈ విషయమును గూర్చిన మీ సంతోషము, మీ విశ్వాసము వ్యర్థమాయెను.

7 మరియు వారు దేశమంతటా గొప్ప అలజడి సృష్టించిరి; విశ్వసించిన ఆ జనులు, ఏ విధముగానైనను చెప్పబడిన ఆ సంగతులు సంభవించవేమోనని మిక్కిలి దుఃఖముతో ఉండసాగిరి.

8 కానీ, వారి విశ్వాసము వ్యర్థము కాలేదని వారు ఎరుగునట్లు అక్కడ ఏ రాత్రి లేనట్లుగా ఒక పగలువలే నుండు ఆ పగలు, ఆ రాత్రి మరియు ఆ పగలు కొరకు నిరంతరము కనిపెట్టియుండిరి.

9 సమూయేలు ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ఆ సూచకక్రియ జరుగని యెడల, ఆ ఆచారములందు విశ్వసించిన వారందరు చంపబడవలెనని అవిశ్వాసుల ద్వారా ఒక దినము ప్రత్యేకపరచబడెను.

10 ఇప్పుడు నీఫై యొక్క కుమారుడైన నీఫై, తన జనుల యొక్క ఈ దుష్టత్వమును చూచినప్పుడు అతని హృదయము మిక్కిలి దుఃఖించెను.

11 అతడు బయటకు వెళ్ళి నేల మీద మోకాళ్ళూని, వారి పితరుల ఆచారమందు వారి విశ్వాసమును బట్టి నాశనము చేయబడబోవుచున్న అతని జనుల నిమిత్తము తన దేవునికి బలముగా మొరపెట్టెను.

12 ఆ దినమంతయు అతడు ప్రభువుకు బలముగా మొరపెట్టగా, ఇట్లు చెప్పుచూ ప్రభువు యొక్క స్వరము అతనికి వినిపించెను:

13 నీ తల పైకెత్తి ఆనందించుము; ఏలయనగా సమయము సమీపించినది, ఈ రాత్రి యందు సూచకక్రియ ఇవ్వబడును మరియు నేను నా పరిశుద్ధ ప్రవక్తల నోటిద్వారా పలుకబడునట్లు చేసిన ఆ సమస్తమును నెరవేర్చెదనని లోకమునకు చూపుటకు ఉదయమున నేను లోకములోనికి వచ్చెదను.

14 ఇదిగో, లోకము పునాది వేయబడినప్పటి నుండి నరులసంతానమునకు నేను తెలియజేసిన విషయములన్నిటినీ నెరవేర్చుటకు తండ్రి యొక్కయు మరియు కుమారుని యొక్కయు—నన్ను బట్టి తండ్రి యొక్కయు మరియు నా శరీరమును బట్టి కుమారుని యొక్కయు ఇరువురి చిత్తమును జరిగించుటకు నేను నా స్వజనుల యొద్దకు వచ్చెదను. ఇదిగో సమయము సమీపించినది, ఈ రాత్రి ఆ సూచకక్రియ ఇవ్వబడును.

15 మరియు నీఫైకి వినిపించిన మాటలు అవి చెప్పబడినట్లుగా నెరవేరెను; ఏలయనగా సూర్యుడు అస్తమించు సమయమున ఎట్టి చీకటి లేకుండెను; రాత్రి వచ్చినప్పుడు ఎట్టి చీకటి లేకుండెను, కావున జనులు ఆశ్చర్యపడసాగిరి.

16 ప్రవక్తల మాటలయందు విశ్వసించని వారనేకులు అక్కడ నేలపై పడి, మరణించిన వారివలె అయిరి, ఏలయనగా ప్రవక్తల మాటల యందు విశ్వసించిన వారి కొరకు వారు వేసిన గొప్ప నాశన ప్రణాళిక వ్యర్థము చేయబడెనని వారు ఎరిగిరి; ఏలయనగా ఇవ్వబడిన సూచకక్రియ అప్పటికే సమీపించియుండెను.

17 మరియు దేవుని కుమారుడు త్వరలో తప్పక ప్రత్యక్షము కావలెనని వారు తెలుసుకొనసాగిరి; క్లుప్తముగా పశ్చిమము నుండి తూర్పునకు, ఉత్తర దేశమందు మరియు దక్షిణ దేశమందు, భూముఖమంతటి పైనున్న జనులందరు నేలపై పడునంత అధికముగా ఆశ్చర్యపడిరి.

18 ఏలయనగా ప్రవక్తలు ఈ విషయములను గూర్చి అనేక సంవత్సరముల పాటు సాక్ష్యమిచ్చిరని, ఇవ్వబడిన సూచకక్రియ అప్పటికే సమీపించియున్నదని వారెరిగిరి; వారి దుర్నీతి మరియు అవిశ్వాసమును బట్టి వారు భయపడసాగిరి.

19 ఆ రాత్రియందంతా ఎట్టి చీకటి లేకుండెను, కానీ మిట్ట మధ్యాహ్నమువలే వెలుతురు ఉండెను. సూర్యుడు తన సరియైన క్రమమును బట్టి ఉదయమందు తిరిగి ఉదయించెను మరియు ఇవ్వబడిన సూచకక్రియను బట్టి అది ప్రభువు జన్మించవలసిన దినమని వారు ఎరిగిరి.

20 ప్రవక్తల యొక్క మాటలను బట్టి అన్ని విషయములు పొల్లుపోకుండా జరిగెను.

21 వాక్యము ప్రకారము ఒక క్రొత్త నక్షత్రము అగుపించెను.

22 ఇప్పుడు ఈ సమయము నుండి వారు చూచిన ఆ సూచకక్రియలు మరియు ఆశ్చర్యకార్యములందు వారు విశ్వసించకూడదను ఉద్దేశ్యముతో, వారి హృదయములను కఠినపరచుటకు సాతాను ద్వారా జనుల మధ్య అబద్ధములు పంపబడుట మొదలాయెను; కానీ ఈ అబద్ధములు మరియు మోసములున్నప్పటికీ, జనులలో అధికభాగము విశ్వసించి, ప్రభువుకు పరివర్తన చెందిరి.

23 పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మమునందు గొప్ప పాప క్షమాపణ ఉన్నదని బాప్తిస్మమిచ్చుచూ నీఫై మరియు ఇతరులనేకులు జనుల మధ్యకు వెళ్ళిరి. ఆ విధముగా జనులు దేశమందు తిరిగి సమాధానము కలిగియుండసాగిరి.

24 ఇకపై మోషే ధర్మశాస్త్రమును అనుసరించనవసరము లేదని లేఖనముల ద్వారా ఋజువు చేయుటకు ప్రయత్నించుచూ బోధించుట మొదలుపెట్టిన కొందరు తప్ప, అక్కడ ఎట్టి వివాదములు లేకుండెను. లేఖనములను గ్రహించనందున ఈ విషయమందు వారు పొరపడిరి.

25 కానీ వారు త్వరలోనే పరివర్తన పొంది, వారి పొరపాటును గూర్చి ఒప్పించబడిరి, ఏలయనగా ధర్మశాస్త్రము ఇంకను నెరవేరలేదని మరియు ప్రతి పొల్లునందు అది నెరవేరవలెనని వారికి తెలియజేయబడెను; అనగా, అది నెరవేరవలెనని, అదంతయు నెరవేరు వరకు ఒక పొల్లు లేదా ఒక రవ్వ అయినను పోదని వాక్యము వారికి వచ్చెను; కావున ఈ సంవత్సరమందే వారు తమ పొరపాటు తెలుసుకొని, వారి తప్పులను ఒప్పుకొనిరి.

26 ఆ విధముగా పరిశుద్ధ ప్రవక్తలందరి ప్రవచనములను బట్టి, సంభవించిన సూచకక్రియలను బట్టి జనులకు సువర్తమానములను తెచ్చుచూ తొంబది రెండవ సంవత్సరము గతించిపోయెను.

27 మరియు దేశమును పట్టి పీడించుచూ పర్వతములపై నివసించుచున్న గాడియాంటన్‌ దొంగల వలన తప్ప, తొంబది మూడవ సంవత్సరము కూడా సమాధానమందు గడిచిపోయెను; ఏలయనగా వారి దుర్గములు, వారి రహస్య స్థలములు ఎంతో బలమైనవిగా ఉన్నందున, జనులు వారిని జయించలేకపోయిరి; కావున, వారు అనేక హత్యలు చేయుచూ జనుల మధ్య అధిక సంహారము జరిగించిరి.

28 తొంబది నాలుగవ సంవత్సరమందు వారు ఒక గొప్ప స్థాయిలో వృద్ధిచెందసాగిరి, ఎందుచేతననగా నీఫైయుల అసమ్మతీయులలో అనేకులు వారి యొద్దకు పారిపోయిరి మరియు అది దేశమందు నిలిచిన నీఫైయులకు అధిక దుఃఖము కలుగజేసెను.

29 లేమనీయుల మధ్య కూడా అధిక దుఃఖము యొక్క హేతువుండెను; ఏలయనగా బలముగా వృద్ధిచెందుచూ వయస్సులో ఎదుగుచున్న అనేకమంది పిల్లలను వారు కలిగియుండిరి మరియు వారు తమ చిత్తప్రకారము చేయుచూ గాడియాంటన్‌ దొంగలతో చేరుటకు కొందరు జోరమీయుల యొక్క అబద్ధములు, ఇచ్ఛకపు మాటల చేత నడిపించివేయబడిరి.

30 ఆ విధముగా లేమనీయులు కూడా బాధింపబడి, యువతరము యొక్క దుష్టత్వమును బట్టి, వారి విశ్వాసము మరియు నీతి విషయమై క్షీణించసాగిరి.