లేఖనములు
పీఠిక


పీఠిక

అమూల్యమైన ముత్యము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క విశ్వాసము మరియు సిద్ధాంతముల యొక్క ప్రాముఖ్యాంశములను గూర్చి తెలుపు అత్యుత్తమమైన లిఖితములనుండి చేయబడిన ఎంపిక. ఈ విషయములు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత అనువదించబడి, కూర్చబడినవి, మరియు వాటిలో అధికము ఆయన కాలములో సంఘ పత్రికలలో ప్రచురించబడినవి.

అమూల్యమైన ముత్యము అనే శీర్షిక కలిగిన లిఖితముల యొక్క మొదటి సేకరణ 1851లో అప్పటి పన్నెండుమంది సలహామండలి సభ్యుడు, బ్రిటీషు మిషను అధ్యక్షుడునైన ఎల్డర్ ఫ్రాంక్లిన్ డి. రిఛర్డ్స్ చేత చేయబడినది. దీని ఉద్దేశ్యమేమనగా, జోసెఫ్ స్మిత్ కాలములో పరిమిత ప్రచురణ గల కొన్ని ముఖ్యమైన వ్యాసములను మరింత అందుబాటులోనికి తెచ్చుట. ఐరోపా మరియు అమెరికా అంతటా సంఘ సభ్యత్వము పెరిగినందువలన, ఈ విషయములు అందుబాటులోనికి తేవలసిన అవసరము కలదు. అమూల్యమైన ముత్యము విస్తృతముగా వినియోగించబడి, పిమ్మట 1880 అక్టోబరు 10న సాల్ట్ లేక్ సిటీలో ప్రథమ అధ్యక్షత్వము మరియు సర్వసభ్య సమావేశము యొక్క చర్యవలన ఒక లేఖనముగా అయ్యెను.

సంఘ అవసరతలను బట్టి విషయసూచికలో అనేక పునర్విమర్శలు చేయబడినవి. మొదటి కూర్పులో లేని మోషే గ్రంథము యొక్క భాగములు 1878లో జతచేయబడినవి. సిద్ధాంతము మరియు నిబంధనలలో ప్రచురించబడి, అమూల్యమైన ముత్యములో కూడా నకలు చేయబడిన కొన్ని భాగములు 1902లో తొలగించబడినవి. 1902లో అధ్యాయములు, వచనములు, పాదవివరణలతో అమరిక చేయబడినది. సూచికతో పాటు రెండు నిలువుభాగాల పుటలతో మొదటి ప్రచురణ 1921లో జరిగెను. 1976 ఏప్రిల్ లో రెండు బయల్పాటు అంశములను చేర్చు వరకు ఏ ఇతర మార్పులు చేయబడలేదు. 1979లో ఈ రెండు అంశములు అమూల్యమైన ముత్యము నుండి తొలగించబడి, సిద్ధాంతము మరియు నిబంధనలలో ఉంచబడినవి, అందులో అవి ఇప్పుడు 137, 138 ప్రకరణములుగా కనిపించును. ఈ ప్రస్తుత కూర్పునందు మూలగ్రంథమును గత పత్రములకు అనుగుణంగా చేయుటకు కొన్ని మార్పులు చేయబడినవి.

ప్రస్తుత విషయసూచికకు ఇది క్లుప్త పరిచయము:

  1. మోషే గ్రంథము నుండి చేయబడిన ఎంపికలు. జోసెఫ్ స్మిత్ అనువదించిన బైబిలులోని ఆదికాండము నుండి సంగ్రహించబడినది, దానిని 1830 జూన్‌లో ఆయన ప్రారంభించెను.

  2. అబ్రాహాము గ్రంథము. దైవిక ప్రేరేపణ మరియు నడిపింపు ద్వారా దానికి అనుగుణంగా అబ్రాహాము వ్రాతలు (జోసెఫ్ స్మిత్ చేత) అనువదించబడినవని ప్రేరేపించబడిన ఒక అనువాదము తెలుపుచున్నది. నావూ, ఇల్లినాయ్‌లో 1842 మార్చి 1 నుండి మొదలై ఈ అనువాదము Times and Seasons నందు వరుసగా ప్రచురించబడినది.

  3. జోసెఫ్ స్మిత్—మత్తయి. జోసెఫ్ స్మిత్ అనువదించిన బైబిలులో మత్తయి సాక్ష్యము నుండి సంగ్రహించబడినది (క్రొత్త నిబంధన అనువాదమును ప్రారంభించుటకు ఇవ్వబడిన దైవిక ఆజ్ఞ కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 45:60–61 చూడుము).

  4. జోసెఫ్ స్మిత్—చరిత్ర. జోసెఫ్ స్మిత్ యొక్క అధికారిక సాక్ష్యము మరియు చరిత్ర నుండి సంగ్రహములు, వాటిని 1838–1839 లో అతడు, అతని లేఖకులు సిద్ధపరిచారు మరియు అది నావూ, ఇల్లినాయ్‌లో 1842 మార్చి 15న మొదలై Times and Seasons నందు వరుసగా ప్రచురించబడినది.

  5. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క విశ్వాస ప్రమాణాలు. 1842 మార్చి 1న Times and Seasons నందు ప్రచురించబడిన వెంట్ వర్త్ లేఖగా ప్రాచుర్యములోనున్న సంఘము యొక్క సంక్షిప్త చరిత్రతో పాటు జోసెఫ్ స్మిత్ చేత చేయబడిన ప్రకటన.