లేఖనములు
మోషైయ 17


17వ అధ్యాయము

అబినడై మాటలను విశ్వసించి, ఆల్మా వాటిని వ్రాయును—అబినడై అగ్నిచేత మరణమును అనుభవించును—తన హంతకులపై వ్యాధి మరియు అగ్నిచేత మరణమును అతడు ప్రవచించును. సుమారు క్రీ. పూ. 148 సం.

1 అబినడై ఈ మాటలను ముగించినప్పుడు, అతడిని పట్టుకొని అతడు చంపబడునట్లు చేయవలెనని రాజు యాజకులను ఆజ్ఞాపించెను.

2 కానీ వారి మధ్య ఆల్మా అను పేరుగల నీఫై వంశస్థుడొకడు ఉండెను, యౌవనుడైన అతడు అబినడై పలికిన మాటలను విశ్వసించెను, ఏలయనగా వారికి వ్యతిరేకముగా అబినడై సాక్ష్యమిచ్చిన దుర్నీతిని గూర్చి అతడు ఎరిగియుండెను; కావున, అబినడైతో కోపముగా ఉండవద్దని, సమాధానముతో పోవుటకు అతడిని అనుమతించమని అతడు రాజును బ్రతిమాలసాగెను.

3 కానీ రాజు మరింతగా ఆగ్రహించి, ఆల్మా వారి మధ్య నుండి బయటకు త్రోసివేయబడునట్లు చేసెను మరియు అతడిని సంహరించునట్లు తన సేవకులను అతని వెనుక పంపెను.

4 కానీ అతడు వారి యెదుట నుండి పారిపోయి, వారతనిని కనుగొనకుండునట్లు దాగుకొనెను. అతడు అనేక దినములు పాటు దాగియుండి, అబినడై పలికిన మాటలన్నీ వ్రాసెను.

5 రాజు, తన భటులు అబినడైని చుట్టుముట్టి అతడిని పట్టుకొనునట్లు చేసెను; మరియు వారతనిని బంధించి, చెరసాలలో వేసిరి.

6 మూడు దినముల తర్వాత రాజు తన యాజకులతో సంప్రదించి, అతడిని తిరిగి తన ముందుకు రప్పించెను.

7 మరియు అతనితో ఇట్లనెను: అబినడై, మేము నీకు వ్యతిరేకముగా నేరారోపణ కనుగొనియున్నాము, నీవు మరణమునకు పాత్రుడవు.

8 ఏలయనగా దేవుడు తానే నరుల సంతానము మధ్యకు దిగిరావలెనని నీవు చెప్పియున్నావు; ఇప్పుడు ఈ కారణమును బట్టి నా గురించి, నా జనులను గురించి నీవు చెడుగా పలికిన మాటలన్నిటినీ వెనుకకు తీసుకుంటే తప్ప నీవు చంపబడుదువు.

9 అప్పుడు అబినడై అతనితో ఇట్లనెను: ఈ జనులను గూర్చి నేను పలికిన మాటలను నేను వెనుకకు తీసుకోనని నీతో చెప్పుచున్నాను, ఏలయనగా అవి సత్యమైయున్నవి; నిశ్చయముగా వాటిని నీవు తెలుసుకొనునట్లు నన్ను నేను నీ చేతులకప్పగించుకొంటిని.

10 నేను మరణమునైనను అనుభవించెదను, కానీ నా మాటలను వెనుకకు తీసుకొనను, అవి నీకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యమువలే నిలుచును. నీవు నన్ను సంహరించిన యెడల, నీవు నిరపరాధి రక్తమును చిందించెదవు, అంత్యదినమున ఇది కూడా నీకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యమువలే నిలుచును.

11 ఇప్పుడు రాజైన నోవాహ్ అతని మాటలకు భయపడి అతడిని విడుదల చేయబోయెను; ఏలయనగా దేవుని తీర్పులు అతనిపై వచ్చునని అతడు భయపడెను.

12 కానీ యాజకులు అతనికి వ్యతిరేకముగా తమ స్వరములెత్తి, అతడు రాజును అవమానపరచెనని చెప్పుచూ అతనిపై నేరారోపణ చేసిరి. కావున రాజు అతనికి వ్యతిరేకముగా కోపమందు పురికొల్పబడి, అతడు సంహరింపబడునట్లు అతడిని అప్పగించెను.

13 అంతట వారతనిని పట్టుకొని బంధించి, అతని చుట్టూ కట్టెల మోపులు పేర్చి మరణించువరకు అతడిని కాల్చిరి.

14 ఇప్పుడు మంటలు అతడిని దహించుచున్నప్పుడు అతడు బిగ్గరగా వారితో ఇట్లనెను:

15 ఇదిగో మీరు నాకు చేసినట్లుగానే నేను అనుభవించుచున్న బాధలను అగ్ని చేత మరణమును అనేకులు అనుభవించునట్లు మీ సంతానము చేయును; ఇది వారి దేవుడైన ప్రభువు యొక్క రక్షణ యందు వారి విశ్వాసమును బట్టియే జరుగును.

16 మీ దోషములను బట్టి మీరు అన్నిరకములైన వ్యాధులతో మొత్తబడుదురు.

17 మీరు ప్రతి ఒక్కరి చేత మొత్తబడుదురు మరియు భయంకరమైన అడవి మృగముల చేత అడవి మంద తరుమబడునట్లు ముందుకు వెనుకకు తరుమబడి, చెదరగొట్టబడుదురు.

18 ఆ దినమందు మీరు వేటాడబడుదురు, మీ శత్రువుల ద్వారా పట్టుకొనబడుదరు, అప్పుడు నావలె మీరును అగ్నిచేత మరణవేదనలు అనుభవించెదరు.

19 ఆ విధముగా తన జనులను నాశనము చేయు వారిపై దేవుడు పగతీర్చుకొనును. ఓ దేవా, నా ఆత్మను చేర్చుకొనుము.

20 అబినడై ఈ మాటలు చెప్పినప్పుడు, అగ్నిచేత మరణమును అనుభవించినవాడై, తన మాటలు సత్యమని మరణముచేత ముద్రవేసినవాడై, దేవుని ఆజ్ఞలను తిరస్కరించనందున చంపబడినవాడై అతడు ప్రాణము విడిచెను.