లేఖనములు
మోషైయ 7


7వ అధ్యాయము

లింహై రాజుగా ఉన్న లీహై-నీఫై దేశమును అమ్మోన్‌ కనుగొనును—లింహై జనులు లేమనీయుల దాస్యమందు ఉండిరి—లింహై తమ చరిత్రను చెప్పును—క్రీస్తే దేవుడనియు సమస్తమునకు తండ్రియనియు ఒక ప్రవక్త (అబినడై) సాక్ష్యమిచ్చును—మలినమును విత్తు వారు సుడిగాలిని కోత కోయుదురు మరియు ప్రభువు నందు తమ నమ్మికయుంచు వారు విడుదల పొందుదురు. సుమారు క్రీ. పూ. 121 సం.

1 రాజైన మోషైయ మూడు సంవత్సరముల పాటు నిరంతరమైన సమాధానము కలిగియుండిన తరువాత, అతడు లీహై-నీఫై దేశమందు లేదా లీహై-నీఫై పట్టణమందు నివసించుటకు వెళ్ళిన జనులను గూర్చి తెలుసుకొనగోరెను; ఏలయనగా వారు జరహేమ్ల దేశమును వదిలివెళ్ళిన సమయము నుండి అతని జనులు వారి యొద్ద నుండి ఏ సమాచారమును వినియుండలేదు; కావున, వారు అతడిని తమ ప్రశ్నలతో విసిగించిరి.

2 అందుచేత వారి సహోదరులను గూర్చి వెదకుటకు లీహై-నీఫై దేశమునకు వెళ్ళునట్లు బలవంతులైన వారి మనుష్యులలో నుండి పదహారుగురిని రాజైన మోషైయ అనుమతించెను.

3 వారు మరుసటి దినమున జరహేమ్ల వంశస్థుడైన అమ్మోన్‌ అను ఒక బలమైన శక్తిశాలిని తమతోపాటు తీసుకొని బయలుదేరిరి; అతడు వారికి నాయకుడైయుండెను.

4 ఇప్పుడు లీహై-నీఫై దేశమునకు వెళ్ళుటకు అరణ్యమందు ప్రయాణము చేయవలసిన మార్గమును వారు ఎరుగకుండిరి; కాబట్టి వారు అరణ్యమందు అనేక దినములు, అనగా నలుబది దినములు తిరుగులాడిరి.

5 వారు నలుబది దినములు తిరుగులాడిన తరువాత షైలోమ్ దేశమునకు ఉత్తరమున ఉన్న ఒక కొండ వద్దకు వచ్చి, అక్కడ తమ గుడారములను వేసుకొనిరి.

6 అమ్మోన్‌ తన సహోదరులలో ముగ్గురిని వెంట తీసుకొని నీఫై దేశమునకు వెళ్ళెను, వారి పేర్లు అమాలేకి, హీలమ్ మరియు హెమ్.

7 నీఫై దేశమందు, షైలోమ్ దేశమందు ఉన్న జనుల యొక్క రాజును వారు కలుసుకొనిరి; వారు రాజభటులచే చుట్టుముట్టబడి, పట్టుకొనబడి, బంధించబడి, చెరసాలలో వేయబడిరి.

8 వారు రెండు దినములు చెరసాలలో ఉన్న తరువాత తిరిగి రాజు యెదుటకు తేబడిరి మరియు వారి కట్లు విప్పబడెను. వారు రాజు యెదుట నిలిచి, అతడు వారిని అడుగు ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు అనుమతించబడిరి లేదా ఒక విధముగా ఆజ్ఞాపించబడిరి.

9 అతడు వారితో ఇట్లనెను: ఇదిగో నేను లింహైని, జెనిఫ్ కుమారుడైన నోవాహ్ కుమారుడను, వారి పితరుల దేశమైయున్న ఈ దేశమును స్వాస్థ్యముగా పొందుటకు జరహేమ్ల దేశము నుండి బయటకు వచ్చిన జనుల స్వరము చేత రాజుగా చేయబడినవాడను.

10 నేను ద్వారము వెలుపల నా భటులతో ఉన్నప్పుడు, పట్టణ ప్రాకారముల దగ్గరకు వచ్చునంతగా మీరు ధైర్యముచేయు కారణమేమైయున్నదో నేను తెలుసుకొనగోరుచున్నాను.

11 నేను మిమ్ములను ప్రశ్నించి తెలుసుకొనవలెనన్న కారణము చేతనే మీరు జీవించుటకు అనుమతించితిని, లేని యెడల నా భటులు మిమ్ములను చంపునట్లు చేసియుండేవాడను. మీరిప్పుడు మాట్లాడుటకు అనుమతించబడియున్నారు.

12 ఇప్పుడు అతడు మాట్లాడుటకు అనుమతించబడియున్నాడని చూచినప్పుడు అమ్మోన్ ముందుకు వెళ్ళి, రాజు యెదుట వంగి నమస్కరించెను; పైకి లేచి అతడు ఇట్లనెను: ఓ రాజా, నేను ఇంకను బ్రతికియున్నందుకు, మాట్లాడుటకు అనుమతించబడినందుకు ఈ దినమున దేవునికి చాలా కృతజ్ఞుడనైయున్నాను; మరియు నేను ధైర్యముతో మాట్లాడుటకు ప్రయత్నించెదను;

13 నీవు నన్ను ఎరిగియుండిన యెడల, నేను ఈ విధముగా బంధించబడి యుండుటను నీవు అనుమతించియుండవని నేను నమ్ముచున్నాను. ఏలయనగా నేను అమ్మోన్‌ను, జరహేమ్ల వంశస్థుడను మరియు జెనిఫ్‌ ఆ దేశము నుండి బయటకు తీసుకొని వచ్చిన మా సహోదరులను గూర్చి తెలుసుకొనుటకు జరహేమ్ల దేశము నుండి వచ్చియున్నాను.

14 ఇప్పుడు లింహై, అమ్మోన్‌ మాటలను విన్న తరువాత అధికముగా సంతోషించి ఇట్లనెను: జరహేమ్ల దేశమందున్న నా సహోదరులు ఇంకా జీవించియున్నారని నేనిప్పుడు ఖచ్చితముగా ఎరుగుదును. ఇప్పుడు నేను సంతోషించెదను మరియు రేపు నా జనులు కూడా సంతోషించునట్లు చేయుదును.

15 ఏలయనగా మేము లేమనీయుల దాస్యమందుండి భరించుటకు అతికష్టమైన పన్ను మోపబడియున్నాము. ఇప్పుడు మన సహోదరులు మనలను దాస్యములోనుండి లేదా లేమనీయుల చేతులలోనుండి విడిపించుదురు, మనము వారి దాసులైయుందుము; ఏలయనగా లేమనీయుల రాజుకు కప్పము కట్టుట కంటే మనము నీఫైయులకు దాసులుగా ఉండుట మేలు.

16 ఇప్పుడు వారు ఇక ఏ మాత్రము అమ్మోన్‌ను లేదా అతని సహోదరులను బంధించరాదని రాజైన లింహై తన భటులను ఆజ్ఞాపించెను మరియు వారు షైలోమ్‌నకు ఉత్తరమున ఉన్న కొండకు వెళ్ళి వారి సహోదరులను పట్టణములోనికి తీసుకొనివచ్చి తిని, త్రాగి, ప్రయాణ బడలిక నుండి విశ్రాంతి తీసుకొనునట్లు చేసెను; ఏలయనగా వారు అనేక శ్రమలు అనుభవించియుండిరి; వారు ఆకలి, దాహము మరియు అలసటను అనుభవించియుండిరి.

17 మరుసటి దినమున అతడు వారితో మాట్లాడు మాటలను వినుటకు వారు దేవాలయము వద్ద సమకూడవలెనని రాజైన లింహై తన జనులందరి మధ్య ఒక చాటింపు వేయించెను.

18 వారు సమకూడినప్పుడు అతడు వారితో ఈ విధముగా మాట్లాడెను: నా జనులారా, మీ తలలు పైకెత్తి ఓదార్పును పొందుడి; ఏలయనగా మన పోరాటములనేకము వ్యర్థమైపోయినప్పటికీ, మనము ఇక ఏ మాత్రము మన శత్రువుల దాస్యములో ఉండని సమయము సమీపించియున్నది లేదా ఎంతో దూరములో లేదు; అయినను ఒక సార్థకమైన పోరాటము చేయుట మిగిలియున్నదని నేను నమ్ముచున్నాను.

19 కాబట్టి మీ తలలు పైకెత్తి ఆనందించుడి; అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడైన ఆ దేవుని యందు మరియు ఇశ్రాయేలు సంతానమును ఐగుప్తు దేశము నుండి బయటకు తీసుకొనివచ్చి, వారు ఎఱ్ఱసముద్రము గుండా ఆరిన నేలను నడుచునట్లు చేసి, అరణ్యమందు వారు నశించకుండునట్లు మన్నాతో వారిని పోషించి, వారికొరకు అనేక క్రియలను చేసిన ఆ దేవుని యందు నమ్మికయుంచుడి.

20 మరలా ఆ దేవుడే మన పితరులను యెరూషలేము దేశము నుండి బయటకు తీసుకొనివచ్చి ఇప్పటివరకు కూడా తన జనులను కాపాడి, భద్రపరచెను; మన పాపములు మరియు హేయక్రియల మూలముగానే ఆయన మనలను దాస్యములోనికి తెచ్చెను.

21 ఈ జనులపై రాజుగా చేయబడిన జెనిఫ్‌ తన పితరుల దేశమును స్వాస్థ్యముగా పొందుటకు అత్యాశక్తి గలవాడైయుండెను, కావున రాజైన లేమన్‌తో ఒక సంధిలోనికి ప్రవేశించి, అతని కుయుక్తి మరియు నేర్పరితనము ద్వారా మోసపోయి దేశము యొక్క ఒక భాగమును లేదా లీహై-నీఫై పట్టణమును, షైలోమ్ పట్టణమును, దాని చుట్టూ ఉన్న ప్రదేశములను రాజైన జెనిఫ్‌ అతనికి అప్పగించివేసెననుటకు ఈ దినమున మీరందరు సాక్షులైయున్నారు.

22 ఈ జనులను దాస్యములోనికి లేదా బానిసత్వములోనికి తెచ్చు ఏకైక ఉద్దేశ్యము నిమిత్తము రాజైన లేమన్ ఇదంతయు చేసెను. మన పంటలైన జొన్న, బార్లీ మరియు ఇంకను మన సమస్త ధాన్యముల యొక్క సగభాగమును, మన మందలు, గుంపుల యొక్క పెరుగుదలలో సగభాగమును లేమనీయుల రాజుకు ఈ సమయమున మనము కప్పము కట్టుచున్నాము; మనమందరము కలిగియున్న లేదా స్వాధీనపరచుకొన్నదాని యొక్క సగభాగమును లేదా మన ప్రాణములను కూడా లేమనీయుల రాజు మన నుండి కోరుచున్నాడు.

23 ఇప్పుడు ఇది భరించుటకు కష్టమైనది కాదా? మన ఈ శ్రమ గొప్పది కాదా? మనము దుఃఖించుటకు గొప్ప హేతువును కలిగియున్నాము.

24 అవును, మనము దుఃఖించుటకు గొప్ప హేతువులు కలవని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా దుష్టత్వమును బట్టియే మన సహోదరులలో ఎంతోమంది సంహరింపబడియున్నారు, వారి రక్తము వ్యర్థముగా చిందించబడినది.

25 ఈ జనులు అతిక్రమములోనికి పడియుండని యెడల, మనపై ఈ గొప్ప కీడు వచ్చుటను ప్రభువు అనుమతించి యుండకపోవును. కానీ వారు ఆయన మాటలను ఆలకించలేదు; మరియు రక్తము చిందించునంత ఎక్కువగా వారి మధ్య వివాదములు కలిగెను.

26 ప్రభువు యొక్క ప్రవక్తను వారు సంహరించిరి; దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక మనుష్యుని, ముఖ్యముగా వారి దుష్టత్వములు, హేయక్రియలను గూర్చి వారికి చెప్పి, రాబోవు విషయములనేకము గూర్చి మరియు క్రీస్తు యొక్క రాకడను గూర్చి కూడా ప్రవచించిన వానిని వారు సంహరించియుండిరి.

27 ఏలయనగా క్రీస్తు దేవుడనియు సమస్తము యొక్క తండ్రియనియు అతడు వారితో చెప్పెను, ఆయన తనపై మనుష్య రూపము ధరించుకొనవలెననియు, అది ఆదియందు సృష్టించబడిన మనుష్యుని రూపమైయుండవలెననియు చెప్పెను; లేదా ఇతర మాటలలో మనుష్యుడు దేవుని స్వరూపమున సృష్టించబడెననియు, దేవుడు నరుల సంతానము మధ్యకు దిగి రావలెననియు, రక్త మాంసములు గల శరీరముతో జన్మించవలెననియు భూముఖముపైన ముందుకు వెళ్ళవలెననియు అతడు చెప్పెను—

28 ఇప్పుడు అతడు దీనిని చెప్పినందుకు వారతనిని సంహరించిరి; వారిపై దేవుని ఉగ్రతను తెచ్చుకొనునట్లు వారు అనేకమైన వాటిని చేసిరి. కాబట్టి వారు దాస్యమందు ఉన్నారని, కష్టమైన శ్రమలతో మొత్తబడియున్నారని ఆశ్చర్యపడు వారెవరు?

29 ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు: వారి అతిక్రమ దినమందు నేను నా జనులకు సహాయము చేయను; కానీ వారు వర్థిల్లకుండా వారి మార్గమందు అవరోధముంచెదను; వారి క్రియలు వారి యెదుట అడ్డుగోడగా నిలుచును.

30 మరలా ఆయన ఇట్లనెను: నా జనులు మలినమును విత్తిన యెడల, వారు దాని పొట్టును సుడిగాలి యందు కోతకోయుదురు; దాని ఫలితము విషమగును.

31 మరలా ఆయన ఇట్లనెను: నా జనులు మలినమును విత్తిన యెడల, వారు తూర్పు గాలిని కోతకోయుదురు; అది తక్షణ వినాశనమును తెచ్చును.

32 ఇప్పుడు ప్రభువు యొక్క వాగ్దానము నెరవేర్చబడినది మరియు మీరు మొత్తబడి, బాధింపబడియున్నారు.

33 కానీ మీరు హృదయము యొక్క పూర్ణ సంకల్పముతో ప్రభువు తట్టు తిరిగి ఆయన యందు నమ్మికయుంచి, మనస్సు యొక్క సమస్త శ్రద్ధతో ఆయనను సేవించిన యెడల, ఆయన తన స్వంత చిత్తము మరియు ఇష్ట ప్రకారము మిమ్ములను దాస్యము నుండి విడిపించును.