లేఖనములు
3 నీఫై 18


18వ అధ్యాయము

యేసు నీఫైయుల మధ్య సంస్కారమును స్థాపించును—ఆయన నామమందు ఎల్లప్పుడు ప్రార్థన చేయవలెనని వారు ఆజ్ఞాపించబడుదురు—అయోగ్యముగా ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగువారు శిక్షింపబడుదురు—పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు శిష్యులకు శక్తి ఇవ్వబడును. సుమారు క్రీ. శ. 34 సం.

1 వారు కొంత రొట్టె మరియు ద్రాక్షారసమును ఆయన యొద్దకు తేవలెనని యేసు తన శిష్యులను ఆజ్ఞాపించెను.

2 రొట్టె మరియు ద్రాక్షారసము కొరకు వారు వెళ్ళియుండగా, సమూహము నేలపై కూర్చుండవలెనని ఆయన ఆజ్ఞాపించెను.

3 శిష్యులు రొట్టె మరియు ద్రాక్షారసముతో వచ్చినప్పుడు, ఆయన రొట్టెను తీసుకొని విరిచి ఆశీర్వదించెను; మరియు దానిని శిష్యులకు ఇచ్చి, వారు తినవలెనని ఆయన ఆజ్ఞాపించెను.

4 వారు తిని తృప్తి పొందినప్పుడు, వారు సమూహమునకు ఇవ్వవలెనని ఆయన ఆజ్ఞాపించెను.

5 మరియు సమూహము తిని తృప్తి పొందినప్పుడు, ఆయన శిష్యులతో ఇట్లు చెప్పెను: ఇదిగో, మీలో ఒకరిని నేను నియమించెదను; అతడు రొట్టెను విరిచి ఆశీర్వదించి, దానిని నా సంఘమందలి జనులకు మరియు నా నామమందు విశ్వసించి, బాప్తిస్మము పొందు వారందరికి ఇచ్చునట్లు అతనికి నేను అధికారము నిచ్చెదను.

6 నేను చేసియున్నట్లే, అనగా నేను రొట్టెను విరిచి ఆశీర్వదించి, దానిని మీకు ఇచ్చినట్లుగానే మీరును ఎల్లప్పుడు దీనిని చేయుడి.

7 నేను మీకు చూపిన నా శరీరము యొక్క జ్ఞాపకార్థము మీరు దీనిని చేయవలెను. మీరు నన్ను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొందురని తండ్రికి అది ఒక సాక్ష్యముగా ఉండును; మరియు మీరు ఎల్లప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనిన యెడల, మీరు నా ఆత్మను కలిగియుందురు.

8 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, వారు పాత్రలోని ద్రాక్షారసమును తీసుకొని త్రాగవలెనని మరియు సమూహము దాని నుండి త్రాగునట్లు వారికి కూడా ఇవ్వవలెనని ఆయన తన శిష్యులను ఆజ్ఞాపించెను.

9 వారు అట్లు చేసిరి మరియు దాని నుండి త్రాగి, తృప్తి పొందిరి; తరువాత వారు సమూహమునకు ఇచ్చిరి మరియు వారు త్రాగి, తృప్తి పొందిరి.

10 శిష్యులు దీనిని చేసినప్పుడు యేసు వారితో ఇట్లు చెప్పెను: మీరు చేసిన ఈ విషయము నిమిత్తము మీరు ధన్యులు, ఏలయనగా ఇది నా ఆజ్ఞలను నెరవేర్చుట అయ్యున్నది మరియు నేను మీకు ఆజ్ఞాపించిన దానిని చేయుటకు మీరు సమ్మతించుచున్నారని తండ్రికి ఇది సాక్ష్యమిచ్చుచున్నది.

11 పశ్చాత్తాపపడి, నా నామమందు బాప్తిస్మము పొందు వారికి దీనిని మీరు ఎల్లప్పుడు చేయవలెను; మరియు మీరు నన్ను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొందురని మీరు తండ్రికి సాక్ష్యమిచ్చునట్లు నేను మీ కొరకు చిందించిన నా రక్తము యొక్క జ్ఞాపకార్థము మీరు దీనిని చేయవలెను. మీరు ఎల్లప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనిన యెడల, మీరు నా ఆత్మను కలిగియుందురు.

12 మీరు ఈ విషయములను చేయవలెనని నేను మీకు ఒక ఆజ్ఞనిచ్చుచున్నాను. మీరు ఈ విషయములను ఎల్లప్పుడు చేసిన యెడల మీరు ధన్యులు, ఏలయనగా మీరు నా బండ మీద కట్టబడియున్నారు.

13 కానీ మీ మధ్య వీటికన్నా ఎక్కువ లేదా తక్కువ చేయు వారెవరైనను నా బండ మీద కట్టబడలేదు, కానీ ఇసుక పునాది మీద కట్టబడియున్నారు; వాన కురిసి, వరదలు వచ్చి, గాలులు వీచి వాటిపై కొట్టినప్పుడు వారు పడిపోవుదురు మరియు వారిని చేర్చుకొనుటకు పాతాళలోక ద్వారములు తెరువబడి సిద్ధముగా ఉండును.

14 కావున, నేను మీకు ఇవ్వవలెనని తండ్రి నాకు ఆజ్ఞాపించిన నా ఆజ్ఞలను మీరు పాటించిన యెడల, మీరు ధన్యులు.

15 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—మీరు అపవాది చేత శోధింపబడి, అతని చేత దాసులుగా నడిపించి వేయబడకుండునట్లు ఎల్లప్పుడు మెలకువగానుండి ప్రార్థన చేయుడి.

16 నేను మీ మధ్య ప్రార్థన చేసిన ప్రకారము, మీరు సంఘము నందు మరియు పశ్చాత్తాపపడి, నా నామమందు బాప్తిస్మము పొందిన నా జనుల మధ్య ప్రార్థన చేయవలెను. ఇదిగో నేను వెలుగునైయున్నాను; నేను మీ కొరకు ఒక మాదిరిని ఉంచియున్నాను.

17 యేసు తన శిష్యులకు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన మరలా సమూహము వైపు తిరిగి వారితో ఇట్లు చెప్పెను:

18 ఇదిగో, నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ఎల్లప్పుడు మెలకువగానుండి ప్రార్థన చేయవలెను; ఏలయనగా సాతాను మిమ్మును పట్టి గోధుమలవలే జల్లించుటకు మిమ్మును కోరుచున్నాడు.

19 కావున మీరు ఎల్లప్పుడు తండ్రికి నా నామమున ప్రార్థన చేయవలెను;

20 మరియు మీరు పొందుదురని విశ్వసించుచూ సరియైనది ఏదైనను నా నామమందు మీరు తండ్రిని అడిగిన యెడల, అది మీకు ఇవ్వబడును.

21 మీ భార్యాపిల్లలు ఆశీర్వదింపబడునట్లు, మీ కుటుంబములలో తండ్రికి ఎల్లప్పుడు నా నామమందు ప్రార్థన చేయుడి.

22 ఇదిగో, మీరు తరచుగా సమకూడుకొనవలెను; మీరు సమకూడునప్పుడు మీ యొద్దకు వచ్చుట నుండి ఏ మనుష్యుడిని మీరు ఆటంకపరచరాదు, కానీ వారు మీ యొద్దకు వచ్చునట్లు వారిని అనుమతించుడి మరియు వారిని ఆటంకపరచకుడి;

23 కానీ మీరు వారి కొరకు ప్రార్థన చేయవలెను మరియు వారిని బయటకు గెంటివేయరాదు; వారు తరచుగా మీ యొద్దకు వచ్చిన యెడల, మీరు వారి కొరకు తండ్రికి నా నామమున ప్రార్థన చేయవలెను.

24 కావున, లోకము కొరకు ప్రకాశించునట్లు మీ దీపమును పైకెత్తుడి. ఇదిగో, నేను చేయగా మీరు చూచిన నా మాదిరిని మీరు అనుసరించుడి. నేను తండ్రికి ప్రార్థన చేసియున్నానని మీరు చూచియున్నారు మరియు మీరందరు సాక్ష్యమిచ్చియున్నారు.

25 మీలో ఎవరూ వెళ్ళిపోరాదని, మీరు స్పృశించి తెలుసుకొని, చూచునట్లు నా యొద్దకు మీరు రావలెనని నేను ఆజ్ఞాపించియున్నానని మీరు చూచుచున్నారు; అట్లే మీరు కూడా లోకమునకు చేయవలెను; మరియు ఈ ఆజ్ఞను అతిక్రమించు వారెవరైనను శోధనలోనికి నడపింపబడుటకు తమనుతాము అనుమతించుకొందురు.

26 ఇప్పుడు యేసు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన మరలా తాను ఎన్నుకొనిన శిష్యుల వైపు చూచి, వారితో ఇట్లనెను:

27 ఇదిగో, నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—నేను మరియొక ఆజ్ఞను మీకిచ్చుచున్నాను మరియు తరువాత, ఆయన నాకు ఇచ్చిన ఇతర ఆజ్ఞలను నెరవేర్చునట్లు నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసియున్నది.

28 ఇప్పుడు, నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞ ఇదియే—మీరు దానిని నిర్వహించినప్పుడు, తెలిసి ఎవరూ నా శరీరము మరియు రక్తమునందు అయోగ్యముగా పాలుపొందుటకు మీరు అనుమతించరాదు.

29 ఏలయనగా ఎవరైతే నా శరీరమును మరియు రక్తమును అయోగ్యముగా తిని త్రాగుదురో, వారు తమ ఆత్మకు శిక్షను పానము చేయుదురు; కావున ఒక మనుష్యుడు నా శరీరమును మరియు రక్తమును తినుటకు, త్రాగుటకు అయోగ్యుడని మీకు తెలిసిన యెడల, మీరు అతడిని నిరోధించవలెను.

30 అయినప్పటికీ మీరు అతడిని మీ మధ్య నుండి బయటకు గెంటివేయరాదు, కానీ మీరు అతనికి పరిచర్య చేయవలెను మరియు అతని కొరకు తండ్రిని నా నామమున ప్రార్థించవలెను; అతడు పశ్చాత్తాపపడి, నా నామమందు బాప్తిస్మము పొందిన యెడల, అప్పుడు మీరు అతడిని చేర్చుకొని అతనికి నా శరీరమును మరియు రక్తమును అందించవలెను.

31 కానీ అతడు పశ్చాత్తాపపడని యెడల, అతడు నా జనులను నాశనము చేయకుండునట్లు అతడు నా జనుల మధ్య లెక్కింపబడడు, ఏలయనగా నా గొఱ్ఱెలను నేను ఎరుగుదును మరియు అవి లెక్కింపబడినవి.

32 అయినప్పటికీ మీరు అతడిని మీ సమాజ మందిరములు లేదా మీ ఆరాధనా స్థలములలో నుండి బయటకు గెంటివేయరాదు, ఏలయనగా అట్టి వారికి పరిచర్య చేయుటను మీరు కొనసాగించవలెను; ఏలయనగా వారు తిరిగి వచ్చి పశ్చాత్తాపపడి, హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు వచ్చెదరేమో, నేను వారిని స్వస్థపరచుదునేమో మరియు వారికి రక్షణ తెచ్చుటకు మీరు సాధనముగా ఉందురేమో మీరెరుగరు.

33 కావున మీరు శిక్షావిధి క్రిందికి రాకుండునట్లు నేను ఆజ్ఞాపించిన ఈ మాటలను పాటించుడి; ఏలయనగా తండ్రి శిక్షావిధి విధించువానికి ఆపద.

34 మీ మధ్య ఉండిన తగవులను బట్టి నేను మీకు ఈ ఆజ్ఞలను ఇచ్చుచున్నాను మరియు మీ మధ్య తగవులు లేనియెడల, మీరు ధన్యులు.

35 ఇప్పుడు మీ నిమిత్తము, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట ప్రయోజనకరము. కావున, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను.

36 మరియు యేసు ఈ మాటలు చెప్పుట ముగించినప్పుడు, తాను ఎన్నుకొనిన శిష్యులను ఒకరి తరువాత ఒకరు చొప్పున అందరినీ తాకునంతవరకు, తన చేతితో ఆయన వారిని తాకెను మరియు ఆయన వారిని తాకుచుండగా వారితో మాట్లాడెను.

37 ఆయన చెప్పిన మాటలను సమూహము వినలేదు, కావున వారు సాక్ష్యమియ్యలేదు; కానీ పరిశుద్ధాత్మను ఇచ్చుటకు ఆయన వారికి అధికారమును ఇచ్చెనని శిష్యులు సాక్ష్యమిచ్చిరి మరియు ఈ వృత్తాంతము సత్యమని ఇకమీదట నేను మీకు చూపెదను.

38 యేసు వారందరినీ తాకినప్పుడు, సమూహము యేసును చూడలేకపోవునట్లు అక్కడకు ఒక మేఘము వచ్చి వారిపై కమ్మెను.

39 మరియు వారిపై మేఘము కమ్మినప్పుడు ఆయన వారి నుండి వెడలిపోయి, పరలోకములోనికి ఆరోహణుడయ్యెను. ఆయన పరలోకములోనికి తిరిగి ఆరోహణుడయ్యెనని శిష్యులు చూచి సాక్ష్యమిచ్చిరి.