లేఖనములు
3 నీఫై 28


28వ అధ్యాయము

పన్నెండుమంది శిష్యులలో తొమ్మిదిమంది మరణించిన తరువాత క్రీస్తు యొక్క రాజ్యములో ఒక స్వాస్థ్యమును కోరుదురు మరియు అది వారికి వాగ్దానము చేయబడును—యేసు తిరిగి వచ్చువరకు భూమిపై నిలుచుటకు ముగ్గురు నీఫైయులు కోరుదురు మరియు వారు మరణముపై అధికారము పొందుదురు—వారు కొనిపోబడుదురు మరియు ఉచ్ఛరింప న్యాయము కాని విషయములను చూచెదరు, ఇప్పుడు వారు మనుష్యుల మధ్య పరిచర్య చేయుచున్నారు. సుమారు క్రీ. శ. 34–35 సం.

1 యేసు ఈ మాటలను చెప్పినప్పుడు, ఆయన తన శిష్యులలో ఒకని తరువాత ఒకనితో మాట్లాడి ఇట్లనెను: నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తరువాత, నా నుండి మీరు ఏమి కోరుచున్నారు?

2 అప్పుడు వారిలో ముగ్గురు తప్ప, అందరు ఇట్లు చెప్పిరి: మేము ఆయుష్షు ఉన్నంతవరకు జీవించి, నీవు మమ్ములను పిలిచిన ఆ పరిచర్య ముగిసిన తరువాత, వేగముగా నీ రాజ్యములోనికి నీ యొద్దకు రావలెనని కోరుచున్నాము.

3 మరియు ఆయన వారితో ఇట్లనెను: నా నుండి దీనిని కోరినందున మీరు ధన్యులు; మీరు డెబ్బది రెండు సంవత్సరముల వారైనప్పుడు, నా రాజ్యములోనికి నా యొద్దకు వచ్చెదరు మరియు నాతో మీరు విశ్రాంతి కనుగొనెదరు.

4 ఆయన వారితో ఇట్లు చెప్పిన తరువాత, ఆ ముగ్గురి వైపు తిరిగి ఇట్లనెను: నేను తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు నేను మీ కొరకు ఏమి చేయవలెనని మీరు కోరుచున్నారు?

5 అంతట వారు తమ హృదయములందు దుఃఖించిరి, ఏలయనగా వారు కోరిన దానిని ఆయనకు చెప్పుటకు వారు ధైర్యము చేయలేదు.

6 అప్పుడు ఆయన వారితో ఇట్లనెను: ఇదిగో, నేను మీ ఆలోచనలను ఎరుగుదును. యూదుల చేత నేను ఎత్తబడుటకు ముందు, నా పరిచర్యలో నాతో ఉన్న నా ప్రియమైన యోహాను నా నుండి కోరిన దానినే మీరు కోరియున్నారు.

7 కావున, మీరు అధిక ధన్యులు, ఏలయనగా మీరెన్నడూ మరణమును రుచిచూడరు; కానీ పరలోకపు శక్తులతో నేను మహిమలో వచ్చునప్పుడు, తండ్రి యొక్క చిత్తమును బట్టి సమస్త సంగతులు నెరవేర్చబడు వరకు నరుల సంతానము యెడల తండ్రి యొక్క కార్యములన్నిటిని చూచుటకు మీరు జీవించెదరు.

8 మీరు మరణము యొక్క బాధలను ఎన్నడూ అనుభవించరు; కానీ నా మహిమలో నేను వచ్చునప్పుడు, మీరు ఒక రెప్పపాటులో క్షయత నుంచి అక్షయతకు మారిపోవుదురు; అప్పుడు మీరు నా తండ్రి యొక్క రాజ్యములో ఆశీర్వదింపబడుదురు.

9 మరలా, మీరు శరీరములో నివసించుచుండగా, లోక పాపముల కొరకు తప్ప, మీరు దేనికీ బాధ లేదా దుఃఖము కలిగియుండరు; ఇదంతయు మీరు నన్ను కోరిన దానిని బట్టియే నేను చేయుదును, ఏలయనగా లోకము నిలిచియుండగానే మనుష్యుల ఆత్మలను నా యొద్దకు తేవలెనని మీరు కోరియున్నారు.

10 ఈ హేతువు చేత మీరు సంపూర్ణ సంతోషమును కలిగియుండెదరు; మీరు నా తండ్రి యొక్క రాజ్యమందు కూర్చొనెదరు; తండ్రి నాకు సంపూర్ణ సంతోషము ఇచ్చినట్లుగానే, మీ సంతోషము కూడా సంపూర్ణమగును మరియు మీరు నా వలెనే ఉండెదరు, నేను తండ్రివలే ఉన్నాను, తండ్రి మరియు నేను ఏకమైయున్నాము;

11 తండ్రిని గూర్చి, నన్ను గూర్చి పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చును మరియు నన్ను బట్టి తండ్రి నరుల సంతానమునకు పరిశుద్ధాత్మనిచ్చును.

12 యేసు ఈ మాటలు చెప్పినప్పుడు, నిలిచియుండు ముగ్గురిని తప్ప, మిగిలిన వారిలో ప్రతి ఒక్కరిని ఆయన తన వ్రేలితో తాకిన తరువాత ఆయన వెడలిపోయెను.

13 ఇదిగో, పరలోకములు తెరువబడెను మరియు వారు పరలోకములోనికి కొనిపోబడి చెప్పశక్యముకాని విషయములను కని, వినిరి.

14 వాటిని ఉచ్ఛరించరాదని వారు నిషేధింపబడిరి; లేదా వారు కనిన, వినిన విషయములను వారు ఉచ్ఛరించునట్లు వారికి శక్తి ఇవ్వబడలేదు;

15 వారు శరీరముతో కొనిపోబడిరో లేదా శరీరము లేకుండా కొనిపోబడిరో వారు చెప్పలేకపోయిరి; ఏలయనగా దేవుని విషయములను చూడగలుగునట్లు వారు మాంసము గల ఈ శరీరము నుండి అక్షయమైన స్థితిలోనికి మార్పుచెందినట్లుగా, అది వారికి రూపాంతరము వలే అనిపించెను.

16 కానీ వారు భూముఖముపై మరలా పరిచర్య చేసిరి; అయినప్పటికీ పరలోకమందు వారికి ఇవ్వబడిన ఆజ్ఞను బట్టి, వారు వినిన మరియు చూచిన విషయములను గూర్చి వారు పరిచర్య చేయలేదు.

17 ఇప్పుడు, వారు రూపాంతరము చెందిన దినము నుండి, వారు క్షయులో అక్షయులో నేనెరుగను;

18 కానీ ఇవ్వబడిన వృత్తాంతమును బట్టి ఇంతమట్టుకు నేనెరుగుదును—వారు భూముఖముపై జనులందరికి పరిచర్య చేయుచు, వారి బోధయందు విశ్వసించిన వారందరికి బాప్తిస్మమిచ్చుచు, సంఘములో చేర్చుచూ ముందుకు సాగిరి మరియు బాప్తిస్మము పొందిన వారందరు పరిశుద్ధాత్మను పొందిరి.

19 అయితే, వారు సంఘమునకు చెందని వారి చేత చెరసాలలో వేయబడిరి. కానీ చెరసాలలు వారిని పట్టలేకపోయెను, ఏలయనగా అవి రెండుగా చీలిపోయెను.

20 వారు గోతిలోనికి పడవేయబడిరి; కానీ, దేవుని శక్తి ద్వారా వారు గోతిలోనుండి విడిపించబడునంతగా వారు భూమిని దేవుని వాక్యముతో కొట్టిరి; కావున, వారిని పట్టియుంచుటకు తగినంత గోతులను వారు త్రవ్వలేకపోయిరి.

21 మరియు వారు మూడుమార్లు కొలిమిలోనికి పడవేయబడినప్పటికీ, ఎట్టి హానిని పొందలేదు.

22 రెండుమార్లు వారు అడవి మృగముల గుహలో పడవేయబడిరి; కానీ, చిన్న పిల్లవాడు పాలుత్రాగు గొఱ్ఱెపిల్లతో ఆడుకొనినట్లు వారు అడవి మృగములతో ఆడుకొనిరి మరియు ఏ హానిని పొందలేదు.

23 ఆ విధముగా వారు నీఫై జనులందరి మధ్య ముందుకు వెళ్ళి, దేశమంతటా ఉన్న జనులందరికీ క్రీస్తు యొక్క సువార్తను బోధించిరి; వారు ప్రభువుకు పరివర్తన చెంది, క్రీస్తు సంఘముతో ఐక్యమయిరి మరియు ఆ విధముగా యేసు యొక్క మాట ప్రకారము, ఆ తరము యొక్క జనులు ఆశీర్వదింపబడిరి.

24 ఇప్పుడు మోర్మన్‌ అను నేను, కొంతకాలముపాటు ఈ విషయములను గూర్చి మాట్లాడుట ఆపెదను.

25 ఇదిగో, ఎన్నడూ మరణమును రుచి చూడని వారి పేర్లను నేను వ్రాయబోతిని, కానీ ప్రభువు నన్ను వారించెను; కావున నేను వాటిని వ్రాయుట లేదు, ఏలయనగా అవి లోకమునుండి మరుగుపరచబడినవి.

26 కానీ నేను వారిని చూచియున్నాను మరియు వారు నాకు పరిచర్య చేసిరి.

27 వారు అన్యజనుల మధ్య ఉందురు, కానీ అన్యజనులు వారిని ఎరుగకయుందురు.

28 వారు యూదుల మధ్య కూడా ఉందురు, కానీ యూదులు వారిని ఎరుగకయుందురు.

29 ప్రభువు తన జ్ఞానముందు సరియని చూచునప్పుడు, వారి కోరిక నెరవేరునట్లు వారి యందున్న దేవుని యొక్క ఒప్పింపజేయు శక్తిని బట్టి వారు ఇశ్రాయేలు యొక్క చెదిరిపోయిన గోత్రములన్నిటికీ మరియు సమస్త జనములు, జాతులు, భాషలు, ప్రజలకు పరిచర్య చేసి, వారిలో నుండి అనేక ఆత్మలను యేసు యొద్దకు తెచ్చెదరు.

30 వారు దేవుని యొక్క దూతల వలె ఉన్నారు మరియు వారు తండ్రికి యేసు నామమందు ప్రార్థన చేసిన యెడల, వారికి యుక్తమనిపించిన ఏ మనుష్యునికైనను వారు తమనుతాము చూపుకొనగలరు.

31 కావున క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము యెదుట జనులందరు తప్పక నిలబడవలసిన ఆ గొప్ప మరియు రాబోవు దినమునకు ముందు, గొప్ప అద్భుతకార్యములు వారి చేత చేయబడును.

32 ఆలాగునే ఆ తీర్పు దినమునకు ముందు, అన్యజనుల మధ్య కూడా వారి చేత గొప్ప అద్భుతకార్యములు చేయబడును.

33 మరియు క్రీస్తు యొక్క అద్భుతకార్యములన్నిటి వృత్తాంతమునిచ్చు లేఖనములన్నిటినీ మీరు కలిగియుండిన యెడల, క్రీస్తు యొక్క మాటలను బట్టి ఈ సంగతులు తప్పక రావలెనని మీరు ఎరుగుదురు.

34 యేసు మాటలను మరియు ఆయన ఎన్నుకొని వారి మధ్యకు పంపిన వారిని ఆలకించని వానికి ఆపద; ఏలయనగా యేసు మాటలను మరియు ఆయన పంపిన వారి మాటలను అంగీకరించని వాడు, ఆయనను అంగీకరించడు; కావున, అంత్యదినమున ఆయన వారిని అంగీకరించడు;

35 మరియు వారు పుట్టియుండకపోవుట వారికి మేలైయుండును. ఏలయనగా, రక్షణ వచ్చునట్లు మనుష్యుల పాదముల క్రింద త్రొక్కివేయబడి నొప్పించబడిన దేవుని న్యాయమును తప్పించుకొనగలరని మీరు తలంచుచున్నారా?

36 ఇప్పుడు ప్రభువు ఎన్నుకొనిన వారిని, అనగా పరలోకములోనికి కొనిపోబడిన ఆ ముగ్గురిని గూర్చి నేను చెప్పినట్లుగా, వారు క్షయత నుండి అక్షయతకు శుద్ధి చేయబడిరో లేదో నేనెరుగను—

37 కానీ, నేను వ్రాసినందున నేను ప్రభువును విచారించితిని మరియు వారి శరీరములలో మార్పు జరుగుట అవసరమని, లేని యెడల వారు మరణమును రుచి చూచుట అవసరమని ఆయన నాకు విశదపరిచెను;

38 కావున, వారు మరణమును రుచి చూడరాదని, లోక పాపముల కొరకు తప్ప వారు బాధ లేదా దుఃఖమును అనుభవించరాదని వారి శరీరములలో ఒక మార్పు చేయబడెను.

39 ఇప్పుడు ఈ మార్పు అంత్యదినమున జరుగు దానికి సమానము కాదు; కానీ, వారిని శోధించగలుగునట్లు సాతానుకు వారిపై ఎట్టి శక్తి లేకుండునంతగా వారిలో ఒక మార్పు చేయబడెను; భూమి యొక్క శక్తులు వారిని పట్టజాలనంతగా, వారు పరిశుద్ధులుగా ఉండునట్లు శరీరమందు పరిశుద్ధపరచబడిరి.

40 మరియు ఈ స్థితియందు వారు క్రీస్తు యొక్క తీర్పుదినము వరకు నిలిచియుండవలెను; ఆ దినమున వారు గొప్ప మార్పును పొంది, ఇకపై బయటకు వెళ్ళకుండా పరలోకములందు నిత్యము దేవునితో నివసించుటకు తండ్రి యొక్క రాజ్యములోనికి చేర్చుకొనబడవలసియున్నది.