లేఖనములు
పీఠిక


పీఠిక

మోర్మన్‌ గ్రంథము బైబిలుతో పోల్చదగిన పరిశుద్ధ లేఖనము యొక్క ఒక సంపుటము. ఇది అమెరికాలోని ప్రాచీన నివాసులతో దేవుని వ్యవహారముల వృత్తాంతము మరియు ఇది శాశ్వతమైన సువార్త యొక్క సంపూర్ణతను కలిగియున్నది.

ఈ గ్రంథము అనేక ప్రాచీన ప్రవక్తల ద్వారా ప్రవచనము మరియు ప్రకటన ఆత్మ ద్వారా వ్రాయబడినది. బంగారు పలకలపై వ్రాయబడిన వారి మాటలు, మోర్మన్‌ అను పేరుగల ప్రవక్త మరియు చరిత్రకారునిచే ఉదహరింపబడి, సంక్షేపించబడెను. ఈ గ్రంథము రెండు గొప్ప నాగరికతల గురించి వర్ణించును. ఒకటి యెరూషలేము నుండి క్రీ.పూ. 600 సం. లో వచ్చి, ఆ తరువాత నీఫైయులు మరియు లేమనీయులు అని పిలువబడిన రెండు జనాంగములుగా విడిపోయెను. మరియొకటి ఎంతో ముందుగా బాబెలు గోపురము వద్ద ప్రభువు భాషలను తారుమారు చేసినప్పుడు వచ్చెను. ఈ సముదాయము జెరెడీయులు అని పిలువబడెను. వేల సంవత్సరముల తరువాత లేమనీయులు తప్ప, అందరు నాశనము చేయబడిరి మరియు వారు అమెరికన్ ఇండియన్ల యొక్క ప్రధాన పూర్వీకుల మధ్య ఉన్నారు.

తన పునరుత్థానము తరువాత నీఫైయుల మధ్య ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత పరిచర్యయే మోర్మన్‌ గ్రంథములో నమోదు చేయబడిన అత్యంత ప్రధానమైన సంఘటన. ఇది సువార్త సిద్ధాంతములను వివరించును, రక్షణ ప్రణాళికను సంక్షేపముగా వర్ణించును మరియు మనుష్యులు ఈ జీవితమందు సమాధానమును, రాబోవు జీవితమందు నిత్య రక్షణను పొందుటకు ఏమి చేయవలెనో చెప్పును.

మోర్మన్‌ తన రచనలను ముగించిన తరువాత, అతడు ఆ వృత్తాంతమును తన కుమారుడైన మొరోనైకి అప్పగించెను, అతడు తన స్వంత వాక్యములను కొన్నింటిని చేర్చి ఆ పలకలను కుమోరా కొండలో దాచిపెట్టెను. తరువాత మహిమ పొందిన, పునరుత్థానుడైన వ్యక్తిగా ఇదే మొరోనై 1823, సెప్టెంబరు 21న, ప్రవక్తయైన జోసెఫ్‌ స్మిత్‌కు ప్రత్యక్షమై ఆ ప్రాచీన గ్రంథమును గూర్చి, ఆంగ్లభాషలోనికి ఉద్దేశించబడిన దాని అనువాదమును గూర్చి అతనికి ఉపదేశించెను.

కాల క్రమములో ఆ పలకలు జోసెఫ్‌ స్మిత్‌కు అప్పగించబడెను, అతడు వాటిని దేవుని వరము మరియు శక్తి చేత అనువదించెను. యేసు క్రీస్తు సజీవుడగు దేవుని కుమారుడని, ఆయన యొద్దకు వచ్చువారందరు మరియు ఆయన సువార్త యొక్క నియమములకు, విధులకు లోబడు వారందరు రక్షింపబడవచ్చుననుటకు ఒక నూతన మరియు అదనపు సాక్షిగా ఈ గ్రంథము ఇప్పుడు అనేక భాషలలో ప్రచురింపబడుచున్నది.

ఈ గ్రంథమును గూర్చి ప్రవక్తయైన జోసెఫ్‌ స్మిత్‌ ఇట్లనెను: “మోర్మన్‌ గ్రంథము భూమిపైనున్న గ్రంథములన్నింటిలోకెల్లా మిక్కిలి ఖచ్చితమైనదని, మన మతము యొక్క ప్రధానరాయి అని మరియు ఒక మనుష్యుడు ఏ ఇతర గ్రంథము కన్నను దీని యొక్క సూక్తులననుసరించిన యెడల దేవునికి చేరువగునని నేను సహోదరులకు చెప్పియున్నాను.”

ఆ బంగారు పలకలను చూచుటకు మరియు మోర్మన్‌ గ్రంథము యొక్క సత్యమునకు, దైవత్వమునకు ప్రత్యేక సాక్షులుగా ఉండుటకు జోసెఫ్‌ స్మిత్‌కు అదనముగా ప్రభువు పదకొండు మంది ఇతరులను ఏర్పాటు చేసెను. వారి లిఖిత సాక్ష్యములు దీనితోపాటు “ముగ్గురు సాక్షుల సాక్ష్యము” మరియు “ఎనిమిదిమంది సాక్షుల సాక్ష్యము” గా చేర్చబడినవి.

మేము ప్రతిచోటనున్న మనుష్యులందరిని మోర్మన్‌ గ్రంథమును చదువమని, అది కలిగియున్న సందేశమును వారి హృదయములలో యోచించమని, ఆ తరువాత ఈ గ్రంథము సత్యమా అని క్రీస్తు నామములో నిత్యుడగు తండ్రియైన దేవుని అడుగమని ఆహ్వానించుచున్నాము. ఎవరైతే ఈ మార్గమును అనుసరించి, విశ్వాసముతో అడుగుదురో వారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాని సత్యము మరియు దైవత్వమును గూర్చి సాక్ష్యమును పొందెదరు. (మొరోనై 10:3–5 చూడుము.)

ఎవరైతే పరిశుద్ధాత్మ నుండి ఈ దైవిక సాక్ష్యమును పొందెదరో, వారు అదే శక్తి ద్వారా యేసు క్రీస్తు లోక రక్షకుడని, జోసెఫ్‌ స్మిత్‌ ఈ అంత్యదినములలో ఆయన యొక్క బయల్పాటుదారుడని, ప్రవక్తయని మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము మెస్సీయ రెండవ రాకడకు సిద్ధపాటుగా భూమిపైన మరియొకసారి స్థాపించబడిన ప్రభువు యొక్క రాజ్యమని కూడా తెలుసుకొందురు.