లేఖనములు
3 నీఫై 29


29వ అధ్యాయము

మోర్మన్‌ గ్రంథము యొక్క రాకడ, ప్రభువు ఇశ్రాయేలును సమకూర్చుటను మరియు తన నిబంధనలను నెరవేర్చుటను మొదలుపెట్టెననుటకు ఒక సూచనయైయున్నది—ఆయన కడవరి దినపు బయల్పాటులను, వరములను తిరస్కరించిన వారు శాపగ్రస్థులగుదురు. సుమారు క్రీ. శ. 34–35 సం.

1 ఇప్పుడు ఆయన వాక్యము ప్రకారము, ఈ మాటలు అన్యజనుల యొద్దకు వచ్చుట తగినదని ప్రభువు తన వివేకమందు చూచునప్పుడు, వారి స్వాస్థ్యమైన దేశములకు వారు పునఃస్థాపించబడుటను గూర్చి ఇశ్రాయేలు సంతానముతో తండ్రి చేసిన నిబంధన నెరవేర్చబడుట మొదలాయెనని మీరు తెలుసుకొనవలెనని నేను మీతో చెప్పుచున్నాను.

2 మరియు పరిశుద్ధ ప్రవక్తలచేత పలుకబడిన ప్రభువు యొక్క మాటలన్నీ నెరవేర్చబడునని మీరు తెలుసుకొనవలెను; ఇశ్రాయేలు సంతానము యొద్దకు ప్రభువు తన రాకను ఆలస్యము చేయునని మీరు చెప్పనవసరము లేదు.

3 మరియు చెప్పబడిన మాటలు వ్యర్థమని మీరు మీ హృదయముల యందు ఊహించవలసిన అవసరము లేదు, ఏలయనగా ఇశ్రాయేలు వంశము వారైన తన జనులతో ఆయన చేసిన నిబంధనను ప్రభువు జ్ఞాపకము చేసుకొనును.

4 ఈ మాటలు మీ మధ్యకు వచ్చుటను మీరు చూచినప్పుడు, ప్రభువు యొక్క కార్యములను మీరిక నిరాకరించవలసిన అవసరము లేదు, ఏలయనగా ఆయన న్యాయపు ఖడ్గము ఆయన కుడిచేతిలో ఉన్నది; ఆ దినమున మీరు ఆయన కార్యములను నిరాకరించిన యెడల, ఆయన తీర్పు త్వరగా మీపై వచ్చునట్లు ఆయన చేయును.

5 ప్రభువు యొక్క కార్యములను నిరాకరించు వానికి ఆపద; ముఖ్యముగా, క్రీస్తును మరియు ఆయన కార్యములను తిరస్కరించు వానికి ఆపద!

6 ప్రభువు యొక్క బయల్పాటులను తిరస్కరించు వానికి మరియు ప్రభువు ఇకమీదట బయల్పాటు, ప్రవచనము, వరములు, భాషలు, స్వస్థతలు లేదా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా పని చేయడని చెప్పువానికి ఆపద!

7 ఆ దినమున లాభము పొందుటకు, యేసు క్రీస్తు ద్వారా ఏ అద్భుతము చేయబడదని చెప్పు వానికి ఆపద; ఏలయనగా దీనిని చేయువాడు నాశనపుత్రునివలే అగును మరియు క్రీస్తు యొక్క వాక్యము ప్రకారము అతని కొరకు ఎట్టి కనికరము ఉండదు.

8 యూదులు లేదా ఇశ్రాయేలు వంశము యొక్క శేషములో ఎవరిని గూర్చియైనను మీరు ఇకమీదట ధిక్కారముతో బుసకొట్టి, నిరాకరించి, ఎగతాళి చేయనవసరము లేదు; ఏలయనగా, ప్రభువు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనును మరియు ఆయన ప్రమాణము చేసిన ప్రకారము ఆయన నెరవేర్చును.

9 కావున, ఆయన ఇశ్రాయేలు వంశముతో చేసిన నిబంధనను నెరవేర్చుటలో ఆయన తీర్పును అమలుపరచకుండునట్లు ప్రభువు యొక్క ఉద్దేశ్యమును మార్చగలరని మీరు తలంచనవసరములేదు.