లేఖనములు
3 నీఫై 4


4వ అధ్యాయము

నీఫైయుల సైన్యములు గాడియాంటన్‌ దొంగలను ఓడించును—గిదియాన్హి సంహరింపబడును; అతని తరువాత వచ్చిన జెమ్నారిహా ఉరితీయబడును—నీఫైయులు తమ విజయముల నిమిత్తము ప్రభువును స్తుతించెదరు. సుమారు క్రీ. శ. 19–22 సం.

1 పదునెనిమిదవ సంవత్సరాంతమున దొంగల యొక్క ఆ సైన్యములు యుద్ధమునకు సిద్ధపడియుండెను మరియు కొండలు, పర్వతములనుండి దిగివచ్చి, అరణ్యములనుండి, వారి బలమైన దుర్గములు, రహస్య స్థలములనుండి అకస్మాత్తుగా బయటకు వచ్చుట మొదలుపెట్టి, ఉత్తర దక్షిణ దేశములు రెండింటియందున్న దేశములను స్వాధీనపరచుకొనసాగిరి; మరియు నీఫైయుల ద్వారా వదిలి వేయబడిన దేశములన్నింటిని, నిర్జనముగా వదిలి వేయబడిన పట్టణములను స్వాధీనపరచుకొనసాగిరి.

2 కానీ, నీఫైయుల చేత వదిలివేయబడిన ఆ దేశములందు ఏ అడవి జంతువులు లేదా వేట జంతువులు లేకుండెను; అరణ్యమందు తప్ప, దొంగలు వేటాడుటకు అక్కడ ఎట్టి జంతువులు లేకుండెను.

3 మరియు ఆహారపు కొరతను బట్టి అరణ్యమందు తప్ప, దొంగలు అక్కడ ఉండలేకపోయిరి; ఏలయనగా నీఫైయులు వారి దేశములను నిర్జనముగా వదిలియుండి, వారి మందలను, గుంపులను, వారు కలిగియున్న సమస్తమును సమకూర్చుకొని ఏక సమూహముగా ఉండిరి.

4 కావున, నీఫైయులకు వ్యతిరేకముగా బహిరంగ యుద్ధమందు వారిపై దాడిచేయుట తప్ప దోచుకొనుటకు, ఆహారము సంపాదించుటకు దొంగలకు ఏ అవకాశము లేకుండెను; ఇప్పుడు నీఫైయులు ఏక సమూహముగానుండి, అధిక సంఖ్యలో ఉన్నందున, ఆ సమయమందు వారు దొంగలను దేశములోనుండి నిర్మూలించుటకు కోరి, ఏడు సంవత్సరముల సమయము వరకు బ్రతుకగలుగునట్లు ఆహార సామాగ్రులను, గుఱ్ఱములను, పశువులను మరియు ప్రతి విధమైన మందలను వారు తమ కొరకు దాచిపెట్టుకొనిరి; మరియు ఆ విధముగా పదునెనిమిదవ సంవత్సరము గతించిపోయెను.

5 పంతొమ్మిదవ సంవత్సరమందు నీఫైయులతో యుద్ధము చేయుట ప్రయోజనకరమని గిద్దియాన్హి కనుగొనెను, ఏలయనగా దోచుకొనుట, దొంగిలించుట, హత్యచేయుట తప్ప బ్రతుకుటకు వారికి ఏ దారి లేకుండెను.

6 మరియు నీఫైయులు తమపై దాడిచేసి, తమను సంహరించుదురేమోనను భయముతో వారు ధాన్యమును పండించగలుగునట్లు తమను దేశమంతటా విస్తరించుకొనుటకు తెగించలేదు; కావున ఈ సంవత్సరమందు వారు నీఫైయులతో యుద్ధము చేయుటకు వెళ్ళవలెనని గిద్దియాన్హి తన సైన్యములను ఆజ్ఞాపించెను.

7 వారు యుద్ధమునకు వచ్చిరి మరియు అది ఆరవ నెలయందైయుండెను; వారు యుద్ధమునకు వచ్చిన దినము మహా భయంకరముగా ఉండెను; వారు దొంగల వలె వస్త్రములు ధరించియుండి, తమ నడుముల చుట్టూ గొఱ్ఱె చర్మమును కట్టుకొని, రక్తము పులుముకొనియుండిరి; వారి తలలు గొరగబడియుండెను మరియు వారు శిరస్త్రాణములను ధరించియుండిరి; వారి కవచములనుబట్టి, వారు రక్తము పులుముకొనియుండుటను బట్టి, గిద్దియాన్హి సైన్యముల ఆకారము మహా భయంకరముగా ఉండెను.

8 నీఫైయుల సైన్యములు గిద్దియాన్హి సైన్యము యొక్క ఆకారమును చూచినప్పుడు అందరూ నేలపై పడి, ప్రభువైన వారి దేవుడు వారిని కాపాడవలెనని, వారి శత్రువుల చేతులలోనుండి వారిని విడిపించవలెనని ఆయనకు మొరపెట్టిరి.

9 గిద్దియాన్హి సైన్యములు దీనిని చూచినప్పుడు, సంతోషముతో వారు బిగ్గరగా కేకలు వేయసాగిరి, ఏలయనగా వారి శత్రువులను చూచి భయముతో నీఫైయులు నేలపై పడిరని వారు తలంచిరి.

10 కానీ ఈ విషయమందు వారు నిరాశ చెందిరి, ఏలయనగా నీఫైయులు వారికి భయపడలేదు; కానీ తమ దేవునికి భయపడి, రక్షణ కొరకు వారు ఆయనకు ప్రార్థన చేసిరి; కావున గిద్దియాన్హి సైన్యములు వారిపై దాడిచేసినప్పుడు, వారిని ఎదుర్కొనుటకు వారు సిద్ధముగానుండిరి; వారు ప్రభువు యొక్క బలమందు వారిని ఎదుర్కొనిరి.

11 మరియు ఈ ఆరవ నెలయందు యుద్ధము ప్రారంభమాయెను; ఆ యుద్ధము మహా భయంకరమైనదైయుండెను, దానియందలి సంహారము మహా భయంకరముగానుండెను, ఎంతగాననగా లీహై యెరూషలేమును వదిలి వచ్చిన సమయము నుండి అతని జనులందరి మధ్య అంత గొప్ప సంహారము ఎన్నడూ లేకుండెను.

12 గిద్దియాన్హి బెదరింపులు, ప్రమాణములు చేసినప్పటికీ, నీఫైయులు వారిని ఎంతగా కొట్టిరనగా, వారి యెదుట నుండి వారు పారిపోయిరి.

13 మరియు అతని సైన్యములు వారిని అరణ్యపు సరిహద్దుల వరకు తరుమవలెనని, దారిలో వారి చేతులలో పడువారెవరిని వదలరాదని గిద్‌గిద్దోని ఆజ్ఞాపించెను; ఆ విధముగా వారు గిద్‌గిద్దోని యొక్క ఆజ్ఞను నెరవేర్చు వరకు వారిని సంహరించుచూ అరణ్యపు సరిహద్దుల వరకు వారిని తరిమివేసిరి.

14 ధైర్యముతో నిలబడి పోరాడిన గిద్దియాన్హి కూడా పారిపోవుచుండగా తరుమబడెను; మరియు అధిక పోరాటమువలన అలసియుండిన అతడు పట్టుకొనబడి సంహరించబడెను. ఆ విధముగా దొంగయైన గిద్దియాన్హి అంతమొందెను.

15 నీఫైయుల సైన్యములు వారి సురక్షిత ప్రదేశమునకు తిరిగి వచ్చెను. అలా ఈ పంతొమ్మిదవ సంవత్సరము గతించిపోయెను మరియు దొంగలు తిరిగి యుద్ధమునకు రాలేదు; ఇరవైయవ సంవత్సరమందు కూడా వారు తిరిగి రాలేదు.

16 ఇరువది ఒకటవ సంవత్సరమందు వారు యుద్ధమునకు రాలేదు, కానీ నీఫై జనులను ముట్టడించుటకు వారు అన్ని వైపులనుండి వచ్చిరి; ఏలయనగా నీఫై జనులను వారి దేశముల నుండి వేరుచేసి, అన్నివైపుల నుండి వారిని చుట్టుముట్టి, బయటి నుండి వారికి ఎటువంటి సదుపాయములు లేకుండా చేసిన యెడల, వారిని తమ కోరికల ప్రకారము తమకు లొంగిపోవునట్లు చేయగలరని వారు తలంచిరి.

17 ఇప్పుడు జెమ్నారిహా అను పేరుగల మరియొకనిని తమ నాయకునిగా వారు నియమించుకొనిరి; కావున ఈ ముట్టడి జరుగునట్లు చేసినది ఆ జెమ్నారిహాయే.

18 కానీ, ఇది నీఫైయులకు ప్రయోజనకరముగా నుండెను; ఏలయనగా వారు దాచియుంచిన అధికమైన సామగ్రిని బట్టి మరియు దొంగల వద్ద సామగ్రుల కొరతను బట్టి,

19 నీఫైయులపై ప్రభావము చూపునంత అధికకాలము ముట్టడి వేయుట దొంగలకు అసాధ్యమైయుండెను; ఏలయనగా వారు బ్రతుకుటకు మాంసము తప్ప ఏమియూ లేకుండెను, అది కూడా వారు అరణ్యమందు సంపాదించినదైయుండెను.

20 మరియు అరణ్యమందు వేట జంతువులు అరుదయ్యెను, ఎంతగాననగా దొంగలు ఆకలితో నశించిపోవుటకు సిద్ధముగా నుండిరి.

21 నీఫైయులు రాత్రింబవళ్ళు నిరంతరము బయటకు నడుచుచూ, వారి సైన్యములపై దాడిచేయుచూ వారిని వేలు, పదుల వేల సంఖ్యలో నరికివేయుచుండిరి.

22 ఆ విధముగా రాత్రింబవళ్ళు వారిపై వచ్చిన గొప్ప నాశనమును బట్టి, జెమ్నారిహా యొక్క జనులు తమ ప్రణాళికను ఉపసంహరించుకోవాలని కోరిరి.

23 మరియు వారు ముట్టడి నుండి తమను ఉపసంహరించుకొనవలెనని, ఉత్తర దేశము యొక్క సుదూరమైన భాగములలోనికి నడువవలెనని జెమ్నారిహా అతని జనులను ఆజ్ఞాపించెను.

24 ఇప్పుడు గిద్‌గిద్దోని వారి ప్రణాళికను గూర్చి మరియు ఆహారపు కొరతను బట్టి వారి బలహీనతను గూర్చి, వారి మధ్య చేయబడిన గొప్ప సంహారమును గూర్చి ఎరిగినవాడై, తన సైన్యములను రాత్రి సమయమందు బయటకు పంపి, వారి పలాయన మార్గమును అడ్డగించెను మరియు వారి పలాయన మార్గమందు తన సైన్యములను ఉంచెను.

25 దీనిని వారు రాత్రి సమయమందు చేసి, వారి నడకయందు దొంగలను దాటి ముందుకు చేరిరి, కావున ఉదయమున దొంగలు వారి నడకను మొదలుపెట్టినప్పుడు, వారి ముందు, వెనుక ఇరువైపులా నీఫైయుల సైన్యముల చేత వారు కలుసుకొనబడిరి.

26 మరియు దక్షిణమున ఉన్న దొంగలు కూడా వారి పలాయన స్థలములలో అడ్డగించబడిరి. ఈ క్రియలన్నియు గిద్‌గిద్దోని యొక్క ఆజ్ఞ చేత చేయబడినవి.

27 మరియు నీఫైయులకు తమను బందీలుగా అప్పగించుకొన్నవారు అనేక వేలమంది ఉండిరి, వారిలో మిగిలిన వారు సంహరింపబడిరి.

28 వారి నాయకుడైన జెమ్నారిహా పట్టుకొనబడి ఒక చెట్టుపైన ఉరి తీయబడెను, అతడు మరణించు వరకు దాని పైభాగమున ఉండబడెను. మరియు అతడు మరణించు వరకు వారు అతడిని ఉరి తీసిన తరువాత, ఆ చెట్టును నేలకు కూల్చివేసి బిగ్గరగా ఇట్లు చెప్పుచూ కేకవేసిరి:

29 నీతియందు మరియు హృదయము యొక్క పరిశుద్ధత యందు ప్రభువు తన జనులను కాపాడునుగాక, తద్వారా ఈ మనుష్యుడు నేలకు కూల్చివేయబడినట్లే, అధికారము మరియు రహస్య కూడికలను బట్టి వారిని సంహరించుటకు కోరు వారందరూ నేలకు కూల్చివేయబడునట్లు వారు చేయుదురు.

30 మరియు వారు ఆనందించి, ఏకస్వరముతో తిరిగి కేకవేసి ఇట్లు చెప్పిరి: రక్షణ కొరకు వారి దేవుని నామమందు వారు ప్రార్థన చేయునంత కాలము అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడు ఈ జనులను నీతియందు కాపాడును గాక.

31 ఇప్పుడు వారి శత్రువుల చేతులలో పడుట నుండి వారిని కాపాడుట యందు ఆయన వారి కొరకు చేసిన గొప్పకార్యము నిమిత్తము వారి దేవునికి పాటలు పాడుట యందు, స్తుతించుట యందు వారందరు ఏకముగా ముందుకు వచ్చిరి.

32 మరియు మహోన్నత దేవునికి హోసన్న. మహోన్నత దేవుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుని నామము ధన్యమగునుగాక అని వారు కేకవేసిరి.

33 వారి శత్రువుల చేతులలో నుండి వారిని విడిపించుట యందు దేవుని యొక్క గొప్ప మంచితనమును బట్టి అనేక కన్నీళ్ళు ఉబికి వచ్చునంతగా వారి హృదయములు సంతోషముతో ఉప్పొంగెను మరియు ఒక నిత్య నాశనము నుండి వారు విడిపించబడినది వారి పశ్చాత్తాపము మరియు వారి వినయమును బట్టియేనని వారెరిగిరి.