లేఖనములు
మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు


“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” లేఖన అధ్యయన ఉపాయములు (2021)

“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” లేఖన అధ్యయన ఉపాయములు

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న స్త్రీ

మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు

లేఖనాలలో దేవుని వాక్యము యొక్క మీ అధ్యయనాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాలు ఇక్కడున్నాయి.

ప్రేరేపణ కొరకు ప్రార్థించండి

లేఖనాలు దేవుని వాక్యాన్ని కలిగియున్నాయి. మీరు వాటిని అధ్యయనం చేస్తున్నప్పుడు, ఆయన నడిపింపు కొరకు మీ పరలోక తండ్రిని అడగండి మరియు వాటిని గ్రహించడంలో మీకు సహాయపడేందుకు ఆయన ఆత్మను పొందండి.

యేసు క్రీస్తు గురించి సత్యాల కొరకు చూడండి

అన్ని విషయాలు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తాయని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి (2 నీఫై 11:4; మోషే 6:63 చూడండి), కావున లేఖనములలోని సంఘటనలు, వృత్తాంతములు మరియు బోధనలయందు ఆయన కొరకు చూడండి. రక్షకుని గురించి మరియు ఆయనను ఎలా అనుసరించాలనే దాని గురించి బోధించే వచనాలను వ్రాయుటను లేదా గుర్తించుటను పరిగణించండి.

ప్రేరేపించే పదములు మరియు వాక్యభాగముల కొరకు వెదకండి

లేఖనములందు మీ కోసం ప్రత్యేకంగా వ్రాయబడినట్లుగా, మిమ్మల్ని ముగ్ధులను చేసే కొన్ని నిర్దిష్టమైన పదములు మరియు వాక్యభాగములను మీరు కనుగొనవచ్చు. అవి వ్యక్తిగతంగా మీకు సంబంధితమైనవిగా అనిపించి, మిమ్మల్ని ప్రేరేపించి, ప్రోత్సహించవచ్చు. మీ లేఖనాలలో వాటిని గుర్తించడాన్ని లేదా వాటి గురించి అధ్యయన పుస్తకములో వ్రాయడాన్ని పరిగణించండి.

సువార్త సత్యముల కొరకు వెదకండి

కొన్నిసార్లు సువార్త సత్యములు (సిద్ధాంతము లేదా సూత్రములుగా తరచు పిలువబడినవి) సూటిగా వ్యాఖ్యానించబడతాయి, మరికొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేదా వృత్తాంతము ద్వారా సూచించబడతాయి. “ఈ వచనాలలో ఏ సువార్త సత్యాలు బోధించబడ్డాయి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఆత్మను ఆలకించండి

మీరు చదివినవాటితో సంబంధం లేనట్లు అనిపించినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి. మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవలసినదిగా మరియు భావించవలసినదిగా కోరుచున్నది కేవలం ఆ భావాలే కావచ్చు.

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న స్త్రీ 2

లేఖనాలను మీ జీవితముతో పోల్చండి

మీరు చదువుతున్న వృత్తాంతములు మరియు బోధనలు ఏవిధంగా మీ జీవితానికి వర్తిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, “నాకు కలిగిన ఏ అనుభవాలు నేను చదివిన దానిని పోలియున్నాయి?” లేదా “లేఖనాలలోని ఈ వ్యక్తి యొక్క మాదిరిని నేను ఎలా అనుసరించగలను?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు.

ప్రశ్నలు అడగండి

సువార్త గురించి ప్రశ్నలు అడగడం దేనిని అధ్యయనం చేయాలో నిర్ణయించుకోవడానికి మీకు సహాయపడగలదు. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, మీ మనస్సులో కూడా ప్రశ్నలు తలెత్తవచ్చు. ఈ ప్రశ్నలు మీరు చదివే దానికి లేదా సాధారణంగా మీ జీవితానికి సంబంధించినవై ఉండవచ్చు. మీరు లేఖన అధ్యయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలను ధ్యానించి, వాటి సమాధానాల కోసం వెదకండి. మీరు అధ్యయనం చేసిన తర్వాత, ఇంకా ఎక్కువగా మీరు ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నారో అడగండి మరియు రాబోయే గంటలలో, రోజులలో జవాబుల కొరకు చూడండి.

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి

మీరు చదివే వచనాల యొక్క అదనపు అంతరార్థములను తెలుసుకొనుటకు, పాదవివరణలను, విషయ దీపిక, బైబిలు నిఘంటువు, లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) మరియు ఇతర అధ్యయన సహాయకాలను ఉపయోగించండి.

లేఖనాల సందర్భాన్ని పరిగణించండి

ఒక లేఖనము యొక్క అర్థవంతమైన అంతరార్థములను దాని యొక్క సందర్భమును—అనగా ఆ లేఖనము యొక్క పరిస్థితులు లేదా స్థితిగతులను పరిగణించినట్లైతే—మీరు కనుగొనగలరు. ఉదాహరణకు, ఒక ప్రవక్త మాట్లాడిన మనుషుల యొక్క నమ్మకాలను మరియు నేపథ్యాన్ని తెలుసుకోవడం ఆయన మాటల ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలదు.

చిత్రం
లేఖనాలను అధ్యయనము చేస్తున్న వ్యక్తి

మీ ఆలోచనలు మరియు మనోభావాలను నమోదు చేయండి

మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు కలిగే మనోభావాలను నమోదు చేయుటకు అనేక విధానములున్నాయి. ఉదాహరణకు, మీరు ఒక అర్థవంతమైన పదము లేదా వాక్యభాగమును గుర్తించవచ్చు మరియు మీ లేఖనములందు ఒక వివరణగా మీ ఆలోచనలను వ్రాయవచ్చు. మీరు పొందే అంతరార్థములు, భావనలు మరియు మనోభావాలతో మీరొక దినచర్య పుస్తకము కూడా వ్రాసుకోవచ్చు. లేదా మీరు అధ్యయనం చేయడానికి ముందు మీరడిగిన ప్రశ్నను, దానితోపాటు మీరు నడిపింపు పొందిన జవాబులను మీరు నమోదు చేయవచ్చు.

కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి

లేఖనాల్లో మీరు కనుగొన్న సూత్రాల గురించి కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు ఏమి బోధించారో చదవండి. వారి సందేశాలు సువార్త గ్రంథాలయంలో “సర్వసభ్య సమావేశము,” “మాసపత్రికలు,” మరియు ఇతర సంగ్రహములలో లభ్యమవుతాయి.

వృత్తాంతాలను చదవండి

వాటి సందర్భాలను (సమయం, ప్రదేశం, వక్త మరియు శ్రోతలు) అర్థం చేసుకోవడానికి కోరుతూ లేఖనాల్లోని వృత్తాంతాలను చదవండి. ప్రత్యేకించి పిల్లల కొరకు మరియు లేఖనాలతో తక్కువ పరిచయం గల సభ్యుల కొరకు వివరణాత్మక లేఖన వృత్తాంతాలు దీనికి గొప్ప వనరులు.

అంతరార్థములను పంచుకోండి

మీ వ్యక్తిగత అధ్యయనము నుండి వచ్చిన అంతరార్థములను చర్చించడం ఇతరులకు బోధించే ఒక మంచి మార్గం మాత్రమే కాదు, కానీ మీరు చదివినదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అది సహాయపడుతుంది.

మీరు నేర్చుకొన్న దానిని బట్టి జీవించండి

లేఖన అధ్యయనము మనల్ని ప్రేరేపించగలదు మరియు మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి దారితీయగలదు. మీరు చదువుతున్నప్పుడు ఆత్మ మిమ్మల్ని ఏమి చేయమని ప్రేరేపిస్తుందో వినండి, తరువాత ఆ ప్రేరణలపై పనిచేయడానికి కట్టుబడి ఉండండి.