లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 137


137వ ప్రకరణము

1836, జనవరి 21న కర్ట్‌లాండ్, ఒహైయోలోనున్న దేవాలయములో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ కివ్వబడిన ఒక దర్శనము. ఈ సందర్భమేమనగా దేవాలయ ప్రతిష్ఠ కొరకు సిద్ధపాటులో భాగముగా విధుల నిర్వహణ.

1–6, ప్రవక్త తన సహోదరుడైన ఆల్విన్‌ను సిలెస్టియల్ రాజ్యములో చూచును; 7–9, మృతుల కొరకు రక్షణ సిద్ధాంతము బయలుపరచబడెను; 10, చిన్నపిల్లలందరు సిలెస్టియల్ రాజ్యములో రక్షింపబడుదురు.

1 మా కొరకు పరలోకము తెరువబడెను, దేవుని యొక్క సిలెస్టియల్ రాజ్యమును, దాని మహిమను నేను చూచితిని, అది శరీరముతోనా లేదా శరీరము లేకనా అనునది నేను చెప్పలేను.

2 ఆ రాజ్యపు వారసులు ప్రవేశించు ద్వారము యొక్క విశేష సౌందర్యమును నేను చూచితిని, అది వృత్తాకారములో మండుచున్న అగ్నివలెనుండెను;

3 అంతేకాక ధగధగ మెరియుచున్న దేవుని సింహాసనమును చూచితిని, దానిమీద తండ్రి, కుమారులు ఆసీనులైయుండెను.

4 ఆ రాజ్యపు సుందరమైన వీధులను చూచితిని, అవి బంగారముతో వేసినట్లుగా కనబడెను.

5 తండ్రియైన ఆదామును, అబ్రాహామును; నా తండ్రిని, నా తల్లిని; బహుకాలము నుండి నిద్రించుచున్న నా సహోదరుడు ఆల్విన్‌ను కూడా నేను చూచితిని;

6 ప్రభువు రెండవమారు ఇశ్రాయేలును పోగుచేయుటకు తన హస్తమును చాపక ముందు అతడు ఈ జీవితము నుండి వెళ్ళిపోవుటను, పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము పొందకయుండుటను చూచి అతడు ఆ రాజ్యములో స్వాస్థ్యమును ఏవిధముగా పొందెనో అని నేను ఆశ్చర్యపడితిని.

7 అప్పుడు ప్రభువు స్వరము నా యొద్దకు వచ్చి ఇట్లు సెలవిచ్చెను: ఈ సువార్త జ్ఞానము లేకుండా మృతులైనవారు, ఎవరైతే ఇక్కడ నిలిచియుండుటకు అనుమతి పొందిన యెడల సువార్తను స్వీకరించియుండెడివారో వారందరు దేవుని సిలెస్టియల్ రాజ్యములో వారసులగుదురు.

8 అంతేకాక ఇకనుండి దానిని గూర్చిన జ్ఞానము లేకుండా మరణించువారందరు ఆ రాజ్యములో వారసులగుదురు, వారు తమ పూర్ణ హృదయాలతో దానిని స్వీకరించి యుండెడివారు;

9 ఏలయనగా ప్రభువైన నేను మనుష్యులందరికి వారి క్రియలను బట్టి, వారి హృదయ వాంఛలను బట్టి తీర్పుతీర్చెదను.

10 లెక్క అప్పగించు వయస్సు రాకమునుపు మరణించు పిల్లలందరు పరలోకపు సిలెస్టియల్ రాజ్యములో రక్షింపబడుటను కూడా నేను చూచితిని.