లేఖనములు
3 నీఫై 24


24వ అధ్యాయము

రెండవరాకడ కొరకు ప్రభువు యొక్క దేవదూత మార్గమును సిద్ధపరచును—క్రీస్తు తీర్పునందు కూర్చొనును—దశమభాగములు మరియు అర్పణములు చెల్లించవలెనని ఇశ్రాయేలు ఆజ్ఞాపించబడెను—ఒక జ్ఞాపకార్థ గ్రంథము వ్రాయబడును—మలాకీ 3తో పోల్చుము. సుమారు క్రీ. శ. 34 సం.

1 తండ్రి మలాకీకి ఇచ్చిన వాటితో పాటు, ఆయన వారికి చెప్పబోవు మాటలను వారు వ్రాయవలెనని ఆయన వారిని ఆజ్ఞాపించెను. అవి వ్రాయబడిన తరువాత ఆయన వాటిని వివరించెను మరియు ఆయన ఇట్లు చెప్పుచూ వారితో పలికిన మాటలు ఇవే: ఈ విధముగా తండ్రి మలాకీతో చెప్పెను—ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2 అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటి వాడు, చాకలివాని సబ్బువంటి వాడు.

3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.

4 అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును, యూదా వారును యెరూషలేము నివాసులును చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును.

5 తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణీకుల మీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

6 యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

7 మీ పితరుల నాటినుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరిగెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవియ్యగా—మేము దేని విషయములో తిరుగుదుమని మీరందురు.

8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.

9 ఈ జనులందరును నా యొద్ద దొంగిలుచునే యున్నారు, మీరు శాపగ్రస్తులై యున్నారు.

10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు క్రుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

11 మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

12 అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

13 యెహోవా సెలవిచ్చునదేమనగా—నన్ను గూర్చి మీరు గర్వపు మాటలు పలికి—నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు.

14 దేవుని సేవచేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు,

15 గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు.

16 అప్పుడు, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

17 నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

18 అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు.