చేతి పుస్తకములు మరియు పిలుపులు
2. రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం


“2. రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“2. వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

చిత్రం
కుటుంబ ఛాయాచిత్రము

2.

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం

2.0

పరిచయము

యేసు క్రీస్తు యొక్క సంఘములో నాయకుడిగా, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యమును పూర్తిచేయడంలో మీరు వ్యక్తులు మరియు కుటుంబాలకు మద్దతు ఇస్తారు (1.2 చూడండి). ఈ కార్యము యొక్క అంతిమ ఉద్దేశ్యం నిత్యజీవము యొక్క దీవెనలు మరియు సంపూర్ణ ఆనందం పొందడంలో దేవుని పిల్లలందరికీ సహాయం చేయడం.

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో అధికభాగము కుటుంబం ద్వారా సాధించబడుతుంది. సంఘ సభ్యులందరికీ, ఈ కార్యము గృహములో కేంద్రీకృతమై ఉంటుంది.

2.1

దేవుని ప్రణాళికలో కుటుంబం యొక్క పాత్ర

ఆయన ప్రణాళికలో భాగంగా, పరలోక తండ్రి భూమిపై కుటుంబాలను స్థాపించారు. కుటుంబాలు మనకు ఆనందాన్ని తీసుకురావాలని ఆయన ఉద్దేశించారు. కుటుంబాలు నేర్చుకోవడానికి, ఎదగడానికి, సేవ చేయడానికి, పశ్చాత్తాపం చెందడానికి మరియు క్షమించడానికి అవకాశాలను అందిస్తాయి. నిత్య జీవానికి సిద్ధపడేందుకు అవి మనకు సహాయం చేయగలవు.

నిత్య జీవానికి సంబంధించిన దేవుని వాగ్దానంలో నిత్య వివాహం, పిల్లలు మరియు నిత్య కుటుంబం యొక్క అన్ని ఇతర దీవెనలు ఉన్నాయి. ప్రస్తుతం వివాహం చేసుకోని లేదా సంఘములో కుటుంబం లేని వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది.

2.1.1

నిత్య కుటుంబాలు

సంఘ సభ్యులు దేవాలయంలో ముద్రవేయు విధులను పొంది, నిబంధనలను చేసినప్పుడు నిత్య కుటుంబాలు ఏర్పడతాయి. సభ్యులు ఆ నిబంధనలను పాటించడం మరియు అవి అసంపూర్ణముగా ఉన్నప్పుడు పశ్చాత్తాపం చెందడం వలన నిత్య కుటుంబం యొక్క దీవెనలు సఫలమవుతాయి. సభ్యులు ఈ విధులను పొందడానికి మరియు తమ నిబంధనలను గౌరవించడానికి సిద్ధపడేలా సంఘ నాయకులు వారికి సహాయం చేస్తారు.

నిత్య కుటుంబాలను స్థాపించడంలో ఒక అదనపు అంశం ఏమిటంటే, సభ్యులు మరణించిన తమ పూర్వీకులతో ముద్ర వేయబడడానికి అనుమతించే విధులను దేవాలయంలో నిర్వహించడం.

2.1.2

భార్యాభర్తలు

స్త్రీ పురుషుల మధ్య వివాహము దేవునిచేత నియమించబడినది (సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15 చూడండి). భార్యాభర్తలు కలిసి నిత్యజీవం వైపు పురోగమించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు (1 కొరింథీయులకు 11:11 చూడండి).

నిత్యజీవాన్ని పొందేందుకు కావాల్సిన అర్హతలలో ఒకటి పురుషుడు మరియు స్త్రీ సిలెస్టియల్ వివాహం యొక్క నిబంధనలో ప్రవేశించడం (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–4 చూడండి). ఒక జంట దేవాలయంలో వివాహాన్ని ముద్రవేయు విధిని పొందినప్పుడు ఈ నిబంధనను చేస్తారు. ఈ నిబంధన నిత్య కుటుంబానికి పునాది. విశ్వాసముగా పాటించినప్పుడు, అది వారి వివాహం శాశ్వతంగా నిలిచేలా చేస్తుంది.

భార్యాభర్తల మధ్య శారీరక సాన్నిహిత్యం అందంగా మరియు పవిత్రంగా ఉండాలని ఉద్దేశించబడింది. ఇది పిల్లల సృష్టి కోసం మరియు భార్యాభర్తల మధ్య ప్రేమను వ్యక్తపరచడం కోసం దేవునిచే నియమించబడింది. సున్నితత్వం మరియు గౌరవం—స్వార్థం లేకుండా ఉండడం—వారి సన్నిహిత సంబంధానికి మార్గనిర్దేశం చేయాలి.

లైంగిక సాన్నిహిత్యాన్ని స్త్రీ పురుషుల మధ్య వివాహానికి కేటాయించాలని దేవుడు ఆజ్ఞాపించాడు.

దేవుని దృష్టిలో భార్యాభర్తలు సమానం. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించకూడదు. తమ నిర్ణయాలను ఐకమత్యంతో మరియు ప్రేమతో, ఇద్దరి పూర్తి భాగస్వామ్యంతో తీసుకోవాలి.

2.1.3

తల్లిదండ్రులు మరియు పిల్లలు

“దేవుడు భూమిని హెచ్చించి మరియు నింపుమని ఆయన బిడ్డలకిచ్చిన ఆజ్ఞ ఇప్పటికీ అమలులో ఉన్నదని” కడవరి దిన ప్రవక్తలు బోధించారు (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”; సిద్ధాంతము మరియు నిబంధనలు 49:16–17 కూడా చూడండి).

ప్రేమగల భార్యాభర్తలు కలిసి పిల్లల పెంపకం మరియు పోషణ కొరకు ఉత్తమమైన పరిస్థితిని అందిస్తారు. వ్యక్తిగత పరిస్థితులు తల్లిదండ్రులు తమ పిల్లలను కలిసి పెంచకుండా నిరోధించవచ్చు. అయినప్పటికీ, వారు ఆయన సహాయాన్ని కోరినప్పుడు మరియు ఆయనతో వారి నిబంధనలను పాటించడానికి ప్రయత్నించినప్పుడు ప్రభువు వారిని దీవిస్తారు.

నిత్యజీవపు దీవెనలను పొందేందుకు తమ పిల్లలు సిద్ధపడేలా వారికి సహాయం చేయవలసిన ముఖ్యమైన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. వారు తమ పిల్లలకు దేవుణ్ణి మరియు ఇతరులను ప్రేమించడం మరియు సేవించడం గురించి నేర్పిస్తారు (మత్తయి 22:36–40 చూడండి).

“తండ్రులు నీతి మరియు ప్రేమతో వారి కుటుంబములపై అధ్యక్షత వహించి, వారి జీవితము యొక్క అవసరతలను అందించి, వారి కుటుంబములను కాపాడవలెను” (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”). గృహములో భర్త లేదా తండ్రి లేనప్పుడు, తల్లి కుటుంబానికి అధ్యక్షత్వం వహిస్తుంది.

కుటుంబంలో అధ్యక్షత్వం వహించడం అనేది కుటుంబ సభ్యులను తిరిగి దేవుని సన్నిధిలో నివసించేలా చేయడంలో సహాయపడే బాధ్యత. యేసు క్రీస్తు మాదిరిని అనుసరించి సౌమ్యమైన, సాత్వీకమైన మరియు స్వచ్ఛమైన ప్రేమతో సేవ చేయడం మరియు బోధించడం ద్వారా ఇది జరుగుతుంది (మత్తయి 20:26–28 చూడండి). కుటుంబంలో అధ్యక్షత్వం వహించడం అనేది క్రమం తప్పని ప్రార్థన, సువార్త అధ్యయనం మరియు ఆరాధనలోని ఇతర అంశాలలో కుటుంబ సభ్యులను ముందుకు నడిపించడాన్ని కలిపియుంది. ఈ బాధ్యతలను నెరవేర్చేందుకు తల్లిదండ్రులు ఐక్యంగా కృషి చేస్తారు.

“తల్లులు వారి పిల్లల పోషణకు ప్రాథమికముగా బాధ్యులు” (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”). పోషణ అంటే రక్షకుని మాదిరిని అనుసరించి పోషించడం, బోధించడం మరియు మద్దతు ఇవ్వడం (3 నీఫై 10:4 చూడండి). తన భర్తతో కలసి, ఒక తల్లి తన కుటుంబానికి సువార్త సత్యాలను తెలుసుకోవడానికి, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేస్తుంది. వారు కలిసి కుటుంబంలో ప్రేమగల వాతావరణాన్ని పెంపొందించుకుంటారు.

“ఈ పవిత్ర బాధ్యతలలో, తండ్రులు మరియు తల్లులు సమాన భాగస్థులుగా ఒకరికొకరు సహాయం చేసుకొనుటకు ఉంచబడిరి” (“కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన”). వారిరువురు కలిసి మరియు ప్రభువుతోపాటు ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తారు. వారు ఇద్దరి పూర్తి భాగస్వామ్యంతో, ఐక్యత మరియు ప్రేమతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు.

2.2

గృహములో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము

ప్రథమ అధ్యక్షత్వము ఇలా చెప్పారు, “గృహము నీతివంతమైన జీవితానికి ఆధారం” (First Presidency letter, Feb. 11, 1999).

గృహములో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును చేయడంలో సభ్యులకు మద్దతు ఇవ్వడానికి, సంఘ నాయకులు ఆత్మ ఉన్న గృహమును స్థాపించమని వారిని ప్రోత్సహిస్తారు. విశ్రాంతిదినమును గౌరవించమని, గృహములో సువార్తను అధ్యయనం చేసి, నేర్చుకోవాలని మరియు వారానికోసారి గృహ సాయంకాలము నిర్వహించాలని వారు సభ్యులను ప్రోత్సహిస్తారు.

2.2.3

గృహములో సువార్త అధ్యయనం మరియు అభ్యాసం

సువార్త బోధన మరియు అభ్యాసం గృహ-కేంద్రీకృతమైనది మరియు సంఘ-సహకారమివ్వబడినది. విశ్రాంతిదినమున మరియు వారం అంతటా గృహములో సువార్తను అధ్యయనం చేయమని సంఘ నాయకులు సభ్యులందరినీ ప్రోత్సహిస్తారు.

రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు నందు వివరించిన విధంగా లేఖనాల అధ్యయనం గృహములో సువార్త అధ్యయనానికి సూచించబడిన పాఠ్యక్రమము.

2.2.4

గృహ సాయంకాలము మరియు ఇతర కార్యకలాపాలు

కడవరి దిన ప్రవక్తలు సంఘ సభ్యులకు వారానికోసారి గృహ సాయంకాలము నిర్వహించమని సలహా ఇచ్చారు. వ్యక్తులు మరియు కుటుంబాలు సువార్త నేర్చుకోవడానికి, సాక్ష్యాలను బలోపేతం చేయడానికి, ఐక్యతను నిర్మించడానికి మరియు ఒకరినొకరు ఆనందించడానికి ఇది పవిత్ర సమయం.

సభ్యుల పరిస్థితులకు అనుగుణంగా గృహ సాయంకాలము అనువైనది. ఇది విశ్రాంతిదినమున లేదా ఇతర రోజులు మరియు సమయాల్లో నిర్వహించబడవచ్చు. ఇది వీటిని కలిగి ఉండవచ్చు:

  • సువార్త అధ్యయనం మరియు సూచన (కావాలనుకుంటే రండి, నన్ను అనుసరించండి ఉపయోగించవచ్చు).

  • ఇతరులకు సేవ చేయడం.

  • కీర్తనలు మరియు ప్రాథమిక పాటలు పాడడం లేదా వినిపించడం (19వ అధ్యాయం చూడండి).

  • పిల్లలు మరియు యువత అభివృద్ధిలో కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం.

  • లక్ష్యాలను నిర్దేశించడానికి, సమస్యలను పరిష్కరించడానికి మరియు కార్యక్రమ వివరణ పట్టికలను సమన్వయం చేయడానికి కుటుంబ సలహాసభలు.

  • వినోద కార్యకలాపాలు.

ఒంటరి సభ్యులు మరియు ఇతరులు గృహ సాయంకాలములో పాల్గొనడానికి మరియు సువార్త అధ్యయనం ద్వారా ఒకరినొకరు బలపరచుకోవడానికి సాధారణ విశ్రాంతిదిన ఆరాధన సేవలకు వెలుపల సమూహాలుగా సమకూడవచ్చు.

2.2.5

వ్యక్తులకు మద్దతు ఇవ్వడం

కుటుంబ మద్దతు లేని సభ్యులకు సంఘ నాయకులు సహాయం చేస్తారు.

సహవాసం, ఆరోగ్యకరమైన సామాజిక అనుభవాలు మరియు ఆధ్యాత్మిక వృద్ధికి అవకాశాలను కలిగియుండేలా నాయకులు ఈ సభ్యులకు మరియు వారి కుటుంబాలకు సహాయం చేస్తారు.

2.3

గృహము మరియు సంఘము మధ్య సంబంధం

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము గృహములో కేంద్రీకృతమై ఉంది మరియు సంఘముచే సహకారమివ్వబడుతుంది. గృహము మరియు సంఘము మధ్య సంబంధంలో క్రింది సూత్రాలు వర్తిస్తాయి.

  • నాయకులు మరియు బోధకులు తల్లిదండ్రుల పాత్రను గౌరవిస్తారు మరియు వారికి సహాయం చేస్తారు.

  • ప్రతి వార్డు లేదా శాఖలో కొన్ని సంఘ సమావేశాలు ఆవశ్యకము. వీటిలో సంస్కార సమావేశం, విశ్రాంతిదినమున జరిగే తరగతులు మరియు సమూహ సమావేశాలు ఉన్నాయి. అనేక ఇతర సమావేశాలు, కార్యకలాపాలు మరియు కార్యక్రమాలు ఆవశ్యకమైనవి కావు.

  • సంఘ సేవ చేయడంలో మరియు పాల్గొనడంలో కొంత త్యాగం అనివార్యమైనది. సభ్యులు ఆయన సంఘంలో సేవ చేస్తున్నప్పుడు మరియు త్యాగం చేస్తున్నప్పుడు ప్రభువు వారిని దీవిస్తారు. ఏదేమైనప్పటికీ, సంఘ సేవకు ఇవ్వబడిన సమయం సభ్యులు గృహములో, పనిలో మరియు ఇతర చోట్ల వారి బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యాన్ని తగ్గించకూడదు.