లేఖనములు
మోషైయ 16


16వ అధ్యాయము

దేవుడు మనుష్యులను తప్పిపోయిన, పతనమైన స్థితి నుండి విమోచించును—శరీరసంబంధులు విమోచన లేనట్లే యుందురు—అంతము లేని జీవమునకు లేదా అంతము లేని శిక్షకు క్రీస్తు ఒక పునరుత్థానమును తెచ్చును. సుమారు క్రీ. పూ. 148 సం.

1 ఇప్పుడు అబినడై ఈ మాటలు పలికిన తరువాత తన చేయి ముందుకు చాచి, ఇట్లనెను: ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలు ముఖాముఖిగా ప్రభువు యొక్క రక్షణను చూచి, ఆయన తీర్పులు న్యాయమైనవని దేవుని యెదుట ఒప్పుకొను సమయము వచ్చును.

2 అప్పుడు దుర్మార్గులు బయటకు త్రోసివేయబడుదురు, వారు ప్రలాపించుటకు, ఏడ్చుటకు, రోదించుటకు, పండ్లు కొరుకుటకు కారణము కలిగియుందురు; ఇదంతయు వారు ప్రభువు యొక్క స్వరమును ఆలకించకుండుటను బట్టియే; కావున ప్రభువు వారిని విమోచించడు.

3 ఏలయనగా వారు శరీర సంబంధులు, అపవాది సంబంధులు మరియు అపవాది, అనగా మన మొదటి తల్లిదండ్రులను మోసగించిన ఆ పురాతన సర్పము వారిపై అధికారము కలిగియుండును; అది వారి పతనమునకు కారణమాయెను; సమస్త మానవజాతి శరీర సంబంధులు, కామాతురులు, అపవాది సంబంధులు అగుటకు, మంచి చెడులను తెలుసుకొని వారు తమనుతాము అపవాదికి లోబరచుకొనుటకు అది కారణమాయెను.

4 ఆ విధముగా సమస్త మానవజాతి తప్పిపోయెను; మరియు తప్పిపోయిన, పతనమైన స్థితి నుండి తన జనులను దేవుడు విమోచించని యెడల, వారు నిరంతరము తప్పిపోయి ఉండేవారు.

5 కానీ తన స్వంత శరీర సంబంధమైన స్వభావమునందు కొనసాగి, పాపపు మార్గములలో వెళ్ళి, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయువాడు తన పతనమైనస్థితిలో నిలిచియుండునని, అపవాది అతనిపై సమస్త అధికారము కలిగియుండునని జ్ఞాపకముంచుకొనుము. కావున అతడు దేవునికి శత్రువైయుండి, అసలు విమోచన చేయబడనట్లే ఉండును; అపవాది కూడా దేవునికి శత్రువైయున్నాడు.

6 ఇప్పుడు జరుగబోవు సంగతులు ఇంతకు ముందే జరిగిపోయినట్లు నేను మాట్లాడుచున్నాను, క్రీస్తు లోకములోనికి వచ్చియుండని యెడల అసలు విమోచన ఉండేది కాదు.

7 సమాధికి ఎట్టి విజయము లేకుండునట్లు, మరణమునకు ఎట్టి ముల్లు లేకుండునట్లు క్రీస్తు మృతుల నుండి లేచియుండని యెడల లేదా మరణబంధకములను త్రెంచియుండని యెడల పునరుత్థానము ఉండేది కాదు.

8 కానీ పునరుత్థానమున్నది మరియు మరణము యొక్క ముల్లు క్రీస్తు నందు మ్రింగి వేయబడినది; కావున సమాధికి విజయము లేదు.

9 ఆయన లోకమునకు వెలుగును, జీవమునైయున్నాడు; ముఖ్యముగా అంతములేని, ఎన్నడూ చీకటి కాని ఒక వెలుగు మరియు అంతములేని, ఇక ఏ మాత్రము మరణముండని ఒక జీవమైయున్నాడు.

10 ఈ మర్త్యత్వము అమర్త్యత్వమును ధరించుకొనును, ఈ క్షయత అక్షయతను ధరించుకొనును, మరియు అవి మంచివేగాని చెడ్డవేగాని వారి క్రియలను బట్టి ఆయన ద్వారా తీర్పుతీర్చబడుటకు దేవుని న్యాయస్థానము యెదుట నిలువబడుటకు తేబడును—

11 అవి మంచివైన యెడల, అంతము లేని జీవము మరియు సంతోషము యొక్క పునరుత్థానమునకు; అవి చెడ్డవైన యెడల, వారిని శిక్షావిధికి లోబరచిన అపవాదికి అప్పగించబడి అంతము లేని శిక్ష యొక్క పునరుత్థానమునకు తేబడుదురు.

12 వారి శరీర సంబంధమైన చిత్తములు, కోరికలను బట్టి వెళ్ళిన వారై కనికరము యొక్క బాహువులు వారి వైపు చాచబడియుండగా ఎన్నడును వారు ప్రభువు నామమున ప్రార్థన చేయలేదు; కనికరము యొక్క బాహువులు వారి వైపు చాచబడినను వారు దానిని అంగీకరించలేదు; వారు తమ దోషములను బట్టి హెచ్చరింపబడినను వాటి నుండి తొలగిపోలేదు; పశ్చాత్తాపపడుటకు ఆజ్ఞాపించబడినను వారు పశ్చాత్తాపపడలేదు.

13 ఇప్పుడు మీ పాపములను గూర్చి మీరు వణికి పశ్చాత్తాపపడి, కేవలము క్రీస్తు నందు మరియు ద్వారానే మీరు రక్షింపబడగలరని జ్ఞాపకము చేసుకొనవలెను కదా?

14 కావున మీరు మోషే ధర్మశాస్త్రమును బోధించిన యెడల, అది రాబోవు విషయములకు చిహ్నమని కూడా బోధించుడి—

15 నిజముగా నిత్యతండ్రి అయిన ఆ ప్రభువైన క్రీస్తు ద్వారానే విమోచన వచ్చునని వారికి బోధించుడి. ఆమేన్‌.