లేఖనములు
మోషైయ 28


28వ అధ్యాయము

మోషైయ కుమారులు లేమనీయులకు బోధించుటకు వెళ్ళుదురు—రెండు దీర్ఘదర్శి రాళ్ళను ఉపయోగించుచూ మోషైయ జెరెడీయుల పలకలను అనువదించును. సుమారు క్రీ. పూ. 92 సం.

1 ఇప్పుడు ఈ కార్యములన్నిటినీ చేసిన తరువాత, మోషైయ కుమారులు తమతోపాటు కొద్దిమందిని తీసుకొని తమ తండ్రియైన రాజు యొద్దకు తిరిగి వెళ్ళి, తాము వినియున్న విషయములను వారు బోధించ గలుగునట్లు మరియు తమ సహోదరులైన లేమనీయులకు దేవుని వాక్యమును తెలియజేయునట్లు వారు ఎన్నుకొనిన వారితోపాటు నీఫై దేశమునకు వెళ్ళగలుగునట్లు అతడు వారికి అనుగ్రహించవలెనని కోరిరి—

2 బహుశా వారు, వారి దేవుడైన ప్రభువును గూర్చి వారికి తెలియజేయవచ్చునని, వారి పితరుల దోషమును గూర్చి వారిని ఒప్పించవచ్చునని, నీఫైయుల యెడల వారి ద్వేషమును తొలగించవచ్చునని, వారు కూడా వారి దేవుడైన ప్రభువు నందు సంతోషించునట్లు, ఒకరితోనొకరు స్నేహముగా ఉండునట్లు చేయవచ్చునని, వారి దేవుడైన ప్రభువు వారికి ఇచ్చియున్న దేశమంతటిలో ఏ వివాదములు ఉండకూడదని వారనుకొనిరి.

3 ఇప్పుడు ప్రతిప్రాణికి రక్షణ ప్రకటించబడవలెనని వారు కోరిరి, ఏలయనగా ఏ మానవ ఆత్మయు నశించిపోవుటను వారు సహించలేకపోయిరి; అంతేకాక ఏ ఆత్మ అయినా అంతము లేని బాధను అనుభవించవలెనన్న తలంపు కూడా వారిని కంపించునట్లు, వణకునట్లు చేసెను.

4 ఆ విధముగా ప్రభువు యొక్క ఆత్మ వారిపై పనిచేసెను; ఏలయనగా వారు మిక్కిలి దుష్టులైన పాపులైయుండిరి. ప్రభువు తన అనంతమైన కనికరమందు వారిని విడిచిపెట్టుట సరియని చూచెను; అయినప్పటికీ అధికముగా బాధననుభవించుచు, వారు శాశ్వతముగా కొట్టివేయబడుదురేమోనని భయపడుచు వారు తమ దోషముల నిమిత్తము అధిక మనోవేదనను అనుభవించిరి.

5 మరియు నీఫై దేశమునకు వెళ్ళునట్లు వారు తమ తండ్రిని అనేక దినములు బ్రతిమాలుకొనిరి.

6 అప్పుడు వాక్యమును బోధించుటకు లేమనీయుల మధ్యకు తన కుమారులు వెళ్ళుటకు అతడు అనుమతించవలెనా అని రాజైన మోషైయ ప్రభువు వద్ద విచారించెను.

7 ప్రభువు మోషైయతో ఇట్లనెను: వారిని వెళ్ళనిమ్ము, ఏలయనగా అనేకులు వారి మాటలను విశ్వసించెదరు మరియు వారు నిత్యజీవమును కలిగియుందురు; నీ కుమారులను లేమనీయుల చేతులలో నుండి నేను విడిపించెదను.

8 అప్పుడు వారు వెళ్ళి, వారి కోరిక ప్రకారము చేయునట్లు మోషైయ అనుగ్రహించెను.

9 వారు లేమనీయుల మధ్య వాక్యమును బోధించుటకు అరణ్యములో ప్రయాణించుచూ వెళ్ళిరి; వారి వ్యవహారముల యొక్క వృత్తాంతమును నేను ఇక మీదట ఇచ్చెదను.

10 ఇప్పుడు రాజైన మోషైయ రాజ్యమును అనుగ్రహించుటకు అక్కడ ఎవరును లేకుండెను, ఏలయనగా అతని కుమారులలో ఎవరును రాజ్యమును అంగీకరించకుండెను.

11 కాబట్టి అతడు కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతములను, నీఫై పలకలను, దేవుని ఆజ్ఞల ప్రకారము అతడు భద్రపరచిన అన్ని వస్తువులను తీసుకొని, లింహై యొక్క జనులచే కనుగొనబడి లింహై చేతి ద్వారా అతనికి అప్పగించబడిన బంగారు పలకలపై ఉన్న వృత్తాంతములను అనువాదము చేసి, వ్రాయబడునట్లు చేసెను;

12 దీనిని అతడు, తన జనుల యొక్క గొప్ప ఆతురుతను బట్టి చేసెను; ఏలయనగా నాశనము చేయబడిన ఆ జనులను గూర్చి తెలుసుకొనుటకు వారు మిక్కిలిగా కోరియుండిరి.

13 ఇప్పుడతడు ఒక చట్రము యొక్క రెండు అంచులలో జతచేయబడియున్న ఆ రెండు రాళ్ళ ద్వారా వాటిని అనువదించెను.

14 ఈ వస్తువులు ఆది నుండి సిద్ధము చేయబడి, భాషలకు అర్థము చెప్పు ఉద్దేశ్యము నిమిత్తము తరతరములకు అందించబడినవి;

15 దేశమును స్వాధీనపరచుకొను ప్రతి ప్రాణికి జనుల దోషములను, హేయకార్యములను ఆయన బయల్పరచునట్లు అవి ప్రభువు యొక్క హస్తము ద్వారా కాపాడబడి, భద్రపరచబడియున్నవి.

16 మరియు పూర్వకాల పద్ధతిని బట్టి, ఈ వస్తువులను కలిగియున్నవాడు దీర్ఘదర్శియని పిలువబడెను.

17 ఇప్పుడు మోషైయ ఈ వృత్తాంతముల అనువాదము ముగించినప్పుడు, అది నాశనము చేయబడిన జనుల వృత్తాంతమునిచ్చెను, ఆ వృత్తాంతము వారు నాశనము చేయబడిన సమయము నుండి వెనుకకు వారు గొప్ప గోపురమును కట్టుచున్నప్పుడు ప్రభువు జనుల భాషను తారుమారు చేసినప్పుడు వారు సమస్త భూముఖముపై చెదిరిపోయిన సమయము వరకు మరియు ఆ సమయము నుండి వెనుకకు ఆదాము యొక్క సృష్టి వరకు కూడా కలిగియుండెను.

18 ఈ వృత్తాంతము మోషైయ జనులు మిక్కిలిగా దుఃఖించునట్లు చేసెను, వారు దుఃఖముతో నిండినప్పటికీ అది వారికి అధిక జ్ఞానమునిచ్చెను మరియు దానియందు వారు ఆనందించిరి.

19 ఈ వృత్తాంతము ఇకపై వ్రాయబడును; ఏలయనగా ఈ వృత్తాంతము నందు వ్రాయబడిన విషయములను జనులందరు తెలుసుకొనుట అవసరమైయున్నది.

20 ఇప్పుడు నేను మీతో చెప్పినట్లుగా రాజైన మోషైయ ఈ కార్యములను చేసిన తరువాత, కంచు పలకలను మరియు అతడు భద్రపరచిన సమస్త వస్తువులను తీసుకొని వాటిని ఆల్మా యొక్క కుమారుడైన ఆల్మాకు అప్పగించెను; అన్ని వృత్తాంతములను అనువాదకారకములను అతనికిచ్చి, అతడు వాటిని కాపాడి, భద్రపరచవలెనని మరియు జనుల యొక్క వృత్తాంతమును కూడా వ్రాసి, లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి అందించబడుచున్నట్లుగా ఒక తరము నుండి మరియొక తరమునకు వాటిని అందించవలెనని కూడా అతడిని ఆజ్ఞాపించెను.