లేఖనములు
మోషైయ 4


4వ అధ్యాయము

రాజైన బెంజమిన్ తన ప్రసంగము కొనసాగించును—ప్రాయశ్చిత్తము వలన రక్షణ కలుగును—రక్షింపబడుటకు దేవుని యందు విశ్వాసముంచుడి—విశ్వాస్యత ద్వారా మీ పాప క్షమాపణను నిలుపుకొనుడి—మీకున్నదానిలో నుండి పేదలకు పంచుడి—అన్ని క్రియలను వివేకమందు, క్రమమందు చేయుడి. సుమారు క్రీ. పూ. 124 సం.

1 రాజైన బెంజమిన్, ప్రభువు యొక్క దేవదూత ద్వారా అతనికి ప్రకటించబడిన మాటలను చెప్పుట ముగించిన తరువాత, చుట్టూ ఉన్న సమూహమును చూచెను, ప్రభువు యొక్క భయము వారిపై వచ్చినందున వారు నేలపై పడియుండిరి.

2 వారు తమ ఐహిక స్థితిలో తమనుతాము ధూళి కంటే తక్కువగా పరిగణించుకొనిరి. వారందరు ఏక స్వరముతో ఇట్లు చెప్పుచూ కేకవేసిరి: కనికరము చూపుము, మేము మా పాపక్షమాపణను పొందునట్లు, మా హృదయములు శుద్ధియగునట్లు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తమును ఉపయోగించుము; ఏలయనగా భూమ్యాకాశములను, అన్ని వస్తువులను సృష్టించి, నరుల సంతానము మధ్యకు రాబోవు ఆ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందు మేము విశ్వసించుచున్నాము.

3 వారు ఈ మాటలు పలికిన తరువాత ప్రభువు యొక్క ఆత్మ వారిపైకి వచ్చెను మరియు రాజైన బెంజమిన్ వారితో పలికిన మాటల ప్రకారము, రాబోవు యేసు క్రీస్తు నందు వారు కలిగియున్న అత్యధిక విశ్వాసమును బట్టి వారి పాపక్షమాపణను పొందియుండి, మనస్సాక్షి యొక్క సమాధానమును కలిగియుండి వారు ఆనందముతో నింపబడిరి.

4 రాజైన బెంజమిన్ తిరిగి వారితో మాట్లాడుట మొదలుపెట్టి ఇట్లనెను: నా స్నేహితులారా, నా సహోదరులారా, నా వంశస్థులారా మరియు నా జనులారా, నేను మీతో చెప్పు నా మాటల యొక్క శేష భాగమును మీరు విని గ్రహించునట్లు దయచేసి ఆలకించమని నేను మిమ్ములను కోరుచున్నాను.

5 ఏలయనగా ఈ సమయమున దేవుని మంచితనమును గూర్చిన జ్ఞానము, మీ శూన్యత మరియు పనికిరాని మీ పతనమైన స్థితి యొక్క అవగాహనకు మిమ్ములను మేలుకొల్పిన యెడల—

6 నేను మీతో చెప్పుచున్నాను, మీరు దేవుని మంచితనము, ఆయన సాటిలేని శక్తి, ఆయన జ్ఞానము, ఆయన సహనము, నరుల సంతానము యెడల ఆయన దీర్ఘశాంతమును తెలుసుకొనిన యెడల, ప్రభువు నందు తన నమ్మకముంచి ఆయన ఆజ్ఞలను గైకొనుటలో శ్రద్ధగా ఉండి తన జీవము అనగా మర్త్య శరీరపు జీవము యొక్క అంతము వరకు కూడా విశ్వాసము నందు కొనసాగిన వానికి రక్షణ కలుగునట్లు లోకము పునాది వేయబడినప్పటినుండి సిద్ధపరచబడిన ప్రాయశ్చిత్తమును గూర్చి మీరు తెలుసుకొనిన యెడల—

7 ఆదాము యొక్క పతనము నుండి ఉన్న లేదా ఉండు లేదా లోకము యొక్క అంతము వరకు కూడా ఉండబోవు సమస్త మానవజాతి కొరకు లోకము పునాది వేయబడినప్పటినుండి సిద్ధపరచబడిన ఆ ప్రాయశ్చిత్తము ద్వారా రక్షణ పొందు మనుష్యుడు ఇతడే అని నేను చెప్పుచున్నాను.

8 రక్షణ కలుగు విధానము ఇదే; చెప్పబడిన ఈ రక్షణ తప్ప మరే ఇతర రక్షణ లేదు; లేదా నేను మీకు చెప్పియున్న ఆ షరతులు తప్ప మనుష్యులు రక్షణ పొందగలుగు షరతులు ఏవియు లేవు.

9 దేవుని యందు విశ్వసించుడి; ఆయన ఉన్నాడని, ఆయన పరలోకము మరియు భూమి రెండింటి యందున్న సమస్తము సృష్టించియున్నాడని విశ్వసించుడి; ఆయన పరలోకము మరియు భూమి రెండింటి యందు సమస్త జ్ఞానము, సమస్త అధికారము కలిగియున్నాడని విశ్వసించుడి; ప్రభువు గ్రహించగలిగినట్లు సమస్త విషయములను మనుష్యుడు గ్రహించలేడని విశ్వసించుడి.

10 మరలా మీ పాపముల నిమిత్తము మీరు పశ్చాత్తాపపడి, వాటిని విడిచిపెట్టి, దేవుని యెదుట మిమ్ములను మీరు తగ్గించుకొనవలెనని విశ్వసించుడి; ఆయన మిమ్ములను క్షమించవలెనని యథార్థ హృదయముతో అడుగుడి; ఇప్పుడు మీరు ఈ విషయములన్నిటినీ విశ్వసించిన యెడల, మీరు వాటిని చేయునట్లు చూచుకొనుడి.

11 నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మరలా మీతో చెప్పుచున్నాను, దేవుని మహిమను మీరు తెలుసుకొనియున్నందున లేదా మీ ఆత్మలలో అట్టి మహదానందమును కలుగజేయు ఆయన మంచితనమును ఎరిగి, ఆయన ప్రేమను రుచిచూచి, మీ పాపక్షమాపణను పొందియున్న యెడల అయోగ్యులైన జీవులారా, మీరు దేవుని గొప్పతనమును మీ స్వంత శూన్యతను మీ యెడల ఆయన మంచితనమును దీర్ఘశాంతమును ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనవలెనని మరియు మిక్కిలి వినయముతో మిమ్ములను మీరు తగ్గించుకొనవలెనని, ప్రతి దినము ప్రభువుకు ప్రార్థన చేయుచూ దేవదూత నోటిద్వారా చెప్పబడిన రాబోవుచున్న దాని యొక్క విశ్వాసమందు స్థిరముగా నిలబడవలెనని నేను కోరుచున్నాను.

12 మీరు దీనిని చేసిన యెడల, మీరు ఎల్లప్పుడు ఆనందించి దేవుని ప్రేమతో నింపబడి మీ పాపక్షమాపణను నిలుపుకొందురు; మిమ్ములను సృష్టించిన ఆయన మహిమ యొక్క జ్ఞానమందు లేదా న్యాయమైన సత్యమైనదాని యొక్క జ్ఞానమందు ఎదుగుదురని నేను మీతో చెప్పుచున్నాను.

13 మీరు ఒకరినొకరు గాయపరచుకోకుండా సమాధానముతో నివసించుటకు, ప్రతి మనుష్యునికి అతనికి తగిన దానిని బట్టి చెల్లించుటకు కోరుకొందురు.

14 మీ పిల్లలు ఆకలితో లేదా దిగంబరముగా ఉండుటను మీరు అనుమతించరు; అట్లే వారు దేవుని ధర్మశాస్త్రములను అతిక్రమించి ఒకనితోనొకడు పోట్లాడునట్లు, కలహించునట్లు మరియు పాపము యొక్క యజమాని లేదా సమస్త నీతికి శత్రువైయుండి మన పితరుల చేత చెప్పబడిన దురాత్మ అయ్యున్న ఆ అపవాదిని సేవించునట్లు మీరు అనుమతించరు.

15 కానీ సత్యము, స్వస్థబుద్ధిగల మార్గములందు నడుచుటను; ఒకరినొకరు ప్రేమించుకొనుటను ఒకరికొకరు పరిచర్య చేసుకొనుటను మీరు వారికి బోధించెదరు.

16 ఇంకను మీ సహాయము అవసరమైన వారికి మీరు సహాయము చేయుదురు; అవసరములో ఉన్న వానికి మీ సంపద నుండి ఇచ్చెదరు; మీ యెదుట బిచ్చగాని విజ్ఞాపన వ్యర్థమగుటను మీరు అనుమతించరు మరియు నశించిపోవుటకు అతడిని పంపివేయరు.

17 బహుశా మీరిట్లు చెప్పవచ్చును: ఆ మనుష్యుడు తన దౌర్భాగ్యమును తనపై తెచ్చుకొనెను; కాబట్టి నేను సహాయము చేయను, అతడు బాధపడకుండా ఉండుట కొరకు అతనికి నా ఆహారములో భాగమియ్యను లేదా నా వస్తువులను అతనికి పంచను; ఏలయనగా అతని శిక్షలు న్యాయమైనవి—

18 కానీ నేను మీతో చెప్పుచున్నాను, ఓ మనుష్యుడా, దీనిని చేయు వాడెవడైనను పశ్చాత్తాపపడుటకు గొప్ప కారణము కలిగియున్నాడు; తాను చేసిన దానిని బట్టి అతడు పశ్చాత్తాపపడని యెడల శాశ్వతముగా నశించిపోవును మరియు దేవుని రాజ్యములో పాలుపొందడు.

19 ఇదిగో, మనమందరము బిచ్చగాళ్ళము కాదా? మనము కలిగియున్న సమస్తము కొరకు, ఆహార వస్త్రముల కొరకు, వెండి బంగారముల కొరకు, మనము కలిగియున్న సకల విధములైన సంపదల కొరకు ఆ దేవునిపై మనమందరము ఆధారపడిలేమా?

20 ఈ సమయమున కూడా మీరు ఆయన నామమున ప్రార్థించుచూ మీ పాపక్షమాపణ కొరకు యాచించుచున్నారు. మీరు వ్యర్థముగా యాచించునట్లు ఆయన చేసెనా? లేదు; ఆయన మీపై తన ఆత్మను క్రుమ్మరించియున్నాడు, మీ హృదయములు ఆనందముతో నింపబడునట్లు చేసియున్నాడు మరియు మీరు ఏమి పలుకలేనంత మహదానందముతో మీ నోళ్ళు మూయబడునట్లు చేసియున్నాడు.

21 ఇప్పుడు మిమ్ములను సృష్టించిన దేవుడు, మీ జీవితములు, మీరు కలిగియున్న సమస్తము కొరకు మీరు ఆధారపడియున్న ఆ దేవుడు, మీరు సరియైనదని తలచి, దానిని పొందుదురని నమ్ముచూ విశ్వాసమందు ఏది అడిగినను అది మీకు దయచేసినట్లయితే, అప్పుడు మీకు కలిగిన సంపదను ఒకరితోనొకరు ఎంతగా పంచుకొనవలెనో గదా!

22 తాను నశింపకుండునట్లు మీ సంపద కొరకు విజ్ఞాపనచేయు వానికి మీరు తీర్పుతీర్చి, నిందించిన యెడల, దేవునికే చెందియున్న మీది కాని సంపదను ఇవ్వకుండా నిలుపుకొన్నందుకు మీరు నిందించబడుట న్యాయమే గదా! మీ జీవితము కూడా ఆయనకే చెందియున్నది; అయినప్పటికి మీరు విజ్ఞాపన చేయరు లేదా మీరు చేసినదానికి పశ్చాత్తాపపడరు.

23 అటువంటి మనుష్యునికి ఆపద, ఏలయనగా అతని సంపద అతనితో పాటు నశించునని నేను మీతో చెప్పుచున్నాను; ఇప్పుడు ఈ లోక విషయములకు సంబంధించి ధనవంతులైన వారికి నేను ఈ విషయములు చెప్పుచున్నాను.

24 మరలా నేను పేదవారితో చెప్పుచున్నాను, మీరు ఎక్కువగా కలిగియుండనప్పటికీ అనుదినము మీరు జీవించియుండుటకు తగినంత కలిగియున్నారు; మీకు లేనందున బిచ్చగాడిని తిరస్కరించు మీరందురు—నేను కలిగియుండలేదు, కాబట్టి నేను ఇచ్చుట లేదు, కానీ నేను కలిగియున్న యెడల, నేను ఇచ్చెదనని మీ హృదయములలో మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను.

25 ఇప్పుడు మీరు మీ హృదయములలో ఇట్లు తలంచిన యెడల మీరు నిర్దోషులైయుందురు, లేని యెడల మీరు శిక్షావిధికి లోనైయున్నారు; మీ శిక్షావిధి న్యాయమైనది, ఏలయనగా మీరు పొందని దానిని కూడా స్వార్థముతో మీరు ఆశించియున్నారు.

26 ఇప్పుడు నేను మీతో చెప్పియున్న ఈ విషయముల నిమిత్తము—అనగా మీరు దేవుని యెదుట నిర్దోషులుగా నడుచునట్లు అనుదినము మీ పాపక్షమాపణను నిలుపుకొనుటకు—ప్రతి ఒక్కరు మీరు కలిగియున్న దానిని బట్టి పేదలకు మీ సంపదను పంచవలెనని అనగా ఆకలిగొన్న వానికి ఆహారమిచ్చుట, దిగంబరులకు వస్త్రము ధరింపజేయుట, రోగులను దర్శించుట మరియు వారి ఉపశమనము కొరకు ఆత్మీయముగా, ఐహికముగా వారి కోరికలను బట్టి పరిచర్య చేయుట వంటివి చేయవలెనని నేను కోరుచున్నాను.

27 ఈ క్రియలన్నియు వివేకమందు, క్రమమందు చేయబడునట్లు చూడుము; ఏలయనగా ఒక మనుష్యుడు తన శక్తికి మించి వేగముగా పరుగెత్తనవసరము లేదు. అయితే దానిని బట్టి అతడు బహుమానము గెలుచుకొనునట్లు శ్రద్ధగా ఉండుట అవసరము; కాబట్టి సమస్త క్రియలు క్రమమందు చేయబడవలెను.

28 మీ మధ్య ఎవడైనను తన పొరుగు వాని నుండి అప్పు తీసుకొనిన యెడల, అతడు అప్పుగా తీసుకొనిన దానిని అతడు ఒప్పుకొనిన ప్రకారము తిరిగి ఇచ్చివేయవలెనని మీరు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను; లేని యెడల మీరు పాపము చేయుదురు మరియు బహుశా మీ పొరుగువారు కూడా పాపము చేయునట్లు మీరు చేయుదురు.

29 చివరిగా, మీరు పాపము చేయగల విషయములన్నిటిని నేను మీకు చెప్పలేను; ఏలయనగా, నేను లెక్కించలేనన్ని మార్గములు మరియు విధానములు కలవు.

30 కానీ ఇంతమట్టుకు నేను మీతో చెప్పగలను, మీరు మిమ్ములను, మీ తలంపులను, మీ మాటలను, మీ క్రియలను కనిపెట్టుకొనియుండి, దేవుని ఆజ్ఞలను పాటించి మన ప్రభువు యొక్క రాకడను గూర్చి మీరు వినియున్న దానినిబట్టి విశ్వాసమందు మీ జీవితాంతము కొనసాగని యెడల మీరు నశించెదరు. ఇప్పుడు ఓ మనుష్యుడా, జ్ఞాపకముంచుకొనుము మరియు నశించకుము.