లేఖనములు
మోషైయ 26


26వ అధ్యాయము

సంఘసభ్యులలో అనేకమంది అవిశ్వాసుల చేత పాపములోనికి నడిపించబడుదురు—ఆల్మాకు నిత్యజీవము వాగ్దానము చేయబడును—పశ్చాత్తాపపడి, బాప్తిస్మము పొందువారు పాప క్షమాపణ పొందుదురు—పాపము చేసిన సంఘ సభ్యులలో పశ్చాత్తాపపడి, ఆల్మా మరియు దేవుని యెదుట ఒప్పుకొనిన వారు క్షమించబడుదురు; లేని యెడల, వారు సంఘసభ్యుల మధ్య లెక్కింపబడరు. సుమారు క్రీ. పూ. 120–100 సం.

1 ఇప్పుడు, రాజైన బెంజమిన్ తన జనులతో మాట్లాడినప్పుడు చిన్న పిల్లలైయుండి ఆయన మాటలను గ్రహించలేకపోయిన యువతరములో అనేకులు అక్కడ ఉండిరి; వారు తమ పితరుల సంప్రదాయములందు విశ్వసించలేదు.

2 వారు మృతుల పునరుత్థానమును గూర్చి లేదా క్రీస్తు యొక్క రాకడను గూర్చి చెప్పబడిన దానిని విశ్వసించలేదు.

3 వారి అవిశ్వాసమును బట్టి వారు దేవుని వాక్యమును గ్రహించలేకపోయిరి మరియు వారి హృదయములు కఠినపరచబడినవి.

4 వారు బాప్తిస్మము పొందకుండిరి లేదా సంఘమునందు చేరకుండిరి. వారి విశ్వాసమును బట్టి వారు ప్రత్యేక జనులుగా ఉండి, వారి శరీరసంబంధమైన పాపపు స్థితియందు ఎప్పటికీ నిలిచియుండిరి; ఏలయనగా వారి దేవుడైన ప్రభువును వారు ప్రార్థించలేదు.

5 ఇప్పుడు మోషైయ పరిపాలనలో వారు దేవుని పిల్లల సంఖ్యలో సగము కూడా లేరు; కానీ సహోదరుల మధ్య కలతల కారణముగా వారు అధిక సంఖ్యాకులైరి.

6 సంఘములో ఉన్న అనేకమందిని వారు తమ ముఖస్తుతులతో మోసగించి, అనేక పాపములు చేయునట్లు చేసిరి; కావున, సంఘములో ఉండి పాపము చేసిన వారు సంఘము చేత మందలింపబడుట అవసరమాయెను.

7 వారు యాజకుల యెదుటకు తేబడి, బోధకుల చేత యాజకులకు అప్పగించబడిరి మరియు యాజకులు వారిని ప్రధాన యాజకుడైన ఆల్మా యెదుటకు తీసుకువచ్చిరి.

8 ఇప్పుడు రాజైన మోషైయ సంఘముపై అధికారమును ఆల్మాకు ఇచ్చియుండెను.

9 ఆల్మా వారిని గూర్చి ఎరిగియుండలేదు; కానీ వారికి వ్యతిరేకముగా అనేకమంది సాక్షులుండిరి; వారి దోషములను గూర్చి జనులు విస్తారముగా సాక్ష్యమిచ్చిరి.

10 సంఘమందు ఇటువంటిదేదియు ఇంతకుముందు జరిగియుండలేదు; కావున ఆల్మా తన ఆత్మలో కలవరపడి, వారు రాజు యెదుటకు తేబడునట్లు చేసెను.

11 మరియు అతడు రాజుతో ఇట్లనెను: తమ సహోదరుల చేత నేరారోపణ చేయబడిన అనేకమందిని మేము మీ యెదుటకు తీసుకొనివచ్చియున్నాము; వారు వివిధ దోషముల యందు పట్టబడియున్నారు. తమ దోషముల విషయమై వారు పశ్చాత్తాపపడుటలేదు; కావున, వారి నేరములను బట్టి మీరు వారికి తీర్పుతీర్చునట్లు మేము వారిని మీ యెదుటకు తెచ్చియున్నాము.

12 కానీ రాజైన మోషైయ ఆల్మాతో ఇట్లనెను: ఇదిగో నేను వారికి తీర్పుతీర్చను; కావున, తీర్పుతీర్చబడునట్లు వారిని నీ చేతులకు అప్పగించుచున్నాను.

13 మరలా ఆల్మా యొక్క ఆత్మ కలవరపడెను; ఈ విషయమును గూర్చి తానేమి చేయవలెనని అతడు ప్రభువు వద్ద విచారించెను, ఏలయనగా దేవుని దృష్టిలో తాను పొరపాటు చేయుదునేమోయని అతడు భయపడెను.

14 అతడు తన పూర్ణాత్మను దేవునికి క్రుమ్మరించిన తరువాత, ప్రభువు యొక్క స్వరము అతనితో ఇట్లు చెప్పెను:

15 ఆల్మా నీవు ధన్యుడవు, మోర్మన్‌ జలముల యందు బాప్తిస్మము పొందిన వారందరు ధన్యులు. కేవలము నా సేవకుడైన అబినడై మాటల యందు నీకు గల అధిక విశ్వాసమును బట్టి నీవు ధన్యుడవు.

16 మరియు కేవలము నీవు వారితో పలికిన మాటల యందు వారి అధిక విశ్వాసమును బట్టి వారు ధన్యులు.

17 ఈ జనుల మధ్య నీవు ఒక సంఘమును స్థాపించియున్నందున నీవు ధన్యుడవు; వారు స్థిరపరచబడి, నా జనులైయుందురు.

18 నా నామమును తమపై తీసుకొనుటకు ఇష్టపడుచున్న ఈ జనులు ధన్యులు, ఏలయనగా వారు నా నామమందు పిలువబడుదురు; వారు నా వారు.

19 మరియు అతిక్రమకారుని గూర్చి నీవు నన్ను విచారించియున్నావు, కావున నీవు ధన్యుడవు.

20 నీవు నా సేవకుడవు; నీవు నిత్యజీవము కలిగియుందువని నేను నీతో నిబంధన చేయుచున్నాను; నీవు నన్ను సేవించి, నా నామమందు బయలువెళ్ళి నా గొఱ్ఱెలను సమకూర్చవలెను.

21 నా స్వరమును వినువాడు నా గొఱ్ఱెయైయుండును; అతడిని నీవు సంఘములోకి చేర్చుకొనవలెను మరియు నేను కూడా అతడిని చేర్చుకొనెదను.

22 ఏలయనగా ఇది నా సంఘము; బాప్తిస్మము పొందు వారందరు పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొందెదరు. నీవు చేర్చుకొను వారు నా నామమందు విశ్వసించెదరు; వారిని నేను ధారాళముగా క్షమించెదను.

23 ఏలయనగా నేనే లోక పాపములను నాపై తీసుకొనుచున్నాను; వారిని సృష్టించినది నేనే; అంతము వరకు విశ్వసించు వానికి నా కుడి పార్శ్వమున స్థలము అనుగ్రహించువాడను నేనే.

24 ఏలయనగా, నా నామమందు వారు పిలువబడియున్నారు; వారు నన్ను ఎరిగియున్న యెడల సమాధినుండి లేచి వచ్చి, నిత్యము నా కుడి పార్శ్వమున స్థలము కలిగియుందురు.

25 రెండవ బూర శబ్దము చేయబడినప్పుడు నన్నెన్నడూ ఎరుగని వారు వచ్చి నా యెదుట నిలిచెదరు.

26 నేనే వారి దేవుడనైన ప్రభువునని, నేనే వారి విమోచకుడనని వారు తెలుసుకొందురు; కానీ వారు విమోచింపబడరు.

27 అప్పుడు నేను వారిని ఎన్నడూ ఎరుగనని వారితో చెప్పుదును; వారు అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుదురు.

28 కావున నా స్వరము వినని వానిని నీవు నా సంఘములోనికి చేర్చుకొనరాదు; ఏలయనగా అంత్యదినమున నేనతనిని చేర్చుకోనని నీతో చెప్పుచున్నాను.

29 కావున వెళ్ళుము, నాకు వ్యతిరేకముగా అతిక్రమము చేయువానిని అతడు చేసియున్న పాపములను బట్టి నీవు తీర్పు తీర్చవలెను; అతడు నీ యెదుట మరియు నా యెదుట తన పాపములను ఒప్పుకొని, యథార్థ హృదయముతో పశ్చాత్తాపపడిన యెడల అతడిని నీవు క్షమించవలెనని, నేను కూడా అతడిని క్షమించెదనని నీతో చెప్పుచున్నాను.

30 ఎంత తరచుగా నా జనులు పశ్చాత్తాపపడుదురో అంత తరచుగా నాకు వ్యతిరేకముగా వారు చేసిన అతిక్రమములను నేను క్షమించెదను.

31 మీరు కూడా ఒకరి అతిక్రమములను మరొకరు క్షమించవలెను; ఏలయనగా తన పొరుగువాని అతిక్రమములను క్షమించకుండా తాను పశ్చాత్తాపపడితినని చెప్పువాడు తననుతాను శిక్షావిధికి లోబరచుకొనునని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

32 ఇప్పుడు వెళ్ళుము; తన పాపముల విషయమై పశ్చాత్తాపపడని వాడు నా జనుల మధ్య లెక్కింపబడడని, ఈ సమయము నుండి ఇది పాటించబడునని నేను నీతో చెప్పుచున్నాను.

33 ఆల్మా ఈ మాటలను వినినప్పుడు, అతడు వాటిని కలిగియుండునట్లు మరియు దేవుని ఆజ్ఞల ప్రకారము సంఘ జనులకు అతడు తీర్పు తీర్చునట్లు వాటిని వ్రాసుకొనెను.

34 అప్పుడు ఆల్మా వెళ్ళి, దోషముల యందు పట్టుబడిన వారికి ప్రభువు వాక్యము ప్రకారము తీర్పుతీర్చెను.

35 తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, వాటిని ఒప్పుకొనిన వారిని అతడు సంఘ జనుల మధ్య లెక్కించెను.

36 తమ పాపములను ఒప్పుకొనక, తమ దోషముల నిమిత్తము పశ్చాత్తాపపడని వారు సంఘ జనుల మధ్య లెక్కింపబడలేదు మరియు వారి పేర్లు తొలగించబడెను.

37 ఇప్పుడు ఆల్మా సంఘ వ్యవహారములన్నిటినీ క్రమపరిచెను; వారు మరలా సమాధానము కలిగియుండి, దేవుని యెదుట జాగ్రత్తగా నడుచుకొనుచు, అనేకులను చేర్చుకొనుచు, అనేకులకు బాప్తిస్మమిచ్చుచూ సంఘ వ్యవహారములలో మిక్కిలిగా వర్థిల్లసాగిరి.

38 ఆల్మా మరియు సంఘమందున్న తోటి సేవకులు పూర్తి శ్రద్ధతో నడుచుకొనుచు, అన్ని విషయములలో దేవుని వాక్యమును బోధించుచు, సమస్త విధములైన బాధలను అనుభవించుచు, దేవుని సంఘమునకు చెందని వారందరి వలన హింసింపబడుచూ ఈ కార్యములన్నియు చేసిరి.

39 మరియు వారు తమ సహోదరులను మందలించిరి; నిరంతరము ప్రార్థన చేయవలెనని, అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని దేవుని చేత ఆజ్ఞాపింపబడిన వారై, ప్రతివాడు అతని పాపములు లేదా అతడు చేసియున్న పాపములను బట్టి వారు కూడా దేవుని వాక్యము చేత మందలింపబడిరి.