లేఖనములు
3 నీఫై 17


17వ అధ్యాయము

ఆయన మాటలను ధ్యానించి, గ్రహింపు కొరకు ప్రార్థన చేయమని యేసు జనులకు నిర్దేశించును—వారి మధ్యనున్న రోగులను ఆయన స్వస్థపరచును—వ్రాయబడలేని భాషను ఉపయోగించుచూ ఆయన జనుల కొరకు ప్రార్థన చేయును—వారి చిన్నపిల్లలకు దేవదూతలు పరిచర్య చేయుదురు మరియు అగ్ని వారిని చుట్టుకొనును. సుమారు క్రీ. శ. 34 సం.

1 యేసు ఈ మాటలను చెప్పినప్పుడు, ఆయన తిరిగి సమూహము వైపు చూచి వారితో ఇట్లనెను: ఇదిగో, నా సమయము ఆసన్నమైనది.

2 మీరు బలహీనులైయున్నారని, తండ్రి చేత ఆజ్ఞాపించబడి ఈ సమయమున నేను మీతో చెప్పిన నా మాటలన్నియు మీరు గ్రహించలేరని నేను చూచుచున్నాను.

3 కావున మీరు మీ గృహములకు వెళ్ళి, నేను చెప్పిన ఆ విషయములను ధ్యానించుడి మరియు మీరు గ్రహించునట్లు నా నామమందు తండ్రిని అడుగుడి; రేపటి కొరకు మీ మనస్సులు సిద్ధము చేసుకొనుడి మరియు నేను మీ యొద్దకు తిరిగి వచ్చెదను.

4 అయితే, ఇప్పుడు నేను తండ్రి యొద్దకు మరియు ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గోత్రములకు నన్ను కనబరచుకొనుటకు వెళ్ళెదను, ఏలయనగా ఆయన వారిని ఎక్కడకు కొనిపోయెనో ఆయన ఎరుగును గనుక వారు తండ్రి దృష్టిలో తప్పిపోయిన వారు కారు.

5 యేసు ఆ విధముగా పలికినప్పుడు, ఆయన సమూహము వైపు చూచెను మరియు వారు కన్నీళ్ళతో ఉండి, మరికొంతసేపు వారితో నిలిచియుండమని ఆయనను అడుగుచున్నట్లు ఆయనవైపు తదేకముగా చూచుటను కనుగొనెను.

6 ఆయన వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో, నా ఆంత్రములు మీ యెడల కనికరముతో నిండియున్నవి.

7 మీ మధ్య రోగులెవరైనా ఉన్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి. కుంటివారు, గ్రుడ్డివారు లేదా కదలలేని వారు, వికలాంగులు, కుష్ఠువారు, ఊచకాలు చేతులు గలవారు, చెవిటి వారు లేదా ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను, ఏలయనగా నేను మీ యెడల కనికరము కలిగియున్నాను; నా ఆంత్రములు కనికరముతో నిండియున్నవి.

8 ఏలయనగా యెరూషలేములోనున్న మీ సహోదరులకు నేను ఏమి చేసియున్నానో దానిని మీకు చూపవలెనని మీరు కోరుచున్నారని, నేను మిమ్ములను స్వస్థపరచుటకు మీ విశ్వాసము చాలునని నేను చూచుచున్నాను.

9 ఆయన ఆ విధముగా పలికినప్పుడు, సమూహమంతా కలిసి వారి రోగులను, బాధింపబడిన వారిని, కుంటివారిని, గ్రుడ్డివారిని, మూగవారిని మరియు ఏ విధముగానైనను బాధింపబడిన వారందరిని తీసుకొని ముందుకు వెళ్ళిరి; ఆయన యొద్దకు వారిని తీసుకురాగా, ఆయన వారిలో ప్రతివానిని స్వస్థపరిచెను.

10 వారందరు, అనగా స్వస్థపరచబడినవారు మరియు ఆరోగ్యముగా ఉన్నవారు ఇరువురు ఆయన పాదములవద్ద మోకరించి, ఆయనను ఆరాధించిరి; సమూహము నుండి రాగలిగిన వారందరు వచ్చి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొనిరి, ఎంతగాననగా వారు ఆయన పాదములను కన్నీళ్ళతో కడిగిరి.

11 అప్పుడు వారి చిన్నపిల్లలను తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించెను.

12 కావున వారు తమ చిన్నపిల్లలను తీసుకువచ్చి ఆయన చుట్టూ నేలపై కూర్చోబెట్టగా, యేసు వారి మధ్యలో నిలిచెను మరియు వారందరు ఆయన యొద్దకు తేబడువరకు సమూహము దారి ఇచ్చెను.

13 వారందరు తీసుకురాబడి యేసు వారి మధ్యలో నిలిచియున్నప్పుడు, వారు నేలపై మోకరించవలెనని ఆయన సమూహమును ఆజ్ఞాపించెను.

14 వారు నేలపై మోకరించినప్పుడు, యేసు తనలోతాను మూలుగుచు ఇట్లనెను: తండ్రీ, ఇశ్రాయేలు వంశస్థుల దుష్టత్వమును బట్టి నేను కలత చెందియున్నాను.

15 మరియు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన కూడా నేలపై మోకరించి, తండ్రిని ప్రార్థించెను; ఆయన ప్రార్థనలో ఉచ్ఛరించిన మాటలు వ్రాయబడలేవు మరియు ఆయనను వినిన సమూహము దానిని గూర్చి సాక్ష్యమిచ్చిరి.

16 ఈ విధముగా వారు సాక్ష్యమిచ్చిరి: యేసు, తండ్రితో మాట్లాడగా మేము చూచిన మరియు వినిన అంత గొప్ప అద్భుతమైన విషయములు ముందెన్నడూ కన్ను చూసియుండలేదు లేదా చెవి వినియుండలేదు.

17 యేసు మాట్లాడగా మేము చూచిన మరియు వినిన అంత గొప్ప అద్భుతమైన విషయములను ఏ నాలుక పలుకలేదు, ఏ మనుష్యుని చేతనైనను అవి వ్రాయబడలేవు, లేదా మనుష్యుల హృదయములు వాటిని ఊహించలేవు; మా కొరకు తండ్రిని ఆయన ప్రార్థించుటను మేము వినిన సమయమున, మా ఆత్మలను నింపిన ఆనందమును ఎవ్వరూ ఉహించలేరు.

18 యేసు తండ్రిని ప్రార్థించుట ముగించినప్పుడు ఆయన పైకి లేచెను; కానీ సమూహము యొక్క ఆనందము ఎంత గొప్పదనగా వారు అధిగమించబడిరి.

19 మరియు యేసు వారితో, పైకి లేవమని చెప్పెను.

20 వారు నేల పైనుండి లేవగా, ఆయన వారితో ఇట్లు చెప్పెను: మీ విశ్వాసమును బట్టి మీరు ధన్యులు. ఇప్పుడు నా ఆనందము సంపూర్ణమాయెను.

21 ఆయన ఈ మాటలను చెప్పినప్పుడు ఆయన కన్నీళ్ళు విడిచెను, దానికి సమూహము సాక్ష్యమిచ్చిరి; మరియు ఆయన వారి చిన్న పిల్లలను ఒకరి తరువాత ఒకరిని తీసుకొని, వారిని ఆశీర్వదించి, వారి కొరకు తండ్రిని ప్రార్థించెను.

22 ఆయన దీనిని చేసినప్పుడు, ఆయన తిరిగి కన్నీళ్ళు విడిచెను;

23 ఆయన సమూహముతో మాట్లాడి, వారితో—మీ చిన్నపిల్లలను చూడుడి అని చెప్పెను.

24 వారు చిన్నపిల్లలను చూచుచూ తమ దృష్టిని పరలోకము వైపు త్రిప్పగా, పరలోకములు తెరువబడియుండుటను చూచిరి మరియు అది అగ్నిమధ్యలో నుండియైనట్లు పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చుటను వారు చూచిరి; వారు క్రిందికి దిగి వచ్చి, చిన్నపిల్లల చుట్టూ చుట్టుకొనిరి మరియు వారు అగ్నితో చుట్టుకొనబడగా, దేవదూతలు వారికి పరిచర్య చేసిరి.

25 మరియు సమూహము దానిని చూచి, విని, సాక్ష్యమిచ్చిరి; వారి సాక్ష్యము సత్యమని వారెరుగుదురు, ఏలయనగా వారిలో ప్రతి మనుష్యుడు తనకుతానే చూచి, వినెను; వారు సంఖ్యలో సుమారు రెండు వేల అయిదు వందల ఆత్మలైయుండిరి; వారిలో పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు గలరు.