లేఖనములు
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1


జోసెఫ్ స్మిత్—చరిత్ర

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చరిత్రనుండి సంగ్రహించబడినవి

1వ అధ్యాయము

జోసెఫ్ స్మిత్ తన పూర్వీకులు, కుటుంబ సభ్యులు, వారి తొలి నివాసస్థలములను గూర్చి చెప్పెను—పశ్చిమ న్యూయార్క్‌లో మతమును గూర్చి అసాధారణ ఉత్సాహము వ్యాపించెను—యాకోబు సూచించిన విధముగా జ్ఞానమును అడుగుటకు అతడు నిశ్చయించుకొనెను—తండ్రి కుమారులు ప్రత్యక్షమయ్యిరి మరియు ప్రవక్త పరిచర్యకు జోసెఫ్ పిలువబడెను. (1–20 వచనములు.)

1 యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము ఏర్పాటు మరియు అభివృద్ధికి సంబంధించిన అనేక నివేదికలు, చెడును ప్రేమించి యోచించే వ్యక్తులచేత ప్రజలలో వ్యాపింపజేయబడినవి. సంఘ ప్రతిష్ఠకు, లోకములో దాని అభివృద్ధికి విరుద్ధముగా దాడిచేయుటకు ఆ నివేదికలు వాటి నిర్మాతలచేత కల్పన చేయబడినవి. అందువలన ప్రజలలో భ్రాంతిని తొలగించుటకు మరియు సత్యాన్వేషకులందరికీ తెలియజేయుటకు ఈ చరిత్రను, అనగా నాకు మరియు సంఘమునకు సంబంధించి జరిగిన సంఘటనలను, ఆ సంఘటనలను గూర్చి నేను కలిగియున్న జ్ఞానమును వ్రాయుటకు నేను ప్రేరేపించబడితిని.

2 ఈ చరిత్రలో ఈ సంఘమునకు సంబంధించి అనేక సంఘటనలను సత్యమందును నీతియందును అవి సంభవించిన విధముగా లేదా ప్రస్తుతము అనగా చెప్పబడిన సంఘము ఏర్పడి, ఎనిమిదవ యేట [1838] అవి ఉన్నవిధముగా నేను సమర్పించెదను.

3 మన ప్రభువు జన్మించిన తరువాత క్రీ.శ. ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదు, డిసెంబరు ఇరవై మూడవ తేదీన షారోను పట్టణము, విన్డ్సర్ జిల్లా, వెర్మౌంట్ రాష్ట్రములో నేను జన్మించితిని. … నేను సుమారుగా పదేండ్ల ప్రాయములో ఉన్నప్పుడు నా తండ్రియైన జోసెఫ్ స్మిత్ సీ. వెర్మౌంట్ రాష్ట్రమును విడిచిపెట్టి పాల్మైరా, ఓంటారియో (ఇప్పుడు వేయిన్) జిల్లా, న్యూయార్క్ రాష్ట్రమునకు తన నివాసమును మార్చెను. నా తండ్రి పాల్మైరాకు వచ్చిన నాలుగేండ్ల తరువాత, తన కుటుంబముతో అదే ఓంటారియో జిల్లాలోని మాంచెస్టర్‌కు తన నివాసమును మార్చెను—

4 నా కుటుంబము పదకొండు మందిని కలిగియుండెను, వారెవరనగా నా తండ్రి జోసెఫ్ స్మిత్; నా తల్లి లూసీ స్మిత్ (వివాహమునకు ముందు ఆమె పేరు మ్యాక్, సాలమన్ మ్యాక్ యొక్క కుమార్తె); నా సహోదరులు ఆల్విన్ (అతడు తన ఇరువది ఆరవయేట, 1823 నవంబరు 19న మరణించెను), హైరం, నేను, శామ్యుల్ హ్యారిసన్, విలియం, డాన్ కార్లోస్; నా సహోదరీలు సోఫ్రోనియా, క్యాథరిన్ మరియు లూసీ.

5 మేము మాంచెస్టర్ వచ్చిన రెండవ యేట మేము నివసించు ప్రాంతములో మతము అను అంశముమీద ఒక అసాధారణ ఉత్సాహము కలిగెను. అది మెథడిస్టులతో ప్రారంభమయ్యెను, కానీ అనతికాలములో దేశము యొక్క ఆ ప్రాంతములోని మతశాఖలన్నిటిలో సాధారణమయ్యెను. నిజానికి దేశములోని ఆ జిల్లా మొత్తము దానివలన ప్రభావితం చేయబడెను, గొప్ప సమూహములు వివిధ మత విభాగములతో ఐక్యమయ్యెను మరియు అది ప్రజల మధ్య గొప్ప కలతను, విభజనను సృష్టించెను; కొందరు “ఇదిగో, నిజమైన మతము ఇక్కడున్నది!” అని, మరికొందరు “అదిగో, నిజమైన మతము అక్కడున్నది!” అని కేకలు వేసిరి. కొందరు మెథడిస్టు విశ్వాసము కొరకు, కొందరు ప్రెస్బిటేరియన్ కొరకు, మరికొందరు బాప్టిస్టు కొరకు వాదించిరి.

6 ఈ వేర్వేరు విశ్వాసములకు పరివర్తన చెందినవారు తమ పరివర్తన సమయములో గొప్ప ప్రేమను వ్యక్తపరచియుండి, ఆ మతగురువులు గొప్ప ఉత్సాహమును చూపించి, ప్రతి ఒక్కరు పరివర్తన చెందుటకు ఈ భావోద్రేకమును రేపి, ఈ అసాధారణమైన మతోద్రేక దృశ్యమును ప్రోత్సహించుటలో చురుకుగానుండి, ప్రతి ఒక్కరు వారికి నచ్చిన మతశాఖలో చేరవలెననే పిలుపునిచ్చుటకు ఇష్టపడినప్పటికీ; పరివర్తన చెందినవారు, కొందరు ఒక సంఘములో, మరికొందరు వేరొక సంఘములో చేరుటకు తమ సంఘములను వదిలిపెట్టినప్పుడు యాజకులు మరియు పరివర్తన చెందినవారి మధ్య ఉన్న మంచి భావములు వాస్తవముగా కాక నటనగా కనిపించెను; యాజకుడు యాజకునితో, పరివర్తన చెందినవాడు పరివర్తన చెందినవానితో జగడమాడుచున్నందున గొప్ప గందరగోళము, చెడుభావములు గల దృశ్యము పరిణమించెను; తద్వారా ఒకరికొకరు కలిగియున్న మంచి భావములన్నియు, ఒకవేళ ఎప్పుడైనా కలిగియుంటే అవి వాగ్వివాదములు మరియు అభిప్రాయబేధములలో కోల్పోబడెను.

7 ఈ సమయములో నేను నా పదిహేనేండ్ల ప్రాయములో నుంటిని. నా తండ్రి కుటుంబము ప్రెస్బిటేరియన్ విశ్వాసములోనికి పరివర్తన చెందెను, వారిలో నలుగురు ఆ సంఘములో చేరిరి, వారెవరనగా నా తల్లియైన లూసీ, నా సహోదరులు హైరం, శామ్యుల్ హ్యారిసన్, మరియు నా సహోదరి సోఫ్రోనియా.

8 గొప్ప ఆందోళనకరమైన ఈ సమయములో నా మనస్సు లోతైన ఆలోచనకు, తీవ్రమైన ఇబ్బందికి లోనయ్యింది; కానీ నా భావములు లోతైనవి మరియు తరచు హృదయవిదారకమైనవి అయినప్పటికీ, అవకాశమున్న ప్రతిసారి వారి కూడికలకు నేను హాజరైనప్పటికీ, ఈ పక్షములన్నిటినుండి నేను దూరముగా నుంటిని. ఈ కాలగమనములో నా మనస్సు కొంతవరకు మెథడిస్టు మతశాఖవైపు మొగ్గుచూపెను, మరియు వారితో చేరుటకు నాకు కొంచెము కోరిక కలిగెను: కానీ వేర్వేరు తరగతుల మధ్య నెలకొనియున్న గందరగోళము, వివాదముల వలన, నా వలె యౌవనములో ఉండి, మనుష్యులు మరియు పరిస్థితుల పట్ల అవగాహన లేని వానికి ఎవరు తప్పో, ఎవరు ఒప్పో అని ఒక నిర్దిష్టమైన ముగింపుకు రావడం అసాధ్యమయ్యెను.

9 అల్లరి మరియు కలకలం ఎక్కువగా, ఎడతెగకయుండుటవలన ఈ సమయములో నా మనస్సు మిక్కిలి ఉత్తేజితమయ్యెను. ప్రెస్బిటేరియనులు బాప్టిస్టులకు, మెథడిస్టులకు మిక్కిలి విరోధముగానుండి, వారి తప్పులను నిరూపించుటకు లేదా కనీసము వారు తప్పుదారిలో ఉన్నారని ప్రజలు ఆలోచించునట్లు చేయుటకు తర్కము, వితండవాదము రెండింటి యొక్క శక్తులన్నిటిని ఉపయోగించిరి. మరోవైపు, బాప్టిస్టులు, మెథడిస్టులు అదేవిధముగా వారి సిద్ధాంతములను స్థిరపరచి, మిగిలిన అందరిని ఖండించు ప్రయత్నములో సమానమైన పట్టుదలతో నుండిరి.

10 ఈ వాగ్వివాదము మరియు అభిప్రాయభేదముల నడుమ, ఏమి చేయవలెను? ఈ పక్షములన్నిటిలో ఎవరు సరియైనవారు; లేదా అందరు సరియైనవారు కారా? వాటిలో ఏదో ఒకటి సరియైనదైతే, అది ఏది? దానిని నేను ఏవిధముగా తెలుసుకోగలను? అని తరచు నన్ను నేను ప్రశ్నించుకొంటిని.

11 ఈ మతవిశ్వాసుల పక్షముల పోటీల వలన కలుగజేయబడిన తీవ్ర ఇబ్బందులచేత వ్యసనపడుచుండగా, ఒక దినమున నేను యాకోబు వ్రాసిన పత్రిక, ఒకటవ అధ్యాయము, ఐదవ వచనమును చదువుచుంటిని, అది ఈ విధముగా చెప్పును: మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు.

12 ఈ సమయములో ఈ లేఖన భాగము నన్ను తాకినంతగా ఏ భాగము మనుష్య హృదయమును ఇంత శక్తివంతముగా తాకలేదు. నా ప్రతి హృదయాలోచనలోనికి గొప్ప బలముతో ఇది ప్రవేశించినట్లు అనిపించెను. పదే పదే దీనిని గూర్చి నేను ఆలోచించితిని, ఎందుకనగా ఏ వ్యక్తికైనా దేవుని నుండి జ్ఞానము కావలసియున్న యెడల, అది నేనే అని నేనెరుగుదును; ఏమి చేయవలెనో నాకు తెలియదు, అప్పటికి నాకున్న జ్ఞానము కంటే మరింత జ్ఞానము పొందని యెడల నేనెన్నటికీ తెలుసుకోలేను; ఏలయనగా వేర్వేరు పక్షముల మతబోధకులు ఒకే లేఖన భాగమును విభిన్నముగా అర్థము చేసుకొనిరి, అందువలన నా ప్రశ్నకు సమాధానము బైబిలులో వెదకవలెనని నాకున్న నమ్మకమునంతటిని నాశనము చేసిరి.

13 కొంతకాలమైన తరువాత చివరకు నేనొకటి నిశ్చయించుకొంటిని—నేను చీకటిలోను గందరగోళములోను ఉండిపోవలెను లేదా యాకోబు చెప్పిన విధముగా చేయవలెను, అనగా దేవుని అడుగవలెను. కొంతకాలమైన తరువాత “దేవుని అడుగవలెను” అని సంకల్పించితిని, ఎందుకనగా జ్ఞానము కొదువగా ఉన్నవారిని ఆయన గద్దింపక ధారాళముగా ఇచ్చినయెడల, దేవుని అడుగుటకు నేను సాహసించవచ్చునని నిశ్చయించుకొంటిని.

14 దేవుని అడుగవలెనను నా ఈ సంకల్పమునకు అనుగుణముగా, ఆ ప్రయత్నము చేయుటకు నేను అడవిలోనికి వెళ్ళితిని. పదునెనిమిది వందల ఇరవైయవ సంవత్సరపు వసంతకాల ఆరంభములో ఒక అందమైన, కాంతివంతమైన ఉదయకాలమున అది జరిగెను. అట్టి ప్రయత్నము చేయుట నా జీవితములో అదే మొదటిసారి, ఎందుకనగా నాకున్న ఆందోళనల మధ్య అప్పటికి ఇంకా బహిరంగముగా ప్రార్థనచేయుటకు ప్రయత్నించలేదు.

15 నేను ముందుగా ప్రణాళిక చేసుకొనిన ప్రదేశమునకు వెళ్ళి, నా చుట్టూ చూచి నేను ఒంటరిగా ఉన్నానని గ్రహించిన తరువాత నేను మోకరించి దేవునికి హృదయవాంఛలను అర్పించుట మొదలుపెట్టితిని. నేను ఆవిధముగా మొదలుపెట్టిన వెంటనే ఏదో ఒక శక్తిచేత నిర్భంధించబడితిని, అది నన్ను పూర్తిగా లోబరచుకొని, నాపై ఆశ్చర్యకరమైన ప్రభావమును చూపి, నేను మాట్లాడకుండునట్లు నా నాలుకను కట్టివేసెను. దట్టమైన చీకటి నా చుట్టూ ఆవరించెను, కొంతసేపటి వరకు నేను ఆకస్మిక నాశనమునకు అప్పగించబడినట్లు నాకనిపించెను.

16 కానీ నన్ను బంధించిన శత్రువునుండి నన్ను విడిపించమని నా బలమునంతటిని ఉపయోగించి దేవునికి ప్రార్థించుచున్న సమయములోనే నిరాశచెందుటకు, నాశనమునకు అనగా ఊహాత్మకమైన నాశనమునకు కాక, ఒక అదృశ్య ప్రపంచము నుండి మునుపెన్నడు నేను అనుభూతిచెందని ఆశ్చర్యకరమైన శక్తిని కలిగియున్న ఒక దుష్టుని శక్తికి నేను అప్పగించబడబోవుచున్నప్పుడు ఆ భయంకరమైన క్షణములో సరిగ్గా నా తలపై సూర్యకాంతిని మించిన ఒక కాంతి స్తంభమును చూచితిని, అది నా మీద పడువరకు క్రమముగా క్రిందకు దిగెను.

17 అది కనిపించిన వెంటనే నన్ను బంధించిన శత్రువు నుండి నేను విడిపించబడితినని గ్రహించితిని. ఆ కాంతి నాపై నిలిచిన తరువాత గాలిలో నా పైన నిలువబడిన ఇద్దరు వ్యక్తులను నేను చూచితిని, వారి తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా నుండెను. వారిలో ఒకరు నన్ను పేరుపెట్టి పిలిచి మరొకరిని చూపించుచు—ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట వినుము! అనిరి.

18 ప్రభువును నేను విచారించాలని వెళ్ళుటకు గల ఉద్దేశ్యమేమనగా ఈ పక్షములన్నిటిలో ఏది సరియైనదని విచారించి తద్వారా దేనిలో నేను చేరవలనో తెలుసుకొనుట. నేను మాట్లాడగలుగునట్లు నా ఆధీనములోనికి నేను వచ్చినప్పుడు, నా పైన కాంతిలో నిలువబడిన ఆ వ్యక్తులను అన్ని పక్షములలో ఏది సరియైనది (ఎందుకనగా ఈ సమయములో అన్నిపక్షములు సరియైనవి కావనే తలంపు నా హృదయములో రాలేదు)—మరియు దేనిలో నేను చేరవలెనని అడిగితిని.

19 వాటిలో దేనిలోను చేరవద్దని, ఎందుకనగా వారందరు తప్పు అని నాకు సమాధానమివ్వబడెను; నాతో మాట్లాడిన వ్యక్తి వారి మత విశ్వాసములన్నియు తన దృష్టిలో హేయకరమైనవని చెప్పెను; విశ్వాసులమని చెప్పుకొనుచున్న వారందరు అబద్దికులైయున్నారు; “వారు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగానున్నవి, మనుష్యులు కల్పించిన పద్ధతులను వారు దైవోపదేశములని బోధించుదురు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునైయుందురు” అని చెప్పెను.

20 వాటిలో దేనిలోను చేరవద్దని ఆయన మరలా నన్ను ఆజ్ఞాపించెను; అనేక ఇతర విషయాలు ఆయన నాతో చెప్పెను, వాటిని ఈ సమయములో నేను వ్రాయలేను. ఇది జరిగిన తరువాత నేను స్పృహలోనికి వచ్చినప్పుడు, ఆకాశములోనికి చూచుచూ నేలమీద నేను వెల్లకిలా పడుకొనియుంటిని. ఆ వెలుగు నిష్క్రమించిన తరువాత నాకు బలము లేకుండెను; కానీ వెంటనే కొంచెము బలము పుంజుకొని నేను ఇంటికి వెళ్ళితిని. చలికాచుకొను పొయ్యికి నేను ఆనుకొనగా, సంగతేమిటని తల్లి అడిగెను. “ఏమియు లేదు, అంతా క్షేమమే—నేను కుశలమే” అని సమాధానము చెప్పితిని. తరువాత, “ప్రెస్బిటేరియన్ మతము సత్యము కాదని నాయంతట నేను తెలుసుకొనియున్నాను” అని నా తల్లితో చెప్పితిని. తన రాజ్యమును ఆటంకపరచువానిగా, విసిగించువానిగా అగుటకు నేను నియమించబడ్డానని విరోధి నా జీవితపు పిన్నవయసులోనే యెరిగినట్లు అనిపించెను; లేనియెడల అంధకారశక్తులు నాకు విరోధముగా ఎందుకు ఏకము కావలెను? ఎందుకు బాల్యములోనే ఈ వ్యతిరేకత, హింస నాకు విరుద్ధముగా చెలరేగెను?

కొంతమంది మత బోధకులు, విశ్వాసులమని చెప్పుకొనువారు మొదటి దర్శన వృత్తాంతమును తిరస్కరించిరి—జోసెఫ్ స్మిత్ మీద హింస పెరిగెను—దర్శనపు యథార్థతను గూర్చి ఆయన సాక్ష్యము చెప్పెను. (21–26 వచనములు.)

21 నాకు ఈ దర్శనము కలిగిన కొన్ని దినముల తరువాత, ముందు చెప్పబడిన మతపరమైన భావోద్రేకములో క్రియాశీలుడైన ఒక మెథడిస్టు బోధకుడిని నేను కలుసుకొంటిని; మతమును గూర్చి అతనితో చర్చించుచుండగా, నాకు కలిగిన దర్శన వృత్తాంతమును అతనికి చెప్పుటకు నాకు అవకాశము కలిగెను. అతని ప్రవర్తనకు నేను బహుగా ఆశ్చర్యపడితిని; నా సంభాషణను అతడు తేలికగా తీసుకొనుటయే కాక, అది సాతాను వలన కలిగినదని, ఈ దినములలో దర్శనములు లేదా బయల్పాటులు అనునవి లేవని; అటువంటివి అపొస్తలులతో సమాప్తమయ్యెనని, అవి ఇక ఉండవని మిక్కిలి అలక్ష్యముతో చెప్పెను.

22 నా కథను చెప్పుటవలన మత విశ్వాసులుగా చెప్పుకొనువారి మధ్య నా గురించి చాలా అసూయ భావము రేగెనని, ఎక్కువగుచున్న గొప్ప హింసకు అది కారణమని నేను అతి త్వరలోనే తెలుసుకొంటిని; నేను పధ్నాలుగు పదిహేనేండ్ల మధ్య వయస్సుగల అప్రసిద్ధ బాలుడను, నా జీవిత పరిస్థితులు లోకములో నన్ను ప్రాముఖ్యతలేని బాలునిగా చేసినప్పటికి, ఉన్నత స్థానములలో ఉన్న వ్యక్తులు నాకు విరుద్ధముగా ప్రజల మనస్సులను రెచ్చగొట్టుటకు, తీవ్రమైన హింసను కలిగించుటకు చాలా ప్రయత్నించిరి; ఇది అన్ని పక్షములలో సర్వసాధారణమయ్యెను—నన్ను హింసించుటకు అందరు ఏకమయ్యిరి.

23 పధ్నాలుగేండ్లు దాటిన ఒక అప్రసిద్ధ బాలుడు, చాలీచాలని పోషణ కొరకు అనుదినము కష్టపడి పనిచేయుటకు బలవంతము చేయబడినవాడు, నేడు ప్రఖ్యాతిగాంచిన పక్షములలోని గొప్పవారి దృష్టిని ఆకర్షించేంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా యెంచబడి వారిలో తీవ్రమైన హింసను, దూషించు వైఖరిని కలుగజేయుట ఎంత విచిత్రము. ఈ విషయము అప్పుడు మరియు అప్పటి నుండి తరచు నన్ను తీవ్రముగా ఆలోచింపజేసెను. ఈ విధముగా జరుగుట విచిత్రమో, కాదో గాని అది నాకు గొప్ప వేదన కలిగించుటకు తరచు కారణమయ్యెను.

24 అయినప్పటికీ నేను ఒక దర్శనమును చూచుట యథార్థము. అగ్రిప్ప రాజు ముందు తననుతాను సమర్థించుకొని, అతడు వెలుగును చూచి, ఒక స్వరమును వినినప్పుడు కలిగిన దర్శనమును గూర్చి చెప్పినప్పుడు పౌలు ఏవిధముగా భావించెనో ఆవిధముగా నేను భావించానని అనుకున్నాను; అతడిని కొంతమందే నమ్మిరి; అతడు అబద్ధములాడుచున్నాడని కొందరు, అతడు పిచ్చివాడని ఇతరులు అనిరి; అతడు ఎగతాళి చేయబడి, నిందించబడెను. కానీ ఇదంతయు అతని దర్శనము యొక్క యథార్థతను నాశనము చేయలేదు. అతడు ఒక దర్శనమును చూచెను, అతడు చూచెనని అతడు ఎరిగియుండెను, ఆకాశము క్రిందనున్న హింస అంతయు దానిని మార్చలేకపోయెను; మరణించువరకు అతడిని హింసించినను, ఒక వెలుగును చూచి, ఒక స్వరము తనతో మాట్లాడుట వినెనని అతడు ఎరిగియుండెను మరియు తుదిశ్వాస వరకు ఎరిగియుండును, సర్వలోకము అది జరుగలేదని అతడు ఆలోచించునట్లు లేదా నమ్మునట్లు చేయలేకపోయెను.

25 నా యెడల కూడా ఆవిధముగానే జరిగెను. వాస్తవానికి నేను ఒక వెలుగును చూచితిని, ఆ వెలుగు మధ్యలో ఇద్దరు వ్యక్తులను చూచితిని, వారు నిజముగా నాతో మాట్లాడిరి; నేను ఒక దర్శనమును చూచితినని చెప్పుటవలన నేను ద్వేషింపబడి, హింసింపబడినను అది సత్యము; ఆవిధముగా చెప్పుచుండుటవలన వారు నన్ను హింసించుచు, నిందించుచు, నా మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకుచుండినప్పుడు—సత్యము పలికినందుకు నన్నెందుకు హింసించుచున్నారని నా హృదయములో అనుకొనుటకు నడిపించబడితిని. వాస్తవానికి నేనొక దర్శనమును చూచితిని; దేవుడిని అడ్డగించుటకు నేను ఏపాటివాడను లేదా నేను వాస్తవముగా చూచిన దానిని నేను తృణీకరించునట్లు చేయుటకు లోకము ప్రయత్నించనేల? ఏలయనగా నేనొక దర్శనమును చూచితిని; దానిని నేనెరుగుదును, దేవుడు దానిని యెరిగియున్నాడని నేనెరుగుదును, దానిని నేను తృణీకరించలేను, అలా చేయుటకు సాహసించలేను; ఆవిధముగా చేయుట వలన దేవుని బాధించెదనని, శిక్షావిధికి లోనగుదునని మాత్రము నేనెరుగుదును.

26 మత పక్షముల విషయములో ఇప్పుడు నా మనస్సు సంతృప్తి చెందెను, ఎందుకనగా వాటిలో దేనిలోను చేరుట నా బాధ్యత కాదు, కానీ నేను మరలా ఆదేశింపబడు వరకు నేను ఉన్న విధముగానే కొనసాగవలెను. జ్ఞానము కొదువగా ఉన్నవాడు దేవుని అడిగి, గద్దింపబడక పొందవచ్చునని యాకోబు చెప్పిన సాక్ష్యము యథార్థమని నేను తెలుసుకొంటిని.

జోసెఫ్ స్మిత్‌కు మొరోనై ప్రత్యక్షమగును—సమస్త జనముల మధ్య జోసెఫ్ పేరు మంచికిని, చెడుకును తెలియజేయబడవలెను—మోర్మన్ గ్రంథము, రాబోయే దేవుని తీర్పులు మరియు అనేక లేఖనముల గురించి మొరోనై అతనికి చెప్పును—బంగారు పలకలు దాచబడిన ప్రదేశము బయలుపరచబడినది—ప్రవక్తకు ఆదేశములిచ్చుటను మొరోనై కొనసాగించును. (27–54 వచనములు.)

27 పదునెనిమిది వందల ఇరవై మూడు, సెప్టెంబరు ఇరవై ఒకటి వరకు అన్ని తరగతుల మనుష్యులచేత మతసంబంధులు, మతసంబంధులు కాని వారిచేత ఇంతవరకు తీవ్ర హింసను అనుభవించుచు నా అనుదిన కార్యములలో నేను నిమగ్నమైయున్నాను, ఎందుకనగా నేను ఒక దర్శనమును చూచితినని రూఢీగా చెప్పుట కొనసాగించితిని.

28 నాకు దర్శనము కలిగినప్పటినుండి పదునెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరము వరకు గల మధ్య కాలములో ఆ నాటి మతపక్షములలో దేనిలోను చేరవద్దని ఆజ్ఞాపించబడి, లేత ప్రాయములోనుండుట వలన నా స్నేహితులుగా ఉండి, నన్ను ఆదరించవలసిన వారిచేత హింసించబడినందువలన, నేను మోసపోతినని వారనుకొన్నట్లైతే నన్ను కాపాడుటకు ప్రేమతో ప్రయత్నించనందున మరియు వారు ఆవిధముగా చేయనందున ్యకరమైన విషయముగా కనిపించదు.

29 వీటి ఫలితముగా, నేను తరచు నా బలహీనతలు, నా లోపముల కొరకు అపరాధిగా భావించితిని; పైన చెప్పబడిన సెప్టెంబరు ఇరవై ఒకటవ తేది సాయంకాలమున నిద్రించుటకు నా పడకపై వాలగా, నా పాపములు, దోషములకు సర్వశక్తిమంతుడగు దేవుని క్షమాపణ కోరుటకు, ఆయన యెదుట నా స్థితిగతులను తెలుసుకొనుటకు ఆయనకు ప్రార్థించి, విన్నపము చేయుటకు నేను పూనుకొంటిని; ఎందుకనగా నేను గతములో పొందిన విధముగా ఒక దైవిక ప్రత్యక్షతను పొందెదనని నాకు పూర్తి నమ్మకము కలదు.

30 నేను ఆ విధముగా దేవుడిని ప్రార్థించు పనిలో ఉండగా, నా గదిలో ఒక వెలుగు ప్రత్యక్షమగుటను నేను కనుగొంటిని, ఆ గది మిట్టమధ్యాహ్నము కంటే కాంతివంతమగువరకు అది వృద్ధిచెందుచు వచ్చెను, అప్పుడు వెంటనే నా మంచము ప్రక్కన ఒక వ్యక్తి ప్రత్యక్షమై గాలిలో నిలబడియుండెను, ఎందుకనగా అతని పాదములు నేలను తాకలేదు.

31 మిక్కిలి శ్రేష్ఠమైన తెల్లని వదులైన అంగీని అతడు ధరించియుండెను. అది నేను ఇప్పటివరకు చూచిన భూసంబంధమైన వాటన్నింటిని మించి మిక్కిలి తెలుపైయుండెను; లేదా భూసంబంధమైనదేదియు అంత తెల్లగా, తేజోమయముగా కనబడునట్లు చేయబడగలదని నేను నమ్ముట లేదు. అతని అరిచేతులు, మణికట్టుకు కొంచెము పైవరకు అతని చేతులకు ఆచ్ఛాదనము లేకుండెను; అతని అరికాళ్ళు, మడమలకు కొంచెము పైవరకు అతని కాళ్ళును ఆవిధముగానే ఉండెను. అతని తల, మెడకు కూడా ఆచ్ఛాదనము లేకుండెను. ఈ అంగీ తప్ప మరే ఇతర వస్త్రమును అతడు ధరించియుండలేదు, ఎందుకనగా అతని రొమ్మును నేను చూడగలుగునట్లు అది తెరువబడియుండెను.

32 అతని అంగీయే కాదు, కానీ అతని శరీరమంతా వర్ణనాతీతముగా మహిమకరముగానుండెను, అతని ముఖము మెరుపువలె ఉండెను. గది మిక్కిలి కాంతివంతముగా ఉండెను, కానీ అతని చుట్టూ ఉన్నంత ప్రకాశవంతముగా కాదు. నేను మొదట అతడిని చూచినప్పుడు భయపడితిని; కానీ వెంటనే భయము తొలగిపోయెను.

33 అతడు నన్ను పేరుపెట్టి పిలిచి, తాను దేవుని సన్నిధి నుండి నా కొరకు పంపబడిన దూత అని, అతని పేరు మొరోనై అని; నేను చేయవలసిన ఒక కార్యమును దేవుడు కలిగియున్నాడని; సమస్త జనములు, వంశములు, భాషలు, ప్రజల మధ్య మంచికి, చెడుకు నా నామము వాడబడునని లేదా సమస్త ప్రజల మధ్య గౌరవముగా, అగౌరవముగా అది చెప్పుకోబడునని నాతో చెప్పెను.

34 ఈ ఖండపు పూర్వ నివాసుల వృత్తాంతమును, వారు ఎక్కడనుండి వచ్చిరో దాని మూలాధారమును తెలుపుచు, బంగారు పలకలపై వ్రాయబడిన ఒక గ్రంథము పాతిపెట్టబడియుండెనని అతడు చెప్పెను. ప్రాచీన నివాసులకు రక్షకునిచేత ఇవ్వబడిన నిత్య సువార్త సంపూర్ణముగా దానిలో ఉన్నదని కూడా అతడు చెప్పెను.

35 రెండు రాళ్ళు వెండి చట్రాలలో ఉండేవని ఆ రాళ్ళు వక్షస్థల కవచమునకు జతచేయబడిన యెడల అది ఊరీము తుమ్మీముగా చేయబడునని, అవి ఆ పలకలతో పాతిపెట్టబడెనని; ఈ రాళ్ళను కలిగియుండి, ఉపయోగించిన వారు ప్రాచీన కాలములో లేదా పూర్వకాలములో “దీర్ఘదర్శులు” అని పిలువబడిరని; ఆ గ్రంథమును అనువదించుట కొరకు దేవుడు వాటిని సిద్ధపరిచెనని చెప్పెను.

36 ఈ సంగతులు చెప్పిన తరువాత, అతడు పాత నిబంధన గ్రంథపు ప్రవచనములను ఉదహరించుట ప్రారంభించెను. మొదట అతడు మలాకీ గ్రంథము మూడవ అధ్యాయములో కొంత భాగమును ఉదహరించెను; ఆ ప్రవచనము యొక్క నాల్గవ లేదా ఆఖరి అధ్యాయమును కూడా మన బైబిలు గ్రంథములలో ఉన్న దానికి స్వల్ప వ్యత్యాసముతో అతడు ఉదహరించెను. మొదటి వచనమును మన గ్రంథములలో ఉన్నవిధముగా ఉదహరించుటకు బదులు అతడు ఈ విధముగా ఉదహరించెను:

37 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును; గర్విష్ఠులందరును దుష్టులందరును కొయ్యకాలు వలె కాలుదురు; వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవువారు వారిని కాల్చివేయుదురని సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

38 మరలా అతడు ఐదవ వచనమును ఇలా ఉదహరించెను: ప్రభువు నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలీయా ద్వారా యాజకత్వమును నేను మీకు బయలుపరిచెదను.

39 తరువాత వచనమును కూడా అతడు మరోవిధముగా ఉదహరించెను: తండ్రులకు చేయబడిన వాగ్దానములను పిల్లల హృదయాలలో అతడు నాటును, అప్పుడు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరుగును. అట్లు కానీయెడల, ఆయన రాకడ సమయమున భూమియంతయు పూర్తిగా నాశనము చేయబడును.

40 వీటికి అదనముగా అతడు యెషయా గ్రంథము పదకొండవ అధ్యాయమును ఉదహరించి, అది త్వరలో నెరవేరునని చెప్పెను. అపొస్తలుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు, ఇరవై మూడు వచనములను కూడా మన క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నవిధముగా అతడు ఉదహరించెను. ఆ ప్రవక్త క్రీస్తు అని అతడు చెప్పెను; కానీ “ఆయన స్వరము విననివారు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగు” దినము ఇంకను రాలేదని, అది త్వరలో వచ్చునని చెప్పెను.

41 యోవేలు రెండవ అధ్యాయము, ఇరవై ఎనిమిదవ వచనమునుండి చివరి వరకు అతడు ఉదహరించెను. ఇది ఇంకా నెరవేరలేదు, కానీ త్వరలో నెరవేరునని అతడు చెప్పెను. అన్యజనులు సంపూర్ణ సువార్తను కలిగియుండు దినము త్వరలో వచ్చునని కూడా అతడు చెప్పెను. లేఖనములలో అనేకమైన ఇతర భాగములను ఉదహరించి, అనేక వివరణలను అతడు ఇచ్చెను, అవి ఇక్కడ చెప్పబడరాదు.

42 మరలా, అతడు చెప్పిన ఆ పలకలను పొందవలసిన సమయము ఇంకా రాలేదు, కానీ నేను వాటిని పొందినప్పుడు వాటిని, ఊరీము తుమ్మీముతోనున్న వక్షస్థల కవచమును ఏ వ్యక్తికి నేను చూపించరాదని; వాటిని చూపించమని నాకాజ్ఞాపించబడిన వారికి మాత్రమే చూపించవలెనని అతడు నాతో చెప్పెను; నేను చూపించిన యెడల నాశనము చేయబడుదును. పలకలను గూర్చి అతడు నాతో మాట్లాడుచుండగా పలకలు దాచబడిన ప్రదేశమును నేను చూడగలుగునట్లు, మరలా నేను దానిని దర్శించినప్పుడు స్పష్టముగా, వివరముగా ఆ ప్రదేశమును నేను తెలుసుకొనునట్లు నా మనస్సునకు ఒక దర్శనము చూపబడెను.

43 ఈ సంభాషణ ముగిసిన తరువాత, వెంటనే గదిలోనున్న వెలుగు నాతో మాట్లాడుచున్న ఆ వ్యక్తి చుట్టూచేరుట ఆరంభించి, అతని చుట్టూ తప్ప గది అంతా చీకటి అగువరకు కొనసాగుటను నేను చూచితిని; అప్పుడు తక్షణమే ఆకాశములోనికి ఒక మార్గము తెరచుకొని, పూర్తిగా అదృశ్యమగువరకు అతడు ఆరోహణమగుటను చూచితిని, మరియు ఈ పరలోక వెలుగు ప్రత్యక్షము కాకమునుపు గది ఏవిధముగా ఉండెనో ఆవిధముగా చేయబడెను.

44 నేను పడకమీదనే ఉండి ఈ విశిష్టమైన దృశ్యమును గూర్చి ఆలోచించుచు, ఈ అసాధారణ దూత ద్వారా నాకు చెప్పబడిన దానిని గూర్చి బహుగా ఆశ్చర్యపడితిని; అప్పుడు నా ధ్యానము మధ్యలో, నా గది మరలా వెలుగుతో నిండుటను అకస్మాత్తుగా నేను కనుగొంటిని, తక్షణమే ఆ పరలోక దూత మరలా నా మంచము ప్రక్కన నిలుచుండెను.

45 అతడు మాట్లాడుట మొదలుపెట్టగా, కొంచెము కూడా మార్పులేకుండా మొదటి దర్శనములో చెప్పిన సంగతులనే మరలా చెప్పెను; ఆవిధముగా అతడు చెప్పినప్పడు, కరువువలన, కత్తివలన, తెగుళ్ళవలన గొప్ప నాశనముతో భూమి మీదకు రాబోవు గొప్ప తీర్పులను గూర్చి నాకు తెలిపెను; ఈ వేదనకరమైన తీర్పులు ఈ తరములో భూమి మీదకు వచ్చునని చెప్పెను. ఈ సంగతులను తెలిపిన తరువాత, మునుపటి వలె అతడు మరలా ఆరోహణుడాయెను.

46 ఈ సమయానికెల్లా, ఈ విషయాలు నా మనస్సులో ఎంత లోతుగా ముద్రవేయబడెననగా, నిద్ర నా కళ్ళను వీడిపోయెను, నేను చూచిన మరియు వినిన వాటిని బట్టి విస్మయముతో ముంచివేయబడితిని. కానీ మరలా ఆ దూతను నా మంచము ప్రక్కన చూచి, అతడు మునుపు చెప్పిన సంగతులనే మరలా చెప్పగా లేదా పునరావృతం చేయగా విని నేనెంతో ఆశ్చర్యపోతిని; మరియు (నా తండ్రి కుటుంబము యొక్క బీదరికము వలన) ఐశ్వర్యవంతులు కావలెనను ఉద్దేశ్యము కొరకు పలకలను పొందమని సాతాను నన్ను శోధించుటకు ప్రయత్నించునని అతడు నన్ను హెచ్చరించెను. దేవుడిని మహిమపరచుటకే తప్ప ఆ పలకలు పొందుటకు మరి ఏ ఇతర ఉద్దేశ్యమును నేను కలిగియుండకూడదని, ఆయన రాజ్యమును నిర్మించుట తప్ప మరే ఇతర ఆలోచనవలన నేను ప్రభావితము చేయబడకూడదని చెప్పుచు అతడు నన్ను నిరోధించెను.

47 ఈ మూడవ దర్శనము తరువాత, మునుపటిలాగే అతడు పరలోకమునకు ఆరోహణుడాయెను మరియు నేను ఇప్పుడే పొందిన అనుభవము యొక్క విశిష్టతను గూర్చి ఆలోచించుటకు విడువబడితిని; మూడవసారి పరలోకపు దూత నా యొద్ద నుండి ఆరోహణుడైన వెంటనే కోడి కూసెను, ఉదయము సమీపించుచున్నదని, మా సంభాషణ రాత్రంతా కొనసాగెనని నేను కనుగొంటిని.

48 కొద్ది సమయము తరువాత నా పడకమీద నుండి నేను లేచి, ఎప్పటివలె ఆ దినములో చేయవలసిన ఆవశ్యకమైన పనులకు వెళ్ళితిని, కానీ ఇతర సమయాలలో చేసిన విధముగా పనిచేయుటకు ప్రయత్నించగా చాలావరకు నా బలమును కోల్పోయి, నేను పూర్తిగా పనిచేయలేకపోవుచున్నట్లు గ్రహించితిని. నాతో పనిచేయుచున్న నా తండ్రి, నా ఆరోగ్యము సరిగాలేదని గ్రహించి, ఇంటికి వెళ్ళమని చెప్పెను. ఇంటికి వెళ్ళవలెనని నేను బయలుదేరితిని; కానీ మేమున్న పొలము యొక్క కంచె దాటుటకు ప్రయత్నించగా నా బలమును పూర్తిగా కోల్పోయి, నేను నిస్సహాయునిగా నేలపై పడి, కొంత సమయము వరకు స్పృహలోలేక ఏమియు తెలియకయుంటిని.

49 నేను జ్ఞాపకము చేసుకోగలిగిన మొదటి విషయము ఒక స్వరము నన్ను పేరుపెట్టి పిలిచి నాతో మాట్లాడుట. నేను పైకిచూడగా, మునుపటివలె చుట్టూ కాంతితో నింపబడి ఆ దూత నా తలకు పైగా నిలువబడియుండుటను చూచితిని. అతడు మరలా గత రాత్రి చెప్పిన సమస్తమును చెప్పి, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పొందిన దర్శనము, ఆజ్ఞలను గూర్చి ఆయనతో చెప్పవలెనని ఆజ్ఞాపించెను.

50 దానిని నేను గైకొంటిని; పొలములో ఉన్న నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఆ విషయమునంతటిని నేనాయనకు వివరించితిని. ఇది దేవుని వలన కలిగినదని ఆయన సమాధానమిచ్చి, నేను వెళ్ళి ఆ దూత ఆజ్ఞాపించిన ప్రకారము చేయవలెనని చెప్పెను. నేను పొలమును వదిలి, పలకలు పాతిపెట్టబడియున్నవని ఆ దూత చెప్పిన ప్రదేశమునకు వెళ్ళితిని; దానిని గూర్చి నేను పొందిన ఆ దర్శనము స్పష్టముగా ఉండుట వలన, అక్కడకు వెళ్ళిన క్షణమే ఆ ప్రదేశమును నేను యెరిగియుంటిని.

51 న్యూయార్క్ రాష్ట్రము, ఓంటారియో జిల్లా, మాంచెస్టర్ గ్రామానికి సమీపములో ఒక పెద్ద కొండ కలదు మరియు అది చుట్టుప్రక్కల ఉన్నవాటిలో మిక్కిలి ఎత్తైనది. ఆ కొండకు పశ్చిమము వైపున, పైనుండి కొద్దిదూరములో, పెద్ద రాయి క్రింద రాతి పెట్టెలో ఆ పలకలు దాచబడియున్నవి. ఈ రాయి పైభాగము మధ్యలో గుండ్రముగాను దళసరిగానుండి అంచులు సన్నగా నుండెను, గనుక మధ్యభాగము నేలపై కనబడుచుండెను, కానీ అంచు చుట్టూ మట్టితో కప్పబడియుండెను.

52 మట్టిని తొలగించిన తరువాత, నేను ఒక మీటను సంపాదించి, దానిని రాతి అంచు క్రింద ఉంచి, కొద్ది ప్రయత్నముతో దానిని పైకి లేపితిని. లోపల చూడగా దూత చెప్పినట్లుగా పలకలను, ఊరీము తుమ్మీమును, వక్షస్థల కవచమును నేను యథార్థముగా చూచితిని. అవి ఉంచబడిన పెట్టె ఒక విధమైన సున్నముతో రాళ్ళు దగ్గరగా అమర్చి తయారుచేయబడినది. ఆ పెట్టె అడుగు భాగములో అడ్డముగా రెండు మూలలా రెండు రాళ్ళు అమర్చబడియుండెను, ఈ రాళ్ళమీద పలకలు మరియు ఇతర వస్తువులు అమర్చబడియుండెను.

53 వాటిని బయటకు తీయుటకు నేను ప్రయత్నించితిని, కానీ ఆ దూతచేత నిరోధించబడితిని, వాటిని బయటకు తీసుకొని వచ్చుటకు సమయము ఇంకా ఆసన్నము కాలేదని, ఆ సమయము నుండి నాలుగు సంవత్సరముల వరకు ఆసన్నము కాదని నాకు చెప్పబడెను; కానీ నేను ఆ ప్రదేశమునకు సరిగ్గా ఒక సంవత్సరము తరువాత రావలెనని, అక్కడ నన్ను కలుసుకొందునని మరియు ఆ పలకలు పొందుటకు సమయము ఆసన్నమగువరకు ఆ విధముగానే చేయవలెనని అతడు చెప్పెను.

54 నాకాజ్ఞాపించబడిన ప్రకారము, ప్రతి సంవత్సరాంతమున నేను వెళ్ళితిని, ప్రతిసారి ఆ దూతను అక్కడ కనుగొంటిని మరియు ప్రభువు ఏమి చేయబోవునో, అంత్య దినములలో ఆయన రాజ్యము ఏలాగు, ఏవిధానములో నడిపించబడవలెనో దానికి సంబంధించిన ఉపదేశమును, జ్ఞానమును మా ప్రతి సంభాషణలో అతని నుండి నేను పొందితిని.

జోసెఫ్, ఎమ్మా హేల్‌ను వివాహము చేసుకొనును—మొరోనై నుండి అతడు బంగారు పలకలను పొందెను మరియు కొన్ని అక్షరములను అనువదించెను—మార్టిన్ హారిస్‌ అక్షరములను, అనువాదమును ఆచార్యులు ఆంథన్‌కు చూపించెను, అతడు “ముద్రవేయబడిన గ్రంథమును నేను చదువలేను” అని చెప్పెను. (55–65 వచనములు.)

55 నా తండ్రి ఆర్థిక వనరులు చాలా పరిమితముగా ఉండుట వలన, మా చేతులతో మేము కష్టపడి పనిచేయవలసిన ఆవశ్యకత మాకుండెను, దినసరి కూలీగా లేదా అవకాశమును బట్టి మరోవిధమైన కూలీగా పనిచేయవలసియుండెను. కొన్నిసార్లు మేము ఇంటివద్ద, కొన్నిసార్లు ఇంటికి దూరముగా నిరంతరము పనిచేయుట వలన మేము సుఖమయ జీవనము గడుపుటకు వీలుకలిగెను.

56 1823వ సంవత్సరములో నా అన్నలలో పెద్దవాడైన ఆల్విన్ మృతితో మా కుటుంబము గొప్ప వేదనను అనుభవించెను. 1825 అక్టోబరు మాసములో, జోషియ స్టోల్ అనే వృద్దునిచేత నేను కూలికి పెట్టుకోబడితిని, అతడు న్యూయార్క్ రాష్ట్రము, షెనన్గో జిల్లాలో కాపురముండెను. పెన్సిల్వేనియా రాష్ట్రము, సస్క్వెహెన్నా జిల్లా, హార్మొనిలో స్పెయిన్ జాతీయులచేత ఏదో ఒక వెండిగని త్రవ్వబడినదని అతడు వినియుండెను; నన్ను పనిలో పెట్టుకొనక ముందు సాధ్యమైతే ఆ గనిని కనుగొనుటకు త్రవ్వుచు ఉండెను. నేను అతనితో జీవించుటకు వెళ్ళిన తరువాత, వెండిగని త్రవ్వుటకు అతడు మిగిలిన పనివారితోపాటు నన్ను తీసుకొని వెళ్ళెను, మా ప్రయత్నములో సఫలముకానప్పటికి అక్కడ సుమారు ఒక నెలపాటు ఆ పనిని కొనసాగించితిని, చివరకు దానిని త్రవ్వుటను ఆపివేయమని నేను ఆ వృద్ధుడిని ఒప్పించితిని. అందువలన నిధి-అన్వేషకుడని నన్ను గూర్చి ఒక కథ ప్రచారములో ఉండెను.

57 ఈ విధముగా నేను పనిలో పెట్టుకోబడిన సమయములో భోజనము, వసతికొరకు ఆ ప్రదేశములో ఐసాక్ హేల్ యొద్దకు నేను పంపబడితిని; అక్కడే నా భార్య (అతని కుమార్తె) ఎమ్మా హేల్‌ను తొలిసారి చూచితిని. స్టోల్ గారి వద్ద ఇంకా పని చేయుచుండగా, 1827 జనవరి 18న మేము వివాహము చేసుకొంటిమి.

58 నేను దర్శనమును చూచితినని ఖచ్చితముగా చెప్పుచుండుట వలన ఇంకా హింస నన్ను వెంబడించెను మరియు నా భార్య తండ్రి యొక్క కుటుంబము మా వివాహమును చాలా వ్యతిరేకించెను. కాబట్టి నేను ఆమెను వేరొక ప్రదేశమునకు తీసుకొని వెళ్ళవలసిన అవసరం ఏర్పడెను; అందువలన మేము న్యూయార్క్, షెనన్గో జిల్లా, సౌత్ బెయిన్‌బ్రిడ్జ్ నందు స్క్వైర్ టార్బిల్ గృహములో వివాహము చేసుకొంటిమి. నా వివాహము జరిగిన వెంటనే, స్టోల్ గారిని వదిలి, నా తండ్రి గృహమునకు వెళ్ళి, ఆ కాలములో ఆయనతో పొలములో పనిచేసితిని.

59 బహుకాలము గడిచిన తరువాత పలకలు, ఊరీము తుమ్మీము, వక్షస్థల కవచమును పొందవలసిన సమయము ఆసన్నమాయెను. ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఏడు, సెప్టెంబరు ఇరవై రెండవ తేదీన, ఎప్పటివలె మరో సంవత్సరాంతమున అవి పాతిపెట్టబడియున్న ప్రదేశమునకు వెళ్ళితిని, ఆ దూత ఈ ఆజ్ఞను ఇచ్చి వాటిని నాకు అప్పగించెను: వాటికి నేను బాధ్యుడను, అజాగ్రత్తతో లేదా నా నిర్లక్ష్యమువలన వాటిని నేను కోల్పోయిన యెడల, నేను కొట్టివేయబడుదును; కానీ ఆ దూత వాటిని వెనుకకు తీసుకొనువరకు వాటిని భద్రముగా ఉంచుటకు నా ప్రయత్నములన్నిటిని వినియోగించిన యెడల, అవి కాపాడబడును.

60 వాటిని జాగ్రత్తగా ఉంచమని నేనెందుకు అటువంటి కఠినమైన ఆజ్ఞలను పొందితినో మరియు నేను చేయవలసిన కార్యమును చేసిన తరువాత వాటిని వెనుకకు తీసుకొందునని ఆ దూత ఎందుకు చెప్పెనో త్వరలోనే నేను తెలుసుకొంటిని. వాటిని నేను కలిగియున్నానని తెలిసినవెంటనే, నా నుండి వాటిని పొందుటకు మిక్కిలి తీవ్రమైన ప్రయత్నములు చేయబడెను. మనుష్యాలోచనకు రాగల ప్రతి ఉపాయము వాటిని నా నుండి తీసుకొనుటకు ఉపయోగించబడెను. హింస మునుపటికంటె మిక్కిలి బాధాకరముగా, తీవ్రముగా మారెను, సాధ్యమైతే వాటిని నా నుండి తీసుకొనుటకు జనసమూహములు నిత్యము కనిపెట్టుకొనియుండెను. కానీ దేవుని జ్ఞానమువలన నాకు అప్పగించబడిన పనిని నేను చేయువరకు అవి నా చేతులలో సురక్షితముగా ఉండెను. ఒప్పందము ప్రకారము ఆ దూత వాటిని వెనుకకు తీసుకొనుటకు అడిగినప్పుడు వాటిని నేను అతనికి అప్పగించితిని; ఈ దినము అనగా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది, మే రెండవ తేదీ వరకు అతడు తన ఆధీనములో వాటిని కలిగియున్నాడు.

61 అయినప్పటికీ ఆ భావోద్రేకము ఇంకనూ కొనసాగెను మరియు నా తండ్రిని గూర్చి, నన్ను గూర్చి అబద్ధములు ప్రచారము చేయుటకు అన్నివేళలా వదంతి వేయినోళ్ళతో ఉపయోగించబడినది. వాటిలో వెయ్యో వంతును నేను చెప్పిన యెడల, వాటితో గ్రంథములు నిండిపోవును. ఆ హింస భరించలేనిదిగా ఉండుట వలన నేను మాంచెస్టర్ వదిలి నా భార్యతో పెన్సిల్వేనియా రాష్ట్రము, సస్క్వెహెన్నా జిల్లాకు వెళ్ళవలసిన అవసరము ఏర్పడెను. మిక్కిలి బీదవారమైయుండి, మా పట్ల హింస మిక్కిలి అధికముగా ఉండుటవలన మరోవిధముగా ఉండుటకు ఎటువంటి సంభావ్యత లేకుండా మేము బయలుదేరుటకు సిద్ధపడుచుండగా మా శ్రమలలో మార్టిన్ హారిస్‌ అను సజ్జనునిలో మేమొక స్నేహితుని కనుగొంటిమి, అతడు మా యొద్దకు వచ్చి, మా ప్రయాణములో సహాయపడుటకు నాకు యాభై డాలర్లు ఇచ్చెను. హారిస్‌ న్యూయార్క్ రాష్ట్రము, వేయిన్ జిల్లా, పాల్మైరా పట్టణప్రాంత కాపురస్తుడు మరియు పలుకుబడిగల రైతు.

62 సకాలములో చేయబడిన ఈ సహాయమువలన పెన్సిల్వేనియాలో నా గమ్యస్థానమునకు చేరుకోగలిగితిని; అక్కడకు నేను చేరుకున్న వెంటనే పలకలపైనున్న అక్షరములను నకలుచేయ మొదలుపెట్టితిని. వాటిలో అధికసంఖ్యను నకలుచేసిన తరువాత, ఊరీము తుమ్మీము సహాయముతో వాటిలో కొన్నిటిని నేను అనువదించితిని, దీనిని డిసెంబరు మాసములో నా భార్య యొక్క తండ్రి గృహమునకు వచ్చినప్పటి నుండి మరుసటి ఫిబ్రవరి వరకు గల సమయములో చేసితిని.

63 ఈ ఫిబ్రవరి మాసములో ఒకరోజు ఇంతకుముందు చెప్పిన మార్టిన్ హారిస్‌ మా ప్రదేశమునకు వచ్చి, పలకలనుండి నేను నకలుచేసిన అక్షరములను తీసుకొని, వాటితో న్యూయార్క్ నగరమునకు బయలుదేరెను. అతడు తిరిగివచ్చిన తరువాత అతనికి, ఆ అక్షరములకు సంబంధించి జరిగిన దానిని అతడు నాతో చెప్పినట్లుగా ఆ పరిస్థితుల యొక్క వృత్తాంతమును నేను ఉదహరించుచున్నాను, అది ఈ విధముగా ఉన్నది:

64 “నేను న్యూయార్క్ నగరమునకు వెళ్ళి, సాహిత్యములో ఆయన సాధించిన ఘనత కొరకు ప్రఖ్యాతిగాంచిన సజ్జనుడైన ఆచార్యులు చాల్స్ ఆంథన్‌కు అనువదించబడిన అక్షరములను, అనువాదమును చూపించితిని. అనువాదము సరియైనదని, ఐగుప్తు భాషనుండి అనువదించబడి, అతడు గతములో చూచిన వాటికంటే మరింత ఖచ్చితముగా ఉన్నదని ఆచార్యులు ఆంథన్ చెప్పెను. తరువాత ఇంకా అనువదించబడకుండా ఉన్న అక్షరములను నేనతనికి చూపించితిని, అవి ఐగుప్తు, చాల్దీయ, అష్షూరు, అరబ్బు భాషలకు సంబంధించినవని అతడు చెప్పెను; అవి సరియైన అక్షరాలని అతడు చెప్పెను. అవి సరియైన అక్షరములని, అనువదించబడిన వాటి యొక్క అనువాదము కూడా సరియైనదని పాల్మైరా ప్రజలకు ధృవీకరించుచు అతడు ఒక ధృవపత్రమును నాకు ఇచ్చెను. నేను ఆ ధృవపత్రమును తీసుకొని, దానిని నా జేబులో పెట్టుకొని ఆంథన్ గారి గృహమును వదిలి వెళ్ళుచుండగా, అతడు నన్ను వెనుకకు పిలిచి, ఆ యౌవనుడు బంగారు పలకలను కనుగొనిన ప్రదేశములో అవి ఉన్నవని ఏవిధముగా తెలుసుకొనెనని అడిగెను. దానిని ఒక దేవదూత అతనికి బయలుపరచెనని నేను జవాబు చెప్పితిని.

65 “అతడు నాతో ‘ఆ ధృవపత్రమును నన్ను చూడనిమ్మనెను.’ అందుకు నేను నా జేబులోనుండి దానిని బయటకు తీసి అతనికి ఇచ్చితిని, అతడు దానిని తీసుకొనిన తరువాత ముక్కలుగా చించి, దేవదూతల పరిచర్య అనునది ఏదియు ఇప్పుడు లేదని, ఆ పలకలను అతని యొద్దకు తెచ్చినచో అతడు వాటిని అనువదించునని చెప్పెను. ఆ పలకలలో కొంత భాగము ముద్రవేయబడి ఉన్నదని, వాటిని తెచ్చుటకు నాకు అనుమతిలేదని అతనికి నేను చెప్పితిని. అందుకతడు ‘ముద్రవేయబడిన గ్రంథమును నేను చదువలేననెను.’ అతడిని విడిచి, డా. మిషెల్ దగ్గరకు వెళ్ళితిని, ఆయన అక్షరములు మరియు అనువాదమును గూర్చి ఆచార్యులు ఆంథన్ చెప్పిన దానిని ధృవీకరించెను.”

· · · · · · ·

మోర్మన్ గ్రంథ అనువాదమునకు ఆలీవర్ కౌడరీ లేఖకునిగా పనిచేసెను—జోసెఫ్ మరియు ఆలీవర్ కౌడరీ బాప్తిస్మమిచ్చు యోహాను నుండి అహరోను యాజకత్వమును పొందిరి—వారు బాప్తిస్మము పొంది, నియమింపబడి, ప్రవచనాత్మను పొందిరి. (66–75 వచనములు.)

66 1829 ఏప్రిల్ 5న ఆలీవర్ కౌడరీ మా గృహమునకు వచ్చెను, ఆ సమయము వరకు నేనెన్నడు అతడిని చూచియుండలేదు. నా తండ్రి నివసించుచున్న ప్రాంతమునకు సమీపములోనున్న పాఠశాలలో తాను పనిచేయుచున్నాడని, పాఠశాలకు పిల్లలను పంపుచున్న వారిలో నా తండ్రి కూడా ఉండుట వలన, ఆయన గృహములో భోజనము చేయుటకు కొంతకాలము తాను వెళ్ళాడని, నేను పలకలు పొందుటకు ఏర్పడిన పరిస్థితులను గూర్చి ఆ సమయములో నా కుటుంబము చెప్పియుండెనని, దీని ఆధారముగా నన్ను విచారించుటకు తాను వచ్చాడని అతడు నాతో చెప్పెను.

67 కౌడరీ వచ్చిన రెండు దినముల తరువాత (ఏప్రిల్ 7వ తేదీన) మోర్మన్ గ్రంథము యొక్క అనువాదమును నేను ప్రారంభించితిని మరియు నేను చెప్పు సంగతులను అతడు వ్రాయుచుండెను.

· · · · · · ·

68 మేము ఇంకా అనువాద కార్యమును చేయుచుండగా, మరుసటి మాసము (1829 మే)లో, పలకల అనువాదములో చెప్పబడి, మేము గమనించిన పాప క్షమాపణ కొరకు బాప్తిస్మమును గూర్చి ప్రార్థించి, ప్రభువును విచారించుటకు ఒక నిర్దిష్ట దినమున మేము వనములోనికి వెళ్ళితిమి. ఆ విధముగా మేము ప్రార్థించుచూ దేవునికి మొరపెట్టుటలో నిమగ్నమైయుండగా, పరలోకమునుండి ఒక దూత వెలుగు మేఘములో దిగివచ్చి, ఆయన హస్తములు మా మీద ఉంచి ఇట్లు చెప్పుచూ మమ్ములను నియమించెను:

69 నా తోటి సేవకులైన మీపై, మెస్సీయ నామములో నేను అహరోను యాజకత్వమును అనుగ్రహించుచున్నాను, ఇది దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాప సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తిస్మము యొక్కయు తాళపుచెవులను కలిగియున్నది; లేవి కుమారులు తిరిగి నీతితో ప్రభువుకు ఒక అర్పణను అర్పించు వరకు ఇది ఎన్నటికీ భూమిపై నుండి తీసివేయబడదు.

70 ఈ అహరోను యాజకత్వము, పరిశుద్ధాత్మ వరము కొరకు హస్తనిక్షేపణము చేయుటకు శక్తిని కలిగియుండదు, కానీ అది ఇకమీదట మాకు అనుగ్రహించబడునని అతడు చెప్పెను; మేము వెళ్ళి బాప్తిస్మము పొందవలెనని మమ్ములను ఆజ్ఞాపించెను, నేను ఆలీవర్ కౌడరీకి బాప్తిస్మము ఇవ్వవలెనని, తరువాత అతడు నాకు బాప్తిస్మము ఇవ్వవలెనని మాకు సూచనలనిచ్చెను.

71 ఆ ప్రకారమే మేము వెళ్ళి బాప్తిస్మము పొందితిమి. మొదట నేను అతనికి బాప్తిస్మమునిచ్చితిని, తరువాత అతడు నాకు బాప్తిస్మమునిచ్చెను; దాని తరువాత అతని తలపై నా హస్తములనుంచి అహరోను యాజకత్వమునకు నియమించితిని, తరువాత అతడు తన హస్తములను నాపై ఉంచి ఆ యాజకత్వమునకే నన్ను నియమించెను; ఏలయనగా ఆవిధముగా మాకు ఆజ్ఞాపించబడెను.*

72 ఈ సందర్భములో మమ్ములను దర్శించి, ఈ యాజకత్వమును మాకు అనుగ్రహించిన దూత, అతని పేరు యోహాను అని, క్రొత్త నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహానుగా పిలువబడినది తానేనని, పేతురు, యాకోబు, యోహానుల నిర్దేశకత్వములో అతడు పనిచేసెనని, వారు మెల్కీసెదెకు యాజకత్వపు తాళపుచెవులను కలిగియున్నారని, సమయము ఆసన్నమైనప్పుడు అవి మాకు అనుగ్రహించబడునని మరియు నేను సంఘపు మొదటి పెద్దగా, అతడు (ఆలీవర్ కౌడరీ) రెండవ పెద్దగా పిలువబడవలెనని అతడు మాతో చెప్పెను. 1829, మే పదిహేనవ తేదీన మేము ఈ దూత చేత నియమించబడి, బాప్తిస్మము పొందితిమి.

73 మేము బాప్తిస్మము పొంది నీటిలోనుండి బయటకు వచ్చిన వెంటనే, మన పరలోక తండ్రి నుండి గొప్ప మహిమకరమైన దీవెనలను అనుభవించితిమి. ఆలీవర్ కౌడరీకి నేను బాప్తిస్మము ఇచ్చిన వెంటనే, పరిశుద్ధాత్మ అతని మీదకు దిగిరాగా, అతడు లేచి నిలబడి త్వరలో సంభవించు అనేక సంగతులను గూర్చి ప్రవచించెను. మరలా అతనిచేత నేను బాప్తిస్మము పొందిన వెంటనే, నేను కూడా ప్రవచనాత్మను పొంది, లేచి నిలబడుచున్నప్పుడు ఈ సంఘము యొక్క ఎదుగుదల, సంఘముతో ముడిపడియున్న అనేక ఇతర సంగతులు, నరుల సంతానము యొక్క ఈ తరమును గూర్చి నేను ప్రవచించితిని. మేము పరిశుద్ధాత్మతో నింపబడి, మా రక్షణకర్తయైన దేవునియందు సంతోషించితిమి.

74 మా మనస్సులు ఇప్పుడు వెలుగుతో నింపబడెను, గనుక మేము గ్రహించునట్లు లేఖనములు స్పష్టముగా మాకు తెలుపబడెను మరియు మిక్కిలి మర్మముతో కూడిన భాగముల యథార్థ భావము, ఉద్దేశ్యము మేము గతములో ఎన్నడూ పొందజాలని విధముగా, గతములో ఆలోచించని విధముగా మాకు బయలుపరచబడెను. ఈ మధ్యకాలములో మేము యాజకత్వమును, బాప్తిస్మమును పొందిన పరిస్థితులను రహస్యముగా ఉంచుటకు మేము బలవంతము చేయబడితిమి, ఎందుకనగా మా చుట్టుప్రక్కల ప్రాంతములో హింసను కలిగించు ఆత్మ అప్పటికే ప్రత్యక్షపరచబడినది.

75 అల్లరిమూకలు దాడిచేయుట వలన మేము తరచు భయపెట్టబడితిమి, ఇది కూడా విశ్వాసులమని చెప్పుకొనుచున్న వారివలన కలిగెను. మాపై దాడిచేయవలెనను వారి ఆలోచనలు కేవలము నా భార్య తండ్రి కుటుంబము యొక్క పలుకుబడివలన (దైవిక సంరక్షణలో) విఫలము చేయబడినవి, వారు నాకు చాలా మంచి స్నేహితులుగా మారి, అల్లరిమూకలను వ్యతిరేకించి, అంతరాయము లేకుండా నేను అనువాద కార్యమును కొనసాగించునట్లు నాకు అవకాశమిచ్చుటకు సమ్మతించిరి; కాబట్టి వారికి వీలైనంత వరకు న్యాయవిరుద్ధమైన క్రియలనుండి మాకు రక్షణను కల్పిస్తామని వాగ్దానము చేసిరి.

  • ఆలీవర్ కౌడరీ ఈ సంఘటనలను ఈ విధముగా వర్ణించెను: “ఎన్నటికీ మరువలేని దినములివి, పరలోకపు ప్రేరణవలన పదములను చెప్పుచున్న ఒక స్వరము యొక్క శబ్దము క్రింద కూర్చొనుట, ఈ రొమ్మునందున్న పరిపూర్ణమైన కృతజ్ఞతను మేలుకొలిపినది! ఊరీము తుమ్మీము లేదా నీఫైయులు పేరుపెట్టిన ‘అనువాదక సాధనముల’ సహాయముతో ‘మోర్మన్ గ్రంథము’ అను చరిత్ర లేదా వృత్తాంతమును అనువదించగా ఆయన నోటినుండి వచ్చు మాటలను నిరంతరాయముగా అనుదినము నేను వ్రాయుట కొనసాగించితిని.

    “ఒకప్పుడు పరలోకము యొక్క అభిమానమును, అనుగ్రహమును పొందిన జనులను గూర్చి మోర్మన్ మరియు విశ్వాసియైన అతని కుమారుడు మొరోనై వ్రాసిన ఆసక్తిగల వృత్తాంతమును కొద్ది మాటలలో ప్రస్తుతించడం, నా ప్రస్తుత ఆలోచనకు మించినదై యుండును; కాబట్టి నేను దీనిని భవిష్యత్తుకు వాయిదా వేయుచున్నాను మరియు నేను పీఠికలో వీటిని చెప్పియున్నాను గనుక, ఈ సంఘము ఎదుగుదలతో దగ్గర సంబంధము గల కొన్ని సంఘటనలను వ్రాయుదును, అవి మూఢవిశ్వాసుల కోపపుచూపులు, వేషధారుల అసత్యారోపణల మధ్యనుండి ముందుకు వచ్చి క్రీస్తు సువార్తను హత్తుకొనిన కొన్ని వేలమందికి సంతోషకరముగా ఉండును.

    “తన సంఘమును ఖచ్చితముగా ఏలాగు నిర్మించవలెనోయని రక్షకుని నోటిద్వారా నీఫైయులకు ఇవ్వబడిన సూచనలను ఏ మనష్యుడు తన విచక్షణాజ్ఞానముతో అనువదించి వ్రాయలేడు, ప్రత్యేకించి యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షికి ప్రత్యుత్తరమిచ్చుటకు నీటిసమాధిలో సమాధిచేయబడుట ద్వారా హృదయపు సమ్మతిని ప్రభువుకు చూపించు విశేషాధికారమును వాంఛింపక, మనుష్యుల మధ్య ఆచరణలో ఉన్న అన్ని వ్యవస్థలు, విధానములలో అవినీతి అనిశ్చితిని వ్యాపింపజేసినప్పుడు వ్రాయజాలరు.’

    “ఈ ఖండములో యాకోబు సంతాన శేషమునకు యేసు క్రీస్తు చేసిన పరిచర్యను గూర్చి ఇవ్వబడిన వృత్తాంతమును వ్రాసిన తరువాత, చీకటి భూమిని కమ్మియున్నది, కటిక చీకటి జనుల మనస్సులను కమ్మియున్నదని ప్రవక్త చెప్పిన దానిని మేము తెలుసుకొనుట సులభము. ఇంకా ఆలోచించుచుండగా మతమును గూర్చి గల గొప్ప కలహము, కేకల మధ్య సువార్త విధులను నిర్వహించుటకు ఎవరికీ దేవుని నుండి అధికారము లేదని మేము తెలుసుకొనుట కూడా సులభమే. ఏలయనగా ఈ ప్రశ్న అడుగబడచ్చును, ఆయన సాక్ష్యము బయల్పాటు ఆత్మకంటే తక్కువ కానప్పుడు, ఆయన భూమి మీద తన జనులను కలిగియున్న అన్ని యుగములలో ప్రత్యక్షముగా ఇవ్వబడిన బయల్పాటులపై ఆయన మతము ఆధారపడి, నిర్మించబడి, నిలబెట్టబడినప్పుడు బయల్పాటులను తృణీకరించు మనుష్యులు క్రీస్తు నామములో నిర్వహణచేయుటకు అధికారమును కలిగియున్నారా? మనుష్యుల ముఖములలో ఒకసారి ప్రకాశింపబడుటకు ఈ వాస్తవములు అనుమతించబడిన యెడల, వారి కపటము తెలిసిపోవు ప్రమాదమున్నదని తలంచిన మనుష్యులచేత అవి సమాధిచేయబడి, జాగ్రత్తగా దాచబడెను, కానీ మానుండి ఇక ఎంతమాత్రము దాచబడలేవు; ‘లేచి బాప్తిస్మము పొందుడి’ అను ఆజ్ఞ ఇవ్వబడుట కొరకు మాత్రమే మేము వేచియుంటిమి.

    “మేము ఈ కోరిన కొద్ది కాలానికే ఇది జరిగెను. కృపాసంపూర్ణుడు మరియు దీనుల ఎడతెగని ప్రార్థనకు సమాధానమిచ్చుటకు ఎల్లప్పుడు ఇష్టపడు ప్రభువు, మేము మనుష్య ఆవాసములకు సుదూరములో తీవ్రముగా ఆయనకు ప్రార్థన చేసిన తరువాత, తన చిత్తమును ప్రత్యక్షపరచుటకు నమ్రత కలిగియుండెను. వెంటనే, నిత్యత్వము మధ్యనుండి విమోచకుని స్వరము మాకు సమాధానమును ప్రకటించెను, అప్పుడు తెర తొలగి, మహిమ వస్త్రమును ధరించిన దేవదూత క్రిందకు దిగివచ్చి, మేము ఆతృతతో ఎదురుచూచుచున్న వర్తమానమును, పశ్చాత్తాప సువార్త యొక్క తాళపుచెవులను ఇచ్చెను. ఇది ఎంత సంతోషకరము! ఎంత అద్భుతము! ఎంత ఆశ్చర్యకరము! ప్రపంచము బాధింపబడి, కలతచెంది లక్షలకొద్ది జనులు గ్రుడ్డివారివలె గోడ కొరకు తడవులాడుచుండగా, మనుష్యులందరు అనిశ్చితిపై ఆధారపడగా, ‘మధ్యాహ్నపు వెలుగులో’ సామాన్య మనుష్యుల వలె మా కళ్ళు చూచెను, మా చెవులు వినెను; ఇంకా సంతోషించితిమి, ఆయన ప్రేమ మా ఆత్మలను ప్రకాశింపజేయగా, సర్వశక్తుని యొక్క దర్శనములో మేము చుట్టబడితిమి! సందేహమునకు స్థానమేది? ఎక్కడనూ లేదు; అనిశ్చితి తొలగిపోయెను, అనుమానము ఇకపై రేకెత్తకుండా వీడిపోయెను, కల్పితము, మోసము శాశ్వతముగా తొలిగిపోయెను!

    “కానీ ప్రియ సహోదరుడా ఆలోచించు, ఒక్క క్షణము ఇంకా ఆలోచించు, ఆ దూత ‘నా తోటి సేవకులైన మీపై, మెస్సీయ నామములో నేను ఈ యాజకత్వమును, ఈ అధికారమును అనుగ్రహించుచున్నాను, మరియు లేవి కుమారులు తిరిగి నీతితో ప్రభువుకు ఒక అర్పణను అర్పించు వరకు ఇది భూమిపై నిలిచియుండును!’ అని పలుకగా మేము అతని ద్వారా పరిశుద్ధ యాజకత్వమును పొందినప్పుడు ఎంతో సంతోషముతో మా హృదయములు నిండినవి, ఎంతో ఆశ్చర్యముతో మేము సాగిలపడితిమి. (ఏలయనగా అటువంటి దీవెనకు మోకాలు వంచకుండా ఎవరు ఉండగలరు?)

    “ఈ హృదయపు భావములనైనను, ఈ సందర్భములో మమ్ములను చుట్టుముట్టిన మహా సౌందర్యమును, మహిమనైనను మీ కొరకు చిత్రించుటకు నేను ప్రయత్నించను; కానీ భూమియైనను, చిరకాల ప్రావీణ్యముతో మనుష్యులైనను ఈ పరిశుద్ధ వ్యక్తి చేయగలిగినంత ఆసక్తికరమైన, ఉన్నతమైన విధములో భాషను అలంకరించలేరని నేను చెప్పినప్పడు నన్ను మీరు నమ్మెదరు. లేదు; ఇట్టి సంతోషమునిచ్చుటకు, సమాధానమును క్రుమ్మరించుటకు లేదా పరిశుద్ధాత్మ శక్తివలన చెప్పబడిన ప్రతి వాక్యములో కలిగియున్న జ్ఞానమును గ్రహించుటకు ఈ భూమికైనను శక్తిలేదు! కల్పితము అనేకులను పోషించి, అసత్య ఫలము దాని ప్రవాహములో మత్తులైనవారిని సమాధివరకు తీసుకొని వెళ్ళునంత వరకు మనుష్యుడు తన తోటి మనుష్యులను మోసపుచ్చును, మోసము తరువాత మోసము జరుగును, దుష్టుల సంతానము వెర్రివారిని, అజ్ఞానులను ప్రేరేపించును; కానీ ఆయన ప్రేమపూరిత స్పర్శ, పై లోకమునుండి ఒక మహిమ కిరణము లేదా రక్షకుని నోటినుండి, నిత్యత్వపు రొమ్మునుండి వచ్చు ఒక మాట వీటన్నిటిని నిరర్థకము చేసి, మనస్సునుండి వాటిని ఎప్పటికీ తుడిచివేయును. ఒక దేవదూత సన్నిధిలో మేమున్నామను నమ్మకము, యేసు స్వరమును మేము విన్నామను వాస్తవము, దేవుని చిత్తమువలన చెప్పబడి, ఒక నిర్మలమైన వ్యక్తినుండి జాలువారిన శుద్ధిచేయబడిన సత్యము నాకు వర్ణనాతీతముగా ఉన్నవి మరియు జీవించుటకు అనుమతించబడువరకు రక్షకుని మంచితనము యొక్క ఈ భావప్రకటనను ఆశ్చర్యముతోను, కృతజ్ఞతతోను నేను వీక్షించెదను; పరిపూర్ణత నిలిచియుండి పాపము ఎన్నటికీ దరిచేరని ఆ నివాసములలో ఎన్నటికీ గతించని ఆ దినమందు ఆయనను ఆరాధించవలెనని నేను నిరీక్షించుచున్నాను.”— Messenger and Advocate, సంపుటి. 1 (1834 అక్టోబరు), పే. 14–16.