లేఖనములు
3 నీఫై 11


సమృద్ధిదేశమందు సమూహము సమకూడియుండగా యేసు క్రీస్తు తననుతాను నీఫై జనులకు కనబరచుకొని, వారికి పరిచర్య చేసెను; మరియు ఈ విధముగా ఆయన తననుతాను వారికి కనబరచుకొనెను.

11 నుండి 26 అధ్యాయములు కలిగియున్నవి.

11వ అధ్యాయము

తండ్రి తన ప్రియకుమారుని గూర్చి సాక్ష్యమిచ్చును—క్రీస్తు అగుపించును మరియు తన ప్రాయశ్చిత్తమును గూర్చి ప్రకటించును—ఆయన చేతులు, కాళ్ళు మరియు ప్రక్కలలోని గాయముల గుర్తులను జనులు స్పృశించి తెలుసుకొందురు—హోసన్నా అని వారు కేక వేయుదురు—ఆయన బాప్తిస్మము యొక్క విధి, విధానములను స్థిరపరచును—వివాదము యొక్క ఆత్మ అపవాదికి సంబంధించినది—మనుష్యులు విశ్వసించి, బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను పొందవలెను అనునది క్రీస్తు యొక్క సిధ్ధాంతము. సుమారు క్రీ. శ. 34 సం.

1 ఇప్పుడు సమృద్ధిదేశమందున్న దేవాలయము చుట్టూ నీఫై జనుల యొక్క గొప్ప సమూహమొకటి సమకూడియుండెను; వారు విస్మయమొంది, ఆశ్చర్యముతో ఒకరితోనొకరు మాట్లాడుకొనుచూ అక్కడ సంభవించిన గొప్ప అద్భుతమైన మార్పును ఒకరికొకరు చూపుచుండిరి.

2 మరియు ఎవరి మరణమును గూర్చి సూచన ఇవ్వబడినదో, ఆ యేసు క్రీస్తును గూర్చి కూడా వారు మాట్లాడుచుండిరి.

3 వారు ఆ విధముగా ఒకరితోనొకరు మాట్లాడుచుండగా పరలోకము నుండి వచ్చినట్లున్న ఒక స్వరమును వారు వినిరి; వారు చుట్టూ చూసిరి, ఏలయనగా వారు వినిన స్వరమును వారు గ్రహించలేదు; అది కఠినమైన స్వరము కాదు లేదా బిగ్గర స్వరము కాదు; అది నిమ్మళమైన స్వరమైనప్పటికీ, వినిన వారిని అది ప్రభావితము చేసెను, ఎంతగాననగా వారి శరీరములోని ప్రతి భాగమును అది కంపించునట్లు చేసెను; అది సూటిగా వారి ఆత్మకు గ్రుచ్చుకొని, వారి హృదయములు దహించునట్లు చేసెను.

4 మరలా వారు ఆ స్వరమును వినిరి, కానీ దానిని గ్రహించలేదు.

5 తిరిగి మూడవసారి వారు ఆ స్వరమును విని, దానిని ఆలకించుటకు తమ చెవులను తెరచిరి; వారి చూపు దాని శబ్దము వైపు ఉండెను మరియు శబ్దము వచ్చుచున్న పరలోకము వైపు వారు స్థిరముగా చూచుచుండిరి.

6 మూడవసారి వారు వినిన స్వరమును వారు గ్రహించిరి మరియు అది వారితో ఇట్లు చెప్పెను:

7 ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయనయందు నేను నా నామమును మహిమపరచియున్నాను—ఈయన మాట వినుడి.

8 మరియు వారు గ్రహించినప్పుడు, వారు తమ కన్నులెత్తి మరలా పరలోకము వైపు చూచిరి; ఒక మనుష్యుడు పరలోకము నుండి దిగివచ్చుటను వారు చూచిరి; ఆయన తెల్లటి నిలువుటంగీని ధరించియుండెను; ఆయన క్రిందికి వచ్చి, వారి మధ్య నిలిచెను; మరియు సమస్త సమూహము యొక్క దృష్టి ఆయన పైనుండెను; వారు ఒకరితోనొకరు మాట్లాడునట్లు నోరు తెరుచుటకు కూడా ధైర్యము చేయలేదు మరియు దాని అర్థము ఎరుగలేదు, ఏలయనగా వారికి ప్రత్యక్షమైనది ఒక దేవదూతయని వారు తలంచిరి.

9 ఆయన తన చేతిని ముందుకు చాపి, జనులతో ఇట్లు చెప్పుచూ పలికెను:

10 ఇదిగో లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసు క్రీస్తును నేనే.

11 నేను లోకమునకు వెలుగును, జీవమునైయున్నాను; తండ్రి నాకు ఇచ్చిన ఆ చేదు గిన్నెనుండి నేను త్రాగియున్నాను మరియు లోక పాపములను నాపై తీసుకొనుటలో తండ్రిని మహిమపరచియున్నాను, ఆది నుండి అన్ని విషయములందు తండ్రి యొక్క చిత్తమునకు లోబడియుండుటకు నేను దానిని సహించియున్నాను.

12 మరియు యేసు ఈ మాటలను పలికినప్పుడు సమూహమంతా నేలపై పడెను; ఏలయనగా పరలోకములోనికి ఆయన ఆరోహణము తర్వాత, క్రీస్తు తననుతాను వారికి కనబరచుకొనునని ప్రవచింపబడినదని వారు జ్ఞాపకము చేసుకొనిరి.

13 మరియు ప్రభువు ఇట్లు చెప్పుచూ వారితో మాట్లాడెను:

14 మీరు మీ చేతులతో నా ప్రక్కలను తాకునట్లు, నా చేతులు మరియు నా కాళ్ళలోని మేకుల గుర్తులను తడిమి తెలుసుకొనునట్లు, నేను ఇశ్రాయేలు దేవుడనని, సమస్త భూమి యొక్క దేవుడనని మరియు లోక పాపముల కొరకు సంహరింపబడితినని మీరు తెలుసుకొనునట్లు లేచి నా యొద్దకు రండి.

15 అంతట సమూహము ముందుకు వెళ్ళి, తమ చేతులతో ఆయన ప్రక్కలను తాకిరి మరియు ఆయన చేతులలో, కాళ్ళలో మేకుల గుర్తులను తడిమి తెలుసుకొనిరి; వారందరు ముందుకు వెళ్ళువరకు ఒకని తరువాత ఒకడు వెళ్ళుచూ వారు దీనిని చేసిరి, వారు తమ కన్నులతో చూచి, చేతులతో తడిమి తెలుసుకొనిరి మరియు ఎవరైతే రావలెనని ప్రవక్తల చేత వ్రాయబడినదో అది నిశ్చయముగా ఆయనేనని తెలుసుకొని, సాక్ష్యమిచ్చిరి.

16 వారందరు ముందుకు వెళ్ళి, తమంతట తాము చూచినప్పుడు వారు ఇట్లు చెప్పుచూ ఒకుమ్మడిగా కేకవేసిరి:

17 హోసన్నా! అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక! అనుచూ వారు యేసు పాదముల యొద్ద సాష్టాంగపడి, ఆయనను ఆరాధించిరి.

18 ఆయన నీఫైతో మాట్లాడి (ఏలయనగా నీఫై సమూహము మధ్యనుండెను), అతడు ముందుకు రావలెనని ఆజ్ఞాపించెను.

19 మరియు నీఫై లేచి ముందుకు వెళ్ళి, ప్రభువు యెదుట సాష్టాంగపడి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను.

20 ప్రభువు అతడిని పైకి లెమ్మని ఆజ్ఞాపించగా, అతడు లేచి ఆయన యెదుట నిలబడెను.

21 నేను తిరిగి పరలోకమునకు ఆరోహణమైనప్పుడు నీవు ఈ జనులకు బాప్తిస్మమిచ్చునట్లు నేను నీకు శక్తినిచ్చుచున్నానని ప్రభువు అతనితో చెప్పెను.

22 మరలా ప్రభువు ఇతరులను పిలిచి, వారితో ఆలాగునే చెప్పి, బాప్తిస్మమిచ్చుటకు ఆయన వారికి శక్తినిచ్చెను. మరియు ఆయన వారితో ఇట్లనెను: ఈ విధముగా మీరు బాప్తిస్మమియ్యవలెను; మీ మధ్య ఎట్టి వివాదములుండరాదు.

23 నిశ్చయముగా నేను మీకు చెప్పుచున్నాను, మీ మాటల ద్వారా తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, నా నామమందు బాప్తిస్మము పొందగోరిన వారికి ఈ విధముగా మీరు బాప్తిస్మమియ్యవలెను—ఇదిగో, మీరు నీటిలోనికి వెళ్ళి నిలబడి, నా నామమందు వారికి బాప్తిస్మమియ్యవలెను.

24 మరియు ఇట్లు చెప్పుచూ వారిని పేరుపెట్టి పిలుచుచూ మీరు చెప్పవలసిన మాటలు ఇవే:

25 యేసు క్రీస్తు నుండి అధికారమును పొందియుండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నేను నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆమేన్‌.

26 అప్పుడు మీరు వారిని నీటిలో పూర్తిగా ముంచి, పైకి తీసుకురావలెను.

27 ఈ మాదిరిని మీరు నా నామమున బాప్తిస్మమియ్యవలెను; ఏలయనగా నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఏకమైయున్నారు; తండ్రియందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాము మరియు తండ్రి, నేను ఏకమైయున్నాము.

28 నేను మిమ్ములను ఆజ్ఞాపించిన విధముగా మీరు బాప్తిస్మమియ్యవలెను. ఇంతవరకు ఉన్నట్లుగా మీ మధ్య ఏ వివాదములుండరాదు లేదా ఇంతవరకు ఉన్నట్లు నా సిద్ధాంతము యొక్క అంశములను గూర్చి మీ మధ్య వివాదములుండరాదు.

29 ఏలయనగా నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, వివాదము యొక్క ఆత్మను కలిగియున్నవాడు నా సంబంధి కాడు, కానీ వివాదము యొక్క తండ్రియైన అపవాది సంబంధియై యున్నాడు; మరియు వారు ఒకరితోనొకరు కోపముతో పోరాడునట్లు మనుష్యుల హృదయాలను అతడు పురిగొల్పును.

30 ఇదిగో, ఒకరికి వ్యతిరేకముగా మరొకరు కోపముతోనుండునట్లు మనుష్యుల హృదయాలను పురిగొల్పుట నా సిద్ధాంతము కాదు; కానీ, అట్టి క్రియలు ఆపి వేయవలెను అనునదే నా సిద్ధాంతమైయున్నది.

31 ఇదిగో నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, నేను నా సిద్ధాంతమును మీకు ప్రకటించెదను.

32 ఇదే నా సిద్ధాంతము మరియు ఇదే నా తండ్రి నాకు ఇచ్చిన సిద్ధాంతము; నేను తండ్రిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మరియు పరిశుద్ధాత్మ తండ్రిని గూర్చియు, నన్ను గూర్చియు సాక్ష్యమిచ్చును; మరియు పశ్చాత్తాపపడుటకు, నా యందు విశ్వాసముంచుటకు ప్రతిచోట మనుష్యులందరిని తండ్రి ఆజ్ఞాపించునని నేను సాక్ష్యమిచ్చుచున్నాను.

33 నా యందు విశ్వాసముంచి, బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును మరియు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనువారు వారే.

34 నా యందు విశ్వాసముంచక, బాప్తిస్మము పొందని వాడు శపించబడును.

35 నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, ఇదే నా సిద్ధాంతము మరియు తండ్రి నుండి వచ్చినదానికి నేను సాక్ష్యమిచ్చుచున్నాను; నా యందు విశ్వాసముంచు వాడు తండ్రి యందు కూడా విశ్వాసముంచును మరియు తండ్రి నన్ను గూర్చి అతనికి సాక్ష్యమిచ్చును, ఏలయనగా ఆయన అగ్నితో, పరిశుద్ధాత్మతో అతడిని దర్శించును.

36 ఆ విధముగా తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును మరియు పరిశుద్ధాత్మ అతనికి తండ్రిని గూర్చి, నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును; ఏలయనగా తండ్రి, నేను మరియు పరిశుద్ధాత్మ ఏకమైయున్నాము.

37 మరలా నేను మీతో చెప్పుచున్నాను, మీరు పశ్చాత్తాపపడి ఒక చిన్న బిడ్డవలే అయి, నా నామమందు బాప్తిస్మము పొందవలెను, లేనియెడల మీరు ఏవిధముగాను ఈ విషయములను పొందలేరు.

38 మరలా నేను మీతో చెప్పుచున్నాను, మీరు పశ్చాత్తాపపడి నా నామమందు బాప్తిస్మము పొంది ఒక చిన్న బిడ్డవలే కావలెను, లేని యెడల మీరు ఏవిధముగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు.

39 నిశ్చయముగా, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, ఇదే నా సిద్ధాంతము; దీనిపైన కట్టువారు నా బండ మీద కట్టుదురు మరియు పాతాళలోక ద్వారములు వారి యెదుట నిలువనేరవు.

40 మరియు ఎవడు దీనికన్నా ఎక్కువ లేదా తక్కువ ప్రకటించునో, అది నా సిద్ధాంతమని స్థాపించునో, అతడు దుష్టుని నుండి వచ్చును మరియు నా బండ మీద కట్టబడలేదు; కానీ, అతడు ఒక ఇసుక పునాదిపై కట్టును మరియు వరదలు వచ్చి, తుఫాను వారిని కొట్టినప్పుడు అట్టి వారిని చేర్చుకొనుటకు పాతాళలోక ద్వారములు తెరువబడియుండును.

41 కావున ఈ జనుల యొద్దకు వెళ్ళి, భూదిగంతముల వరకు నేను పలికిన మాటలను ప్రకటించుము.