లేఖనములు
3 నీఫై 27


27వ అధ్యాయము

సంఘము తన నామమున పిలువబడవలెనని యేసు వారిని ఆజ్ఞాపించును—ఆయన పరిచర్యను, ప్రాయశ్చిత్తపు బలిని ఆయన సువార్త కలిగియున్నది—మనుష్యులు పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడునట్లు పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించబడిరి—వారు కూడా యేసు ఉన్నట్లే ఉండవలెను. సుమారు క్రీ. శ. 34–35 సం.

1 యేసు యొక్క శిష్యులు ప్రయాణము చేయుచూ, వారు వినిన మరియు చూచిన విషయములను బోధించుచూ, యేసు నామమున బాప్తిస్మమిచ్చుచుండగా, శిష్యులు సమకూడి బలమైన ప్రార్థనయందు, ఉపవాసమందు ఏకమయిరి.

2 యేసు వారికి మరలా తననుతాను కనబరచుకొనెను, ఏలయనగా వారు ఆయన నామమందు తండ్రికి ప్రార్థన చేయుచుండిరి; యేసు వచ్చి వారి మధ్య నిలిచి, వారితో ఇట్లనెను: నేను మీకేమి ఇవ్వవలెనని మీరు కోరుచున్నారు?

3 అప్పుడు వారు ఆయనతో ఇట్లు చెప్పిరి: ప్రభువా, ఈ సంఘమును మేము ఏ నామమున పిలువవలెనో దయచేసి నీవు మాకు చెప్పవలెనని మేము కోరుచున్నాము; ఏలయనగా ఈ విషయమును గూర్చి జనుల మధ్య వివాదములున్నవి.

4 అంతట ప్రభువు వారితో ఇట్లు చెప్పెను: నిశ్చయముగా నేను చెప్పునదేమనగా, ఈ విషయమును గూర్చి జనులు సణిగి తగవులాడనేల?

5 నా నామమైన క్రీస్తు యొక్క నామమును మీరు మీపై తీసుకొనవలెనని చెప్పు లేఖనములను వారు చదువలేదా? ఏలయనగా ఈ నామము చేతనే అంత్యదినమున మీరు పిలువబడుదురు.

6 మరియు నా నామమును తనపై తీసుకొని, అంతము వరకు స్థిరముగా నిలిచియుండువాడు అంత్యదినమున రక్షించబడును.

7 కావున, మీరు ఏమి చేసినను నా నామమున చేయవలెను; మీరు సంఘమును నా నామమున పిలువవలెను మరియు తండ్రి నా నిమిత్తము సంఘమును దీవించునట్లు, మీరు నా నామమున తండ్రిని ప్రార్థించవలెను.

8 మరియు అది నా నామమున పిలువబడని యెడల, అది నా సంఘము ఎట్లగును? ఏలయనగా ఒక సంఘము మోషే నామమున పిలువబడిన యెడల, అది మోషే సంఘమగును; లేదా అది ఒక మనుష్యుని నామమున పిలువబడిన యెడల, అది ఒక మనుష్యుని సంఘమగును; కానీ అది నా నామమున పిలువబడి, వారు నా సువార్తపై కట్టబడిన యెడల, అప్పుడది నా సంఘమగును.

9 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, మీరు నా సువార్తపై కట్టబడియున్నారు; కావున, ఏ విషయములను అడిగినను మీరు నా నామమున అడుగుడి; సంఘము నిమిత్తము మీరు తండ్రికి ప్రార్థన చేసిన యెడల, అది నా నామమందైన యెడల, తండ్రి మిమ్ములను వినును.

10 మరియు సంఘము నా సువార్తపై కట్టబడిన యెడల, అప్పుడు తండ్రి తన స్వకార్యములను దానియందు చూపును.

11 కానీ అది నా సువార్తపైన కట్టబడకుండా మనుష్యుల క్రియలపైన లేదా అపవాది క్రియలపైన కట్టబడిన యెడల, వారి క్రియలయందు కొంతకాలము వారు సంతోషము కలిగియుందురు మరియు త్వరలోనే అంతము వచ్చును, వారు నరికి వేయబడి అగ్నిలో పడవేయబడుదురు, అక్కడ నుండి తిరిగి రాలేరని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.

12 వారి క్రియలు వారిని వెంబడించును, ఏలయనగా వారి క్రియలను బట్టి వారు నరికి వేయబడియున్నారు; కావున, నేను మీకు చెప్పిన విషయములను జ్ఞాపకముంచుకొనుడి.

13 ఇదిగో నేను మీకు నా సువార్తను ఇచ్చియున్నాను మరియు నేను మీకు ఇచ్చిన సువార్త ఇదియే—తండ్రి నన్ను పంపినందున, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను లోకములోనికి వచ్చియున్నాను.

14 నేను సిలువపైన పైకెత్తబడునట్లు నా తండ్రి నన్ను పంపియున్నాడు; మనుష్యులందరినీ నా వైపు ఆకర్షించుకొనునట్లు నేను సిలువపైన పైకెత్తబడిన తరువాత, మనుష్యులచేత నేను పైకెత్తబడినట్లుగానే, అవి మంచివేగాని చెడ్డవేగాని వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుటకు నా యెదుట నిలబడుటకు మనుష్యులు తండ్రి చేత పైకెత్తబడవలెను—

15 మరియు ఈ హేతువు నిమిత్తము నేను పైకెత్తబడితిని; కావున, వారి క్రియలను బట్టి వారు తీర్పు తీర్చబడునట్లు, తండ్రి యొక్క శక్తిని బట్టి నేను మనుష్యులందరిని నా వైపు ఆకర్షించుకొందును.

16 పశ్చాత్తాపపడి, నా నామమున బాప్తిస్మము పొందువాడు నింపబడును; అతడు అంతము వరకు స్థిరముగానున్న యెడల, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు నిలుచు దినమున అతడిని నా తండ్రి యెదుట నేను నిర్దోషిగా యెంచెదను.

17 మరియు అంతము వరకు స్థిరముగా లేని వాడే నరికి వేయబడి అగ్నిలో పడవేయబడువాడు, తండ్రి యొక్క న్యాయమును బట్టి అక్కడ నుండి వారు ఇక తిరిగిరాలేరు.

18 ఇప్పుడు నరుల సంతానమునకు ఆయన ఇచ్చిన వాక్యము ఇదియే. ఈ హేతువు నిమిత్తము ఆయన ఇచ్చిన మాటలను ఆయన నెరవేర్చును, ఆయన అబద్ధమాడడు, కానీ తన మాటలన్నిటిని నెరవేర్చును.

19 మరియు అపరిశుద్ధమైనదేదియు ఆయన రాజ్యములోనికి ప్రవేశించలేదు; కావున వారి విశ్వాసము, సమస్త పాపముల విషయమై వారి పశ్చాత్తాపము మరియు అంతము వరకు ఉన్న వారి విశ్వాస్యతను బట్టి నా రక్తమందు వారి వస్త్రములను కడుగుకొనిన వారు తప్ప, మరెవరూ ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించలేరు.

20 ఇప్పుడు ఆజ్ఞ ఇదియే: అంత్యదినమున మీరు నా యెదుట మచ్చలేక యుండునట్లు, పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడునట్లు, భూదిగంతములలో నున్న మీరందరు పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి మరియు నా నామమున బాప్తిస్మము పొందుడి.

21 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, ఇదియే నా సువార్త; మరియు నా సంఘములో మీరు చేయవలసిన విషయములను మీరు ఎరిగియున్నారు; ఏలయనగా నేను చేయగా మీరు చూచిన క్రియలను మీరు కూడా చేయవలెను; ఏలయనగా నేను చేయగా మీరు చూచిన దానిని మీరు చేయవలెను;

22 కావున, మీరు ఈ విషయములను చేసిన యెడల మీరు ధన్యులు, ఏలయనగా అంత్యదినమున మీరు పైకి లేపబడుదురు.

23 నిషేధించబడిన వాటిని తప్ప, మీరు చూచిన మరియు వినిన విషయములను వ్రాయుడి.

24 ముందుండిన వాటిని గూర్చి వ్రాయబడినట్లుగా, ఇకపై ఉండబోవు ఈ జనుల యొక్క క్రియలను గూర్చి వ్రాయుడి.

25 ఇదిగో, వ్రాయబడిన మరియు వ్రాయబడబోవు గ్రంథముల ప్రకారము ఈ జనులు తీర్పు తీర్చబడుదురు, ఏలయనగా వాటి ద్వారా వారి క్రియలు మనుష్యులకు తెలియజేయబడును.

26 అన్నివిషయములు తండ్రి చేత వ్రాయబడినవి; కావున, వ్రాయబడబోవు గ్రంథముల ప్రకారము లోకమునకు తీర్పు తీర్చబడును.

27 మరియు నేను మీకు ఇవ్వబోవు న్యాయమైన తీర్పును బట్టి, మీరు ఈ జనుల యొక్క న్యాయాధిపతులుగా ఉందురని మీరు ఎరుగుదురు. కావున, మీరు ఏ విధమైన మనుష్యులై యుండవలెను? నేను ఉన్నట్లుగానే అని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.

28 ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళెదను మరియు నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడును.

29 కావున, అడుగుడి మీకియ్యబడును; తట్టుడి మీకు తీయబడును; అడుగు ప్రతివాడును పొందును; తట్టువానికి తీయబడును.

30 ఇప్పుడు మిమ్ములను బట్టి, ఈ తరమును బట్టి నా సంతోషము సంపూర్ణమగు వరకు గొప్పదాయెను; అవును, మిమ్ములను బట్టి, ఈ తరమును బట్టి తండ్రి మరియు సమస్త పరిశుద్ధ దేవదూతలు కూడా ఆనందించెదరు; ఏలయనగా వారిలో ఒక్కరూ తప్పిపోలేదు.

31 ఇదిగో, మీరు గ్రహించవలెనని నేను కోరుచున్నాను; ఏలయనగా ఈ తరములో, ఇప్పుడు జీవించియున్న వారని నా అర్థము; వారిలో ఎవరూ తప్పిపోలేదు మరియు వారి యందు నేను సంపూర్ణ సంతోషమును కలిగియున్నాను.

32 కానీ, ఈ తరము నుండి నాలుగవ తరమును బట్టి నేను దుఃఖించుచున్నాను, ఏలయనగా వారు నాశనపుత్రునివలే అతని చేత బందీలుగా కొనిపోబడిరి; వెండి బంగారముల కొరకు, చిమ్మెట తినివేయుదాని కొరకు, దొంగలు కన్నము వేసి దొంగిలించు దాని కొరకు వారు నన్ను అమ్మివేయుదురు. ఆ దినమందు వారి క్రియలను వారి శిరస్సులపై త్రిప్పుచూ నేను వారిని దర్శించెదను.

33 మరియు యేసు ఈ మాటలను ముగించినప్పుడు, ఆయన తన శిష్యులతో ఇట్లనెను: ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది, దాని కనుగొనువారు కొందరే; మరణమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది; ఏ మనుష్యుడూ పనిచేయలేని రాత్రి వచ్చు వరకు, దానియందు ప్రయాణము చేయువారు అనేకులు.