లేఖనములు
3 నీఫై 13


13వ అధ్యాయము

యేసు నీఫైయులకు ప్రభువు యొక్క ప్రార్థనను నేర్పును—వారు పరలోకమందు నిధులను కూర్చుకొనవలెను—వారి పరిచర్యలో ఐహికమైన విషయముల కొరకు ఎట్టి ఆలోచన చేయరాదని పండ్రెండుగురు శిష్యులు ఆజ్ఞాపించబడిరి—మత్తయి 6 తో పోల్చుము. సుమారు క్రీ. శ. 34 సం.

1 నిశ్చయముగా నేను చెప్పునదేమనగా—మీరు బీదలకు ధర్మము చేయవలెనని నేను కోరుదును; కానీ, మనుష్యులకు కనబడవలెనని వారి యెదుట మీ నీతికార్యము చేయకుండా జాగ్రత్తపడుడి; లేని యెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.

2 కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యులవలన ఘనతనొందవలెనని, వేషధారులు సమాజమందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

3 నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ ఎడమచేతికి తెలియకయుండవలెను;

4 అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు బహిరంగముగా ప్రతిఫలమిచ్చును.

5 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను, వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

6 నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గది లోనికి వెళ్ళి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు బహిరంగముగా ప్రతిఫలమిచ్చును.

7 కానీ మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు.

8 మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.

9 కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక.

10 నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.

11 మరియు మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

12 మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము.

13 ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవైయున్నవి. ఆమేన్‌.

14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును;

15 మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన యెడల, మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

16 ఇంకను మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలే దుఃఖముఖులై యుండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

17 కానీ నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తలను అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము;

18 రహస్యమందున్న నీ తండ్రికే తప్ప, ఉపవాసము చేయుచున్నట్లు నీవు మనుష్యులకు కనబడరాదు; అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు బహిరంగముగా ప్రతిఫలమిచ్చును.

19 భూమి మీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు.

20 కానీ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దాని తినివేయదు; దొంగలు కన్నము వేసి దొంగిలరు.

21 నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.

22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల, నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.

23 కానీ, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమైయుండును. నీలోనున్న వెలుగు చీకటియై యుండినయెడల, ఆ చీకటి ఎంతో గొప్పది!

24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.

25 మరియు యేసు ఈ మాటలను పలికినప్పుడు, ఆయన తాను ఎన్నుకొనిన పడ్రెండుగురి వైపు చూచి వారితో ఇట్లు చెప్పెను: నేను పలికిన మాటలను జ్ఞాపకముంచుకొనుడి. ఏలయనగా ఈ జనులకు పరిచర్య చేయుటకు నేను ఎన్నుకొనిన వారు మీరే. అందువలన నేను మీతో చెప్పునదేమనగా—ఏమి తిందుమో ఏమి త్రాగుదుమోయని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమోయని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?

26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్టులు కారా?

27 మీలో నెవడు చింతించుట వలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

28 వస్త్రములను గూర్చి మీరు చింతింపనేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి; అవి కష్టపడవు, ఒడకవు.

29 అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.

30 నేడుండి రేపు పొయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడీలాగు అలంకరించిన యెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా.

31 కాబట్టి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి.

32 ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

33 కానీ మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడును.

34 రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును.