లేఖనములు
మోషైయ 3


3వ అధ్యాయము

రాజైన బెంజమిన్ తన ప్రసంగమును కొనసాగించును—సర్వశక్తిమంతుడైన ప్రభువు ఒక మట్టి గుడారములో మనుష్యుల మధ్య పరిచర్య జరిగించును—లోక పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేయగా ప్రతి స్వేదరంధ్రము నుండి రక్తము వచ్చును—కేవలము ఆయన నామము ద్వారానే రక్షణ కలుగును—మనుష్యులు ప్రకృతి సంబంధమైన మనుష్యుని విసర్జించి ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధులు కాగలరు—దుష్టుల వేదన అగ్ని గంధకములు గల గుండము వలే ఉండును. సుమారు క్రీ. పూ. 124 సం.

1 నా సహోదరులారా, దయచేసి ఆలకించమని నేను మిమ్ములను కోరుచున్నాను, ఏలయనగా నేను మీతో చెప్పవలసినది ఇంకా కొంత వున్నది; రాబోవుచున్న దానిని గూర్చి నేను మీతో చెప్పవలసిన విషయములు కలవు.

2 నేను మీతో చెప్పవలసిన విషయములు దేవుని నుండి వచ్చిన దేవదూత ద్వారా నాకు తెలియజేయబడినవి. అతడు నాతో మేలుకొమ్మని చెప్పగా నేను మేలుకొంటిని; అప్పుడతడు నా యెదుట నిలిచెను.

3 అతడు నాతో ఇట్లనెను: మేలుకొనుము, నేను నీతో చెప్పు మాటలను వినుము; ఏలయనగా మహా సంతోషకరమైన సువర్తమానము నీకు తెలియజేయుటకు నేను వచ్చితిని.

4 ప్రభువు నీ ప్రార్థనలను వినియున్నాడు, నీ నీతిని బట్టి తీర్పుతీర్చియున్నాడు, నీవు ఆనందించునట్లు నీకు ప్రకటించుటకు నన్ను పంపియున్నాడు; తద్వారా నీ జనులు సంతోషముతో నింపబడునట్లు నీవు వారికి ప్రకటించవచ్చు.

5 ఏలయనగా శక్తితో పరిపాలన చేయువాడు, నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఉన్న మరియు ఉండు ఆ సర్వశక్తిమంతుడైన ప్రభువు పరలోకము నుండి నరుల సంతానము మధ్యకు దిగివచ్చి ఒక మట్టి గుడారములో నివసించును, మరియు రోగులను స్వస్థపరచుచూ, మృతులను లేపుచూ, కుంటివారు నడుచునట్లు, గ్రుడ్డివారు తమ చూపును పొందునట్లు, చెవిటివారు వినునట్లు చేయుట మరియు అన్నివిధములైన వ్యాధులను బాగుచేయుట వంటి గొప్ప అద్భుతములను చేయుచూ మనుష్యుల మధ్య ముందుకు వెళ్ళు సమయము వచ్చును, అది ఎంతో దూరములో లేదు.

6 ఆయన నరుల సంతానము యొక్క హృదయములలో నివసించే దయ్యములను లేదా దురాత్మలను వెళ్ళగొట్టును.

7 మరణము తప్ప, మనుష్యుడు సహించగలిగిన దాని కంటే అధికముగా ఆయన శోధనలను, శారీరక బాధను, ఆకలిదప్పులను మరియు అలసటను సహించును; ప్రతి స్వేదరంధ్రము నుండి రక్తము వచ్చును, ఏలయనగా తన జనుల దుష్టత్వము, హేయక్రియల కొరకు ఆయన వేదన అంత గొప్పగా ఉండును.

8 ఆయన యేసు క్రీస్తనియు, దేవుని కుమారుడనియు, భూమ్యాకాశముల యొక్క తండ్రియనియు, ఆది నుండి అన్నింటి యొక్క సృష్టికర్తయనియు పిలువబడును; ఆయన తల్లి మరియ అని పిలువబడును.

9 ఆయన నామమందు విశ్వాసముంచుట ద్వారా నరుల సంతానమునకు రక్షణ రాగలదని ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చును; దీనియంతటి తరువాత కూడా వారు ఆయనను ఒక మనుష్యునిగా భావించి, అతడు ఒక దయ్యమును కలిగియున్నాడని చెప్పి అతడిని కొరడాతో కొట్టి, సిలువ వేయుదురు.

10 మూడవ దినమున ఆయన మృతులలో నుండి లేచును; లోకమును తీర్పు తీర్చుటకు ఆయన నిలుచును; నరుల సంతానముపై నీతిగల తీర్పు వచ్చునట్లు ఈ కార్యములన్నియు చేయబడెను.

11 ఆదాము యొక్క అతిక్రమము ద్వారా పతనమైన వారు, దేవుని చిత్తము తెలియకనే మరణించియున్న వారు లేదా అజ్ఞానము వలన పాపము చేసియున్న వారి పాపముల కొరకు కూడా ఆయన రక్తము ప్రాయశ్చిత్తము చేయును.

12 కానీ ఆపద, తాను దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుచున్నాడని ఎరుగు వానికి ఆపద! ఏలయనగా పశ్చాత్తాపము మరియు ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసము ద్వారా తప్ప ఎవనికీ రక్షణ రాదు.

13 ఈ విషయములను ప్రతి వంశము, జనము, మరియు భాషలకు ప్రకటించుటకు ప్రభువైన దేవుడు నరుల సంతానము మధ్యకు తన పరిశుద్ధ ప్రవక్తలను పంపియున్నాడు, తద్వారా క్రీస్తు వచ్చునని విశ్వసించువారు తమ పాపక్షమాపణను పొందెదరు మరియు ఆయన వారి మధ్య అప్పటికే వచ్చియున్నట్టు మహదానందముతో సంతోషించెదరు.

14 అయినప్పటికీ, తన జనులు మెడబిరుసు జనులైయున్నారని ప్రభువైన దేవుడు చూచెను; ఆయన వారికి ఒక ధర్మశాస్త్రమును, అనగా మోషే ధర్మశాస్త్రమును నియమించెను.

15 తన రాకడను గూర్చి ఆయన వారికి అనేక సూచకక్రియలు, ఆశ్చర్యకార్యములు, సూచనలు మరియు ఛాయలు చూపించెను; పరిశుద్ధ ప్రవక్తలు కూడా ఆయన రాకడను గూర్చి వారికి చెప్పిరి; అయినప్పటికీ వారు తమ హృదయములను కఠినపరచుకొనిరి మరియు ఆయన రక్తము యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా తప్ప మోషే ధర్మశాస్త్రము వలన ఏ ప్రయోజనము లేదని గ్రహించలేకపోయిరి.

16 చిన్న పిల్లలు పాపము చేయుట సాధ్యమైన యెడల, వారు కూడా రక్షింపబడలేరు; కానీ, వారు ఆశీర్వదింపబడిన వారని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ఆదామును బట్టి లేదా స్వభావమును బట్టి వారు పతనమైనప్పటికీ, క్రీస్తు యొక్క రక్తము వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును.

17 అంతేకాకుండా కేవలము సర్వశక్తిమంతుడైన ప్రభువైన క్రీస్తు యొక్క నామము నందు మరియు ద్వారానే తప్ప, నరుల సంతానమునకు రక్షణనిచ్చు మరి ఏ ఇతర నామము, మార్గము లేదా సాధనము ఇవ్వబడలేదని నేను మీతో చెప్పుచున్నాను.

18 ఏలయనగా ఆయన తీర్పుతీర్చును మరియు ఆయన తీర్పు న్యాయమైనది; తన శైశవమందు మరణించు శిశువు నశించదు; కానీ, తమను తాము తగ్గించుకొని చిన్న పిల్లల వలే మారి, సర్వశక్తిమంతుడైన ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము నందు మరియు ద్వారానే రక్షణ ఉండెనని, ఉన్నదని మరియు రావలెనని విశ్వసించితే తప్ప మనుష్యులు తమ స్వంత ఆత్మలకు శిక్షను పానము చేయుదురు.

19 ఏలయనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లోబడి ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి, ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధుడైయుండి, చిన్నపిల్లవాని వలె విధేయుడై, సాత్వికుడై, వినయము మరియు సహనము కలిగి ప్రేమతో నిండి, పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లుగా అతనిపై విధించుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడు పిల్లవాని వలె అయితే తప్ప ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి శత్రువైయున్నాడు, ఆదాము యొక్క పతనము నుండి ఉండియున్నాడు మరియు నిరంతరముండును.

20 అంతేకాక రక్షకుని జ్ఞానము ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలందరి మధ్య వ్యాపించు సమయము వచ్చునని నేను నీతో చెప్పుచున్నాను.

21 ఆ సమయము వచ్చినప్పుడు చిన్న పిల్లలు తప్ప మిగిలిన వారు పశ్చాత్తాపపడి, సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుని నామమందు విశ్వాసముంచితే తప్ప దేవుని యెదుట నిర్దోషులుగా యెంచబడరు.

22 ఈ సమయమున ప్రభువైన నీ దేవుడు నీకు ఆజ్ఞాపించిన విషయములను నీవు నీ జనులకు బోధించియున్నప్పటికీ, నేను నీకు చెప్పిన మాటల ప్రకారము మాత్రమే వారు దేవుని దృష్టి యందు నిర్దోషులు కాగలరు.

23 ఇప్పుడు ప్రభువైన దేవుడు నాకు ఆజ్ఞాపించిన మాటలను నేను పలికియున్నాను.

24 మరియు ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: ఆ మాటలు ఈ జనులకు వ్యతిరేకముగా తీర్పు దినమున ఒక స్పష్టమైన సాక్ష్యముగా నిలుచును; ప్రతి మనుష్యుడు తన క్రియల చొప్పున అవి మంచివేగాని చెడ్డవేగాని వాటిని బట్టి తీర్పుతీర్చబడును.

25 అవి చెడ్డవైన యెడల, వారి స్వంత దోషము మరియు హేయక్రియల యొక్క భయంకరమైన దర్శనమునకు వారు అప్పగించబడుదురు, అది వారిని ప్రభువు యొక్క సన్నిధి నుండి దౌర్భాగ్యము మరియు అంతము లేని వేదన యొక్క స్థితిలోనికి కృంగిపోవునట్లు చేయును; అక్కడ నుండి వారు తిరిగి రాలేరు; అందువలన వారి స్వంత ఆత్మల కొరకు వారు శిక్షను పానము చేసియున్నారు.

26 కాబట్టి, నిషేధింపబడిన ఫలమును భుజించుట ద్వారా ఆదాము పతనమగుటను న్యాయము ఏ విధముగా తిరస్కరించదో అదేవిధముగా వారు దేవుని ఉగ్రతాపాత్రలోనిది త్రాగుటను కూడా న్యాయము ఏ మాత్రము తిరస్కరించదు; కాబట్టి కనికరము ఇక ఎన్నటికీ వారిపై హక్కు కలిగియుండదు.

27 వారి వేదన అగ్ని గంధకములు గల గుండము వలే ఉన్నది, దాని జ్వాలలు ఆర్పబడలేవు మరియు దాని పొగ నిరంతరము ఆరోహణమగుచుండును. ప్రభువు ఆ విధముగా నన్ను ఆజ్ఞాపించెను. ఆమేన్‌.