లేఖనములు
మోషైయ 1


మోషైయ గ్రంథము

1వ అధ్యాయము

రాజైన బెంజమిన్ తన కుమారులకు వారి పితరుల భాషను, ప్రవచనములను బోధించును—వివిధ పలకలపై వ్రాయబడిన వృత్తాంతముల మూలముగా వారి మతము మరియు నాగరికత భద్రపరచబడెను—మోషైయ రాజుగా ఎన్నుకోబడి, ఆ వృత్తాంతములు మరియు ఇతర వస్తువుల యొక్క సంరక్షణ బాధ్యత ఇవ్వబడెను. సుమారు క్రీ. పూ. 130–124 సం.

1 ఇప్పుడు రాజైన బెంజమిన్‌కు చెందిన జనులందరి మధ్య జరహేమ్ల దేశమంతటా ఏ వివాదము లేకుండెను, అందును బట్టి రాజైన బెంజమిన్ తన శేష దినములన్నిటిలో నిరంతర సమాధానము కలిగియుండెను.

2 అతనికి ముగ్గురు కుమారులుండిరి; వారు మోషైయ, హెలోరమ్, హీలమన్‌ అని అతనిచే పిలువబడిరి. వారు వివేకముగల మనుష్యులగునట్లు, అతని పితరుల భాషయంతటిలో వారు బోధింపబడునట్లు అతడు చేసెను; తద్వారా వారు వారి పితరుల ద్వారా పలుకబడి, ప్రభువు చేత వారికి అప్పగించబడిన ప్రవచనములను గూర్చి తెలుసుకొందురు.

3 కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతములను గూర్చి కూడా అతడు వారికి బోధించి ఇట్లు చెప్పెను: నా కుమారులారా, ఈ వృత్తాంతములను, ఈ ఆజ్ఞలను కలిగియున్న ఈ పలకలు లేనియెడల, మనము నేటికీ దేవుని మర్మములను ఎరుగక అజ్ఞానములో బాధపడియుండేవారమని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను.

4 ఏలయనగా ఈ పలకల సహాయము లేని యెడల, మన పితరుడైన లీహై ఈ విషయములన్నిటిని జ్ఞాపకముంచుకొని వాటిని తన సంతానమునకు బోధించియుండుట అసాధ్యము; ఏలయనగా అతడు ఐగుప్తీయుల భాషలో బోధింపబడినందున అతడు ఈ చెక్కడములను చదువగలిగి, వాటిని తన సంతానమునకు బోధించగలిగెను, అందు మూలముగా వారు తమ సంతానమునకు వాటిని బోధించగలిగిరి మరియు ఆ విధముగా నేటివరకు దేవుని ఆజ్ఞలను నేరవేర్చిరి.

5 నా కుమారులారా, మనము ఆయన మర్మములను చదివి, గ్రహించి, ఆయన ఆజ్ఞలను ఎల్లప్పుడు మన కన్నుల యెదుట కలిగియుండునట్లు దేవుని చేత కాపాడబడి భద్రపరచబడిన ఈ వస్తువులు లేకున్న యెడల, అప్పుడు మన పితరులు కూడా తమ విశ్వాసమందు క్షీణించియుండేవారు మరియు వారి పితరుల తప్పుడు ఆచారములను బట్టి ఈ విషయములను గూర్చి ఏమియు ఎరుగక, వారికి ఈ విషయములు బోధించబడినప్పుడు కూడా వాటియందు విశ్వసించని మన సహోదరులైన లేమనీయులవలే మనము కూడా ఉండేవారమని నేను మీతో చెప్పుచున్నాను.

6 ఓ నా కుమారులారా, ఈ మాటలు సత్యమైయున్నవనియు ఈ వృత్తాంతములు కూడా సత్యమైనవనియు మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను. వారు యెరూషలేమును వదిలి వచ్చిన సమయము నుండి ఇప్పటి వరకు మన పితరుల వృత్తాంతములు, మాటలను కలిగియున్న నీఫై పలకలు కూడా సత్యమైయున్నవి; వాటిని మన కన్నుల యెదుట కలిగియున్నందున మనము వాటిని నిశ్చయముగా ఎరిగియుండగలము.

7 ఇప్పుడు నా కుమారులారా, మీరు వాటి ద్వారా లాభము పొందునట్లు వాటిని శ్రద్ధగా వెదుకవలెనని మీరు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను; ప్రభువు మన పితరులకు చేసిన వాగ్దానముల ప్రకారము, మీరు దేశమందు వర్ధిల్లునట్లు దేవుని ఆజ్ఞలను గైకొనవలెనని నేను కోరుచున్నాను.

8 మరియు ఈ గ్రంథమందు వ్రాయబడని అనేకానేక విషయములను రాజైన బెంజమిన్ తన కుమారులకు బోధించెను.

9 రాజైన బెంజమిన్ తన కుమారులకు బోధించుట ముగించిన తరువాత, అతడు వృద్ధుడైనందున అతి త్వరలో మరణించవలసియున్నదని గ్రహించెను; అందువలన తన కుమారులలో ఒకరికి రాజ్యమును అనుగ్రహించుట యుక్తమైనదని అతడు తలంచెను.

10 కావున అతడు మోషైయను తన యెదుటికి రప్పించి, అతనితో ఇట్లు చెప్పెను: నా కుమారుడా, అందరు సమకూడి చేరునట్లు సమస్త దేశమంతటా ఈ జనులందరి మధ్య లేదా జరహేమ్ల యొక్క జనులు మరియు దేశమందు నివసించుచున్న మోషైయ యొక్క జనుల మధ్య నీవు ఒక ప్రకటన చేయవలెనని నేను కోరుచున్నాను; ఏలయనగా ప్రభువైన మన దేవుడు ఈ జనులపై ఒక రాజుగా, అధిపతిగా నిన్ను మాకు దయచేసియున్నాడని రేపు నేను నా నోటితో ఈ నా జనులకు ప్రకటించెదను.

11 అంతేకాక, యెరూషలేము దేశము నుండి ప్రభువైన దేవుడు బయటకు తీసుకొని వచ్చిన జనులందరి నుండి ప్రత్యేకపరచబడునట్లు నేను ఈ జనులకు ఒక పేరు పెట్టెదను; వారు ప్రభువు యొక్క ఆజ్ఞలను గైకొనుటలో శ్రద్ధ కలిగిన జనులైయుండిన కారణముగా నేను దీనిని చేయుదును.

12 అతిక్రమము ద్వారా తప్ప, ఎన్నడూ తుడిచివేయబడని ఒక పేరును నేను పెట్టెదను.

13 అంతేకాక, ప్రభువునుండి అధిక అనుగ్రహము పొందిన ఈ జనులు అతిక్రమములో పడి దుర్మార్గులుగా, వ్యభిచారులుగా మారిన యెడల, అందును బట్టి వారు తమ సహోదరుల వలే బలహీనులగునట్లు ప్రభువు వారిని అప్పగించివేయునని మరియు ఇంతవరకు మన పితరులను కాపాడినట్లు తన సాటిలేని అద్భుతమైన శక్తి చేత ఆయన వారిని ఇక ఏమాత్రము కాపాడడని నేను నీతో చెప్పుచున్నాను.

14 ఏలయనగా మన పితరులను కాపాడుటలో ఆయన తన బాహువును చాపియుండని యెడల, వారు లేమనీయుల చేతులలో పడి వారి ద్వేషమునకు బలి అయ్యేవారని నేను నీతో చెప్పుచున్నాను.

15 రాజైన బెంజమిన్ తన కుమారునితో ఈ మాటలు చెప్పుట ముగించిన తరువాత, అతడు రాజ్యము యొక్క సమస్త వ్యవహారములపై అతనికి అధికారమిచ్చెను.

16 అంతేకాక కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతముల బాధ్యత అతనికిచ్చెను; నీఫై పలకలను, లేబన్‌ ఖడ్గమును మరియు గోళము లేదా దిక్సూచిని కూడా ఇచ్చెను, ప్రతి ఒక్కరు ప్రభువుకు ఇచ్చిన లక్ష్యమును, శ్రద్ధను బట్టి దాని ద్వారా నడిపింపబడునట్లు ఆయన చేత సిద్ధము చేయబడి ఆ గోళము అరణ్యము గుండా మా పితరులను నడిపించెను.

17 కాబట్టి, వారు అవిశ్వాసులుగా ఉన్నప్పుడు తమ ప్రయాణములో వర్థిల్లలేదు లేదా వృద్ధి చెందలేదు, కానీ వెనుకకు తరుమబడి దేవుని అయిష్టతను తమపై పొందిరి; అందువలన వారి కర్తవ్యము యొక్క జ్ఞాపకమందు పురిగొల్పబడుటకు వారు కరువుతో, తీవ్రమైన బాధలతో మొత్తబడిరి.

18 ఇప్పుడు మోషైయ వెళ్ళి అతని తండ్రి ఆజ్ఞాపించినట్లు చేసి, అతని తండ్రి వారితో చెప్పే మాటలను వినుటకు దేవాలయము వద్ద కూడుకొనవలెనని జరహేమ్ల దేశములో ఉన్న జనులందరికి ప్రకటించెను.