2000–2009
కానీ, అలా కానియెడల …
ఏప్రిల్ 2004


కానీ, అలా కానియెడల …

దేవుడు తమను ఎలా తీర్చిదిద్దుతున్నాడో తెలియకపోయినా విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా—దేవుడిని నమ్మడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా నరులు అద్భుతకార్యాలను సాధిస్తారు.

ఒక యువకుడిగా, నేను ఎనిమిదవ తరగతి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ నుండి నిరాశ, నిస్పృహ మరియు గందరగోళంతో ఇంటికి తిరిగి వచ్చాను. “మేము గెలుస్తామనే నమ్మకం నాకు ఉన్నప్పటికీ మేము ఎందుకు ఓడిపోయామో నాకు తెలియదు!” అని నేను నా తల్లితో అనాలోచితంగా అన్నాను.

విశ్వాసం అంటే ఏమిటో నాకు అప్పుడు తెలియదని ఇప్పుడు నేను గ్రహించాను.

విశ్వాసం అంటే ఊహాత్మక ధైర్యం కాదు, కేవలం కోరిక కాదు, ఆశ మాత్రమే కాదు. నిజమైన విశ్వాసం అంటే ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగియుండడం—యేసు క్రీస్తుపై విశ్వాసం మరియు నమ్మకం ఒక వ్యక్తి ఆయనను అనుసరించడానికి దారితీస్తుంది.1

శతాబ్దాల క్రితం, దానియేలు మరియు అతని యువ సహచరులు అకస్మాత్తుగా భద్రత నుండి ప్రపంచంలోకి నెట్టబడ్డారు —విదేశీయ మరియు భయపెట్టే ప్రపంచంలోకి నెట్టబడ్డారు. నెబుకద్నెజరు రాజు ఏర్పాటు చేసిన బంగారు ప్రతిమకు నమస్కరించడానికి షద్రకు, మేషాకు మరియు అబేద్నగో నిరాకరించినప్పుడు, కోపంతో ఉన్న అతడు వారు ఆజ్ఞాపింపబడినట్లుగా పూజించకపోతే, వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారని చెప్పాడు. “నా చేతిలోనుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?”2

ముగ్గురు యువకులు త్వరగా మరియు ఆత్మవిశ్వాసంతో ఇలా ప్రతిస్పందించారు, “ఒకవేళ [నీవు మమ్ములను అగ్నిగుండములో పడవేసినను], మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును.” అది నా ఎనిమిదో తరగతి విశ్వాసంలా అనిపిస్తుంది. కానీ వారు విశ్వాసం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నారని నిరూపించారు. “ఒక వేళ ఆయన రక్షింపకపోయినను … నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము” అని వారు చెప్పారు.3 అది నిజమైన విశ్వాసం యొక్క ప్రకటన.

వారు ఆశించిన విధంగా విషయాలు జరుగకపోయినా వారు దేవుడిని విశ్వసించగలరని వారికి తెలుసు.4 విశ్వాసం మానసిక సమ్మతి కంటే, దేవుడు జీవిస్తున్నాడని అంగీకరించడం కంటే ఎక్కువ అని వారికి తెలుసు. విశ్వాసం అంటే ఆయనపై పూర్తి నమ్మకం.

విశ్వాసం అంటే మనకు అన్ని విషయాలు అర్థం కాకపోయినా ఆయనకు అర్థమవుతాయని నమ్మడం. మన శక్తి పరిమితం అయినప్పటికీ, ఆయన శక్తి పరిమితం కాదని తెలుసుకోవడమే విశ్వాసం. యేసు క్రీస్తుపై విశ్వాసం ఆయనపై పూర్తిగా ఆధారపడటాన్ని కలిగియుంటుంది.

వారు ఎల్లప్పుడూ ఆయనపై ఆధారపడగలరని షద్రకు, మేషాకు మరియు అబేద్నగోలకు తెలుసు, ఎందుకంటే ఆయన ప్రణాళిక వారికి తెలుసు మరియు ఆయన మారడని వారికి తెలుసు.5 మనకు తెలిసినట్లుగా, మరణం అనేది ప్రకృతిలో ప్రమాదవశాత్తూ కలిగేది కాదని వారికి తెలుసు. మన ప్రేమగల పరలోక తండ్రి యొక్క గొప్ప ప్రణాళిక6 యొక్క సంక్షిప్త విభాగం ఏమిటంటే, మనం సమ్మతించినట్లయితే, ఆయన ఆనందించే ఆశీర్వాదాలను పొందడాన్ని ఆయన కుమారులు మరియు కుమార్తెలైన మనకు సాధ్యపరచడం.

మనకు తెలిసినట్లుగా, మన పూర్వమర్త్య జీవితంలో మరణం యొక్క ఉద్దేశ్యం గురించి ఆయన ద్వారా మనకు సూచించబడిందని వారికి తెలుసు: “వీరందరు నివాసముండుటకు మనము ఒక భూలోకమును చేయుదుము; వారి దేవుడైన ప్రభువు వారికి ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని వారు గైకొందురో లేదోనని మనము వారిని పరీక్షించెదము.”7

కాబట్టి మనము దానిని కలిగియున్నాము—ఇది ఒక పరీక్ష. ప్రపంచం మర్త్య స్త్రీ పురుషులకు పరీక్షా ప్రదేశం. ఇదంతా మనము ఆయనపై నమ్మకం ఉంచాలని మరియు మనకు సహాయం చేయడానికి ఆయనను అనుమతించాలని కోరుకునే మన పరలోక తండ్రి ద్వారా నిర్వహించబడుతున్న పరీక్షయని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ప్రతిదానిని మరింత స్పష్టంగా చూడగలము.

“నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటయే”8ఆయన కార్యమును మహిమయై యున్నదని ఆయన మనకు చెప్పారు. ఆయన ఇప్పటికే దైవత్వాన్ని సాధించారు. ఇప్పుడు ఆయన ఏకైక లక్ష్యం మనకు సహాయం చేయడమే—మనము ఆయన వద్దకు తిరిగి వచ్చి ఆయనలాగే ఉండి, ఆయన తరహా జీవితాన్ని శాశ్వతంగా జీవించేలా చేయడం.

ఇవన్నీ తెలిసిన ఆ ముగ్గురు యువ హెబ్రీయుకు నిర్ణయం తీసుకోవడం కష్టం కాలేదు. వారు దేవుడిని అనుసరిస్తారు; వారు ఆయనపై విశ్వాసాన్ని సాధన చేస్తారు. ఆయన వారిని విడిపిస్తాడు, కానీ, అలా కానియెడల—మిగిలిన కథ మనకు తెలుసు.

ప్రభువు మనకు కర్తృత్వాన్ని, అనగా నిర్ణయాలు తీసుకొనే హక్కు మరియు బాధ్యతను ఇచ్చారు.9 మనం సవాలు చేయబడడానికి అనుమతించడం ద్వారా ఆయన మనల్ని పరీక్షిస్తారు. తట్టుకోగల మన సామర్థ్యానికి మించి మనం శోధనలకు గురికావడానికి ఆయన అనుమతించరని ఆయన మనకు హామీ ఇస్తున్నారు.10 కానీ గొప్ప సవాళ్ళు గొప్ప వ్యక్తులను తయారు చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మనము శ్రమను కోరుకోము, కానీ మనం విశ్వాసంతో ప్రతిస్పందిస్తే, ప్రభువు మనల్ని బలపరుస్తారు. కానీ, అలా కానియెడల అనేవి చెప్పుకోదగ్గ ఆశీర్వాదాలు కాగలవు.

అపొస్తలుడైన పౌలు ఈ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు మరియు దశాబ్దాల అంకిత సువార్త పరిచర్య తర్వాత ఇలా ప్రకటించాడు, “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.”11

“నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది” అని ఆయన రక్షకునిచేత అభయమివ్వబడెను.12

పౌలు ఇలా స్పందించెను: “కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. … నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.”13 పౌలు తన సవాళ్ళను ప్రభువు మార్గంలో ఎదుర్కొన్నప్పుడు, అతని విశ్వాసం పెరిగింది.

“అబ్రాహాము శోధింపబడివిశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.”14 అతని గొప్ప విశ్వాసం కారణంగా అబ్రాహాముకు ఆకాశంలోని నక్షత్రాల కంటే ఎక్కువ సంఖ్యలో సంతానం కలుగుతుందని, ఆ సంతతి ఇస్సాకు ద్వారా వస్తుందని వాగ్దానం చేయబడింది. అయితే అబ్రాహాము వెంటనే ప్రభువు ఆజ్ఞను పాటించెను. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, కానీ అబ్రాహాము ఆశించిన రీతిలో కానప్పటికీ , అతడు ఆయనను పూర్తిగా విశ్వసించాడు.

దేవుడు తమను ఎలా తీర్చిదిద్దుతున్నాడో తెలియకపోయినప్పటికీ విశ్వాసాన్ని సాధన చేయడం ద్వారా—దేవుడిని నమ్మడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా నరులు అద్భుతకార్యాలను సాధిస్తారు.

విశ్వాసమునుబట్టి మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;

“అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి;

“ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనెను. …

విశ్వాసమునుబట్టి అతడు రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. …

విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములోబడి నడిచిపోయిరి. …

విశ్వాసమునుబట్టి యెరికో గోడలు కూలెను.”15

మరికొందరు “విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, … వాగ్దానములను పొందిరి; సింహముల నోళ్ళను మూసిరి,

“అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి; బలహీనులుగా ఉండి బలపరచబడిరి; యుద్ధములో పరాక్రమశాలులైరి.”16

కానీ పాల్గొనేవారు నిరీక్షించిన మరియు ఆశించిన అద్భుతమైన ఫలితాల మధ్య, కానీ అలా కానియెడలఅనేవి ఎల్లప్పుడూ ఉన్నాయి:

“మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, … బంధకములను ఖైదును అనుభవించిరి:

“వారు రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి: దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, … తిరుగులాడుచు సంచరించిరి, … 17

“దేవుడు వారి శ్రమల ద్వారా వారికి కొన్ని శ్రేష్ఠమైనవాటిని సమకూర్చెను, ఎందుకంటే శ్రమలు లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు.”18

దేవుని యొక్క గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఆయన వారిని విడిపించునని నమ్మి, అలా కానప్పటికీ ఆయనయందు విశ్వాసముంచి, యధార్థముగా ఉంటామని నిరూపించిన వృత్తాంతాలతో మన గ్రంథాలు మరియు మన చరిత్ర నిండియుంది.

ఆయన శక్తిని కలిగియున్నాడు, కానీ అది మనకు పరీక్ష.

మన సవాళ్ళకు సంబంధించి ప్రభువు మన నుండి ఏమి ఆశిస్తారు? మనం చేయగలిగినదంతా చేయాలని ఆయన ఆశిస్తారు. మిగిలినది ఆయన చేస్తారు. నీఫై ఇట్లు చెప్పాడు, “ఏలయనగా మనము సమస్తము చేసిన తర్వాత కూడా మనము కృప చేతనే రక్షింపబడియున్నామని మేము ఎరుగుదుము.”19

షద్రకు, మేషాకు, అబేద్నగోల వంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి.

మన దేవుడు అపహాస్యం మరియు హింస నుండి మనలను విడిపిస్తాడు, కానీ అలా కానియెడల. … మన దేవుడు మనలను అనారోగ్యం మరియు వ్యాధి నుండి రక్షిస్తాడు, కానీ అలా కానియెడల. … ఆయన ఒంటరితనం, నిరాశ లేదా భయం నుండి మనలను విడిపిస్తాడు, కానీ అలా కానియెడల. … మన దేవుడు మనలను బెదిరింపులు, ఆరోపణలు మరియు అభద్రత నుండి విముక్తి చేస్తాడు, కానీ అలా కానియెడల. … ప్రియమైనవారి మరణం లేదా బలహీనత నుండి ఆయన మనలను విడిపిస్తాడు, కానీ అలా కానియెడల. … మనం ప్రభువునందు నమ్మకముంచెదము.

మనకు న్యాయము, ధర్మము లభించేలా మన దేవుడు చూస్తాడు, కానీ అలా కానియెడల. … మనం ప్రేమించబడేటట్లు మరియు గుర్తించబడేటట్లు ఆయన చేస్తాడు, కానీ అలా కానియెడల. … మనము పరిపూర్ణ సహచరుడిని మరియు నీతిమంతులైన, విధేయులైన పిల్లలను పొందుతాము, కానీ అలా కానియెడల, …మనం చేయగలిగినదంతా చేసినట్లయితే, మనం ఆయన యుక్తకాలంలో మరియు ఆయన మార్గంలో విడుదల పొందుతామని మరియు ఆయనకున్నవన్నీ పొందుతామని యెరిగి మనం ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగియుంటాము.20 ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.