లేఖనములు
మోషైయ 15


15వ అధ్యాయము

ఎట్లు క్రీస్తు తండ్రి మరియు కుమారుడైయున్నాడు—ఆయన విజ్ఞాపనము చేయును మరియు జనుల అతిక్రమములను భరించును—వారు మరియు పరిశుద్ధ ప్రవక్తలందరు ఆయన సంతానమగుదురు—ఆయన పునరుత్థానమును తెచ్చును—చిన్న పిల్లలు నిత్యజీవము కలిగియున్నారు. సుమారు క్రీ. పూ. 148 సం.

1 ఇప్పడు అబినడై వారితో ఇట్లనెను: దేవుడు తానే నరుల సంతానము మధ్యకు దిగివచ్చునని, తన జనులను విమోచించునని మీరు గ్రహించవలెనని నేను కోరుచున్నాను.

2 ఆయన శరీరమందు నివసించినందున ఆయన దేవుని కుమారుడని పిలువబడును, శరీరమును తండ్రి చిత్తమునకు లోబరచినందున ఆయన తండ్రి మరియు కుమారుడైయున్నాడు—

3 ఆయన దేవుని శక్తి చేత గర్భమందు దాల్చబడెను గనుక తండ్రి; మరియు శరీరమును బట్టి కుమారుడు; ఆ విధముగా తండ్రి మరియు కుమారుడైయున్నాడు—

4 వారు ఏకమైయున్నారు, అనగా భూమ్యాకాశముల యొక్క నిత్య తండ్రియైయున్నారు.

5 ఆ విధముగా శరీరము ఆత్మకు లేదా కుమారుడు తండ్రికి లోబడి, ఏకమైయుండి శోధనను సహించును కానీ శోధనకు లోబడడు; వెక్కిరింపబడుటకు, కొరడాతో కొట్టబడుటకు, బయటకు త్రోసివేయబడుటకు, తన జనుల చేత తృణీకరింపబడుటకు తననుతాను అనుమతించును.

6 దీనియంతటి తర్వాత నరుల సంతానము మధ్య అనేక గొప్ప అద్భుతములను చేసిన తరువాత, యెషయా చెప్పినట్లు బొచ్చు కత్తిరించు వాని యెదుట గొఱ్ఱె మౌనముగా ఉన్నట్లు అతడు నడిపించబడును, కావున అతడు తన నోరు తెరవలేదు.

7 ఇంకను అట్లే అతడు నడిపించబడి, శరీరము మరణమునకు లోబడి, కుమారుని చిత్తము తండ్రి చిత్తమందు ఉపసంహరించబడి, సిలువ వేయబడి సంహరించబడును.

8 ఆ విధముగా మరణముపై జయము పొందినవాడై దేవుడు మరణబంధకములను త్రెంచును; నరుల సంతానము కొరకు విజ్ఞాపనము చేయుటకు కుమారునికి శక్తినిచ్చును—

9 పరలోకమునకు ఆరోహణుడైన వాడై కనికరము కలిగి, నరుల సంతానము యెడల జాలితో నిండినవాడై వారికిని, న్యాయమునకును మధ్యవర్తియై మరణబంధకములను త్రెంచి, వారి దోషములు, అతిక్రమములు తనపై వేసుకొని వారిని విమోచించి, న్యాయపు అక్కరలను తృప్తిపరచును.

10 ఇప్పుడు ఆయన సంతానమును ఎవరు వివరింతురు? పాపము కొరకు ఆయన ప్రాణము అర్పణముగా చేయబడియున్నప్పుడు ఆయన తన సంతానమును చూచునని నేను మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు మీరేమందురు? ఎవరు ఆయన సంతానమగుదురు?

11 ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను—ప్రవక్తల మాటలు, ముఖ్యముగా ప్రభువు రాకడను గూర్చి ప్రవచించియున్న ఆ ప్రవక్తలందరి మాటలు విన్నవారందరు, వారి మాటలను విని ప్రభువు తన జనులను విమోచించునని విశ్వసించి తమ పాపముల క్షమాపణకై ఆ దినము కొరకు ఎదురు చూచియున్న వారందరు—వారే ఆయన సంతానము లేదా దేవుని రాజ్యము యొక్క వారసులగుదురు.

12 ఏలయనగా ఆయన ఎవరి పాపములు భరించెనో వారు వీరే; వారి అతిక్రమముల నుండి వారిని విడిపించుటకు వారి కోసమే ఆయన మరణించెను. ఇప్పుడు వారు ఆయన సంతానము కారా?

13 మరియు ప్రవక్తలు, అతిక్రమములోనికి పడకుండా ప్రవచించుటకు తన నోరు తెరచిన ప్రతివాడు, లోకారంభము నుండి గల పరిశుద్ధ ప్రవక్తలందరూ ఆయన సంతానము కారా? అని నా ఉద్దేశ్యము. వారు ఆయన సంతానమని నేను మీతో చెప్పుచున్నాను.

14 సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించినవారు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పిన వారు వీరే.

15 వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి.

16 ఇంకను సమాధానము చాటించుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి.

17 ఇకపైన ఈ సమయము నుండి ముందుకు మరియు నిరంతరము సమాధానము చాటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి.

18 అంతయు ఇదియే కాదని నేను మీతో చెప్పుచున్నాను. ఏలయనగా సువర్తమానము తెచ్చువాడు సమాధాన స్థాపకుడు, ముఖ్యముగా తన జనులను విమోచించి, వారికి రక్షణను అనుగ్రహించిన ప్రభువు యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి;

19 ఏలయనగా లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధము చేయబడి, ఆయన తన జనుల కొరకు చేసిన విమోచనను బట్టి కాని యెడల, సమస్త మానవజాతి నశించియుండవలెనని నేను మీతో చెప్పుచున్నాను.

20 కానీ మరణబంధకములు త్రెంచబడును, కుమారుడు పరిపాలించును మరియు మృతులపై అధికారము కలిగియుండును; కావున, ఆయన మృతుల పునరుత్థానమును తెచ్చును.

21 అప్పుడు ఒక పునరుత్థానము, అనగా మొదటి పునరుత్థానము వచ్చును; ఉండియున్నవారు, ఉన్నవారు మరియు క్రీస్తు పునరుత్థానము వరకు కూడా ఉండే వారి యొక్క పునరుత్థానము వచ్చును—ఏలయనగా ఆయన క్రీస్తు అని పిలువబడును.

22 ఇప్పుడు ప్రవక్తలందరు, వారి మాటలయందు విశ్వాసముంచిన వారందరు లేదా దేవుని ఆజ్ఞలను పాటించిన వారందరి పునరుత్థానము మొదటి పునరుత్థానమందు వచ్చును; కావున, వారు మొదటి పునరుత్థానమగుదురు.

23 వారిని విమోచించిన దేవునితో నివసించుటకు వారు లేపబడుదురు; ఆ విధముగా మరణబంధకములను త్రెంచిన క్రీస్తు ద్వారా వారు నిత్యజీవము కలిగియున్నారు.

24 మొదటి పునరుత్థానమందు పాలు కలిగియున్న వారు వీరే; వీరు తమ అజ్ఞానములో క్రీస్తు రాకడకు ముందు మరణించిన వారు, వీరికి రక్షణ ప్రకటించబడలేదు. ఆవిధముగా ప్రభువు వీరి పునఃస్థాపనను తెచ్చును; వారు ప్రభువు చేత విమోచింపబడి మొదటి పునరుత్థానమందు పాలు కలిగియున్నారు లేదా నిత్యజీవము కలిగియున్నారు.

25 చిన్నపిల్లలు కూడా నిత్యజీవము కలిగియున్నారు.

26 కానీ చూడుడి, భయపడుడి మరియు దేవుని యెదుట వణకుడి, ఏలయనగా మీరు వణక వలసియున్నది; ఏలయనగా ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయువారిని, వారి పాపములలో మరణించువారెవరిని ప్రభువు విమోచించడు; ముఖ్యముగా లోకారంభము నుండి తమ పాపములలో నశించిన వారు, దేవునికి వ్యతిరేకముగా ఇష్టపూర్వకముగా తిరుగుబాటు చేసిన వారు, దేవుని ఆజ్ఞలను ఎరిగియుండి వాటిని పాటించని వారందరు మొదటి పునరుత్థానమందు పాలు కలిగియుండరు.

27 కావున మీరు వణకనవసరము లేదా? అట్టి వారెవరికీ రక్షణ రాదు; అట్టి వారినెవ్వరినీ ప్రభువు విమోచించియుండలేదు, లేదా అట్టి వారిని ప్రభువు విమోచించలేడు; ఆయన తననుతాను తిరస్కరించలేడు; ఏలయనగా న్యాయము తన హక్కును కలిగియున్నప్పుడు ఆయన దానిని తిరస్కరించలేడు.

28 ఇప్పుడు ప్రభువు యొక్క రక్షణ ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలకు ప్రకటించబడు సమయము వచ్చునని నేను మీతో చెప్పుచున్నాను.

29 ప్రభువా, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు; ప్రభువు సీయోనును మరలా రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.

30 యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి, ప్రభువు తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను.

31 సమస్త జనముల కన్నుల యెదుట ప్రభువు తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు; భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.