లేఖనములు
3 నీఫై 5


5వ అధ్యాయము

నీఫైయులు పశ్చాత్తాపపడి, వారి పాపములను విడిచిపెట్టుదురు—మోర్మన్‌ తన జనుల చరిత్రను వ్రాయును మరియు వారికి నిత్యవాక్యమును ప్రకటించును—దీర్ఘకాలము చెదిరిపోయిన ఇశ్రాయేలు సమకూర్చబడును. సుమారు క్రీ. శ. 22–26 సం.

1 ఇప్పుడు నీఫైయుల జనులందరి మధ్య పరిశుద్ధ ప్రవక్తలందరి మాటలను కొంచెమైనను సందేహించిన సజీవ ఆత్మ ఒక్కటి కూడా లేకుండెను, ఏలయనగా అవి నెరవేర్చబడుట అవసరమని వారు ఎరిగిరి.

2 ప్రవక్తల మాటల ప్రకారము ఇవ్వబడిన అనేక సూచకక్రియలను బట్టి క్రీస్తు రాక అవసరమైయుండునని వారు ఎరిగిరి; మరియు అప్పటికే జరిగిన విషయములను బట్టి, చెప్పబడిన దాని ప్రకారము అన్నిసంగతులు జరుగుట అవసరమని వారు ఎరిగిరి.

3 కావున వారు తమ పాపములు, హేయకార్యములు మరియు జారత్వములన్నిటినీ వదిలివేసి, రేయింబవళ్ళు పూర్ణ శ్రద్ధతో దేవుడిని సేవించిరి.

4 ఇప్పుడు సంహరింపబడని వారిలో ఎవరూ తప్పించుకొనకుండునంతగా దొంగలందరినీ వారు బందీలుగా పట్టుకొని చెరసాలలో వేసి, వారికి దేవుని వాక్యము బోధింపబడునట్లు చేసిరి; మరియు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, ఇకపై హత్య చేయమని ఒక నిబంధనలోనికి ప్రవేశించిన వారందరు విడుదల చేయబడిరి.

5 కానీ, ఎందరైతే నిబంధనలోనికి ప్రవేశించక తమ హృదయములలో ఆ రహస్య హత్యలను ఇంకను కలిగియున్నారో, ఎందరైతే తమ సహోదరులకు వ్యతిరేకముగా బెదిరింపులు పలుకుచూ కనుగొనబడిరో వారు ధర్మశాస్త్రము ప్రకారము దోషులుగా తీర్పుతీర్చబడి, శిక్షించబడిరి.

6 ఆ విధముగా అత్యంత దుష్టత్వము మరియు అనేక హత్యలు జరిగించిన ఆ దుర్మార్గమైన, రహస్యమైన, హేయకరమైన కూడికలన్నింటికి వారు ముగింపు పలికిరి.

7 ఆ విధముగా ఇరువది రెండవ సంవత్సరము గడిచిపోయెను; ఇరువది మూడు, ఇరువది నాలుగు, ఇరువది అయిదు కూడా; మరియు ఆ విధముగా ఇరువది ఐదు సంవత్సరములు గతించిపోయెను.

8 అనేక విషయములు సంభవించెను, అవి కొందరి కన్నులలో గొప్పవి మరియు అద్భుతమైనవి; అయినప్పటికీ, అవన్నియు ఈ గ్రంథమందు వ్రాయబడలేవు; అనగా, ఇరువది అయిదు సంవత్సరముల సమయములో అంత ఎక్కువమంది జనుల మధ్య చేయబడిన దానిలో నూరవ భాగమును కూడా ఈ గ్రంథము కలిగిలేదు;

9 కానీ, ఈ జనుల వ్యవహారములన్నిటినీ కలిగియున్న గ్రంథములు కలవు మరియు చిన్నదైనప్పటికీ, నిజమైన వృత్తాంతమొకటి నీఫై చేత ఇవ్వబడెను.

10 కావున నేను ఈ విషయముల గురించి నా వృత్తాంతమును, నీఫై పలకలని పిలువబడిన పలకలపై చెక్కబడిన నీఫై వృత్తాంతమును బట్టి చేసియున్నాను.

11 మరియు నేను ఈ వృత్తాంతమును నా స్వహస్తములతో చేసిన పలకలపై చేయుచున్నాను.

12 ఇదిగో జనుల మధ్య ఆల్మా సంఘమును, అనగా వారి అతిక్రమము తరువాత వారి మధ్య మొదటి సంఘమును స్థాపించిన దేశమైన మోర్మన్‌ యొక్క దేశమును బట్టి నేను మోర్మన్‌ అని పిలువబడితిని.

13 ఇదిగో, నేను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క శిష్యుడను. ఆయన జనులు నిత్యజీవము కలిగియుండునట్లు ఆయన వాక్యమును వారి మధ్య ప్రకటించుటకు నేను ఆయన ద్వారా పిలువబడియున్నాను.

14 పరిశుద్ధులైయుండి ఇక్కడ నుండి వెడలిపోయిన వారి ప్రార్థనలు, వారి విశ్వాసమునుబట్టి నెరవేరబడునని దేవుని చిత్తమునుబట్టి చేయబడిన ఈ విషయముల యొక్క వృత్తాంతమును—

15 అనగా, లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి ప్రస్తుత సమయము వరకు సంభవించిన వాటి యొక్క చిన్న వృత్తాంతమును నేను వ్రాయుట అవసరమాయెను.

16 కావున నా దినము యొక్క ప్రారంభము వరకు, నా ముందుండిన వారి చేత ఇవ్వబడిన వృత్తాంతముల నుండి నేను నా వృత్తాంతమును వ్రాయుచున్నాను.

17 తరువాత నేను నా కన్నులతో చూచిన దృశ్యముల యొక్క వృత్తాంతమును వ్రాయుదును.

18 నేను వ్రాయు వృత్తాంతము న్యాయమైన మరియు సత్యమైన వృత్తాంతమని నేనెరుగుదును; అయినప్పటికీ మా భాషను బట్టి మేము వ్రాయలేని విషయములు అనేకమున్నవి.

19 ఇప్పుడు నేను, నా గురించి చెప్పుట ముగించెదను మరియు నా ముందున్న సంగతుల గురించి నా వృత్తాంతమునిచ్చుట మొదలుపెట్టెదను.

20 మోర్మన్‌ అను నేను లీహై యొక్క నిజమైన వంశస్థుడను. నా దేవుడు మరియు నా రక్షకుడైన యేసు క్రీస్తును స్తుతించుటకు నాకు హేతువు కలదు, ఏలయనగా ఆయన మా పితరులను యెరూషలేము దేశము నుండి బయటకు తెచ్చెను (ఆయన మరియు ఆ దేశము నుండి బయటకు తేబడిన వారు తప్ప, మరి ఎవరూ దానిని ఎరుగరు) మరియు మా ఆత్మల రక్షణ కొరకు ఆయన నాకు, నా జనులకు అధిక జ్ఞానమును ఇచ్చెను.

21 నిశ్చయముగా ఆయన యాకోబు వంశమును ఆశీర్వదించియున్నాడు మరియు యోసేపు సంతానము యెడల కనికరము కలిగియున్నాడు.

22 లీహై సంతానము ఆయన ఆజ్ఞలను పాటించినంత మట్టుకు ఆయన వారిని ఆశీర్వదించి, ఆయన మాట ప్రకారము వారిని వర్థిల్లజేసెను.

23 మరియు నిశ్చయముగా ఆయన యోసేపు సంతానము యొక్క శేషము ప్రభువైన వారి దేవుడిని గూర్చి తెలుసుకొనునట్లు చేయును.

24 ప్రభువు జీవముతోడు, నిశ్చయముగా భూముఖమంతటిపై చెదిరియున్న యాకోబు సంతానము యొక్క శేషమంతటిని భూమి నలువైపులనుండి ఆయన సమకూర్చును.

25 మరియు ఆయన యాకోబు వంశమంతటితో నిబంధన చేసినట్లుగా, యాకోబు వంశమంతటిని ఆయన వారితో చేసిన నిబంధన యొక్క జ్ఞానమునకు పునరుద్ధరించుచూ ఆయన యాకోబు వంశముతో చేసిన ఆ నిబంధనను తన యుక్తకాలమందు నెరవేర్చును.

26 అప్పుడు వారు, వారి విమోచకుని గూర్చి తెలుసుకొందురు, ఆయనే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు; అప్పుడు వారు ఎక్కడినుండి చెదరగొట్టబడిరో, ఆ స్వదేశములకు భూమి యొక్క నలువైపుల నుండి సమకూర్చబడుదురు; ప్రభువు జీవముతోడు అది అట్లే జరుగును. ఆమేన్‌.